రబీ పంటకాలంలో పండించే వివిధ పంటలైన పత్తి, వేరుశనగ, ఆముదం, పొగాకు, కంది, పెసర, మినుము అలాగే కూరగాయ పంటలైన టమాట, వంగ, బెండ, మిరప లాంటి ఎన్నో పంటలను ఆశించి నష్ట పరుస్తుంది. దీని రెక్కల పురుగు లేత గోధుమ రంగులో ఉండి ముందు రెక్కలు మచ్చలు కలిగి ఉంటాయి.

తల్లి పురుగులు ఆకులపై వందల కొద్ది గ్రుడ్లను గుంపులో పెట్టి వాటిపై గోధుమ వర్ణం గల నూగుతో కప్పబడతాయి. ఒక్కొక్క తల్లి పురుగు తన జీవితకాలంలో 1000 కి పైగా గుడ్లను పెడుతుంది. నాలుగైదు రోజుల్లో గుడ్లు పొదగబడి చిన్న గొంగళి పురుగులుగా మారుతాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగు కింద భాగం లేత గోధుమ రంగు కలిగి మెడ మీద ప్రముఖంగా కనిపించే నల్లటి మచ్చలతో శరీరమంతా సన్నని లేత రంగు గీతలు కలిగి ఉంటాయి. ఈ పురుగు కోశస్థ దశను మొక్కలకు దగ్గరగా భూమిలో గడుపుతుంది.

నష్టపరచే విధానం :

తొలిదశలో చిన్నగొంగళి పురుగులు ఆకుల మీద పత్రహరిత పదార్ధాన్ని గీకి జల్లెడ ఆకులుగా తయారు చేస్తాయి. పెద్ద పురుగులు ఆకులను కొరికి తిని, ఈనెలను మాత్రం మిగులుస్తాయి. పూత, మొగ్గలు మరియు కాయలను ఆశించి లోపల పదార్ధాలను తిని నష్టపరుస్తాయి.

ఎదిగిన గొంగళి పురుగులు పగలంతా నేల మీద చెత్త క్రింద కాని, మట్టి పెళ్ళల క్రింద కాని, నెర్రెల్లో కాని దాగి రాత్రులందు పైరునాశించి విపరీతంగా నష్టపరుస్తాయి. రైతులు మొదటిగా గుడ్ల సముదాయాలను, ఆపైన జల్లెడ ఆకులను, చిన్న చిన్న గొంగళి పురుగుల గుంపులను బట్టి పురుగు ఉనికిని గమనించవచ్చును. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు మాత్రమే ఉన్న ఆకులను, చెట్ల మొదళ్ళలో పగటి పూట దాగి ఉన్న నునుపైన పెద్దపెద్ద గొంగళి పురుగులను బట్టి దీని ఉనికిని గమనించవచ్చును. దీని జీవిత చక్రం 30-40 రోజులలో పూర్తవుతుంది. ఒక సంవత్సరంలో దాదాపు 7 - 8 తరాలను పూర్తి చేస్తుంది. ఈ పురుగును సమగ్ర సస్యరక్షణ ద్వారా నివారించుకోవచ్చును.

సమగ్ర సస్యరక్షణ :

కీటక సంహారానికి వాడుతున్న విషపూరిత మందులను క్రమబద్దం చేసి వాటితో పురుగులను అదుపులో పెట్టటానికి మనకు అందుబాటులో ఆచరణ సాధ్యమైన వివిధ ప్రక్రియలను జోడించి ప్రకృతిలోని జీవుల సమతుల్యాన్ని కాపాడుకోవటానికి దోహదకారి అయ్యే పధకాన్ని సమీకృత సస్యరక్షణ లేక సమగ్ర సస్యరక్షణ అంటారు.

పొగాకు లద్దెపురుగు నివారణకు ఆచరించాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు :

వేసవిలో లోతుగా దుక్కులు దున్నడం వల్ల భూమిలో విశ్రాంతి దశలో ఉన్న పురుగులు, కోశస్థ దశలను అదుపులో ఉంచవచ్చు.

రైతులందరూ సమిష్ఠిగా ఒకేసారి విత్తుకోవడం పూర్తి చేయాలి.

నత్రజని ఎరువులను అతిగా వాడరాదు. సిఫారసు చేయబడిన మోతాదులో ఎరువులను వాడాలి.

పంట మార్పిడి విధానాన్ని పాటించాలి.

ఎరపంటలుగా లద్దె పురుగుకు 100 ఆముదం మొక్కలు ఒక ఎకరా చేలో అక్కడక్కడ వేసిన ఆ పురుగులు పెట్టిన గ్రుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులను గమనిస్తూ ఏరి నాశనం చేయాలి.

ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. వీటిని ప్రతి 50 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున మొక్కల కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చాలి. లింగాకర్షక బుట్టలలోని మందుని ప్రతి 20 రోజుల కొకసారి మార్చాలి.

పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ఎకరాకు 15 - 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.

గ్రుడ్ల సముదాయాలు మరియు పిల్ల లద్దె పురుగులు ఆకుల అడుగుభాగాలలో గుంపులుగా ఉంటాయి కాబట్టి వాటిని ఆకులతో సహా ఏరి నాశనం చేయాలి.

మొక్కల దశను బట్టి గ్రుడ్లను, తొలి దశ పిల్ల పురుగులను నివారించుటకు 5 శాతం వేపగింజల ద్రావణాన్ని పిచికారి చేయాలి. దీనివల్ల తల్లి పురుగులు మొక్కలపై తక్కువ గ్రుడ్లు పెడతాయి.

తొలిదశ పిల్ల పురుగులను అదుపులో ఉంచడానికి హెక్టారుకు 500 ఎల్‌. ఇ. యన్‌.పి.వి. ద్రావణాన్ని కిలో బెల్లం మరియు శాండోవిట్‌ కలిపి సాయంత్రం సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. ఈ రోగం వచ్చిన పురుగులు కొమ్మకు వేలాడి చనిపోతాయి.

రెక్కల పురుగుల ఉనికిని గమనించిన వెంటనే లేదా విత్తిన 40 - 50 రోజుల్లో హెక్టారుకు 1,50,000 చొప్పున వారానికి ఒకసారి ట్రైకోగ్రామా కిలోనిస్‌ గ్రుడ్లను రెండు లేదా మూడు సార్లు వదలాలి.

లద్దె పురుగులు ఒక పంట పొలం నుంచి మరో పంట పొలానికి రాత్రి సమయంలో వలస పోతాయి కనుక పొలం చుట్టూ నాగలితో కందకం చేసి అందులో ప్రతి 70 మీ. చాలుకు 1 కిలో ఫాలిడాల్‌ పొడిని చల్లాలి.

ప్రకృతిలోని మిత్రపురుగులను, పంట పెరుగుదలకు హాని చేసే పురుగుల ఆర్ధిక నష్ట పరిమితి స్థాయిని దృష్టిలో ఉంచుకొని మిగిలిన అన్ని పద్ధతుల ద్వారా పురుగులను అదుపులో ఉంచలేక పోయినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారి చేయాలి.

పురుగులు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రా. లేదా నోవాల్యురాన్‌ 1 మి.లీ. లేదా అసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

50 శాతం పంటలో నష్టం గమనించినట్లయితే స్పైనోశాడ్‌ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రా. లేదా లూఫెన్యురాన్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎదిగిన లద్దె పురుగుల నివారణకు 5 కిలోల తవుడు, అర కిలో బెల్లం, అర లీటరు మోనోక్రోటోఫాస్‌ లేదా క్లోరిపైరిఫాస్‌లో తగినంత నీళ్ళు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్కల మొదళ్ళ దగ్గర సాయంత్రం చల్లుకోవాలి.

విషపు ఎర తయారు చేసుకోలేని పక్షంలో క్లోరాన్‌ ట్రానిలిప్రోల్‌ 0.3 మి.లీ లేదా ఫ్ల్యూబెండిమైడ్‌ 0.2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి లద్దె పురుగులను నివారించుకోవచ్చును.

పొలంలో కింద పడినటువంటి ఎండు ఆకులను తీసి కాల్చి వేయాలి.

పురుగు ఉనికిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పైన చెప్పిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తూ తెలివిగా వ్యవసాయం చేస్తే రైతులు ఖర్చు తగ్గించుకొని, అధిక దిగుబడులు సాధించడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చును.

డా|| వి. లక్ష్మీనారాయణమ్మ, సీనియర్‌ శాస్త్రవేత్త (కీటక శాస్త్రం),

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఫోన్‌ : 9949282907