మనిషి జీవన గమనంలో అనేక పరిణామాలను చవిచూస్తూ, నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ దేశ సంపదను సృష్టించేందుకు అనేక ఒడిదుడుకులను అధిగమించి, వేగవంతమైన జీవన విధానంలో అనేక రకాల సమస్యలను మూటకట్టుకొని పరుగుల జీవితంతో కాలం గడుపుతున్న నేటి సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని, అనేక అధ్యాయనాల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వారు సూచించిన విధానాన్ని ప్రతి ఒక్క పౌరుడు పాటించాల్సిన ఆహార నియమాలను అనేక మార్లు వెలుగులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం యాంత్రిక జీవనం కొనసాగుతున్న పరిస్థితుల్లో నేడు పూర్తిగా ఆహార నియమాలు మార్పు చెందాయి. రోజు వారీ ఆహార నియమాల్లో మార్పులు రావడం, సరైనటువంటి పోషక ఆహారం అందకపోవడంతో తరచుగా అనారోగ్యాలకు గురవుతూ వస్తున్నారని అధ్యయనాలు తెలిపాయి.

ప్రకృతిలో సహజంగా లభించే ఆహార పదార్థాలను నేటి సమాజం స్వీకరించే స్థితిలో లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహార నియమాలను కూడా పరిస్థితులకు అనుకూలంగా మార్చివేసుకుంటూ రావడం వల్ల సహజసిద్ధమైన కూరగాయ సాగు తగ్గుతూ రావడంతో పౌష్టికరమైన ఆహార ఉత్పత్తుల కొరత క్రమంగా పెరుగుతూ రావడం వల్ల పెరిగిన జనాభాకు అనుగుణంగా నేడు వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడంతో సామాన్యులపై భారం పెరిగింది రోజువారీ కూరగాయలు, పండ్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి ఆవాసాలకు అనుగుణంగా మిద్దెతోట పెంపకం అలవర్చుకోవాల్సిన అవసరం ఎర్పడింది.

భాగ్యనగరంలోని భవనాల పై విస్తీర్ణం దాదాపు 40-50 వేల ఎకరాలు ఉంటుందని ఒక అంచనా. అటువంటి టెర్రాస్‌ను మిద్దె తోటలుగా మార్చగలిగితే నగరం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సహజ సిద్ధమైన కూరగాయలు లభించడం వల్ల ప్రజల శారీరక, మానిసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయి. వైద్యం పేరుతో చేసే ఖర్చులు తగ్గుతాయి. ఇప్పటికే మిద్దెతోటల పెంపకం కేరళ, తమిళనాడు, కార్ణటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్యనగరాల్లో బాగా వ్యాపించింది. అటువంటి నేపధ్యంలోనే తెలంగాణ రాష్ట్రం మిద్దె తోటలపై రాష్ట్ర స్థాయి సదస్సు జరుపడం విశేషమైన సంఘటనే అవుతుంది.

సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ జీడిమెట్ల రాష్ట్ర సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతతో పాటు మిద్దెతోటల పెంపకం, వర్టికల్‌ గార్డెన్‌లకు కూడా 50 శాతం రాయితీలు అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సైలేంద్రకుమార్‌ జోష్‌ తెలిపారు. జీడిమెట్లలోని సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో జరిగిన మిద్దెతోట పెంపకం, వర్టికల్‌ గార్డెన్‌పై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. రసాయనాలతో పండిస్తున్న కూరగాయలు తినడంవల్ల అనేక అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లవుతుందని తెలిపారు. సేంద్రీయ పంటలతో ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు వారి వారి ఆవాస ప్రాంతాల్లో కూరగాయల పండ్ల తోటల పెంపకాలపై అవగాహన కలిగి ఉండేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటికే పట్టణప్రాంతాల ప్రజలకు మిద్దెతోటల పెంపకం కోసం 50 శాతం రాయితీ కల్పిస్తుందని మిద్దెతోట సాగులో హైదరాబాద్‌ నగరం దేశంలోని అన్ని నగరాలకంటే ముందంజలో ఉందని అన్నారు.

ఇంటి పంటలతో భూమిపై వేడిని తగ్గించవచ్చునని తెలిపారు. చల్లని వాతావరణంలో జీవించవచ్చునని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో దాదాపుగా కోటి జనాభాతో పాటు మరో 20-30 లక్షల మంది ప్రతిరోజు సందర్శిస్తున్నారు. రోజువారి జనాభాకు పట్టణంలో దాదాపు 3 వేల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు 1000 మెట్రిక్‌ టన్నుల పండ్లు అవసరమవుతుందని తెలిపారు. వీటిని సమకూర్చేందుకు ఇప్పటికే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి హైదరాబాద్‌ నగరానికి తరలి వస్తున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న కూరగాయలు, క్రిమిసంహారక మందులు, భారీగా లోహాల అవశేషాలు అధిక మోతాదులో ఉండడం వల్ల వినియోగదారుల్లో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఏటా 38.54 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరమవుతున్నాయిని అందుకు తగిన విధంగా ఉత్పత్తి మాత్రం జరుగడంలేదన్నారు. 1.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 15.94 లక్షల టన్నుల కూరగాయల దిగుబడి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 22.60 లక్షల కూరగాయల కొరత ఉందని అన్నారు. ఈ లోటును తీర్చేందుకు ఉద్యానశాఖ తనవంతు భాగస్వామ్యంగా మిద్దెతోటల పెంపకం ద్వారా అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రోత్సాహకాలు ఇస్తుందని తెలిపారు. నగరంలో 22 లక్షల కుటుంబాలు ఉన్నాయిని వారంతా మిద్దె తోటల పెంపకాన్ని అవలంభిస్తే 3 వేల టన్నుల కూరగాయలను పండించే అవకాశం ఉందన్నారు. ఈ పథకం ద్వారా 1000 టన్నులు వివిధ రకాల పండ్లు కూడా ఉత్పత్తి చేయవచ్చు అని అన్నారు. మిద్దెతోటల పెంపకానికి అవసరమైన పనిముట్లు, గ్రో బ్యాగులు, విత్తనాలు, ఎరువులు, వేపపిండి, వేపనూనె తదితర వాటిని అందిస్తున్నామన్నారు. ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ తిరుచూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ డా|| సుశీల ఇంటపంటల సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవలనే అంశంపై వివరించారు.

ఉద్యానవన శాఖ కమీష్‌నర్‌ వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమీషనర్‌ పార్థసారధితో పాటు ఐఏఎస్‌ అధికారులు జచలక్ష్మి, ఉషారాణి, నిర్మల, లక్ష్మిభాయి, ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలు, డా|| సుశీల, డా|| భారతి, కె. కేశవులు, ఎమ్‌. సురేంధ్రర్‌, ఉద్యానవన శాఖ డిడిలు, మధుసూధన్‌, బాబు, డా|| ఉమానాయక్‌, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లవల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి,

ఫోన్‌ : 9949285691