వివిధ పంటలనాశించే నులిపురుగులు - సమగ్ర యాజమాన్యం


రచయిత సమాచారం

వి. లక్ష్మీ నారాయణమ్మ, పి. ప్రశాంత్, యమ్. శ్రీనివాసులు ఎలక్ట్రానిక్ వింగ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం


పంట ఏదైనప్పటికీ అధిక దిగుబడి సాధించడానికి సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యం. వివిధ పంటలలో సాధారణంగా కనిపించే చీడపీడలకు సంబంధించిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు చాలా వరకు అవగాహన ఉంది. అయితే గత 2, 3 సంవత్సరాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్న వివిధ పంటలలో మరియు పండ్ల తోటల్లో ఆకులు పసుపుబారి, మొక్కలు వాడిపోయి, చెట్లు ఎండిపోవడం లాంటి లక్షణాలను ఎక్కువగా గమనించడం జరుగుతున్నది. మొక్కలకు పోషకాలను, నీటిని సమృద్ధిగా అందిస్తున్నా మొక్క కోలుకోకపోవడం, దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులలో మొక్కల వేర్లను మరియు మట్టి నమూనాలను కుణంగా పరిశీలించిన తర్వాత ఈ లక్షణాలు నులిపురుగులు ఆశించడం వలన వస్తున్నాయని తెలిసింది. నులి పురుగులు వివిధ పంటలను ఆశించి మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అధిక ప్రాముఖ్యత సంతరించుకున్న తైవాన్ జామ రకంలో ఎక్కువగా నష్టం కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నులిపురుగులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వున్నది. మెలాయిడాగైన్ జాతికి చెందిన నెమటోడ్లు లేదా రౌండ్ వార్మ్ అని పిలవబడే నులిపురుగులు విస్తృతమైన పరిసరాలలో, భిన్నమైన పంటలనాశించి జీవించగల విభిన్న జంతువులు. నెమటోడ్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. నెమట్ అనగా దారం అని, ఓడ్స్ అనగా స్వభావం అని అర్థం. అనగా నెమటోడ్స్ అనగా సన్నని దారం వంటి స్వభావం కలిగిన జీవులని అర్ధం. నులిపురుగులు 5-100 మైక్రాన్ల మందంతో 0.1 నుండి 2.5 మిల్లీ మీటరు పొడవు కలిగిన అతి చిన్న జీవులు.

నులిపురుగు యొక్క బాహ్య లక్షణాలు: -
 నులిపురుగుల శరీరం పొడవుగా, స్థూపాకారంగా వుంటుంది. ఖండీ భవనం ఉండదు.
వీటి శరీరం మీద పారదర్శకమైన, కొల్లాజన్ కలిగిన రక్షణ పొర వుంటుంది.
బాహ్యా చర్మం అనేక కణాల కలయికతో ఏర్పడి ఉంటుంది.
వీటిలో రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు. మిథ్యా శరీర కుహర ద్రవం పోషక పదార్థాలను శరీరం అంతటా పంపిణీ చేస్తుంది .

నులిపురుగులు ఆశించిన పంటల లక్షణాలు :
నులిపురుగులు కూరగాయలను, పండ్ల మొక్కలను, పూల మొక్కలను మరియు వివిధ ఆహార పంటలను ఆశించి నష్ట పరుస్తాయి. మన రాష్ట్రంలో వేరుశనగ,జామ, కనకాంబరం పంటలలో ఎక్కువగా గమనించడం జరిగింది.
ఈ పురుగులు ఆశించిన మొక్కల యొక్క ఆకులు పసుపురంగులోకి మారతాయి.
మొక్క కొమ్మలు, లేత చిగుర్లు వడలిపోతాయి.
నులిపురుగులు ఆశించిన తొలిదశలో భూమిలో తగినంత తేమ ఉన్నా మొక్కలు వాడిపోయినట్లు కనిపిస్తాయి.
నీరు, ఎరువులు అందించినా మొక్క కోలుకోలేదు.
ఈ లక్షణాలు, పోషక లోపాల లక్షణాలు మరియు ఎండుతెగులు లక్షణాలు పోలివుంటాయి.
క్రమంగా కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది.
చెట్లు ఎదుగుదల లోపించి, చెట్టు మోడుబారతాయి.
పూత, పిందె రాలడం లేదా ఆలస్యం అవడం, వచ్చినా త్వరగా రాలిపోవడం జరుగుతుంది.
పండ్ల తోటల్లో ఈ లక్షణాలు కనిపించిన మూడు మాసాల్లో చెట్లు చనిపోతాయి.
వేర్లు ముడులు ముడులుగా మారి, బుడిపెలని కలిగి వుంటాయి, వేరు వ్యవస్థ క్షీణించి ఉంటుంది.
నులిపురుగులు ఆశించిన వేరు భాగాల్లో ఎండుతెగులు శిలీంధ్రం ఆశించి వేరు కుళ్ళిపోతాయి.
ఈ విధమైన లక్షణాలు మొక్కల్లో కనిపించినట్లయితే నులిపురుగులు ఆశించినట్లుగా నిర్ధారించవచ్చు. ,

