మెరుగైన ఆరోగ్యం, సామాజిక జీవనం, ఆర్ధిక అసమానతల నిరోధం ద్వారా సకల జనుల సంక్షేమానికి కృషి చేయడమే తన ధ్యేయమని, పేదలు, సామాన్యులకు అందుబాటులో కార్పోరేట్‌ వైద్యాన్ని భూమార్గం పట్టించి ఆరోగ్య పర్చూరు- ఆరోగ్య ప్రకాశం జిల్లాల నిర్మాణం కొరకు తన జీవితాన్ని అంకితం చేశానని, అందుకు అనుగుణం గానే రాజకీయ ప్రవేశానికి ముందే ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రారంభించి, లక్ష ఆపరేషన్లు పూర్తి చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. నియోజక వర్గంలోని ఇంకొల్లు మండల కేంద్రంలో సెప్టెంబరు 30వ తేదీన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తూ, ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు, సామాజిక బాధ్యత నిర్వహణలో అది విజయవంతమైన తీరును ఆయన వివరించారు. రాజకీయ ప్రవేశానికి ముందే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రారంభించి, కొనసాగిస్తున్న తీరు వాటికి ప్రజల నుండి వస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ, రాజకీయాలకు అతీతంగా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ కార్యక్రమాన్ని అకుంటిత దీక్షతో కొనసాగిస్తామని తెలిపారు.

జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర్‌ నేత్రాలయ సంస్ధలతో కలసి ప్రకాశం జిల్లాను అంధత్వ రహిత జిల్లాగా తీర్చి దిద్దడం తన కర్తవ్యమని, తన తండ్రి ఏలూరి నాగేశ్వరరావు స్మృత్యర్ధం, స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ముందుకు కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. 2012లో పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనను నియామకం చేయకముందు నుండి శాసన సభ్యునిగా పర్చూరు ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్న తీరును ఆయన ప్రస్తావించారు.

ప్రజలకు అంకిత భావంతో సేవ చేయాలనే దృక్పదంతో రాజకీయాలకు ముందు నుండే ప్రారంభమైన ఈ ట్రస్టు స్వర్గీయ గురజాడ అప్పారావుగారి స్పూర్తితో ''స్వంత లాభం కొంత మానుకొని.....పొరుగు వాడికి మేలు తలపెట్టాలనే'' ఆకాంక్షతో ముందుకు వెళుతున్నామని, ''సాధించిన దానితో సంతృప్తిని పొంది అదే విజయమని పొరపాటు పడకోయ్‌'' అనే శ్రీశ్రీ గారి నుడికారంతో ద్విగుణీకృత ఉత్సాహంతో అత్యధిక వ్యయ ప్రయాసలకోర్చి అంధత్వ నివారణకు కృషి చేస్తున్నానని ఉద్ఘాటించారు.

ఒక సామాన్య రైతు బిడ్డగా, ఒక మధ్యతరగతి ఉద్యోగిగా, ప్రారంభమైన తన జీవిత ప్రయాణం ''అన్నార్తుల.. అభాగ్యుల'' ఆర్తనాదాలను విని ఆ దిశగా ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 8 సంవత్సరాలుగా శిబిరాలను నిర్వహిస్తూ 40 వేల మందికి పైగా చికిత్సలు అందించినట్లు వివరించారు. ఈ శిబిరాలకు విశేష స్పందన ప్రజల నుండి వస్తుందని తెలిపారు. కేవలం కంటి వ్యాధుల నివారణే కాకుండా, ఇతర శారీరక రుగ్మతల నివారణకు కూడా సేవలు విస్తరింపచేశామని అన్నారు. గుండె, రక్తనాళాల పరీక్షలు, మోకాలి చిప్పల మార్పిడి, మహిళలకు గర్భాశయ క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, క్రమం తప్పకుండా ఎన్‌టిఆర్‌ జన్మదినం, జనవరి 26న భారత గణతంత్య్ర దినోత్సవం, తన జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా క్యాంపుల్లో రక్తసేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్న విధానాన్ని సుస్పష్టంగా వివరించారు.

సెప్టెంబరు 30వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 1500 మందికి పైగా పాల్గొనగా అందులో 800 మందికి కంటి చికిత్స అవసరాన్ని గుర్తించారు. 300 మందికి పైగా గుండె పరిక్షలు చేపట్టి,100 మంది రోగులకు చర్మవ్యాధి పరిక్షలు నిర్వహించారు. తక్షణమే 525 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు.

