సజ్జ పంటలో ఎరువుల యాజమాన్యం,పోషక లోపాలు-సవరణ


రచయిత సమాచారం

డా బి.వజంత శాస్త్రవేత్త. శ్రీమతి టి.యమ్ హేమలత శాస్త్రవేత్త, డా.ఎల్ మాధవిలత శాస్త్రవేత్త, డా.ఎమ్‌హేమంత్ కుమార్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి వ్యవసాయ పరిశోధనా స్థానం ,పెరుమాళ్ళపల్లె ,తిరుపతి.


చిరు ధాన్యాల పంటలలో సమృద్దిగా పోషక విలువలు ఉండతం వలన వీటిని పోషక ధాన్యాలు(న్యూట్రిషన్ గ్రేయిన్స్)గా పరిగణిస్తున్నారు.చిరుధాన్యాలలో సజ్జను ప్రధానమైన అహార పంటగా చెప్పవచ్చును.పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.మేలైన యాజమాన్య పద్దతులలో ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం.మన రాష్ట్రంలో సజ్జ పంటను ఎక్కువగా చిత్తూరు,అనంతపురం,కర్నూలు,ప్రకాశం,విశాక పట్టణం,విజయనగరం మరియు శ్రీకాకుళం,జిల్లాలలో సాగుచేస్తున్నారు.ఈ పంటను ఖరిఫ్ మరియు వేసవి పంటగా రైతులు వేస్తారు. ఖరీఫ్ పంటగా అయితే  జూన్ మొదటి వారం  నుండి జూలై రెండవ వారం వరకు,వేసవి పంటగా జనవరి మాసంలో విత్తుకోవాలి.సజ్జ పంట మెట్ట ప్రాంతాలలో తక్కువ సారవంతమైన నేలల్లో,అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో కూడా సాగు చేస్తున్నారు.
ఎరువుల యాజమాన్యం:
సజ్జ పంటను వర్షాధారంగా మరియు నీటి వసతి కింద సాగు చేస్తారు.పంటకు కావాల్సిన ఎరువుల మోతాదు వర్షధార పంటకు,నీటిపారుదల క్రింద వేసే పంటకు వేర్వేరుగా ఉంటుంది.వర్షాధార పంటకు ఒక ఎకరాకు 24కిలోల నత్రజని,12కిలోల భాస్వరం మరియు 8కిలోల పొటాషియం పోషకాలను అందించే ఎరువులను వేసుకోవాలి.అనగా 52కిలోల యూరియా,75 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్,14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఒక ఎకరానికి వేయాలి.
నీటి పారుదల కింద సజ్జను సాగుచేస్తున్నప్పుడు,ఒక ఎకరానికి 32కిలోల నత్రజని,16కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం పోషకాలను అందించే ఎరువులను వేసుకోవాలి.అనగా 70కిలోల యూరియా,100కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్,20కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఒక ఎకరా పంటకు వేయాలి.
సిఫారసు చేసిన మొత్తం భాస్వరం మరియు పొటాషియం అందించు ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి.నత్రజని ఎరువును మాత్రం రెండు సమభాగాలుగా చేసుకుని ఒక సమభాగం విత్తేటప్పుడు,మిగిలిన సమభాగం విత్తిన 25-30రోజులకు పైపాటుగా వేసుకోవాలి.పంట వేసుకునే ముందు భూసార పరీక్ష చేసుకున్నట్లైతే ఆ ఫలితాల అధారంగా ఎరువుల మోతాదును పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేయాలి.భూసార పరీక్ష ఫలితాల పట్టికలో ఏదైనా ఇతర పోషక మోతాదు నిర్ణీతస్థాయి(క్రిటికల్ లిమిట్)కంటే తక్కువ ఉంటే రైతులు ఎరువులు వేసేటప్పుడు ఆ పోషకాన్ని అందించే ఎరువులను సరైన సమయంలో వేసుకున్నట్లైతే మొక్క పోషకాలను సమర్ధవంతంగా గ్రహించి ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
సజ్జ పంటలో పోషక లోపాలు-సవరణ:
ఒక్కొక్కసారి సరైన మోతాదులో,సరైన సమయంలో సిఫార్సు చేసిన ఎరువులను వేయక పోవడం వలన లేదా నేలలో ఆయా పోషకాల మోతాదు తక్కువగా ఉండటం వలన సజ్జ పంటలో కొన్ని పోషక లోపాలు రావడం తద్వారా జీవ రసాయన చర్యలు సక్రమంగా జరగక పంట దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది.కానీ రైతులు పొలంలో ఉన్న పంటలో కనిపించిన పోషక లోపాల్ని గుర్తించి వెంటనే సవరణ చర్యలు చేపట్టినట్లైతే ఆ పోషక లోప ద్వారా కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చును.కాబట్టి సజ్జ పంటలో వచ్చే పోషక లోపాలు మరియు సవరణ గురించి ఇచ్చట వివరించడం జరిగింది.
నత్రజని 
లోప లక్షణాలు:

 • నత్రజని లోప లక్షణాలు ముందుగా ముదురు ఆకులపై కనిపిస్తాయి.

 • మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు నత్రజని లోపం ఉంటే ఆకు మొత్తం లేత ఆకుపచ్చ వర్ణంలోకి మారుతాయి.లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు చివరికొన భాగం నుంచి పత్రహరితం క్షీణిస్తూ అంచులు అంచులు పసుపు రంగులోకి మారి ఆకు మొదటి భాగం వరకు విస్తరించి "వి"ఆకారంలో క్లోరోసిస్ కనిపిస్తుంది.సజ్జలో దీనిని నత్రజని లోప యొక్క ప్రధాన లక్షణంగా చెప్పవచ్చును.

 • లోప తీవ్రత పెరిగేకొద్దీ పసుపు రంగులో పసుపు రంగులో ఉన్న భాగం మొత్తం నిర్జీవమై ముదురు ఆకులు అన్నీ ఎండిపోతాయి.

 • నత్రజని లోపం ఉన్న మొక్కలు పొట్టిగా/కురచగా ఉండి మెలితిరిగైనట్లు ఉంటాయి.

 • కంకి పరిమాణం తగ్గి కంకిలో ఉండవలసిన గింజల సంఖ్య కూడా తగ్గి దిగుబడి తగ్గుతుంది.

సవరణ:

 • భూసార పరీక్ష అధారంగా సిఫారుసు చేసిన నత్రజ్ఞి ఎరువులను వేయాలి.

 • పైపాటుగా వేయవలసిన నత్రజని ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి.

 • సేంద్రీయ ఎరువులను,నత్రజని సంబందిత జీవన ఎరువులను వేసినచో నత్రజని లోపం లేకుండా నివారించవచ్చును.

 • పంట మార్పిడి లెగ్యూం జాతి పంటలతో ఉండేలా చూడాలి.

 • పొలంలో ఉన్న పంటపై నత్రజనిఉ లోపం కనిపించినట్లైతే 2 శాతం యూరియా ధ్రావణాన్ని 10-15 రోజుల వ్యవధిలో మొక్కలపై 2-3సార్లు పిచికారి చేయాలి.

భాస్వరం:
లోప లక్షణాలు

 • లోప లక్షణాలు ముందుగా ముదురు ఆకులపై కనిపిస్తాయి.

 • మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ముదురు ఆకుల అంచుల చివరికొస నుంచి గులాబి వర్ణంలోకి మారడం ప్రారంభమై ఆకు మొదటి భాగం వరకు వ్యాపిస్తుంది.లోప తీవ్రత ఎక్కువైనచో ఆకుమొత్తం ఎరుపువర్ణంలోకి మారుతుంది.

 • కంకి పరిమాణం.గింజల సంఖ్య తగ్గడం వలన దిగుబడి కూడా తగ్గుతుంది.

 • పంట ఆలస్యంగా పక్వదశకు వస్తుంది.

సవరణ:

 • విత్తనం విత్తే ముందు భూసార పరీక్ష అధారంగా సిఫారసు చేసిన భాస్వరం ఎరువులను వేయాలి.

 • సేంద్రీయ ఎరువులు,భాస్వరం సంబందిత రసాయన ఎరువులు,జీవన ఎరువులను పొలంలో వేసి బాగా కలియ దున్నాలి.

 • పంట పొలంలో ఉన్నప్పుడు భాస్వరం లోపం కనిపించినట్లైతే అమ్మోనియం పాస్ఫేట్ వంటి నీటిలో కరిగే ఎరువులను నీటి తడులతోపాటు వేసుకోవాలి.

