భారత ప్రభుత్వ సంస్థ అయిన ట్రాయ్‌ అంచనా ప్రకారం మనదేశంలో 38 కోట్ల మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో చరవాణిని ఉపయోగిస్తున్నారు. ఈ చరవాణి ద్వారా రైతులకు సందేశాలను తమ ప్రాంతీయ భాషల్లో వ్యవసాయానికి సంబంధించిన వాతావరణ సూచనలను, చీడపీడల నివారణ చర్యలను, మార్కెట్‌ సంబంధిత సమాచారాన్ని పంపవచ్చు. రైతులకు సాగులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలంటే సాంప్రదాయ విస్తరణ సేవలతో పాటు ఆధునిక ఎలక్ట్రానిక్‌ ఆధారిత సమాచార సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. అంతర్జాల సదుపాయం ప్రస్తుతం మారుమూల గ్రామాలకు, చరవాణులకు అందుబాటులోకి రావడం ద్వారా రైతులు వ్యక్తిగతంగా తమ చరవాణిలో అంతర్జాల సదుపాయం ఏర్పాటు చేసుకొని వారు సాగుచేసే పంటలలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఇప్పుడు వీటికి తోడు అగ్రి ఆప్‌ల రూపంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతన్నకు అండగా నిలుస్తుంది. తాకే తెరలున్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల వినియోగం రైతు స్థాయిలో బాగా పెరగడం వల్ల రైతులు అంతర్జాలం ఉంటే (ఇంటర్నెట్‌) గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అగ్రి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని పంటల సాగుకు ఉపయోగించు కోవచ్చు. ఈ విధంగా పంటల్లో మంచి దిగుబడులు సాధించడానికి భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ మరియు తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కొన్ని అగ్రి యాప్‌లను తయారు చేసింది.

రైతులు అంతర్జాలం (ఇంటర్నెట్‌) ద్వారా వివిధ వెబ్‌సైట్లతో మన రాష్ట్రం, దేశం మరియు ప్రపంచంలో జరుగుతున్న ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని తెలుసుకొనవచ్చును. ప్రొఫెషనల్స్‌ గ్రూప్స్‌లో సభ్యులు కావడం వలన తమకు కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చును. రైతులు కంప్యూటర్‌ / మొబైల్‌ ఫోన్‌లోని యూ ట్యూబ్‌ యాప్‌ను క్లిక్‌ చేయడం ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఫోటోలు మరియు వీడియోల రూపంలో చూడవచ్చును. రైతులు తమకు కావాల్సిన సమాచారాన్ని యూట్యూబ్‌లో టైపు చేసి వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను చూడటమే కాకుండా తమకున్న సమస్యలను వాటితో సరిపోల్చుకొని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

వెబ్‌ ఆధారిత పోర్టల్స్‌ :

1. తెలంగాణ అగ్రిస్‌ నెట్‌ (ఆధునిక సేద్యానికి ఇ-పాఠాలు) :

సేద్యానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని అంతర్జాలంలో తెలుగులో, ఆంగ్లంలో రైతులు పొందవచ్చు. వ్యవసాయ శాఖకు చెందిన అగ్రి.తెలంగాణ.జిఒవి.ఇన్‌ సైట్‌లోకి వెళ్తే వ్యవసాయ ముఖచిత్రం తెలుగులో దర్శనమిస్తుంది. పంటల యాజమాన్యం, అంతర పంటలు, శ్రీవరి సాగు, సమగ్ర సస్యరక్షణ, సేంద్రియ వ్యవసాయం, యాంత్రీకరణ, వాతావరణం, విత్తనాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పురుగు మందుల వినియోగం, భూసార పరీక్షల సమాచారం, ఎరువుల మోతాదు, పంటలు విత్తే సమయం, వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన అనేక అంశాలు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వివిధ పంటల్లో తీసుకోవలసిన చర్యలను నిరక్షరాస్యులైన రైతులు కూడా సులభంగా అర్ధం చేసుకునేలా వీడియో పాఠాలు అందుబాటులో ఉంచారు. ఇందులో ప్రతి అంశానికి చెందిన వివరాలు ఉంటాయి. సాగులో ఉత్తమ ఫలితాలను సాధించి అవార్డులను పొందిన రైతుల అనుభవాలు, విజయ గాధలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. యంత్ర పరికరాల సమాచారంతో పాటు వాటిని వినియోగించే పద్ధతులను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దుక్కిదున్నడం నుంచి పంట ఉత్పత్తులు ఇంటికి చేరే వరకు సాగులో రైతులకు ఎదరయ్యే పలు సందేహాలు, సమస్యలను ఈ సైట్‌ ద్వారా నిపుణులకు తెలియ చేసి సమాచారాన్ని పొందవచ్చును. ఈ వెబ్‌ సైట్‌లో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏటా ప్రచురించే వ్యవసాయ పంచాంగం పంటల వారిగా అందుబాటులో ఉంటుంది.

