శనగ పంటకు ప్రత్యామ్నాయ పంటగా 'కుసుమ”


రచయిత సమాచారం

డా. జి. రమేష్, శాస్త్రవేత్త, ఫోన్ : 9440358336, డా. సి. హెచ్. వరప్రసాదరావు, సీనియర్ శాస్త్రవేత్త, డా. జి.ఎమ్.వి. ప్రసాదరావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డాట్ సెంటర్, దర్శి,


ప్రస్తుతం శనగ పంటకు మార్కెట్ లో సరైన ధర లేకపోవడం వలన చాలా మంది రైతులు శనగ పంటకు ప్రత్యామ్నాయ పంటల ఎంపిక మీద దృష్టి పెట్టుచున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో శనగ పండించే రైతులు కుసుమ పంటను సాగు చేసినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా నూనె గింజల పంటలను ప్రోత్సహిస్తున్నారు. మరి కుసుమ పంట కూడా నూనె గింజల పంట క్రింద వస్తుంది. కాబట్టి మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది. 

కుసుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లరేగడి నేలలయందు వర్షాధార రబీ పంటగా కర్నూలు, అనంతపురం, ప్రకాశం మరియు కడప జిల్లాల్లో సాగు చేయబడుతున్నది. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే, కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించవచ్చు. అడవి పందులు మరియు జింకల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. 

విత్తే సమయం :
కుసుమ పంట అధిక వర్షపాతం, తేమను తట్టుకోలేదు. ఈ పంట సాగుకు పొడి వాతావరణం అనుకూలం. తక్కువ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలను పెరుగుదల దశకు అనుకూలం. మన రాష్ట్రంలో కుసుమను కోస్తా మరియు రాయలసీమలో అక్టోబరు నెలలో విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనప్పుడు అక్టోబరు రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. 

నేలలు :
నీరు నిలవని, బరువైన, తేమని నిలుపుకునే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు మిక్కిలి అనుకూలం. 

విత్తనం, విత్తే పద్దతి :
ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. ఒకవేళ కుసుమను అంతర పంటగా సాగుచేయాలంటే ఎకరానికి 1.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనం భూమిలో 5 సెం.మీ. లోతులో పడే విధంగా విత్తుకోవాలి. లేకపోతే మొలకశాతం తగ్గుతుంది. సాలుకు సాలుకు 45 సెం.మీ. దూరంలో ఉండే విధంగా విత్తుకోవాలి.

రకాలు :
టి.ఎస్.ఎఫ్-1:
తెల్ల పూల రకం కలిగి 28-30 శాతం నూనె ఉంటుంది. ఈ రకం ఎండు తెగులును పూర్తిగా తట్టుకొని కొంతమేరకు పేనుబంకను తట్టుకొంటుంది. పంటకాలం 135 రోజుల్లో పూర్తి అయి ఎకరానికి 7-8 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. 

పూలే కుసుమ (జె.యస్.ఎఫ్ - 414) : 
పంటకాలం 135 రోజులు. ఎకరాకు 8 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. నీటి పారుదల సాగుకు అనుకూలమైన రకం. 

మంజీర :
ఈ రకం 115-120 రోజులకు కోతకు వచ్చి ఎకరానికి 4 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. పూలు పసుపు నుండి నారింజ రంగుకు మారతాయి. గింజ తెల్లగా ఉండి 27-30 శాతం నూనె కలిగి ఉంటుంది. 

సాగర ముత్యాలు :
ఈ రకం కుసుమలో పూలు పసుపుగా ఉంటాయి. గింజలు చిన్నవిగా ఉండి, ముత్యాలవలె ఉంటాయి. 27-32% నూనె కలిగి ఉంటుంది. ఈ రకం అధిక నత్రజని తీసుకొని ఎక్కువ దిగుబడినిస్తుంది. ఈ రకం 115-120 రోజుల్లో పంట కాలం పూర్తి చేసుకుని ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. 

