వివిధ పంటలను ఆశించు రసం పీల్చు పురుగులు-సమగ్ర యాజమాన్యం


రచయిత సమాచారం

వి.లక్ష్మినారాయణమ్మ ,పి.ప్రశాంత్ మరియు యం.శ్రీనివాసులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం .


రసం పీల్చు పురుగులలో తెల్లదోమ,పచ్చదోమ,పేనుబంక,తామరపురుగు, నల్లి,మరియు పిండినల్లి ముఖ్యమైనవి.ఇవి ఎక్కువగా పంట మీది వివిధ భాగాల నుండి రసం పీల్చి పంటను నష్టపరుస్తాయి.వీటి జీవిత విధానం,నష్టపరిచే విధానం మరియు యాజమాన్య పద్దతుల గురించి తెలుసుకుందాం.

పచ్చదోమ:
రసం పీల్చే పురుగులలో పచ్చదోమ ప్రధానమైనది.దీపపు పురుగులు మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట చివరి దశ వరకు ఆశించుట గమనిస్తాము.పిల్ల పురుగులు మరియు రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం పీలుస్తాయి.దీనివల ఆకులు క్మొదట పసుపు రంగులొకి మారి తదుపరి ఆకుల అంచులు ముదురు ఎరుపు రంగుకు మారి క్రమేపి ఆకు మొత్తం ఎర్రబడి,ఎండి రాలిపోతుంది.తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న మొక్కలు చనిపోతాయి.పెద్ద మొక్కల్లో పెరుగుదల క్షీణించి గిడసబారిపోతాయి.
ప్రతి తల్లిపురుగు 15-20 లేత పసుపు రంగు గ్రుడ్లను ఆకు అడుగు భాగాన ఈనెలలోకి చొప్పిస్తుంది..ఇవి 4-11 రోజులలో పొదగబడి,7-21 రోజులలో అయిదు అంచెలుగా అదిగి రెక్క్ల పురుగులుగా మారతాయి.ఒక సంవత్సరంలో 7-8 తరాలు పూర్తిచేసుకుంటాయి.
పేనుబంక:
బెట్ట సమయంలో ఈ పేను బెడద ఎక్కువగా ఉంటుంది.పసుపు లేక గోధుమ రంగు పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి.ఇవి మొదట చిగురాకులను ఆశించి క్రమేపి మొక్క క్రింది భాగాలకు గుంపులు గుంపులుగా సోకి కొన్ని మొక్కలకే మొదట ఆశించి,తర్వాత మిగతా మొక్కలకు వ్యాపిస్తాయి.ఇవి ఆశించిన మొక్కలు ముదురు ఆకు పచ్చ రంగులో ఉండి ,అడుగు వైపు దోనెలాగా ముడుచుకొని ఉంటాయి.ఇవి తేనె వంటి జిగురు పదార్ధాన్ని విసర్జిస్తాయి.ఈ జిగురు పదార్ధంపై నల్ల్ని బూజు ఆశించి కిరణజన్య సమ్యోగక్రియకు అంతరాయం కలుగుతుంది.ఈ పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు రాలిపోయి పంట దిగుబడి తగ్గుతుంది.
పేనుబంక పురుగులలో రెక్కలు ఉన్నవి రెక్కలు లేనివి అని 2 రకాలు ఉంటాయి.రెక్కలున్న పురుగులు మాత్రమే ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తాయి.తల్లి పురుగులు రెక్కలు కోల్పోయిన 24 గంటల్లో సంతానోత్పత్తి ప్రారంబిస్తాయి.ఆడ పురుగులు సంపర్కం లేదా గ్రుడ్లు లేకుండా పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి.కావున గ్రుడ్డు దశ ఉండదు.పిల్ల పురుగులు 7-9 రోజుల వరకు జీవించి ఉంటాయి. ఒక్కొక్క తల్లింపురుగు 12-14 రోజుల జీవిత కాలంలో ఒక్కో రోజుకి 25-30 పిల్లలను పెడుతుంది.ఒక సంవత్సరంలో 12-14 తరాలు పూర్తిచేసుకుంటాయి.
తామరపురుగులు:
