రబీ పంట తర్వాత లోతుదుక్కులు-ప్రయోజనాలు


రచయిత సమాచారం

యం.సురేష్ ,ఆర్.టి బాలాజి నాయక్,బి.వెంకట రాజ్ కుమార్,యం.శ్వేత,యం.భవ్య మంజరి మరియు యం.మోహన్ కృషి విజ్ఞాన్ కేంద్రం -రుద్రూరు,నిజామాబాద్ జిల్లా.


చీడ పీడలను నివారించడానికి ,పంటల సమగ్ర సస్య రక్షణలో భాగంగా భౌతిక,యాంత్రిక మరియు సాగు పద్దతుల్లో మార్పులు ఆచరించతగ్గవి.సాధారణంగా రైతులు ఖరీఫ్,రబీ పంటల కోత తర్వాత మళ్ళీ వర్షాకాలం పంట వేసే వరకు భూమిని దున్నకుండా ఖాళీగా వదిలేయడం జరుగుతుంది.ప్రస్తుతం పండ్ల తోటలు,కూరగాయలు మినహా మిగతా పంట భూముల్లో పైర్లు కోత దశలో ,కొన్ని భూములు ఖాళీగా ఉన్నాయి.కాబట్టి రైతులు పంట తర్వాత వేసవి దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.దుక్కి చేయకుండా భూమిని ఖాళిగా వదిలేయడంవల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలో నీటిని పోషక పదార్ధాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తాయి.దీని వల్ల భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుండి నీరు పైకి  ఆవిరై పోతుంది.కాబట్టి పంట కోసం వెంటనే వేసవిలో తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు చేసుకోవాలి.ప్రస్తుతం దుక్కులు చేసుకోవడానికి సరిపడ తేమ ఉన్న పొలాల్లో సుమారుగా 9 అంగుళాల లోతు తగ్గకుండా దుక్కులు చెసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. 
లోతు దుక్కులు దున్నినప్పుడు నేల పై పొరల్లో ఉండే పురుగులను,తెగుళ్ళను నశింపచేయడానికి అవకాశముంది.నేలను లోతుగా దున్నినప్పుడు నేలలో దాక్కొని లేదా నిధ్రావస్థలో ఉండే పురుగులు,నేలలో ఉండే తెగుళ్ళను కలుగజేసే శిలీంధ్రాలకు సూర్యరశ్మి తగులుతుంది.
ఏప్రిల్,మే నెలల్లో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు ఈ పురుగులు,శిలీంధ్రాలు నశిస్తాయి.దుక్కిలో బయట ప్యూపాలను ,గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి.కాబట్టి తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గడానికి అవకాశం ఉంది.
తుంగ,గరిక,దర్భ,జమ్ము వంటి మొండి జాతి కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటకు నష్టం కలుగ జేస్తాయి.వీటి వేర్లు,కాయలు,దుబ్భులు భూమిలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది.వేసవి దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు మొక్కల కాయలు,దుంపలు పెకిలించబడి,వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు నశించడానికి అవకాశం ఉంది.నేలపైకి తేలిన కాయలు,వేర్లు,దుంపలను ఏరివేసి వీటిని అరికట్టవచ్చును.
వేసవిలో లోతుగా దుక్కి దున్ని,తొలకరి వషాలకు గొర్రు,గుంటకలతో దున్నినప్పుడు,నేల బాగా గుల్లబారిపోతుంది.తొలకరిలో వేసే పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది.
సేద్యానికి ఉపయోగపడే గొర్రు,గుంటక,దంతెలు వంటి పరికరాలు నేలలోపలికి 3-5 అంగుళాల లోతు వరకు చొచ్చుకొనిపోతాయి.ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయడం వల్ల నేల లోపలికి సుమారుగా 3-5  అంగుళాల లోతులో ఒక గట్టి పొర ఏర్పడుతుంది.అందువల్ల నేలకు నీటిని పీల్చుకొనే శక్తి తగ్గుతుంది.కాబట్టి నేలను లోతుగా దున్నినప్పుడు ఈ గట్టిపొర చేదింపబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది.భూమి గుల్ల బారుతుంది.
పంట కోతల తర్వాత మిగిలే పంటల మొదళ్ళు,పొలంలో మిగిలిన కలుపు మొక్కలు,పంటల నుండి రాలిపడిన ఆకులు వంటి వివిధ సేంద్రీయ పదార్ధాలు అన్ని లోతు దుక్కి దున్నినప్పుడు నేలలో కలిసి కుళ్ళిపోతాయి.అందువల్ల నేలలో సేంద్రీయ కర్భన శాతం,పోషక పదార్ధాలు పెరగడానికి అవకాశం ఉంది. 
వేసవిలో లొతు దుక్కి దున్నినప్పుడు పొలంలో కలుపు,గత పంట మొదళ్ళు లేకుండా శుభ్రంగా ఉంటుంది.అందువల్ల తొలకరి వర్షాలకు నేలను గొర్రు,గుంటకలతో దున్నుకొని,తొలకరి పంటలను ఆలస్యంగా లేకుండా త్వరగా విత్తుకోవడానికి వీలు కలుగుతుంది.
అందువల్ల ఈ వేసవి కాలంలో పంట కోతలు పూర్తి అయిన తర్వాత వేసవి జల్లులు ఆసరా చేసుకొని వేసవిలో లోతు దుక్కులు చేసుకుంటే తొలకరి విత్తుకునే పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.