కంది పంటలో పూత దశ నుండి కోత వరకు ఆశించే పురుగులు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు


రచయిత సమాచారం

డా. ఓ. శైల, జి. నీలిమ, డా. సి.హెచ్‌.వి. దుర్గారాణి, డా. కె. అనిల్‌ కుమార్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, పి.జె.టి.ఎస్‌.ఎ.యు


కరువులో ప్రత్యామ్నాయ పంట, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ సరైన శాస్త్రీయ మెలకువలు మరియు సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. కంది పంటలో పూత దవ నుంచి కోత వరకు ఆశించే పురుగులు మరియు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు ఈ క్రింద వివరించబడ్డాయి.

కంది పంటను ఆశించే పురుగులు - నివారణ పద్ధతులు :

పేనుబంక :

పిల్ల మరియు తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, పువ్వులు మరియు కాయల నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ముడతలు పడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లయితే గింజ సరిగ్గా తయారవ్వదు. ఈ పురుగులు తేనె వంటి పదార్ధాన్ని విసర్జిస్తాయి. దీంతో ఆకులు, కాయలపైన మసి తెగులు, బూజు ఆశ్రయించి నల్లగా మారతాయి. మేఘావృతమైన, తేమతో కూడిన చల్లటి వాతావరణం ఈ పురుగు ఆశించడానికి అనుకూలం. అదే అధిక వర్షపాతం ఉన్నట్లయితే దీని ఉధృతి తగ్గుతుంది.

నివారణ :

మోనోక్రోటోఫాస్‌ 36% ఎస్‌.ఎల్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 30% ఇ.సి. 2.2 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

ఆకు గూడు పురుగు :

ఈ పురుగు పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తింటాయి. మరియు పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది.

నివారణ :

క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. / లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పూత పెంకు పురుగు :

ఈ పురుగు కంది పంట పూత దశలో ఆశిస్తుంది. పూత పెంకు పురుగులు ఎర్రటి లేదా నారింజ రంగు మచ్చలు ఉండి నల్లటి గీతలు కలిగి ఉంటాయి. ఇవి పూత సమయంలో మేఘావృతమైన వాతావరణ పరిస్థితులలో పంటను ఆశిస్తాయి.

నివారణ :

ఈ పురుగులను ఉదయం పూట ఏరి నాశనం చేయాలి.

మారుకా మచ్చల పురుగు :

తల్లి రెక్కల పురుగు కోడి గుడ్డు ఆకారంలో పసుపు పచ్చని గుడ్లను పూ మొగ్గలపై, లేదా ఆకులపై, పిందెలపై పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన లార్వాలు ఆకులను, పువ్వులను, కాయలను కలిపి గూళ్ళుగా చేసి మొగ్గలని, పిందెలను కాయలను తొలిచి తింటాయి. తొలిచిన కాయ రంద్రము దగ్గర లార్వా విసర్జితములు కనిపిస్తాయి. ఈ పురుగు పూత దశలో మేఘావృతమైనప్పుడు పొగమంచు మరియు చిరు జల్లులు కురిసినప్పుడు కంది పంటను ఆశిస్తుంది.

నివారణ :

క్లోరిపైరిఫాస్‌ 20% ఇ.సి. 2.5 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 50% ఇ.సి. 2.0 మి.లీ. లేదా నోవాల్యురాన్‌ 10% ఇ.సి. 0.75 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ పురుగు యొక్క               ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సైనోశాప్‌ 45% యస్‌.సి 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5% యస్‌.జి. 0.4 లేదా ఫ్లూబెండమైడ్‌ 39.35% యస్‌.సి. 0.2 మి.లీ. లేదా లామ్డాసైహాలోత్రిన్‌ 5% ఇ.సి. 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. జీవ రసాయనాలైనటువంటి వేపగింజల కషాయం 5% లేదా వేప నూనె (300 పిపిఎమ్‌) 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి మొగ్గ దశలో పిచికారి చేయాలి.

శనగ పచ్చ పురుగు :

తల్లి పురుగు లేత చిగుళ్ళపై, పూమొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లని పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన నల్ల పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తరువాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. పురుగు తిన్న కాయకి గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి.

నివారణ : 

ఈ పురుగు నివారణకు ఎసిఫేట్‌ 75% యస్‌.సి. 1.5 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఉధృతి ఎక్కువగా కనిపించినపుడు ఇండాక్సాకార్బ్‌ 14.5% యస్‌.పి. 1.0 మి.లీ. లేదా స్పైనోశాప్‌ 45% యస్‌.సి. 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5%  యస్‌.పి. 0.3 మి.లీ. లేదా ప్లూబెండమైడ్‌ 39.35% యస్‌.సి. 0.2 మి.లీ. లేదా లామ్డాసైహాలోత్రిన్‌ 5% ఇ.సి. 1 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5% యస్‌.జి. 0.5 గ్రా. లేదా థయోడికార్బ్‌ 75% డబ్ల్యు.పి. 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 9.3% మరియు లామ్డాసైహాలోత్రిన్‌ 4.6% జెడ్‌.సి. 0.4 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వేప గింజల కషాయం 5% లేదా వేప నూనె (300 పిపిఎమ్‌) 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారి చేయాలి. బ్యాసిల్లస్‌ తురింజెన్సిస్‌ 300 గ్రా. ఒక ఎకరాకు, హెలికోవెర్పా యన్‌.పి.వి. 200 ఎల్‌.ఇ. ఒక ఎకరాకు పిచికారి చేసుకోవలి.