2. తెలంగాణ కిసాన్‌ పోర్టల్‌ :

దీని ద్వారా తెలంగాణ రైతులు ప్రభుత్వం అందించే పథకాలైన సబ్సీడి ద్వారా విత్తన పంపిణీ, మట్టి నమూనా పరీక్షల వివరాలు, వడ్డీలేని పంట ఋణాలు, పంట భీమా, రైతు లక్ష్మి పథకాలకు సంబంధించిన వివరాలు పొందవచ్చు.

3. రైస్‌ నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ :

జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్‌ వారు ఈ అప్లికేషన్‌ ద్వారా రైతులు వరికి సంబంధించిన చీడపీడలు, వరి రకాలు, ఎరువుల యాజమాన్యం, కిసాన్‌ కాల్‌ సెంటర్‌కు తరచుగా వచ్చే ప్రశ్నలకు సమాధానాలు, వరిలో రైతు, శాస్త్రజ్ఞుల స్థాయిలో నూతన ఆవిష్కరణను తెలుసుకోవచ్చు.

4. ఈ-నామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) :

పోర్టల్‌ మార్కెట్‌ ఆవరణంలోనే రైతు ఉత్పత్తులకు నాణ్యతా పరీక్షలు నిర్వహించి ఉత్పత్తి ఫోటోను, వివరాలను అన్ని మార్కెట్‌లో నుంచి ఆనలైన్‌ ఈ-నామ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఉదయం 9 గంటల లోపు ఉత్పత్తిని పరిశీలించుకున్న తరువాత వ్యాపారులు తాము చెల్లించే ధరను ఆన్‌లైన్‌లో కోట్‌ చేయాలి. రైతుకు ఆ ధర సమ్మతమైతే సరుకును వ్యాపారికి విక్రయిస్తాడు. ఆన్‌లైన్‌ అగ్రికల్చరల్‌ పోర్టల్‌ ఈ-నామ్‌ ద్వారా తెలంగాణలోని రైతులు లైసెన్స్‌ గల వర్తకుల ద్వారా భారతదేశంలోని ఏ మార్కెట్‌లోనైనా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తాము పండించిన 25 రకాల పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. తొలుత తెలంగాణలోని 44 మార్కెట్‌లను జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌కు అనుసంధానం చేయడం జరిగింది. దీని ద్వారా వ్యాపారులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వేలంలో పాల్గొని ధరలను కోట్‌ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులకు ఎలక్ట్రానిక్‌ వేలం వేదిక, శాస్త్రీయంగా గ్రేడింగ్‌ చేయడం ద్వారా అధిక ధరను సకాలంలో పొందవచ్చును. తెలంగాణ రాష్ట్రం 2018 సంవత్సరానికి రాష్ట్రంలోని 585 మార్కెట్‌లను అనుసంధానం చేయాలని ప్రయత్నిస్తోంది.

5. పిజెటియస్‌ఏయు అగ్రికల్చరల్‌ వీడియోస్‌ యూ ట్యూబ్‌ ఛానల్‌ :

ఈ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పంటల సాంకేతిక పరిజ్ఞానం, విజయగాధలు, సస్యరక్షణ పరిజ్ఞానం, అదనపు ఆదాయ వనరులు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ పనిముట్లు తదితన అంశాలను రైతులకు అందజేయడం జరుగుతుంది. రైతు సోదరులు ఈ యూట్యూబ్‌ ఛానల్‌ను వారి వారి స్మార్ట్‌ ఫోన్‌లలో ఓపన్‌ చేసి ఈ ఛానల్‌లోని అంశాలను ఉచితంగా వీక్షించవచ్చు.

