తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీలను అందిస్తుందని భూపాలపల్లి జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎమ్‌.ఎ అక్బర్‌ తెలిపారు. వికాస్‌ అగ్రి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రైతు శిక్షణా కార్యక్రమంలో వివిధ శాఖల వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని ప్రసంగించారు. సుగంధ పంటలు పండించే రైతులందరికీ సూక్ష్మనీటి పారుదల పరికరాలను, ప్లాస్టిక్‌ క్రేట్స్‌ని రాయితీపై మంజూరు చేస్తున్నామన్నారు. యమ్‌.ఐ.డి.హెచ్‌ ద్వారా వివిధ రకాల పండ్ల మొక్కల సాగుపై రాష్ట్రీయ కృషీ వికాస్‌ యోజన పథకం ద్వారా పందిరి తీగ జాతి కూరగాయల సాగుకి రైతులకు రాయితీలు ఇస్తున్నామని వివరించారు. మిరప పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణ ఇచ్చారు.

వరంగల్‌ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా|| ఎడ్ల శ్రీనివాస్‌ రైతులను ఉద్ధేశించి మాట్లాడుతూ ప్రస్తుతం మిరప పంటలో పై ముడతను నివారించడానికి రైతులు తగు జాగ్రత్తలను పాటించాలని నివారణ చర్యలు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. రైతులకు వ్యవసాయేతర రంగాల్లో ఎప్పటికప్పుడు ఏరువాక కేంద్రం నుండి సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందని తెలిపారు. తాము అందిస్తున్న సేవలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుగంధ పంటలు పండిస్తున్న రైతాంగానికి వికాస్‌ పౌండేషన్‌ నుండి ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు సుగంధ పంటల రైతులకు వికాస్‌ అగ్రిఫౌండేషన్‌ నుండి రూ. 24 లక్షల విలువైన చేతి పంపులు, యంత్రాలు, టార్పాలిన్‌ షీట్లను రాయితీలతో ఉత్పాదక ధరలకే పంపిణీ చేసినట్లు తెలిపారు. మిరప రైతులకు జిగురు అట్టలు, లింకాకర్షక ఎరలను అందచేస్తున్నట్లు వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో సగంధ పంట పసుపును సాగు చేస్తున్న రైతులకు రూ. లక్ష విలువైన 20 హెడ్‌.డి.ఫీ వర్మీబెడ్లని 100 శాతం రాయితీపై ఉచితంగా పంపిణీ చేశామన్నారు. సుగంధ పంటలను సాగు చేసే రైతుల కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడతామని వికాస్‌ అగ్రి ఫౌండేషన్‌ చైర్మన్‌ నాశిరెడ్డి సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్‌ అగ్రి ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ పచ్చిపుసులు నరేష్‌, డైరెక్టర్లు, నేలపట్ల శేషారెడ్డి, నాశిరెడ్డి, స్నేహలత, నేలపట్ల సంతరెడ్డి, చెట్టుపల్లి తిరుపతి రావు, కాట్రగడ్డ రవి పాల్గొన్నారు.

- అగ్రిక్లినిక్‌ డెస్క్‌