వరి మాగాణులలో సాగుచేసే మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం


రచయిత సమాచారం

ఈదర వెంకటేశ్వర్లు, డా||బి.ప్రమీలరాణి, సమగ్ర కలుపు నివారణ కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం, గుంటూరు


ఆంధ్రప్రదేశ్ లో మొక్కజొన్న దాదాపు లక్ష హెక్టార్ల మేర వరి మాగాణులలో సాగు చేయబడుతున్న ముఖ్యమైన పైరు. మొక్కజొన్న సాగులో పోషకాలు, నీరు ఎక్కువగా అవసరం. ఎక్కువ పోషకాలు, నీటి వినియోగం కారణంగా మొక్కజ్నొలో కలుపు సమస్య కూడా అధికంగానే ఉంటుంది. మొక్కజొన్నలో గడ్డి జాతికి చెందిన తుంగ, గరిక, చిప్పెర, ఉర్రంకి, ఊద, వెడల్పాకు జాతికి చెందిన చెంచలికూర, పిచ్చితోటకుర, గలిజేరు, గునుగు, నేలఉసిరి, వామింట, గుంటగలవిరి, టపాకాయల చెట్టు, ముక్కుపుడకాకు, మరలమాతంగి వంటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి.
కలుపు కారణంగా మొక్కజొన్నలో 74 శాతం వరకు దిగుబ డులు తగ్గే అవకాశం ఉన్నట్లుగా వివిధ పరిశోధనలలో తేలింది. కాబట్టి మొక్కజొన్నలో దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే కలుపు యాజమాన్యం చాలా ముఖ్యం. మొక్కజొన్న విత్తిన 45 రోజులకు సాళ్ళ మధ్య ఖాళీ ప్రదేశం పైరుతో కమ్ముకుంటుంది. కాబట్టి విత్తిన 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా యాజమాన్యం చేపడితే ఆ తరువాత మొక్కజొన్న పైరు కలుపును పెరగనివ్వదు. 

కలుపు నివారణ మార్గాలు : 
మనుషులతో కలుపు తీయించుట : 
వరి మాగాణులలో సాగు చేసే మొక్కజొన్న నేల దున్నకుండానే సాగుచేస్తారు కాబట్టి నేల గట్టిగా ఉండి మనుషులతో కలుపు తీయించటం అనేది కష్టమైన పని. అంతేకాక పొలంలో మిగిలి ఉండే వరి దుబ్బులు పచ్చబడి మొక్కకజొన్నతోపాటుగా పెరగడం మొదలవుతాయి. అందువలన మనుషులతో కలుపు తీయటానికి అవకాశాలు చాలా తక్కువ. 
అంతరకృషి :
మనుషులతో కలుపు తీయించటానికి ఉండే ఇబ్బందులే అంతరకృషి చేయడంలోనూ రైతులు ఎదుర్కొన వలసిఉంది. అంతేకాక వరి మాగాణులలో అంతరకృషికి బాగా అనువైన యంత్ర పరికరాలు కూడా పెద్దగా లేవు. మనుషులతో కలుపు తీయించటానికి, అంతరకృషికి పెద్దగా అవకాశాలు లేని పరిస్థితులలో వరి మాగాణులలో సాగుచేసే 
మొక్కజొన్నలో కలుపు నివారణకు రైతులు కలుపు మందుల పైనే ఎక్కువగా ఆధారపడవలసి ఉంది. అదృష్టవశాత్తు వరి మాగాణులలో సాగుచేసే మొక్కజొన్నలో కలుపు నివారణకు సమర్ధవంతంగా పనిచేసే కలుపు మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. 

కలుపు మందుల ద్వారా కలుపు నివారణ:
మొక్కజొన్న విత్తిన వెంటనే:
మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి ఒక కిలో అట్రాజిన్ 50% (అట్రాటాప్, సోలార్ వంటివి) పిచికారి చేసి, మొక్కజొన్నలో పంటతోపాటు మొలిచే కలుపు మొక్కలను నివారించవచ్చు. మొక్కజొన్న చుట్టు ప్రక్కల అపరాలు సాగు చేసినప్పుడు అట్రాజినకు బదులుగా పెండిమిథాలిన్ 30% (స్టాంపు, పెండిగార్డు, బాండ్, టాటాపనిడా వంటివి) ఎకరానికి 1.0 లీటరు పిచికారి చేయాలి.
వరి మాగాణులలో దుక్కి దున్నకుండా మొక్కజొన్న సాగు చేస్తారు కాబట్టి అట్రాజిన్ వంటి మందుతో పాటు ఎకరాకు 1.0 లీటరు పారాక్వాట్ 24% (గ్రామాక్సోన్, యునిక్వాట్, పారాలాక్ వంటివి) మొక్కజొన్న విత్తిన వెంటనే లేక 1-2 రోజులలోపు పిచికారి చేయాలి. పారాక్వాట్ వాడటం వలన వరికోసిన తరవాత పొలంలో మిగిలి ఉన్న కలుపు చనిపోతుంది. దానితో పాటుగా వరి దుబ్బులు కూడా ఎండిపోయి చిగురించవు. మొక్కజొన్న పైరు 20-30 రోజుల దశలో తుంగ, వెడల్పాకు కలుపు మాత్రమే ఉన్న పరిస్థితులలో 2,4-డి ఎమైన్ సాల్టు 58% (వీడ్ మార్ సూపర్, డ్యురా వంటివి) ఎకరానికి 400 మి.లీ. లేక 2,4-డి సోడియం సాల్లు 80% (ఫెర్నాక్సోన్, సాలిక్స్) ఎకరానికి 400 గ్రాములు చొప్పున పిచికిరి చేసి నివారించవచ్చు. ఈ మందు గడ్డిజాతికి చెందిన గరిక, ఊద, ఉర్రంకి వంటి కలుపును నివారించలేదు. ఈ మందు మొక్కజొన్న పైరు మీద పడినా కూడా పైరుకు నష్టం ఉండదు. 
మొక్కజొన్న 20-30 రోజుల దశలో గడ్డి మరియు ఆకుజాతి కలుపు కూడా ఉన్నపుడు టెంబోట్రెయాన్ 34.4% (లాడిస్) ఎకరానికి 115 మి.లీ. (లేక) లో ప్రమిజోన్ 33.6% (టింజరు) ఎకరానికి 30 మి.లీ. ఉపయోగంగా ఉంటాయి. ఈ రెండు మందులు మొక్కజొన్న పైరు మీద పడినా కూడా పైరుకు నష్టం ఉండదు.