6. అన్నపూర్ణ కృషి ప్రసార సేవ :

ఇది వెబ్‌ (ఇంటర్నెట్‌) ఆధారిత, ఐ.వి.ఆర్‌.యస్‌ (స్వర ఆధారిత) మొబైల్‌ పరిజ్ఞానాలను ఉపయోగించుకునే సమీకృత వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ సమాచార అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన సరిక్రొత్త మొబైల్‌ ఆధారిత ప్రత్యామ్నాయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ అన్నపూర్ణ కృషి ప్రసార సేవ. మీడియా లాబ్‌ ఆసియా, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఈ మొబైల్‌ ఆధారిత ఈ- ప్రసార సేవల ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ ప్రశ్నలను నేరుగా అడగడమే కాకుండా, సమస్యల వీడియోలను సంబంధిత జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక శాస్త్రవేత్తల నుండి తెలుగు భాషలో అక్షర మరియు శబ్ద సందేశాలను తమ చరవాణి ద్వారా టోల్‌ ఫ్రీ నెంబరు ద్వారా రైతులు వ్యవసాయ, ఉద్యాన, పశువుల యాజమాన్యం మరియు చేపల పెంపకంపై తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రైతు వ్యక్తిగత సలహాల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 1800 425 3141 ద్వారా రైతులు తమ ప్రశ్నలను 24 గంటలు రికార్డు చేసే సదుపాయం కలదు. అలాగే రైతులు, వారు పాటించే ఉత్తమ పద్ధతులను మరియు వారి అనుభవాలను రికార్డు చేసి ఇతర రైతు స్నేహితులతో పంచుకోవచ్చు. రైతులు వ్యవసాయ సమాచారాన్ని తమ మొబైల్‌ ద్వారా మాతృ భాషలో సంక్షిప్త సందేశాలు, శబ్ద సందేశాల రూపంలో పొందవచ్చును. అంతేకాకుండ సంబంధిత శాస్త్రవేత్తల నుంచి అత్యవసర సందేశాలను, హెచ్చరిక సందేశాలను మాతృభాషలో పొందవచ్చును. రైతులు అడిగిన ప్రశ్నలు, సమాధానాలు ఎప్పుడైనా వారు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, చూడవచ్చు.

7. అగ్‌మార్క్‌ నెట్‌ :

అగ్‌మార్క్‌ నెట్‌ దేశంలోని 670 మార్కెట్‌ వ్యవసాయ మార్కెట్లతో అనుసంధానం చేయబడి విలువ ఆధారిత ఉత్పత్తులు ఉత్పత్తి చేసే చిన్న, మధ్య తరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తమకు కావలసిన ఉత్పత్తులు తాజాగా పొందవచ్చును.

పిజెటియస్‌ఏయు వారి చేనుకబుర్లు :

వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి విద్యార్ధుల రేడియో కార్యక్రమం ''చేను కబుర్లు'' ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30-2:00 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్‌ 'ఏ' కేంద్రం ద్వారా ప్రసారమవుతుంది. ఇందులో వ్యవసాయ, గృహ విజ్ఞాన మరియు ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్ధులు రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని నాటిక, పాట, రైతు సదస్సు, చర్చాగోష్ఠులు, శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూ మొదలగు పద్ధతుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. పిజెటియస్‌ఏయు వారి చేనుకబుర్లు బ్లాగ్‌ ద్వారా ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వినని రైతులు తమకు కావలసిన సమాచారాన్ని బ్లాగ్‌ ద్వారా పొందవచ్చు.

చరవాణి అప్లికేషన్స్‌ :

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ గల రైతులు అగ్రి యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గాని, సంబంధిత వెబ్‌సైట్లలో టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్‌లో రైతు తన పేరు, ఫోన్‌ నంబర్‌, జిల్లా, గ్రామం తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. తరువాత రైతు తనకు అనువైన భాషను సమాచారం కోసం ఎంచుకోవాలి. దీనిలో టెక్స్ట్‌తో పాటు వీడియో, ఆడియో కూడా ఉంటాయి. పంట యాజమాన్య పద్ధతులు, అనుకూలమైన నేలలు, పొలం తయారీ, రకాలు, విత్తన మోతాదు, విత్తనశుద్ధి, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడల యాజమాన్యం, దిగుబడికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఆప్‌లలో రకాలకు సంబంధించిన గుణగణాలు, వాటి చిత్రాలతో సహా గుర్తు పట్టే విధంగా ఏ కాలంలో ఏ రకం ఎంచుకోవాలో సమాచారాన్ని పొందవచ్చు.

1. యమ్‌ కిసాన్‌ అప్లికేషన్‌, యస్‌.యమ్‌.యస్‌ పోర్టల్‌ :

భారత ప్రభుత్వం యమ్‌ కిసాన్‌, యస్‌.యమ్‌.యస్‌ పోర్టల్‌ను జూలై 16, 2013 న ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు 1500 కోట్ల సందేశాలను రైతులకు అందించడం జరిగింది. ఈ అప్లికేషన్‌, పోర్టల్‌ ద్వారా రైతులు ఎలాంటి రుసుము చెల్లించకుండా వ్యవసాయ ఆధారిత సమాచారాలను శాస్త్రవేత్తల నుంచి పొందవచ్చు. రాబోయే ఐదు రోజుల్లో మీ ప్రాంతంలో వర్షపాతం, గాలిలో తేమ శాతం, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలు, ఈదురు గాలులు వంటి పలు అంశాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా రైతులు తెలుసుకొని తదనుగుణంగా వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. ఖచ్చితమైన ముందస్తు సమాచారంతో అదునులో రైతు విత్తనం వేసుకోవచ్చు. తమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలకు అనుకూలమైన పంటలను విత్తుకోవచ్చు. పంట కోతల సమయంలో ఈదురు గాలులు కుండపోత వర్షాలతో నష్టపోకుండా పంట కోతలు, నూర్పిడి వాయిదా వేయవచ్చు. పంట కోశాక ఆరబెట్టిన రైతుల కోసం గాలిలో ఆర్ధత (తేమ) వంటి వివరాలను తెలుపుతుంది. దీనివల్ల పంటను ఆరబెట్టేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుంది అన్న విషయంపై రైతులకు అవగాహన వస్తుంది. వాతావరణానికి తెగుళ్ళు, చీడపీడల వ్యాప్తికి మధ్య సంబంధం ఉంది. గాలిలో తేమ శాతం పెరిగినప్పుడు రైతులకు చీడపీడలపై ఈ యాప్‌ అప్రమత్తం కూడా చేస్తుంది.

2. ప్లాంటిక్స్‌ :

ఈ అగ్రి యాప్‌ను తెలుగు రైతుల అవసరాలకు అనుగుణంగా ఇక్రిసాట్‌ వారు రూపొందించారు. రైతులు స్మార్ట్‌ ఫోన్‌లోని కెమెరాతో తెగులు సోకిన, పోషక లోపాలు గల మొక్కల ఫోటోలను యాప్‌కు అనుసంధానం చేయాలి. ఆ వెంటనే యాప్‌ పనిచేయడం మొదలవుతుంది. క్షణాల్లో ఆ పంటకు సోకిన తెగులు లేదా ఆశించిన పురుగు నివారణా చర్యలు లేదా అందించాల్సిన పోషకాలు తదితర వివరాలన్నీ ఫోన్‌ తెరపై (అనగా స్క్రీన్‌పై) యస్‌.యమ్‌.యస్‌ (మెసేజ్‌) రూపంలో కనిపిస్తాయి. ఈ ప్లాంటిక్స్‌ యాప్‌లో వరి, మొక్కజొన్న, కందులు, మినుము, పెసర, వేరుశనగ, మిరప, శనగ, సోయాబీన్‌, మామిడి, అరటి, దానిమ్మ, బొప్పాయి, టొమాటో, చిక్కుడు, వంకాయ, బంగాళదుంప, గోధుమ తదితర పంటలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ప్లాంటిక్స్‌ యాప్‌లో 350 కి పైగా వివరణాత్మక వ్యాధి వర్ణనలు గలవు. ప్రతి వ్యాధికి సంబంధించిన జీవ రసాయన నివారణ చర్యల సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ యాప్‌ను గూగుల్‌ ఎర్త్‌ తో అనుసంధానించడం వల్ల ఏ ప్రాంతానికి చెందిన రైతులు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలుస్తుంది. దీంతో ఈ ప్రాంతాల్లోని వ్యవసాయ విస్తరణాధికారులను అప్రమత్తం చేసే అవకాశం ఉంది.