పొటాషియం:
లోప లక్షణాలు

 • పొటాషియం పోషక లోప లక్షణాలు కూడా ముందుగా ముదురు ఆకులపై కనిపిస్తాయి.

 • లోప తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కాండం సన్నగా అయి మొక్కలు పొట్టిగా ఉంటాయి.

 • లోప తీవ్రత మధ్యస్థంగా ఉన్నచో ఆకు చివరి భాగం నుంచి అంచుల వెంబడి క్లోరోసిస్ ప్రారంభమవుతుంది.

 • పొటాషియం లోపం ఎక్కువగా ఉన్నచో మధ్య ఈనే మరియు దానీ చుట్టూ ఉన్న ప్రాంతం మ్మాత్రమే పచ్చగా ఉండి మిగిలిన భాగం అంతా పసుపు పచ్చగా మారుతుంది.సజ్జ పంటలో దీనిని పొటాషియం లోపం యొక్క ప్రధాన లక్షణంగా చెప్పబడింది.

సవరణ:

 • సిఫారసు చేసిన పొటాషియం ఎరువులను భూసరా పరీక్షల అధారంగా విత్తేటప్పుడు వేయాలి.అందుబాటులో ఉన్న సేంద్రీయ ఎరువులను వేయాలి.

 • పొలంలో ఉన్న పంటలో పొటాషియం లోప లక్షణాలు కనిపంచినట్లైతే సిఫారుసు చేసిన మోతాదులో మూడవ వంతు పొటాషియం ఎరువులను నీటి తడుల ద్వారా మొక్కలకు అందించాలి.

గంధకం:
లోప లక్షణాలు

 • లోప లక్షణాలు ముందుగా లేత ఆకులపై కనిపిస్తాయి.

 • గంధకం లభ్యత తగ్గినప్పుడు లేతాకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారి లోప తీవ్రత పెరిగేకొద్దీ పసుపు వర్ణంలోకి మారతాయి.

 • లోప తీవ్రత అలాగే ఉన్నట్లైతే మొక్క మొత్తం పసుపు వర్ణంలోకి మారుతుంది.మొక్కలు గిడసబారి దిగుబడి తగ్గుతుంది.

సవరణ:

 • మొక్కకు కావాల్సిన గంధకం సింగిల్ సూపర్ పాస్ఫేట్ లేదా జిప్సమ్ రూపంలో లభిస్తుంది.

 • భూమిలో గంధకం లోపం ఉన్నట్లైతే జిప్సమ్ ఒక ఎకరానికి 200కేజీలు అఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి.

ఇనుము:
లోప లక్షణాలు

 • లోప లక్షణాలు ముందుగా లేత ఆకులపై కనిపిస్తాయి.

 • ఈనేల మధ్యభాగంలో పత్రహరితం క్షీణించడం వలన ఆ భాగం పసుపు రంగులోకి మారుతుంది.ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి.దీని ఇనుప ధాతు లోపం యొక్క ప్రధాన లక్షణంగా చెప్పవచ్చును.

సవరణ:

 • పంట వేసే మునుపు సేంద్రీయ ఎరువులను వేసి బాగా కలియదున్నాలి.

 • క్షార భూములను ముందుగా సవరించి తర్వాత సజ్జ పంటను వేసుకోవాలి.

 • మొక్కలో ఇనుపధాతు లోప లక్షణాలను గమనించినట్లైతే 0.5శాతం ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని 10-15 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారి చేయాలి.

జింక్
లోప లక్షణాలు

 • జింక్ లోప లక్షణాలు ముందుగా లేత ఆకులపైన కనిపిస్తాయి.

 • ఆకులపై పసుపు రంగు చారలు ఆకు మొదతీభాగం నుంచి ప్రారంచమై మధ్య భాగం వరకు విస్తరిస్తాయి.

 • జింక్ లోపం అలాగే కొనసాగినట్లైతే ఆకు మధ్య ఈనే,అంచుల మధ్యభాగంలో వెడల్పాటి తెల్లని చారలు ఏర్పడుతాయి.

సవరణ:

 • తగినంత సేంద్రీయ ఎరువులను వేయాలి.

 • నేలలో జింక్ లోపం ఉన్నట్లైతే 25కేజీల జిం సల్ఫేట్ లేదా 10 కేజీల జింక్ చీలేట్ ఎరువులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేయాలి.