నేలను సేంద్రియంగా అభివృద్ధిపరచడం


రచయిత సమాచారం

ఈడ్పుగంటి  శ్రీలత, కె. స్నేహమాధురి, జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 9010327879


సేంద్రియ వ్యవసాయం చేసే నేల ఆరోగ్యకరమైన పంట పెరుగుదలకు పునాది కనుక మట్టిని అభివృద్ధి చేసే ప్రక్రియ పంట పెరుగుదలలో కన్పిస్తుంది. మనం మట్టిని జాగ్రత్తగా కాపాడుకొని అభివృద్ధి చేసుకుంటే అదే దీర్ఘకాలంలో విజయవంతమైన సేంద్రియ వ్యవసాయానికి సోపానమవుతుంది. సేంద్రియ పద్ధతుల్లో అభివృద్ధి చేయబడిన నేల సారవంతంగా ఉండి పంట  ఉత్పాదక మరియు నాణ్యత పెంచుతుంది. 

సేంద్రియ వ్యవసాయానికి భూమి ఎంపిక మరియు సౌకర్యాల కల్పన చాలా ముఖ్యం. నేల సారవంతమైనది మరియు వాతావరణం అనుకూలమైనది అయినచో తేలికగా నాణ్యమైన పంట పండించవచ్చు. నాణ్యమైన నీటి లభ్యత, లేబర్‌ లభ్యత, రవాణా, మార్కెటింగ్‌ సదుపాయాలు కూడా ముఖ్యమైనవి. ఎంచుకున్న పొలం పండించదలచిన పంటలకు సంబంధించిన తెగుళ్ళు మరియు వ్యాధుల నుండి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఒకసారి సేంద్రియ భూమిని ఎంచుకున్న తరువాత తీసివేసిన పంటల అవశేషాలను నేలలో కలియదున్నడం, జంతువుల ఎరువులను భూమిలో అందించడం, నేల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించడం, నేలలో సూక్ష్మజీవుల వైవిద్యాన్ని పెంచడం మరియు పోషకాలను పరిరక్షించడం వంటి పద్ధతుల అమలు ముఖ్యం.

భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించుట :

సేంద్రియ వ్యవసాయానికి నేలలో సేంద్రియ పదార్థాలను నిర్మించడం అవసరం. సేంద్రియ పదార్ధ పర్యావరణాన్ని పరిరక్షించి మొక్కలకు అవసరమైన అన్ని పోషకాలు సరఫారా చేసి వాటిని తెగుళ్ళు మరియు వ్యాధుల నుండి రక్షిస్తుంది. నీటిని ఒడిసిపట్టి నిల్వ ఉంచుతుంది. నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందిచడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కనుక చాలా ఓపిక మరియు ఆసక్తి అవసరం. సహజ ప్రక్రియలో 1 సెం.మీ. సేంద్రియ పదార్థాన్ని నిర్మించడానికి వందల సంవత్సరాలు పడుతుంది. 

లివింగ్‌ సాయిల్‌ కాన్సెప్ట్‌ మరియు సాయిల్‌ పుడ్‌ వెబ్‌ : 

భూమిని ఎప్పుడూ ఒక సజీవమైన దానిలా భావించాలి. ఎందుకనగా నేల చాలా ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉంది. మట్టిలో సేంద్రియ పదార్థం పెరుగుతున్న కొలదీ సూక్ష్మజీవుల సంఖ్య మరియు వైవిద్యం పెరుగుతూ ఉంటుంది. ఒక గ్రాము మట్టిలో లక్షల కొలది బ్యాక్టీరియా శిలీంద్రాలు ఆక్టినోమైసుట్స్‌, ప్రోటోజువా, నులిపురుగులు, చిన్న కీటకాలు, సాలె పురుగులు, వానపాములు, నత్తలు, స్లగ్స్‌ మరియు రకరకాల పక్షుల ఆహారం వంటివి ఉంటాయి. ఇవి ఒక దాని మీద ఒకటి ఆహారం కొరకు ఆధారపడి ఒక పుడ్‌ వెబ్‌ అనగా ఆహారపు సాలెగూడును ఏర్పాటు చేసుకుంటాయి. 