ఈ శిబిరంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 87 మందికి రూ. 42.82 లక్షల చెక్కులను అందచేశారు. ఏడుగురికి రూ. 8.90 లక్షల చంద్రన్నబీమా చెక్కును పంపిణీ చేశారు. ఎస్‌సి కార్పోరేషన్‌ ద్వారా ఒకరికి ఇన్నోవా కారును అందించారు. ఒక రైతుకు రైతు రథం పధకం కింద ట్రాక్టరును అందచేశారు.

నియోజక వర్గ వ్యాప్తంగా ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలతో పాటు పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచేందుకు, రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలతో పాటు ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టు సొంత నిధులతో నిర్వహిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. పేదల అభ్యున్నతికి, సామాజిక సంక్షేమానికి, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, నిమ్న వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచేందుకు, నాణ్యమైన సేవలను అందించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించేందుకు శాసన సభ్యునిగానే కాకుండా ఒక వ్యక్తిగా, సామాజిక శక్తిగా తమ సంస్థ ద్వారా స్వచ్ఛ సేవలను అందచేస్తున్నామని, తనను ఎన్నుకొన్న ప్రజలకు విధేయుడిగా, కృతజ్ఞుడిగా ఎల్లప్పుడూ ఉంటానని, పర్చూరు ప్రజల జీవన స్రవంతిలో తాను భాగంగా మారి సుదీర్ఘకాలం, ఓపిక ఉన్నంత కాలం సేవలకు కట్టుబడి ఉంటానని, రుణం తీర్చుకుంటానని ఉద్వేగంగా ప్రసంగించారు.

పర్చూరు నియోజకవర్గంలో రోడ్లు, పారిశుధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు, రైతుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా నియోజక వర్గ ప్రజలు తెలుగు జనజీవన స్రవంతిలో ప్రధాన భూమికను పోషించే విధంగా తన లక్ష్యమైన అందమైన పర్చూరు, ఆకుపచ్చ పర్చూరు....ఆధునిక పర్చూరు నిర్మాణం కొరకు పునరంకితమవుతానని ఈ సందర్భంగా ఆయన వక్కాణించారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు రూ. 2లకు కిలో బియ్యం ఆనాడే అందచేసి ఆంధ్రుల అన్నదాతగా చూపించిన స్ఫూర్తితో, దార్శనిక ముఖ్యమంత్రి, పేదల పెన్నిది నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నేరుగా రూ. 5లకే భోజన సౌకర్యం కల్పిస్తూ, పేద ప్రజలకు అక్షయ పాత్రను బహూకరించడం తమ పార్టీ ప్రభుత్వ బడుగుల పక్షపాతానికి నిదర్శనమని ఏలూరి అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యుడు గుంజి వెంకటరావు, పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిట్టినేని రామకృష్ణ, ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు, నాయకులు వీరగంధ ఆంజనేయులు, యార్లగడ్డ లక్ష్మి, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, కారంచేడు, చినగంజాం మండలాల టిడీపి అధ్యక్షులు జమాలుద్ధీన్‌, రంగయ్య, ఆదినారాయణ, పెదవీరయ్య, శ్రీహరి, రజాక్‌, ఎస్సీ సెల్‌ నాయకులు సురేష్‌, ప్రసాద్‌, రామకృష్ణ, డా|| దర్మానందరావు, డా|| శ్యాంసుందర్‌, శివరామిరెడ్డి, నల్లపనేని రంగయ్య చౌదరి, రావిపాటి సీతయ్య, కామేపల్లి హరిబాబు, ఇంటూరి మురళి, గుండే తారక రామారావు, జంపని రాధాకృష్ణ, అంకమ్మ, బోయపాటి సాంబశివరావు, రాము, రవి తదితర పార్టీనాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం నోవా అగ్రిటెక్‌ కంపెనీ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ పుల్లెల అజయ్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా, విజయవాడకు చెందిన రమేష్‌ హాస్పటల్స్‌, పెదకాకాని శంకర నేత్రాలయం, చిలకలూరి పేట చర్మవ్యాధి నిపుణాలయంకు సంబంధించిన వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి విచ్చేసిన అందరికీ భోజన, రవాణా వసతులను ట్రస్టు కల్పించింది.