పంట నష్టం  :
ఈ నులిపురుగుల వలన ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు పండ్ల తోటల్లో 60-100 శాతం, నర్సరీలలోనైతే 90-100 శాతం మరియు వేరుశనగ మొదలగు ఆహార పంటలలో 60 నుండి 100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది.

నులి పురుగుల సమగ్ర యాజమాన్య పద్దతులు :
నులిపురుగుల వ్యాప్తిని నిరోధించుటకు గాను, దిగుమతి సంస్థలైన విమానాశ్రయాలు, పోర్టులు మరియు రోడ్డు రవాణా కేంద్రాలలో నులిపురుగులపై శాస్త్రీయమైన నిఘాను విధిగా నిర్వర్తించాలి.
నులిపురుగులు లేనివిగా నిర్ధారింపబడిన నర్సరీల నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైన విత్తనాలను, పండ్ల మొక్కల అంట్లను కొనుగోలు చేయాలి.
అంట్లు కట్టడానికి మరియు నర్సరీల్లో అంటుమొక్కలను పెంచడానికి నులిపురుగులు లేని స్వచ్ఛమైన మట్టిని వాడుకోవాలి. 
ఆకులు పచ్చబారి, వాడిపోయి, వేరుపై బొడిపెలు లాంటివి కలిగి ఉన్న మొక్కలను తోటల్లో నాటరాదు.

వేరుశనగ:
వేరుశనగలో నులిపురుగుల నివారణకు వేసవిలో లోతు దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి.
పంట మార్పిడి విధానాన్ని విధిగా పాటించాలి.
వరి,జనుము, నువ్వులు వంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. • నులిపురుగులను తట్టుకునే కాళహస్తి, తిరుపతి 3, ప్రసూన, కదిరి 9 రకాలను ఎన్నుకోవాలి. • విత్తనాన్ని నాటుటకు ముందు ఎకరాకు 8 నుండి 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు వేయాలి. • ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3జి గుళికలు వేసుకోవాలి.

నర్సరీలలో నులిపురుగుల యాజమాన్యం: 
ఒక టన్ను మట్టిలో 50-100 కిలోల వేప చెక్క పిండి లేదా గానుగ పిండి మరియు జీవ నియంత్రణ కారకాలైన పరూరేసిల్లమ్ లిలాసినస్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ మరియు ట్రైకోడెర్మా హార్జియానమ్ ఒక్కో కిలో చొప్పున కలిపిన మట్టిని అంట్లు కట్టే ముందు సంచుల్లో నింపాలి.
కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 5 నుండి 10 కిలోలను ఒక టన్ను మట్టితో కలపాలి.
నారుమడులను, నారు మొక్కలను పెంచడానికి వాడే మట్టిని వేసవి కాలంలో 100 మైక్రాన్ల మందం గల తెల్ల పాలిథీన్
షీటుతో 45 నుండి 60 రోజులు కప్పి ఉంచి సోలరైజేషన్ ప్రక్రియ ద్వారా నులిపురుగులను నివారించవచ్చును.
డయాజోమెట్ గుళికలు ఎకరాకు 60 కిలోల చొప్పున వేసి, కలియబెట్టి పాలిథీన్ షీటుతో కప్పి, ఒక వారం ఉంచి తరువాత షీటుని తీసి, మట్టిని తిరిగి కలియబెట్టి 2-3 రోజుల తరువాత మొక్కలు నాటుకోవాలి.
ఈ పద్ధతి ద్వారా నులిపురుగులను త్వరితగతిలో నివారించవచ్చు. వీలైనంత వరకు ఎయిర్ లేయరింగ్ పద్దతిలో నులిపురుగులు లేని మట్టి లేదా కొబ్బరి పీచు లేదా వర్మిక్యులేటని వాడి పండ్ల మొక్కల అంట్లను తయారు చేసుకోవాలి.