మట్టిలోని సేంద్రియ పదార్ధం అనేక రకాలైన జీవరాసులను కలిగి ఉంటుంది. అవి వాటి ఆహారం కొరకు చనిపోయిన లేదా జీవించి ఉన్న జీవరాసులపై ఆధారపడి ఉంటాయి. మొక్కల వేళ్ళు, అనేక రకాలైన సూక్ష్మజీవులు కలిసి నేల యొక్క సేంద్రియ పదార్థాలను కుళ్ళేలా చేసి నేల యొక్క ఆకృతిని మరియు నిర్మాణాన్ని పటిష్టపరచడానికి తోడ్పడతాయి. చనిపోయిన మొక్కలు, మొక్క భాగాలు మరియు జీవులు ఎరువుగా మారి మొక్కలకు త్వరితగతిన పోషకాలు అందిస్తాయి. ఇవి నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి పంటను కీటకాలు మరియు తెగుళ్ళ నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి. కంపోస్ట్‌, వర్మికంపోస్ట్‌, సీ వీడ్‌ వంటివి సేంద్రియ వ్యవసాయంలో సిఫార్సు చేయబడ్డాయి. 

భారత కూరగాయల పరిశోధనా సంస్థ, వారణాసి వారు ఎన్నో పరిశోధనలు చేసి హెక్టారుకు 20-30 టన్నుల చివికిన పశువుల ఎరువు లేదా నాడెప్‌ విధానంతో తయారుచేసిన ఎరువు లేదా 7.5 నుండి 10 టన్నుల పౌల్ట్రీ ఎరువు, అజటోబాక్టర్‌ మరియు ఫాస్పేట్‌ సాల్యుబిలైజింగ్‌ బ్యాక్టీరియా (పి.ఎస్‌.బి)తో కలిపి వాడిన కూరగాయల్లో 20-35 శాతం అధిక ఉత్పత్తిని పొందవచ్చునని నిరూపించారు. 

పశువుల ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ప్రెస్‌మడ్‌ మొదలైన ఎరువులను ఎక్కువ సేంద్రియ పదార్ధం కలిగి పోషకాలను తక్కువ నిష్పత్తిలో అందించే వాటిగా పరిగణిస్తారు. అధిక దిగుబడినిచ్చే సంకరజాతి వంగడాలు ప్రవేశపెట్టక ముందు ఈ స్థూల సేంద్రియ ఎరువులు భారతీయ వ్యవసాయంలో ప్రధాన పోషక వనరులుగా ఉండేవి. ఈ స్థూల సేంద్రియ ఎరువు వాడడం వల్ల నేల భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలను మెరుగుపరుస్తుంది. ఇటీవల సంవత్సరాల్లో భారతదేశంలో పశుసంపద వృద్ధి చెందినప్పటికీ సేంద్రియ ఎరువుల లభ్యత గణనీయంగా పెరగలేదు. 

జంతువుల ఎరువులు : 

ఎరువు అనేది పాక్షికంగా లేదా పూర్తిగా కుళ్ళిన సేంద్రియ పదార్ధం. బాగా కుళ్ళిన ఎరువు త్వరితగతిర నేలలో కలిసిపోయి నేలలో ఉన్న సూక్ష్మజీవులకు మరియు మొక్కలకు త్వరితగతిన నత్రజని మరియు ఇతర పోషకాలను అందిస్తుంది. భాస్వరం అధికంగా ఉన్న జంతు సంబంధ ఎరువులు త్వరగా పెరిగి అధిక మొత్తంలో పోషకాలు గ్రహించే మొక్కజొన్న వంటి పంటలకు ఎంతో అవసరం. 