వాతావరణం బాగా పొడిగా ఉండే వర్షాభావా పరిస్థితులలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది.వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లెదా చలి వాతావరణంలో వీటి ఉనికి చాలా తక్కువగా ఉంటుంది.పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగు భాగం నుండి రసం పీలుస్తాయి.దీనివల్ల ఆకులు వంకర్లు తిరిగి,ముడతలు పడి చివరికి పెళుసుబారి ఎండిపోతాయి.
ఒక్కొక్క తల్లి పురుగు 50-60 వరకు చిక్కుడు గింజ ఆకారం గల గ్రుడ్లను చీలికలు ఏర్పడిన ఆకుల పొరలలో పెడుతుంది.ఈ గ్రుడ్లు 5 రోజులలో పొదిగి 4-5 రోజుల వరకు జీవించి కోశస్థదశకు చేరుతాయి.వీటి నుండి 5-6 రోజులలో పెద్ద పురుగులు బయటకు వచ్చి 2-4 వారాలు జీవిస్తాయి.
తెల్లదోమ:
వర్షపాతం తక్కువగా ఉండి,ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు బాగా వృద్ది చెందుతుంది.తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు వర్ణానికి మారి పాలిపోయి,పెళుసుబారి,ఎండి రాలిపోతాయి.ఇది ఎక్కువగా పంట పూత,కాయ దశలో ఆశిస్తుంది.ఇది కూడా పేనుబంజ్క వలె జిగురు వంటి పాదార్ధాన్ని విసర్జిస్తుంది.ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పెరుగుదల ఆగిపోయి, గిడసబారిపోయిపోతాయి.
ఒక్కొక్క తల్లి పురుగు సుమారుగా 120గ్రుడ్లు పెడుతుంది.గ్రుడ్లు 3-5 రోజులలో పొదగబడి,2-3 రోజుల నిధ్రావస్థలో గడిపి ర్వెక్కల పురుగులలా మారతాయి.దీని జీవిత దశ 14 రోజులలో పూర్తి అవుతుంది.సంవత్సరానికి 12-15 తరాలు పూర్తి చెస్తుంది .
నల్లి:
వాతావరణం తేమతో కూడిన చలిగా ఉన్నప్పుడు మరియు పంట చివరి దశలో ఈ పురుగు కనపడుతుంది.పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన పలచని బూజు వంటి గూడులలో గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి.దీని వలన ఆకుల పైభాగాన తెల్లని పొడి మచ్చలు ఏర్పడి,ఆకులు పచ్చదనం కోల్పోయి,ముడతలు పడి క్రమేపి ఎండి రాలిపోతాయి.
తల్లి పురుగులు సుమారుగా 70 వరకు కంటికి కనపడని చిన్న చిన్న గ్రుడ్లను పెడుతుంది.చిన్న పురుగులు 3-4 అంచెలలో పెద్దవిగా పెరిగి ఒకే సంవత్సరంలో 20 తరాలు పూర్తిచేస్తుంది.
పిండినల్లి:
పిల్ల మరియు తల్లి పురుగులు మొక్కల వివిధ భాగాల ఆశించి రసం పీల్చడం వల్ల మొక్కలు నీరసించిపోతాయి.ఈ పురుగులు ఎక్కువ శాతం మొదట పొలంలోను,పొలం గట్ల వెంబడి ఉండే కలుపు మొక్కలపై అభివృద్ది చెంది,వాటి నుండి పంట మొక్కలకు వ్యాప్తి చెందుతాయి.ఈ పురుగులు మొదట ఒకటి,రెండు మొక్కలను ఆశించి తర్వాత ఎక్కువ మొక్కలకు ఆశిస్తాయి.ఈ పురుగు పొలమంతా సమంగా లేకుండా అక్కడక్కడా కొన్ని మొక్కలకు ఆశిస్తుంది.
వీటిలో ప్రత్యుత్పత్తి రేటు ఎక్కువ.ఒక్కొక్క తల్లి పురుగు 10-15 రోజుల వ్యవధిలో 250-500 వరకు గ్రుడ్లు పెడుతుంది.గ్రుడ్లు 4-10 గంటల్లోనే పగిలి పిల్ల పురుగులు బయటకు వస్తాయి.ఈ పిండినల్లి సుమారు 35 రోజులు జీవిస్తుంది.
ఈ రసం పీల్చు పురుగులు మొక్క నుండి రసం పీల్చి నష్టపరచడమే కాకుండా వివిధ రకాల వైరస్ తెగుళ్ళను వ్యాపింపజేస్తాయి.కావున వీటిని సమగ్రంగా నివారించకపోతే పంటకు రెండు విధాలుగా నష్టం కలుగజేతాయి.
యాజమాన్యం:

 • సంవత్సరాల తరబడి ఒకే పంటను పండించకుండా విధిగా పంట మార్పిడి చేయాలి.