3. ఆకాశవాణి మొబైల్‌ ఆప్‌ :

ఆల్‌ ఇండియ రేడియో లైవ్‌ అనే అప్లికేషన్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి రైతులు డౌన్‌లోడ్‌ చేసుకొని ఆకాశవాణికి సంబంధించిన సమాచారాన్ని రైతులు పొందవచ్చును. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆకాశవాణి ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రూపాల్లో వ్యవసాయ సమాచారాన్ని రైతులకు అందించడం జరుగుతున్నది. ప్రతిరోజు ఉదయం 6:30-6:45 వరకు పొలం పనులు, మధ్యాహ్నం 1:20-1:30 వరకు పాడిపంటలు, సాయంత్రం 6.40-6:50 వరకు గ్రామ సీమలు (ప్రతి ఆదివారం), 6.50 నుండి 7.00 వరకు వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15-7:45 వరకు ఇల్లు, వాకిలి, ప్రతి సోమవారం నిర్వహించబడే వ్యవసాయ పాఠశాల అలాగే ప్రతి గురువారం నిర్వహించబడే ప్రత్యక్ష ప్రసారాలకు సాంకేతిక సహకారం అందించడమే కాకుండా, నేరుగా విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు చేయడం జరుగుతుంది. వాయస్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ అనగా కిసాన్‌ వాణి అనే కార్యక్రమం ద్వారా ఆకాశవాణి యఫ్‌.యమ్‌ రేడియో స్టేషన్లలో రైతులు తమ అనుభవాలను తోటి రైతులకు ప్రేరణ కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి యఫ్‌.యమ్‌ ఛానళ్ళలో ప్రతిరోజు సాయంత్రం కిసాన్‌వాణి పేరుతో 7:15 గంటల నుండి 7:45 గంటల వరకు 30 నిమిషాల పాటు ప్రసారం అవుతుంది.

4. కిసాన్‌ సువిధ :

ఈ అప్లికేషన్‌ ద్వారా రైతులు ప్రతి రోజు, తదుపరి ఐదు రోజులకు తమ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సూచనలను, మార్కెట్‌ ధరలను, వ్యవసాయ సూచనలను, చీడపీడల నివారణా చర్యల గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తమ దగ్గరలో గల ఏఏ మార్కెట్‌లలో వివిధ పంటల గరిష్ట ధరలను తెలుసుకొని అత్యధిక గిట్టుబాటు ధర పొందవచ్చు.

5. పూసా కృషి :

భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ పరిశోధనా సంస్థలకు, రైతులను వ్యవసాయ వాణిజ్య కేంద్రాలను ఏర్పరచుకొని స్వయం ఉపాధితో పాటు మరికొంత మందికి ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో పూసాకృషి అనే చరవాణి అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొనిరావడం జరిగింది. దీని ద్వారా రైతులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనేటప్పుడు కావలసిన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.

6. శత్కారి మాసిక్‌ :

ఈ అప్లికేషన్‌ ద్వారా వ్యవసాయ మాస పత్రికలలో లభ్యమయ్యే సమాచారాన్ని రైతులు పొందవచ్చును.

7. భువన్‌ :

ఈ అప్లికేషన్‌ ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు వ్యవసాయ అధికారులు పంట పేరు, పంట విత్తిన తేదీ, పంట సాగు వివరాలు, ఛాయా చిత్రాలను పొందుపరచి పంట నష్టాన్ని అంచనా వేయవచ్చు. దీని ద్వారా పంట భీమాకు ప్రీమియం చెల్లించిన రైతులు తొందరగా సహాయాన్ని పొందవచ్చు.