ఎరువుల ద్వారా పంటలలోకి వ్యాధి కారక క్రిములు రాకుండా నివారించడానికి ఎరువు వేయడానికి మరియు ఆకు కూరలు, దుంపలు వంటి పంటలు కోయడానికి మధ్య మూడు నెలలు ఉండాలని సిఫార్సు చేయబడింది. అదీకాక ఈ ఎరువుల నుండి పోషకాలు, భూగర్భ జలాలు మరియు పారే నీటిలోకి చేరి నీటిని కలుషితం చేసే అవకాశం ఉంది కనుక ఎరువులను అవసరం మేరకు తగుమాత్రంగా వేసుకోవాలి. 

కంపోస్ట్‌ : 

కంపోస్ట్‌ అనేది కుళ్ళే ప్రక్రియను నియంత్రించడం ద్వారా తయారైన ఎరువు. ఏదైనా సేంద్రియ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడానికి కంపోస్ట్‌ంగ్‌ ఉత్తమ సాధనం. ఇది ఎంతో పరిమాణంలో ఉన్న సేంద్రియ పదార్థాన్ని తగ్గించి చిన్న పరిమాణంలో తయారు చేస్తుంది. కంపోస్టింగ్‌ ప్రక్రియ అస్థిరమైన కరిగే పోషకాలను స్థిరీకరించి భూమి యొక్క హ్యూమస్‌ ఏర్పడటాన్ని వేగవంతం చేస్తుంది. చిన్న కంపోస్ట్‌ గొయ్యిని నిర్వహించడం చాలా సులభం కానీ పెద్ద ఎత్తున కంపోస్ట్‌ గుంటలను నిర్వహించడానికి లేబర్‌ అవసరం ఎక్కువ మరియు శ్రమతో కూడుకున్నది. పశువుల ఎరువులు, పౌల్ట్రీ ఎరువులు, చేపల ఎరువులు, గొర్రెల ఎరువులు మొదలైన వాటిని పంట అవశేషాలతో పాటు కంపోస్ట్‌ తయారీలో ఉపయోగించవచ్చు. సూక్ష్మజీవులు ఈ పదార్థాలన్నింటినీ తిని వాటిని సరళమైన స్థిరమైన సమ్మేళనాలుగా విభజించి మొక్కలకు అందిస్తాయి. ప్రతి సంవత్సరం పొలంలో కంపోస్ట్‌ వేస్తూ ఉంటే అది అన్ని పోషకాలను మొక్కలకు అందించడమే కాకుండా నేల యొక్క నీటిని నిల్వ ఉంచే సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తుంది. మట్టిలో సేంద్రియ పదార్థాన్ని సరైన మోతాదులో పెంచగలిగినచో అది మొక్కలకు వచ్చే అనేక వ్యాధులను నెమటోడ్లతో సహా నియంత్రిస్తుంది. 

పంట అవశేషాలు : 

నియంత్రత పరిస్థితుల్లో సూక్ష్మజీవుల చర్యలచే సేంద్రియ పదార్థం చీకిపోవడం మరియు కుళ్లిపోవడం సహజ ప్రక్రియ. కంపోస్టింగ్‌ ప్రక్రియ ద్వారా పంట అవశేషాలు, జంతువుల వ్యర్థాలు, ఆహారంలో మిగిలిన పదార్థాలు, కూరగాయల తొక్కలు, కొన్ని రకాలైన మున్సిపల్‌ వ్యర్థాలు మరియు తగినటువంటి పారిశ్రామిక వ్యర్థాలు ఫలవంతమైన ఎరువుగా మార్చవచ్చు. ఈ కంపోస్టింగ్‌ ప్రక్రియలో సేంద్రియ సేద్యంలో అనుమతి లేని ఏ ముడి పదార్థాన్ని ఉపయోగించరాదు. కర్భన శాతం ఎక్కువగా ఉండే పంట అవశేషాలు వంటివి కంపోస్టింగ్‌ బ్యాక్టీరియాకు అవసరమైన సెల్యులోజ్‌ అందిస్తాయి. ఈ బ్యాక్టీరియా వాటి చర్యల ద్వారా సరళమైన చక్కెరలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియ ఎంతో వేడిని ఉత్పత్తి చేస్తుంది. నత్రజని అధికంగా ఉండే జంతు వ్యర్థాలు అధిక శాతంలో ప్రొటీన్‌ అందిస్తాయి. వీటిని ఉపయోగించుకొని కంపోస్టు బ్యాక్టీరియా మనుగడ సాగించి సంఖ్యను పెంపొందించు కుంటుంది. కంపోస్ట్‌ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే కార్బన్‌, నత్రజని 25 నుండి 30 శాతం పొడి బరువు ఆధారంగా  ఉండాలి. 

వర్మి కంపోస్టింగ్‌ : 

వానపాములను ఉపయోగించి ఎరువులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్న ముడి పదార్థాలను మొక్కలకు తక్షణం ఉపయోగపడే ఎరువుగా మార్చడాన్ని వర్మికంపోస్టింగ్‌ అంటారు. మొక్కల వ్యర్థాలతోపాటు పశువులు, పౌల్ట్రీ లేదా గొర్రె ఎరువు వంటి ఏదైనా ఎరువుని వర్మికంపోస్టింగ్‌ కొరకు వాడవచ్చు. వానపాముల కాస్టింగ్‌లు వర్మికంపోస్ట్‌లో ప్రధాన భాగం. ఇది పోషకాహారాన్ని మొక్కలకు అందించడమే కాకుండా ఎన్నో రకాలైన ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను నేలకు జోడిస్తుంది. 

పచ్చిరొట్ట పంటలు : 

పచ్చిరొట్ట ఎరువులను పెంచి అవి పుష్పించే దశలో అంటే విత్తిన 40-45 రోజులకు నేలలో కలియదున్ని కుళ్ళబెట్టడం వల్ల నేల యొక్క భౌతిక నిర్మాణం, సారం పెరిగి సేంద్రియ పదార్ధం, పోషకాలు మరియు సూక్ష్మజీవుల కార్యక్రమాలు వృద్ది పొందుతాయి.

పచ్చిరొట్ట పైరులైన జనుము, దేంచా, పిల్లిపెసర, పెసర, మినుము, అలసంద, గోరుచిక్కుడు వంటి పప్పుజాతికి చెందిన వాటివల్ల మట్టిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులు త్వరగా కుళ్ళిపోవడానికి ట్రాక్టరు లేదా మోల్ట్‌ బోర్డ్‌ ప్లౌతో నేలలో 20-30 సెం.మీ. లోతులోకి కలియదున్నాలి. 

చిక్కుడు జాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువులు హెక్టారుకు 8-25 టన్నులు సేంద్రియ పదార్థాన్ని ఉత్పత్తి చేసి నేలకు 60-90 కిలోల నత్రజని అందిస్తుంది. ఇది 3-10 టన్నుల చివికిన పశువుల ఎరువుతో సమానమైన బలాన్ని పొలానికి అందిస్తుంది. పచ్చిరొట్ట ఎరువులు నేలను కోత నుండి మరియు పోషకాల నష్టం నుండి కాపాడుతుంది. ఇవి నేల సారాన్ని పెంచి మొక్కలకు అవసరమైన పోషకాలను కొంత మేర ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తాయి. పచ్చిరొట్ట పంటల్లో హెక్టారుకు 280 కిలోల వరకు నత్రజనిని అందించగల సామర్ధ్యం ఉంది. కేవలం 50-55 రోజుల్లోనే ఈ నత్రజని మొత్తాన్ని వాతావరణంలోని గాలి నుండి సంగ్రహించి వాటి వేర్లపై ఉన్న బుడిపెల్లో నిక్షిప్తం చేస్తాయి. పప్పు చిక్కుడు జాతి మొక్కల్తో సావాసం చేసే రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణం నుండి నత్రజనిని సంగ్రహించి మొక్కలకు కావలసిన పోషక నత్రజనిగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులను ప్రధాన పంటకాలంలో వేసిన అవి స్థలం, నీరు మరియు ఇతర పోషకాల కోసం ప్రదాన పంటతో పోటీపడతాయి కనుక పంట కాలానికి తగినంత ముందుగా వేసుకొని సీజన్‌కు ముందుగానే నేలలో కలియదున్ని కుళ్ళిపోయేటట్లు చూసుకోవాలి. 