 • పురుగులను తట్టుకునే శక్తి ఉన్న ఆరోగ్యవంతమైన వంగడాన్ని వాడాలి.

 • ముందు జాగ్రత్త చర్యగా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. లేదా కార్బోసల్ఫాన్ 40గ్రా.లేదా థయోమిథాక్సాం 5గ్రా.కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేయాలి.

 • పురుగు మదులతో విత్తనశుద్ది చేసిన తర్వాత,శిలీంధ్ర నాశినులతో కానీ,ట్రైకోడర్మావిరిడేరో కానీ విత్తనశుద్ది చేయాలి.

 • ఈ పురుగులు కలుపు మొక్కలైన పార్థీనియం మరియు ఇతర మొక్కలను ఆశిస్తాయి.కాబట్టి పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

 • పొలం చుట్టు నాలుగు వరుసల జొన్న లేదా మొక్కజొన్నలను అవరోధ పంటగా వేసి అక్షింతల పురుగులు,అల్లిక పురుగులైన సహజ మిత్రులు వృద్ధి చెందేలా చేయవచ్చును.

 • నత్రజని ఎరువులను అధిక మోతాదులో వినియోగించరాదు.

 • అంతర పంతలుగా అలసంద/వేరుశనగ/సోయాచిక్కుడు/పెసర/మినుములను సాగు చేసి మిత్ర పురుగులను వృద్ధి చేయాలి.

 • తెల్లదోమ ఉదృతి ఎక్కువగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు జిగురు పూసి పొలంలో ఉంచాలి. తెల్లదోమలు పసుపు రంగుకు ఆకర్షితమైజిగురుకు అంటుకుపోతాయి.

 • పొలంలో చీమల పుట్టలు లేకుండా చూసుకోవాలి.

 • పిండినల్లి ఆశించిన మొక్కలు గుర్తించి నివారించాలి.

 • పైరులో పేనుబంక ఆశించిన మొక్కలు 15-20 శాతంగాని,ఆకుకి 1-2 పచ్చదోమలు కానీ లేదా ఆకుకి 5-10 తెల్లదోమలు కనిపించిన యెడల అవసరన్ని బట్టి డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 • తామరపురుగుల ఉదృతి ఎక్కువగా బట్టి ఫిప్రోనిల్ 2 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 • తెల్లదోమ ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు బైఫెంత్రిన్ 1.6మి.లీ లెదా క్లోథయాడిన్ 0.2 మి.లీ లేదా స్పైరోమెసిఫిన్ 2 మి.లీ లేదా డైఫెంథురియాన్ 1.2గ్రా లీటరు నీటికి ఖలికి పిచికారి చేయాలి.

 • నల్లులను అదుపులో ఉంచడానికి డైఫెంథురియాన్ 1.2గ్రా లేదా క్లోరోఫెనాఫిర్ 1.5 మి.లీ లేదా ప్రొపార్గైట్ 2 మి.లీ లేదా థయోమిథాక్సం 0.3మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 • పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు వివిధ రకాలుగా పనిచేసే పురుగు మందులను మార్చి మార్చి వినియోగించుకోవాలి.

 • వాతావరణ వేడిగా ఉండి తేమ ఎక్కువగా ఉన్నట్లైతే రసం పీల్చు పురుగుల ఉదృతి పెరుగుతుంది.కాబట్టి మొక్కలు నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి.

 • భూమిలో సేంద్రీయ పదార్ధాలు ఎక్కువగా వాడినట్లైతే భూమి నీటిని నిలుపుకునే సామర్ధ్యాన్ని పెంచుకుంటుంది.

 • పురుగుల ఉనికిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పైన తెల్పిన యాజమాన్య పద్దతులను పాటిస్తూ వ్యవసాయం చేస్తే, రైతులు ఖర్చు తగ్గించుకుని వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టి అధిక దిగుబడులు సాధించవచ్చును.