నారి - 6 :
ముళ్ళు లేని రకము. పంట కోత, నూర్పిడి సులభతరము. పూరేకులు సేకరించుటకు అనువైన రకం. కొంతవరకు ఆకుమచ్చ తెగులు తట్టుకొంటుంది. గింజలో నూనె 30 శాతం వరకు ఉంటుంది. పంట కాలం 135 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.

హైబ్రిడ్స్ : 
డి.యస్. హెచ్- 129 : 
ఈ సంకర రకం కొంతవరకు ఎండు తెగులు తట్టుకొంటుంది. గింజలో 31 శాతం వరకు నూనెశాతం ఉంటుంది. ఎకరానికి 7-8 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. 

డి.యస్. హెచ్ - 185 :
ఈ సంకర రకం 130 రోజుల్లో పంటకాలం పూర్తె ఎకరానికి 7-8 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. కొంతవరకు ఎండు తెగులును తట్టుకొంటుంది. 

నారి ఎన్.హెచ్ -1 :
నీటి పారుదలకు అనువైన ముళ్ళు లేని సంకర రకం. కొంతవరకు ఎండుతెగులును తట్టుకొంటుంది. గింజలో నూనెశాతం 29% ఉంటుంది. ఎకరానికి 7-8 క్వింటాళ్ళ దిగుబడినిచ్చి 130 రోజుల్లో పంటకాలం పూర్తి అవుతుంది. 

విత్తన శుద్ధి :
విత్తనము ద్వారా సంక్రమించే ఆల్టర్నేరియా ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళు మరియు నేలలోని శిలీంద్రాల ద్వారా సంక్రమించే ఎండు తెగుళ్ళను అరికట్టుటకు విత్తనశుద్ధి అత్యంత ఆవశ్యకము. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ (లేదా) కాప్టాన్ (లేదా) కార్బండిజమ్ ను కలుపుకొని విత్తనశుద్ధి చేయాలి. 

ఎరువుల యాజమాన్యము :
వర్షాధారపు పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని మరియు 10 కిలోల భాస్వరము ఇచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. అంటే 35 కిలోల యూరియా మరియు 63 కిలోల సూపర్‌ఫాస్పేట్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది.

నీటి వసతి కింద సాగు చేసినప్పుడు సిఫార్సు చేసిన దానిలో 50% నత్రజని మరియు పూర్తిగా భాస్వరాన్ని దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన 50% నత్రజని 5 వారాల తర్వాత మొదటి తడి ఇచ్చేటప్పుడు పైపాటుగా వేయాలి. జీవన ఎరువైన అజోస్పైరిల్లమ్ 25 గ్రా. కిలో విత్తనాన్ని శుద్ధి చేసిన ఎకరాకు 8 కిలోల నత్రజని ఆదా చేసుకోవచ్చును. గంధకము మూలకాన్ని సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో వేసుకొన్న అధిక గింజ మరియు నూనె దిగుబడి సాధించవచ్చును. 

నీటి యాజమాన్యం :
బరువైన నల్లరేగడి నేలల్లో నీటి తడులు అవసరం లేదు. తేలిక నేలల్లో 1-2 నీటి తడులు అవసరం. రకాన్ని మరియు నేలలో తేమను బట్టి కుసుమలో పూత 65-75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో కీలక దశ అయిన కాండం సాగే దశ (35-35 రోజులు) లేక పూత దశ (65-75 రోజులు)లలో ఒక తడి ఇచ్చిన దిగుబడులు 40-60 శాతం పెరిగే అవకాశముంది.

కలుపు యాజమాన్యం :
విత్తిన 20-30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 మరియు 40-45 రోజులకు దంతులు తోలి అంతరకృషి చేయాలి. దీని వలన కలుపు నివారణతో పాటు నేలలోని తేమను పరిరక్షించుకోవచ్చును. 

సస్యరక్షణ : 
పేనుబంక :
కుసుమ పంటకు పేనుబంక తాకిడి చాలా ప్రమాదకరమైనది. ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. విత్తిన 40-45 రోజుల నుండి పంటను ఆశించి ఒక వారం రోజుల్లో సంతతిని విపరీతంగా పెంచుకుంటుంది. దీని నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.