కవర్‌ పంటలు : 

నేలను కప్పి ఉంచే కవర్‌ పంటలు భూమికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. చిక్కుడు వంటి విలువైన కవర్‌ పంటలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి. అలసంద, పెసర, మినుము, ఆల్ఫా ఆల్ఫా, క్లోవ్స్‌, బీన్స్‌ మరియు బఠానీ వంటి కవర్‌ పంటలు మట్టిని సారవంతం చేసి దాని నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పంటల యొక్క ఎండు ఆకులు మట్టిని వదులు చేసి మొక్కల వేళ్ళకు ఆమ్లజని మొదలగు నీరు అందేటట్లు చేస్తాయి. ఈ మొక్కలు కుళ్ళేటప్పుడు సూక్ష్మజీవులకు పోషకాలు సరఫారా చేయడం ద్వారా సూక్ష్మజీవుల కార్యక్రమాలు పెంచుతాయి. గడ్డిజాతి మరియు చిక్కుడుజాతి మిశ్రమంగా కవర్‌ పంటలుగా వాడిన గడ్డి బయోమాస్‌ను పెంచి చిక్కుడుజాతి మొక్కలు నత్రజనిని పెంచుతాయి. 

మల్చింగ్‌ (నేలను కప్పి ఉంచడం) : 

మట్టిని కప్పకుండా వదలవద్దు అనే భావనతో అన్ని సమయాల్లో కప్పబడి ఉంచడం ద్వారా నేల యొక్క సేంద్రియ పదార్థాన్ని రక్షించడానికి మల్చింగ్‌ వాడాలి. స్థానికంగా లభించే సేంద్రియ మల్చింగ్‌ పదార్థాలు లేదా పాలిథీన్‌ షీట్ల వాడకం తేమను కాపాడి కలుపు పెరుగుదలను తగ్గిస్తుంది. అధికంగా సేంద్రియ కర్బన శాతం ఉండే వరి గడ్డి, గోధుమ గడ్డి లేదా తృణధాన్యాలు నేరుగా మట్టిలో కలుపుకుంటే సి.ఎన్‌ నిష్పత్తి పెరిగి పంట పెరుగుదల సరిగా ఉండదు. ఈ విధంగా అధిక కర్బన పదార్థాలు కలిగిన ఎండుగడ్డిని నేల పైభాగంలో కవచంగా వాడినట్లయితే ఇది నేలను ఉష్ణోగ్రత తీవ్రత నుండి రక్షించి మొక్కలకు చాలాకాలం వరకు తేమను అందిస్తుంది. సూక్ష్మజీవులకు మరియు వానపాములకు ఆశ్రయం ఇస్తుంది. కలుపు నియంత్రణకు ఎక్కువ కర్బనశాతం ఉండే మల్చ్‌లు ఉత్తమం. ఎందుకనగా అవి కుళ్ళి నేలలో కలవడానికి చాలాకాలం ఉంటాయి.