పండ్ల తోటల్లో నులిపురుగుల యాజమాన్యం :
నేల సూర్యరశ్యీకరణ :
నులి పురుగుల యాజమాన్యంలో నేల సూర్యరశ్మీకరణ చేయటం ఒక ప్రధాన ప్రక్రియ. 
ఈ ప్రక్రియను చేపట్టే ముందు భూమిని 2 నుండి 3 సార్లు బాగా దున్నాలి.
తగినంత నీరు పెట్టి నేలను బాగా తడిపి పూర్తిగా తేమ ఉండేటట్లు చూడాలి. 24 గంటల తర్వాత పారదర్శకత (టాన్సపరెన్సీ) కలిగిన పాలిథీన్ షీట్ ను పలుచగా నీరున్న నేలపై కప్పి అన్ని ప్రక్కల మూసివేయాలి.
4 నుండి 6 వారాల పాటు ఈ విధంగా పాలిథీన్ షీటు వుంచాలి. దీనివల్ల నేల ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్ వరకుపెరిగి రోగ కారకాలు నశించడం, పోషకాలు అందుబాటులోకి రావడం జరుగుతుంది.
ఈ ప్రక్రియ వల్ల నుమటోడ్లు పూర్తిగా నశిస్తాయి. వీటితో పాటు కలుపు మొక్కలు మరియు పంటలకు హాని కలిగించే శిలీంధ్రాలు కూడా నశించబడతాయి.
ప్రత్తి, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, తమలపాకు మొదలైన సాధారణ పైర్లమీద, టొమాటో, మిరప, వంగ, చిక్కుడు, దోస,బంగాళదుంప వంటి కూరగాయల పైర్లు, అరటి, జామ చీనీ, నిమ్మ వంటి ఫలవృక్షాలు వేసిన పొలాల్లో సాయిల్ సోలరైజేషన్ మంచి ఫలితాలనిచ్చినట్లు కనుగొన్నారు.
కొత్తగా పండ్ల మొక్కలు పెట్టే తోటల్లో మట్టిని నులి పురుగులకై పరీక్ష చేయించుకోవాలి.
నులి పురుగులు ఉన్న భూమిలో మొక్కలు నాటే ముందు జీవనియంత్రణ కారకాలతో సమృద్ధి చేయబడిన వానపాముల
ఎరువు లేదా వేపపిండి గుంటకి 5 కిలోల చొప్పున వేసుకొని అంట్లని నాటాలి.
ఒక టన్ను వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువు లేదా వేపపిండిలో 5 కిలోల చొప్పున పాసిలో మైసిస్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ మరియు ట్రైకోడెర్మా హార్జినియమ్ ను కలిపి 30 రోజులు ఉంచి సమృద్ధి చేసిన మిశ్రమాన్ని 3-4 కిలోలు ఒక చెట్టుకు 6 నెలల వ్యవధిలో వేయాలి.
పైన సూచించిన జీవనియంత్రణ కారకాలతో ఉన్న వేపపిండి లేదా పశువుల ఎరువును 20 కిలోలను 200 లీటర్ల
నీటిలో 2 రోజుల పాటు నానబెట్టి, 2-3 లీటర్లతో ఒక్కో చెట్టు మొదళ్ళు తడిపి నులి పురుగులను నివారించవచ్చు.
ఈ ద్రావణాన్ని వడకట్టి 15-20 రోజుల వ్యవధిలో డ్రిప్ పద్దతిలో చెట్లకు పంపించడం ద్వారా నులిపురుగులను నియంత్రించవచ్చు.
పండ్ల మొక్క మొదళ్ళలో బంతి నారు మొక్కలు నాటడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు. కార్బోఫ్యూరాన్ గుళికలను ఒక్కో చెట్టుకు వయసును బట్టి 50 నుండి 100 గ్రా. చొప్పున ఇసుకలో కలిపి సంవత్సరానికి రెండుసార్లు వేసుకోవాలి.