8. అగ్రి మార్కెట్‌ :

ఈ అప్లికేషన్‌ ద్వారా రైతులు తమకు దగ్గరలోని 50 కిలోమీటర్ల పరిధిలో గల మార్కెట్లలో గల వ్యవసాయ పంట ఉత్పత్తుల ధరలను చరవాణి ద్వారా పొందవచ్చు.

9. ఇఫ్కో కిసాన్‌ :

ఇఫ్కో కిసాన్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా వాతావరణ, మార్కెట్‌ సంబంధిత సలహాలు, సూచనలు నిపుణులతో సూచనలు, ఉచిత శ్రవ్య సందేశాలు, కాల్‌ బ్యాక్‌ ఫెసిలిటీ అందించడం జరుగుతుంది.

10. మన రైతు బజార్‌ :

ఈ అప్లికేషన్‌ ద్వారా చిన్న, సన్నకారు రైతులు తాము పండించిన కూరగాయలను వినియోగదారులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్మవచ్చును. తెలంగాణలో వందకు పైగా రైతు బజార్‌లు ఈ సదుపాయాన్ని కలిగి తాజా కూరగాయలను మార్కెట్‌ ధరకన్నా తక్కువకు వినియోగదారులకు అందిస్తున్నారు.

11. కియోస్క్‌ టెక్నాలజీ :

అన్నపూర్ణ కృషి ప్రసార సేవ అమలవుతున్న ప్రాంతాలలో రైతులు తనంతట తానే స్వయంగా చూసి తెచ్చుకొని వాడడం వల్ల అతనికి ఆత్మ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అంతేకాక వారి ప్రదేశాలలో ఉండే నేలల గురించి అవగాహన ఇస్తూ ఎటువంటి నేలలో ఎటువంటి పంటలు వేసుకుంటే ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారో ఈ కియోస్క్‌ అందిస్తుంది. వాతావరణ సమాచారాన్ని కూడా అందిస్తుంది. రైతులు సులభంగా ఉపయోగించే విధంగా టచ్‌స్క్రీన్‌ కలిగి ఆకర్షణీయమైన గుర్తులతో పంటలు, చీడపురుగులు వాటి సంబంధిత వీడియోలు పొందవచ్చు. ఈ కియోస్క్‌ను మండల, జిల్లా, రాష్ట్ర ఇంటర్నెట్‌లతో అనుసంధానం చేసి ఉంటాయి. అందువల్ల రైతులు తమకు కావలసిన సమాచారాన్ని, సూచనలను పొందవచ్చు.

ఈ విధంగా రైతులు ఆధునిక వ్యవసాయ రంగంలో రైతు స్థాయిలో నూతన సమాచార సాంకేతిక వ్యవస్థలైన ఆకాశవాణి, టెలివిజన్‌, ఈబ్లాగ్స్‌, కమ్యూనిటి రేడియో, అంతర్జాల ఆధారిత అగ్రిస్నెట్‌ యూట్యూబ్‌ ఛానల్‌, కిసాన్‌ కాల్‌ సెంటర్‌, పోర్టల్స్‌, చరవాణి అప్లికేషన్స్‌, వాట్స్‌ఆప్‌ మరియు అన్నపూర్ణ కృషి ప్రసార సేవ, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఈ సాగు, యస్‌.యమ్‌.యస్‌ ద్వారా శ్రవ్య, వీడియో సందేశాల ద్వారా ఎలక్ట్రానిక్‌ ఆధారిత సమాచార సాంకేతిక వ్యవస్థలను రైతులకు సకాలంలో సమాచారాన్ని అందించడానికి

డా|| పి. ప్రశాంత్‌, డా. వి. లక్ష్మీ నారాయణమ్మ, ఆర్‌. సుధాకర్‌ రెడ్డి , ఎలక్ట్రానిక్‌ వింగ్‌, ఎ.ఆర్‌.ఐ, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 9553153149