తేలికపాటి దుక్కిదున్నడం, పైపాటు తగ్గించడం :

నేలను మరీ లోతుగా దుక్కి దున్నడం వల్ల నేల యొక్క నిర్మాణం దెబ్బతినే ప్రమాదమే కాక గ్రీన్‌హౌస్‌ వాయువులను విడుదల చేసే ప్రమాదం ఉంది. స్థిరంగా ప్రతి సంవత్సరం నేలలో సేంద్రియ పదార్ధం వృద్ధి చేయడంపై దృష్టి పెట్టినా భూమి వదులుగా మొక్కల పెరుగుదలకు అనువుగా తయారవుతుంది. లోతు దుక్కులను నివారించడానికి ఎరువు లేదా కంపోస్టు, నీరు వేసి దానిపైన మందపాటి అధిక కార్బన్‌ కలిగిన మల్చ్‌ వేసుకోవచ్చు. దీనివల్ల తేలికపాటి దుక్కితో సేంద్రియ వ్యవసాయాన్ని వేసుకోవచ్చు. మల్చ్‌ వల్ల పదే పదే కలుపు తీసి లేదా పైపాటు చేసే అవసరం ఉండదు. 

ప్రణాళికాబద్ధమైన పంట మార్పిడి, పచ్చిరొట్ట ఎరువు, కంపోస్టింగ్‌, అంతర పంటలు, సహచర పంటలు, మల్చింగ్‌ మొదలైన పద్ధతులు సాధారణంగా సేంద్రియ సేద్యంలో ఆచరించే పద్దతులు పంట యొక్క అవశేషాలు జాగ్రత్తగా నేలలో కుళ్ళేటట్లు చేయడం ముఖ్యం. వేర్లు భూమిలోతుల్లోకి చొచ్చుకుపోయో పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల అవి భూమిలోపల పొరల నుండి పోషకాలను పైకి తీసుకొని రాగలిగే సామర్థ్యం ఉంటుంది కనుక పంటమార్పిడిలో లోతైన వేరు వ్యవస్థ కలిగిన పంటలను ఎంచుకోవాలి. చిక్కుడు జాతి పంటలను పంట మార్పిడిలో చేర్చడం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయంలో అనుసరిస్తున్న పద్ధతి. ఇవేకాక పోషకాలను సరఫరా చేయడానికి పొడి రాక్‌ ఫాస్ఫేట్‌, గ్రీన్‌శాండ్‌, జిప్సం, డోలమైట్‌ మొదలైన ముడి ఎరువులను వాడవచ్చు. సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టిన కొత్తలో వీటిని వాటి పోషక లోపాలు నివారించిన తరువాత దీర్ఘకాలంలో ఖనిజాలను నెమ్మదిగా విడుదల చేసే వనరులు, సేంద్రియ ఎరువులు, బయో ఎరువుల ద్వారా అవసరమైన పోషకాలు అందించేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. 

శాశ్వత బెడ్స్‌, నడక మార్గాలు : 

శాశ్వత బెడ్స్‌ నేల నిర్మాణాన్ని మరియు సారాన్ని రక్షిస్తాయి. కూరగాయలు మరియు ఆకు కూరల సాగులో శాశ్వతమైన బెడ్స్‌ అమర్చడం ద్వారా తేమను సంరక్షించడం  మరియు వాతావరణంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతల నుండి పంటను రక్షించడం వంటి ఉపయోగాలు ఉన్నాయి. 

సేంద్రియ వ్యసాయంలో రసాయన ఎరువులకు అనుమతి లేదు కనుక రైతులు కేవలం సేంద్రియ ముడిపదార్థాలను ఉపయోగించి మాత్రమే నేలను సారవంతంగా చేసుకొని పంటను పండించుకోవాలి. పైన పేర్కొన్న పద్ధతుల్లో ఏదో ఒకటి కాక వీలైనన్ని పద్ధతులు పాటించడం ద్వారా భూమిని మరియు మిత్ర జీవులను కాపాడుకొని అధిక ఉత్పత్తులు సాదించుకోవాలి.