శక్తి, పోషకాల సమాహారము - సపోటా


రచయిత సమాచారం

డా.యం. భవ్యమంజరి, డా. ఆర్‌విటి.బాలాజీనాయక్‌, డా,బి.వి.రాజ్‌కుమార్‌, మాలోత్‌ మోహన్‌ మరియు యం.సురేష్‌, కృషి విజ్నాన కేంందం రుద్రూరు, నిజామాబాద్‌ జిల్లా.


సహజ సిద్దంగా లభించే పండ్లల్లో ఒకటి సపోటా, కమ్మని రుచి, బోలెడన్ని పోషకాల సమాహారమే సపోటా పండు, ఇది తేలిగ్గా జీర్ణమవడమే కాకుండా శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. సీజన్‌లో దొరికే సపోటా పండ్లను రోజుకు రెండు తినటం చాలా మంచిది.
 

పోషక విలువలు :
సాధారణంగా 170గ్రా, సపోటా పండులో లభించే ఆహార పోషర విలువలు ఇలా ఉన్నాయి. శక్తి -141 క్యాలరీలు, నీరు-132.60గ్రా, పిండి పదార్ధము-33.93గ్రా, మాంసకృత్తులు-0.75గ్రా, పీచు పదార్ధం-9.01గ్రా, మొత్తం కొవ్వు పదార్ధము-1.87గ్రా, కాల్షియం-35.70మి.గ్రా, ఐరన్‌-36మి.గ్రా, మెగ్నీషియం-20.40మి.గ్రా, భాస్వరం-20.40మి.గ్రా, పొటాషియం-328.10మి.గ్రా, సోడియం-20.40మి.గ్రా, జింక్‌-0.17మి.గ్రా, కాఫర్‌-0.15మి.గ్రా, సెలీనియాం-1.02.00మి.గ్రా విటమిన్‌ ఎ-102.001 , ధయమిన్‌-0.00మి.గ్రా, రైబోప్లావిన్‌-0.03మి.గ్రా, నియాసిన్‌-0.34మి.గ్రా, పాంధోనిక్‌ యాసిడ్‌-0.43మి.గ్రా, విటమిన్‌ బి6-0.06మి.గ్రా, ఫోలిక్‌ యాసిడ్‌-23.80మి.గ్రా, సయనోకోబాలమైన్‌-విటమిన్‌ బి12-0.00మి.గ్రా, విటమిన్‌ సి-24.99మి.గ్రా, 

రోగ్య ప్రయోజనాలు :

 • ఆయుర్వేదం ప్రకారం సపోటా వినియోగం శరీరంలోని వేడిని తగ్గించి వొంటిని చల్ల బరుస్తుంది.

 • నీరసంగా ఉన్నప్పుడు సపోటా పండ్లను తింటే, శరీరం అతి తక్కువ సమయంలో శక్తిని పుంజుకుంటుంది. అయితే ఇందులో చక్కెర పాళ్ళు అధికం గనుక మధుమేహులు పరిమితంగానే తీసుకోవాలి.

 • సపోటాలో అధికంగా ఉండే విటమిన్‌ ఎ, కంటిచూపును మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది.

 • సపోటాలోని పీచుపదార్ధం మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. పెద్ద పేగుక్యాన్సర్‌ ముప్పును సపోటా గణనీయంగా తగ్గిస్తుంది.

 • మొలలు, ఫిస్ట్యులా బాధితులు తరచూ సపోటా తింటే రక్తస్రావం తగ్గుతుంది. పేగులు బలపడతాయి.

 • కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌ సమృద్దిగా ఉండటం వల్ల సపోటా పండు ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. 

 • పిండిపదార్ధాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలుఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం.

 • సపోటాలోని విత్తనాల పేస్టుని పురుగు కుట్టినప్పుడు ఉపయోగిస్తారు.

 • ఈ పండులో ఉండే విటమిన్‌ ఇ చర్మాన్ని తేమగా ఉంచడం వల్ల చర్మం, అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. సపోటా విత్తనాల నుంచి తీసిన నూనెను జుట్టుకు పట్టిస్తే అది తేమగా మృదువుగా ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఆరోగ్యంగా పెరుగడానికి సహాయపడుతుంది. చుండ్రును నియంత్రిస్తుంది. మొహం మీద ముడతలను తగ్గిస్తుంది.

 • సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.

 • సపోటా వినియోగంతో, నొప్పులు, వాపులు తగ్గుతాయి. తక్కువ సమయంలో గాయాలు కూడా మానిపోతాయి. 

 • మొలకెత్తిన రాగుల్ని ఎండ బెట్టి పిండిపట్టి అందులో సపోటా గుజ్జు కలిపి సాయంత్రం వేళల్లో తింటే కాల్షియం లోపం తొలగి పోతుంది.

 • వేడి చేసినప్పుడు కనిపించే పొడిదగ్గు, మూత్రంలో మంట, కడుపు లో మంట, విరేచనంలో మంటకు సపోటా వినియోగం మంచి విరుగుడు.

 • సపోటా,పెరుగు, పంచదార, చిటికడు ఉప్పు, ఎండుఖర్జురాలను కలిపి జ్యూస్‌లా చేసుకుని తాగాలి. తరచూ ఈ జ్యూస్‌ తాగే వారికి ఇందులో ఐరన్‌, కాల్షియం మూలంగా రక్తహీనత తొలగి పోవటమేకాక ఎముకలు గట్టిపడతాయి.

 •  తరచూ సపోటా తినేవారికి మానసిక ఆరోగ్యం బావుంటుంది. డిప్రెషన్‌, నిద్రలేమి, ఆందోళన వంటివి  దరిచేరవు.

గమనిక : తియ్యగా మెత్తగా, రుచిగా ఉన్నాయి కదా అని, బాగా లభ్యమవుతున్నాయి, కదా అని సపోట పండ్లను అదే పనిగా తినరాదు. అలా తింటే అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం కూడా వస్తుంది. గుండె జబ్బుతో బాధపడే వారు మాత్రం రోజుకు ఒకటి కంటే ఎక్కువ తినక పోవడం ఉత్తమం ఓబేసిటి, మధుమేహం ఉన్న వారు వైద్యుల సలహా మేరకే ఈ పండు తినాలి.