యాసంగిలో వరిని నేరుగా విత్తే పద్ధతి


రచయిత సమాచారం

డి. అనిల్, శాస్త్రవేత్త (సేద్య శాస్త్ర విభాగం ),డా .శ్రీధర్ సిద్ది,శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడింగ్ ), వ్యవసాయ పరిశోదనస్థానం, కూనారం పీ. మధుకర్ రావు, శాస్త్రవేత్త (సేద్య శాస్త్ర విభాగం ), ఆర్ .ఉమారెడ్డి (ఏ.డి.అర్), ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనస్థానం, జగిత్యాల


మన రాష్టం లో వరిని యాసంగి లో సుమారుగా 18 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా సంప్రదాయ పద్ధతి లో అనగా నాటువేసే పద్ధతి లో సాగు చేస్తున్నారు. ఒక ఎకరం నాటు వేయడానికి సుమారు 8-10 మంది కూలీలు అవసరం మరియు యాసంగి లో వరి నాట్లు 30-40 రోజులలో పూర్తవుతాయి. వరి నాట్లు వేసే సమయానికి కూలీలా కొరత ఏర్పడతుంది. వరి సాగు చేసే రైతులు తమ నాట్లను సకాలం లో వేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దమ్ము చేసిన పొలం లో సరైన సమయం లో నాటు వేయకపోవడం తో మళ్ళి వరి పొలాలను దమ్ము చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం  వల్ల సాగులో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నయి.వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని
కొన్ని ప్రాంతాలలో రైతులు దమ్ము చేసిన పొలం లో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్దతి పై ఆసక్తి చూపుతున్నారు
ఈ పద్దతి వలన కలిగే ప్రయోజనాలు :
నారుమడి పెంపకం మరియు నాట్లకు అయ్యే ఖర్చు సుమారు 3000 -4000 వరకు తగ్గుతుంది .
 విత్తన మోతాదు  మరియు కూలీలా అవసరం తక్కువ 20-30% వరకు నీటి ఆదా అవుతుంది . 
ఎరువులను సమర్థవంతగా వినియోగించుకోవచ్చును 
చీడ పీడల సమస్య తక్కువ 
పంట 7-10 రోజుల ముందుగా కోతకు వస్తుంది 
తక్కువ సమయం లో ఎక్కువ విస్తీర్ణం లో విత్తుకోవచ్చు  
ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంటకాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నపుడే  వరి సాగు చేసుకునే అవకాశం వుంది 
నేలలు : సమస్యాత్మక నేలలు తప్ప సాధారణంగా వరిని సాగుచేసే అన్ని నేలలు అనుకూలం .ముంపుకు గురయ్యే భూములు సాగుకు అనుకులం కాదు  
విత్తన మోతాదు  : దమ్ము చేసుకున్న పొలం లో 
వెదజల్లే పద్దతి  లో :   ఎకరానికి 30 -35 కిలోలు 
డ్రమ్ సీడర్ ద్వారా విత్తే పద్దతిలో : 10 - 15 కిలోలు అవసరమవుతాయి. 
ప్రధాన  పొలం తయారీ : సాధారణ పద్దతిలో వరి నాటేటపుడు కంటే వీలైనంత బాగా చదును చేసుకోవాలి ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాల అవసరం. అవసరమైతే వీలైనన్ని ఎక్కువ సార్లు జంబూతో కొట్టిన తర్వాత నాటు వేసుకోవాలి .పొలం లో నీరు  నిల్వ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి .బంక నేలల్లో ఆఖరి దమ్ము చేసి , చదును చేసిన మరుసటి రోజున విత్తుకోవచ్చును .విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే చాలు .ఇసుక శాతం ఎక్కువగా వున్నా నేలల్లో విత్తలనుకున్నరోజే  ఆఖరి దమ్ము చేసి , చదును చేసి పలుచగా నీరు వుండేటట్టు చూసుకోవాలి.
వెదజల్లే పద్దతి :  విత్తనలను 24 గంటలు నానబెట్టి  నానిన విత్తనాలను గొనె సంచిలో మండే కట్టి  దమ్ము చేసిన పొలం లో మొలకెత్తిన విత్తనని విత్తుకోవాలి 
డ్రమ్ సీడర్ ద్వారా విత్తే పద్దతి: లీటర్ నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ కలిపినా ద్రావణంలో 12  గంటలు నానబెట్టి 24 గంటలు మండే కట్టి కొద్దిగా ముక్కు పగిలిన గింజలను సీడర్ లో వేసి విత్తుకోవాలి .డ్రమ్ సీడర్ పరికరానికి 4 ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ కు 20 సెం .మీ  దూరం లో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలు ఉంటాయి ఈ డ్రమ్ లో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి . గింజ రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ లో కేవలం 3/4 వ వంతు మాత్రమే గింజలను నింపాలి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో వరుసకు వరుసకు మధ్య 20  సెం .మీ దూరం లో గింజలు పడతాయి వరుసల్లో కుదురుకు  కుదురుకు   మధ్య దూరం 5 - 8  సెం .మీ ఉంటుంది ఒక్కో కుదురులో 5-8 గింజలు పడటం జరుగుతుంది.