సమగ్ర సస్యరక్షణ :

వేసవిలో లోతైన దుక్కులు చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. మరియు 8-10 పక్షి స్థావరాలను ఎకరాకు అమర్చుకోవాలి. ఎరపంటగా బంతి పూల మొక్కలను వేయాలి.

ఈక రెక్క పురుగు :

ఇవి ఎండు గడ్డి రంగులో సన్నని, పొడవైన ఈక రెక్కలతో ఉంటాయి. ముందు రెక్కలు రెండుగా, వెనుక రెక్కలు మూడుగా చీలి ఉంటాయి. ఈ పురుగు పచ్చటి గుడ్లను పూ మొగ్గపై పెడుతుంది. లార్వా ముదురు ఆకు పచ్చ రంగులో కందె మాదిరిగా, చిన్న చిన్న ముళ్ళు కలిగి, కాస్త పొడవు వెంట్రుకలతో ఉంటుంది. లార్వాలు పూ మొగ్గలను, పువ్వులను తిని కాయలను తొలిచి నష్టపరుస్తాయి. ఇవి కాయ లోపల తల ఉంచి మిగతా శరీరాన్ని బయటే ఉంచి లోపల గింజలను తింటాయి. లార్వాలు ఎదిగిన తర్వాత గోధుమ రంగు కోశస్థ దశ ప్యూపాలుగా మారి కాయల మీదే ఉంటాయి. వర్షాలు తగ్గిన తర్వాత ఈ పురుగులు ఆశిస్తాయి.

నివారణ :

ఎసిఫేట్‌ 75% యస్‌.పి. 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.ఎల్‌ 1.6 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

కాయ తొలిచే ఆకు పచ్చ పురుగు :

ఈ పురగు కంది చివరి దశలో ఎక్కువగా ఆశిస్తుంది. రెక్కల పురుగు ముందు రెక్కలు గోధుమ రంగులో ఉండి పై అంచున తెల్లని చార కలిగి ఉంటుంది. ఇవి పెరిగే పిందెలపై తెల్లటి గుడ్లను గుంపుగా పెడుతాయి. చిన్న చిన్న లార్వాలు ఆకుపచ్చగా ఉండి, పెరిగే కొద్దీ గులాబీ ఎరుపుగా మారతాయి. తల మీద గింజలను తింటాయి. లార్వా విసర్జించిన మలినాలు కాయ లోపల ఉంటాయి. 

నివారణ :

అజాడిరెక్టిన్‌ 0.03%, వేప నూనె (300 పిపిఎమ్‌) 2.5-5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎసిఫేట్‌ 75% యస్‌.పి. 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.ఎల్‌. 1.6 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. / లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కాయ తొలిచే ఈగ :

ఈ పురుగు దీర్ఘకాలిక రకాలలో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి ఈగ తెల్ల గుడ్లను అభివృద్ధి చెందుతున్న పిందెలలో చొప్పిస్తుంది. గుడ్ల నుండి వచ్చే కాళ్ళు లేని తెల్ల పిల్ల పురుగులు వృద్ధి చెందుతున్న గింజలను, చారలు, గూళ్ళు చేసి తింటాయి. ఒక్కో పురుగు జీవిత కాలంలో కొద్దిపాటి గింజలను మాత్రమే తింటుంది. పురుగు తిన్న గింజ పనికిరాదు. కాయలోనే నిద్రావస్థలోకి వెళ్ళి కాయ నుండి పిల్ల పురుగు చేసిన ఆవ గింజంత రంధ్రము ద్వారా తల్లి పురుగు బయటకి వస్తుంది. కాత దశలో బెట్ట వాతావరణ పరిస్థితులుంటే పూత, పిందె దశలలో ఈ పురుగు ఆశిస్తుంది.

నివారణ :

ఎసిఫేట్‌ 75% యస్‌.పి 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.ఎల్‌ 1.6 మి.లీ. లేదా లామ్డా సైహాలోత్రిన్‌ 5% ఇ.సి. 1.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కాయ రసం పీల్చే పురుగులు :

బగ్స్‌ జాతికి చెందిన మూడు రకాల పురుగులు కాయల నుండి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఒక రకం గోధుమ రంగు, భుజాల మీద రెండు ముళ్ళతో ఉంటాయి. రెండో రకం ముదురు గోధుమ రంగు, గుండ్రటి భుజాలతో ఉంటాయి. మూడో రకం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పురుగులు గుడ్లను గుంపులుగా ఆకుల మీద, కాయల మీద పెడతాయి. పిల్ల, తల్లి పురుగులు కాయలోని గింజల నుండి రసం పీల్చడం వలన గింజలు నొక్కులుగా మారి, ఎండిపోయి మొలకెత్తవు. బెట్ట వాతావరణ పరిస్థితులలో పిందె, కాయ అభివృద్ది చెందే దశలలో (నవంబర్‌ - డిసెంబర్‌) ఈ పురుగులు పంటను ఆశిస్తాయి.

నివారణ :

డైమిథోయేట్‌ 30% ఇ.సి. 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.ఎల్‌. 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి