బొప్పాయి మొదటగా అమెరికా లోని శీతల మండలంలో పుట్టి, ఆ తరువాత అన్ని శీతల దేశాలకు వ్యాప్తి చెందింది బొప్పాయిని బ్రిటిష్‌లో 'పప్వా', బ్రెజిల్‌లో 'మామ్‌' అని అంటారు. తెలుగులో బొప్పాయి, పుప్పెడి అని కూడా అంటారు. ప్రపంచంలో బొప్పాయి ప్రజా బహుళం అవ్వటానికి కారణాలు అనేకం ముఖ్యంగా తేలిగ్గా సాగు చేయటం, త్వరగా ఆదాయాన్ని ఇవ్వటం, రకరకాల నెలల్లో, వాతావరణ పరిస్థితులు అనుకూలత. బొప్పాయి ఆకర్షణీయమైన పసుపు రంగులో ఉండి, ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉంటుంది. భారత దేశంలో అనేక రకాలు సాగులో ఉన్నాయి

బొప్పాయిలో పోషక విలువలు :

పోషక విలువలు దష్ట్యా బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండులో చక్కెర, బీటా కెరొటీన్‌, విటమిన్‌ సి, ఈ, బి వర్గానికి చెందిన రైబోప్లేవిన్‌, పీచు పదార్థం, తక్కువ పరిమాణంలో ఖనిజ లవణాలు ఉన్నాయి. చక్కెర పదార్థాలు తగినంత ఉండి, పీచు ఒక మొస్తారుగా ఉండటం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.

చక్కెర పదార్థాలు :

బొప్పాయిలో చక్కర పదార్థాలు ఉండటం వల్ల పండిన పండు తీయగా ఉంటుంది. ఎక్కువ తీయగా ఉన్న పండులో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చక్కెర పదార్థాలు 7-10 గ్రా. ఉన్నాయి.

పెక్టిన్‌ :

బొప్పాయి కాయ, దోరగా పండిన పండులో పెక్టిన్‌ ఉంటుంది. ఈపెక్టిన్‌ చెప్పుకోతగిన పరిమాణంలో ఉండటం వలన, జామ్‌, జెల్లీ, చీజ్‌ వంటి పదార్థాలకి గట్టితనాన్ని ఇస్తుంది. బొప్పాయి జ్యూస్‌కు కూడా ఈ పెక్టిన్‌ చిక్కదనాన్ని ఇస్తుంది.

బీటాకెరోటిన్‌ :

100 గ్రా. బొప్పాయి పండులో 1000-3500 మైక్రో గ్రాముల కెరోటిన్‌ ఉన్నాయి. కెరోటిన్లలో చెప్పుకోదగినది బీటాకెరోటిన్‌. బొప్పాయి పండులో 700-1660 మైక్రో గ్రాముల బీటాకెరోటిన్‌ ఉంది. కత్రిమంగా పండిన పండులో కంటే చెట్టున పండిన పండులో బీటకెరోటిన్‌ అధికంగా ఉంటుంది. బీటాకెరోటిన్‌ కంటి చూపుకు, మధు కణాల పరిరక్షణకి, క్యాన్సర్‌ రాకుండా కాపాడటానికి ఉపయోగపడుతుంది.

విటమిన్‌ 'సి' :

వివిధ రకాల బొప్పాయి పండులో 'సి' విటమిన్‌ 40-125 మి. గ్రా. ప్రతి 100 గ్రా. ఉంది. విటమిన్‌ 'సి' పంటి చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్త శుద్దికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. అందుకే వ్యాధిగ్రస్తులు, పెరిగే వయసులోను, శాస్త్ర చికిత్స తరువాత బొప్పాయి పండు తినడం మంచిది.

రైబోఫ్లేవిన్‌:

బొప్పాయి పండులో 'బి' వర్గానికి చెందిన రైబోఫ్లేవిన్‌ ఉంది. కాయలోను, పండులోను, ఈ విటమిన్‌ అధికంగా ఉంటుంది. వంద గ్రాముల పండులో 0.25 మి. గ్రా. ఉన్నది. రైబోఫ్లెవిన్‌ నోటి పూత, ముఖం మీద తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు, పెదాల మూల పుండ్లు రాకుండా కాపాడుతుంది.

పీచు పదార్థం :

బొప్పాయి పండులో పీచు పదార్థం తక్కువగా ఉండటం వల్ల తెలిగ్గా జీర్ణమవుతుంది.

ఔషధ గుణాలు :

పచ్చికాయలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక జబ్బులు నివారణకు బొప్పాయి కాయ, కాయ నుండి తీసిన రసాన్ని వాడతారు. బొప్పాయి కాయ నుండి తీసిన పాలు, గింజలు, పండు, ఆకులు, వేరు ఇలా బొప్పాయి చెట్టు అన్ని భాగాలని ఒక్కోరకమైన జబ్బుకు వాడతారు. కాలేయ సంబంధ జబ్బులు, పిత్తాశయంలో రాళ్ళను కరిగించడానికి పచ్చి బొప్పాయి మంచిది. కడుపులో వాయువు చేరినప్పుడు కూడా పచ్చి బొప్పాయి మంచిది. బొప్పాయి కాయ నుండి పాలు తీసి, దానిని కూడా అనేక జబ్బులకు వాడతారు. పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయాన్నే బాగా పండిన పండు తింటే మొల్లలు తగ్గుతాయి.

చక్కెర వ్యాధితో బాధపడేవారికి ఉదయం అల్పాహారంలోనూ, మద్యాహ్నం, రాత్రి, భోజనం తరువాత దోరగా పండిన పండు ఇవ్వడం ఎంతో మంచిది. పాలిచ్చే తల్లికి, పాలు బాగా పడటానికి పండు పెట్టాలి. చిన్న పిల్లల్లో కాలేయం పెరుగుదల ఆపాలంటే పండు ఇవ్వాలి. మొల్లలు ఉన్న వారికి పండు తీసుకోవడం చాలా మంచిది. బొప్పాయి గింజలను కూడా అనారోగ్యాన్ని తగించడానికి వాడతారు. ఎక్కువగా విరోచనలు అవుతున్నప్పుడు, బొప్పాయి గింజల పొడి నుండి చేసిన మందును వాడతారు. భయంకర జబ్బులుగా పరిగణించే ప్లేగు, కలరా సోకినప్పుడు గింజల నుండి చేసిన ఔషధం ఇస్తారు.

బొప్పాయి ఆకులను, ఆకుల నుండి తీసిన రసాన్ని ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు ఇవ్వాలి. గుండె జబ్బులు ఉన్న వారికి కూడా ఈ ఆకుల రసం మంచిది. గునియాపాముల నివారణకు, ఈ ఆకుల రసం పని చేస్తుంది. చక్కెర వ్యాధి ఉన్న వారికి, నాన బెట్టిన నీరు మంచిది. బోదకాలు వచ్చినప్పుడు ఆ వాపు పై బొప్పాయి ఆకులు కడితే వాపు తగ్గుతుంది.

బొప్పాయిపై అపోహలు - వాస్తవాలు :

బొప్పాయి మీద చాలా అపోహలు ఏర్పరచుకున్నారు. గర్భిణీ స్త్రీకి గర్భస్రావం అవుతుందని, పురుషల్లో పురుషత్వం తగ్గుతుందని, జబ్బులున్నవారికి, ముసలి వారికి, పసి పిల్లలకి విరోచనాలు అవుతాయని అపోహలు ఉన్నాయి. పండు తింటే వేడి చేస్తుందని చాలా మందికి అపోహలు ఉన్నాయి.నిజానికి బొప్పాయి పండు కణాల పెరుగుదల వాటి అభివద్ధి, పరిరక్షణకి తోడ్పడుతుంది. అందుకే బొప్పాయి పండు అందరికీ చాలా మంచిది.

బొప్పాయి పండు వాడకం :

బొప్పాయి పండు పసి పిల్లలకి నాలుగవ నెల నుండి గుజ్జుగా చేసి తినిపించవచ్చు. పెరిగే వయసులో ఒక మాదిరిగా పండిన పండు పెట్టవచ్చు, వయసులో ఉన్నవారు దోరగా పండిన పండు తినడం మంచిది. వద్ధులకి, జబ్బుతో బాధ పడుతున్నవారికి బొప్పాయి పండు మంచిది. గర్భిణీస్త్రీకి, పాలిచ్చు తల్లులకు బాగా పండిన పండు మంచిది. ఏ వయసు వారైనా, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి పండు, కాయ - ఏది తినాలి అని నిర్ధారించుకోవాలి. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు పండు, కాయ మార్చి వాడటం మంచిది.

ఎంత తినాలి :

బొప్పాయిలో బీటా కెరోటిన్‌ ఉంది. మన నిత్యవసరాల్లో సగం కెరోటిన్‌ బొప్పాయి పండు నుండి పొందితే మిగిలినది ఇతర ఆహారపదార్థాలైన ఆకుకూరలు, గుడ్డు, కాలేయం, పాలు, పసుపు పచ్చని పండ్లు, కూరగాయల నుండి పొందవచ్చు.

చిన్న పిల్లలు 100

గర్భిణీ స్త్రీలు 200

పాలిచ్చు తల్లులు -

యుక్త వయస్కులు -

పురుషులు 150 గ్రా పైన

ఆరోగ్యంగా ఉన్నవారు పండు ఎంతైనా తినవచ్చు. కానీ జబ్బులతో బాధ పడేవారు బొప్పాయి కాయైనా, పండైన పరిమితంగా వాడాలి. తినే పరిమాణం పరిమితం చేస్తే ఔషదంలా పని చేస్తుంది, ఆరోగ్యాన్నిస్తుంది. చాలా మంది కి బొప్పాయి వాసన ఇష్టం ఉండదు. అలా వాసన సహించనప్పుడు, ముక్కల మీద నిమ్మరసం, చక్కెర జల్లుకుని తింటే రుచిగా వాసన లేకుండా ఉంటుంది. బొప్పాయిని పండుగ తినవచ్చు లేదా రకరకాల నిల్వ పదార్థాలు చేసుకొని తినవచ్చు.

బొప్పాయితో జామ్‌ :

కావలసిన పదార్థాలు :

బొప్పాయి పండు 1 కి.గ్రా.

చక్కెర 3/4 కిలో

నిమ్మ ఉప్పు 1/2 టీ స్పూను/ 2 గ్రా.

నీరు 125 మి.లీ./అర కప్పు

పద్దతి :

పచ్చి బొప్పాయి కాయను శుభ్రంగా కడిగి తోలు, గింజలు తీసి చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఒక గిన్నెలో నీరు పోసి మెత్తగా ఉడకనిచ్చి, మెత్తగా గుజ్జు అయ్యే వరకు మెదపాలి. ఈ గుజ్జులో చెక్కర వేసి సన్నటి సెగ మీద గట్టిపడే వరకు ఉడకనివ్వాలి. 1050 ఉష్ణోగ్రత వచ్చే వరకు గాని లేకపోతే స్పూనుతో ఒంపేటప్పుడు ఒక షీటులాగాపడే వరకు ఉడకనివ్వాలి. నిమ్మ ఉప్పునీటిలో వేసి కరిగిన తరువాత జామ్‌లో వేసి ఉడకనివ్వాలి.

వెడల్పాటి మూతి ఉన్న శుభ్రమైన సీసాను కుక్కర్‌లో సీసా మునిగినంత వరకు నీరు పోసి ఉడకనివ్వాలి. నీరు వేడిగా ఉన్నప్పుడే సీసాను నీటిలో నుంచి పూర్తిగా ఒంపేసి చెక్క పైన సీసాను పెట్టాలి. వేడిగా ఉన్న జామ్‌ను సీసా లోకి పోసి మూత పెట్టాలి. తడి స్పూన్లు పెట్టకుండా ఉంటే ఆరు నెలలు వరకు తాజాగా నిల్వ ఉంటుంది. దీన్ని బ్రెడ్‌లో గాని, చపాతీతో గాని, పూరీతో గాని తినవచ్చు.

బొప్పాయి పండుతో నెక్టారు :

కావలసిన పదార్థాలు:

బొప్పాయి గుజ్జు 1 కి.గ్రా.

చక్కెర 800 గ్రా.

నిమ్మ ఉప్పు 25-40 గ్రా.

నీరు 3-4 లీటర్లు

పద్దతి :

బాగా పండిన బొప్పాయి పండును శుభ్రంగా కడిగి తోలు, గింజలు తీసి వేసి, ముక్కలను మెదిపి, జల్లెడ పట్టాలి. ఆ గుజ్జుకి నీరు, చెక్కర, నిమ్మ ఉప్పు కలపాలి. కలిపి పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. వీటిని అప్పుడే మరిగించిన సీసాలో పోసి, మూతను బిగించాలి. సీసాలు చల్లారిన తరువాత ఫ్రిజ్‌ లో పెట్టి తాగితే బాగుంటుంది. దీన్ని మద్యాహ్నం పూటగాని, సాయంత్రం పూటగాని మంచి పానీయంగా ఇవ్వడానికి చాలా మంచిది.

కె.సుధారాణి, జి. త్రికళ మాధవి, డా|| పి.లక్ష్మీ రెడ్డి, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌,

కషీ విజ్ఞాన కేంద్రం, రెడ్డిపల్లి, అనంతపురం, ఫోన్‌ : 9989623825