ఎరువుల యాజమాన్యం :ఈ విధానం లో కూడా సాధారణ పద్దతిలో సిఫారసు చేసిన మోతదే సరిపోతుంది .కాకపోతే దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం భాస్వరం ఎరువు ( 150 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ) మరియు సగ భాగం పోటాష్ ఎరువును ( 15 కిలోలు ) మాత్రమే వేయాలి .దమ్ములో గాని విత్తేటపుడు గాని నత్రజనిని వేస్తె కలుపు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సమయం లో నత్రజని ఎరువులను వేయకూడదు.నత్రజని ఎరువులను 3 భాగాలూగ చేసి 1/3 వ భాగం  ( 35 కిలోల యూ రియా) విత్తిన 15 -20 రోజులకు , 1/3 భాగం  ( 35 కిలోల యూరియా) విత్తిన 40-45 రోజులకు , మిగిలిన 1/3 వ భాగం  ( 35 కిలోల యూరియా) నత్రజని, సగం పోటాష్ ( 15 కిలోలు ) కలిపి విత్తిన 60-65 రోజులకు వేయాలి 
కలుపు యాజమాన్యం :విత్తిన 3- 5 రోజులలోపు  ప్రెటీలాక్లోర్ + సెఫ్ నర్ మందును 600 -800 మీ .లీ లేదా విత్తిన 8-10 రోజులలోపు  ప్రెటీలాక్లోర్ 500 మీ .లీ లేదా   ఆక్సాడయార్జిల్ 35-40 గ్రాములు  కలుపు మందును 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి .విత్తిన 15 రోజులకు ఎకరాకు సైహాలో ఫాప్ – పి – బుటైల్(క్లించర్) 250 మీ.లీ - 300 మీ.లీ   మందును లేదా బిస్ పైరీబాక్ సోడియం  100 మీ.లీ.   200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వరి నాటిన 25-30 రోజులకు 2,4- డి సోడియం సాల్ట్ (ఫెర్నా క్సోన్) అనే కలుపు మందును 500 – 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేసుకోవాలి.
సస్యరక్షణ చర్యలు 
కాండం తొలిచే పురుగు (మొగి పురుగు):
పిలక దశలో ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకి వస్తాయి. పిలకల నుండి దుబ్బు చేసే దశలో ఉన్న వరి పైర్లలో తప్పనిసరిగా నాటిన 30 రోజుల లోపు కార్బొఫ్యురాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జి 8 కిలోలు లేదా క్లోరాన్తోనిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోలు నీరు పలుచగా ఉంచి పొలం అంతటా సమానంగా చల్లాలి. 
40 - 45 రోజులు దాటిన పైర్లలో మరియు ఆంకురం నుండి చిరుపొట్ట దశలో ఉన్న చోట కాండం తొలిచే పురుగు గమనిస్తే  కార్టాఫ్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్. పి 2 గ్రాములు లేదా క్లోరాన్తోనిలిప్రోల్ 20 ఎస్.పి 0.3 మీ.లి ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.  
అగ్గి తెగులు :
నాటిన వరి పైరు తోలిదశలలో ఆకులపైనా నూలు కండె ఆకారం లో మచ్చలు ఏర్పడి ఆ మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగు లో ఉండి మచ్చల మధ్య భాగం బూడిద లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఈ మచ్చలు ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. దూరం నుండి చూసినట్లయితే తగలపడినట్లు కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లాజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోతయోలిన్ 1.5 మీ.లి. కాసుగామైసిన్ 2.5 మీ.లి లీటరు నీటికి చొప్పున 10 నుండి 15 రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారీ చెయ్యాలి.
నీటి యాజమాన్యం : విత్తిన తర్వాత మొదట్లో నీరు లేకుండా బురదగా మాత్రమే ఉంచాలి .నీరు నిల్వ వున్నా చోట మొలక రాదు . ఆ తర్వాత పలుచగా నీరు (2-3 సెం .మీ ) పిలకలు తొడిగే  దశ వరకు ఉంచితే సరిపోతుంది. పైరు పొట్ట దశ నుండి పంట కోసే 7 -10 రోజుల వరకు నాటు వేసిన పొలం మాదిరిగానే నీటి యాజమాన్యం పాటించాలి