నత్రజనిని అందించడానికి రైతులు అధికంగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. అధిక రసాయన ఎరువులవాడకం రైతుకిపెట్టుబడిని పెంచడమేకాకుండా భూగర్బ జలాల్లో నైట్రేట్‌లు కాష్యాన్ని కలుగజేస్తుంది. ఇటువంటి నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు మేలైన నిర్వహణ పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది. సహజ వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా భూమిలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అభివద్ధి చెందడంతోపాటు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను సాధించవచ్చు. మీనామ్నతం వాడడం ద్వారా భూమిలో నత్రజని లభ్యతను పెంచటంతో పటు భూగర్బజలాల్లో కలిగే నైట్రేట్‌లు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.

మీనామ్నతం అంటే ఏమిటి?

మీనామ్నతం అనేది చేప తల, చర్మం, పొలుసులు మరియు ఇతర వ్యర్థాలను బెల్లంతో కలిపి పులియబెట్టబడిన మిశ్రమం నుండి వడపోయబడిన ద్రావణం.

మీనామ్నతం తయారు చేసేవిధానం :

చేప యొక్క తల, చర్మం, పొలుసులు మరియు ఇతర వ్యర్థాలను సేకరించాలి.

సేకరించిన వ్యర్థాలలో సమననిష్పత్తిలో బెల్లం (1కిలో చేప వ్యర్థాలకి 1కిలో బెల్లం) వేసి బాగా కలియబెట్టాలి.

తరువాత ఒక మట్టి పాత్ర లేదా ప్లాస్టిక్‌ పాత్రని తీసుకొని అడుగు భాగంలో రాళ్లతో ఒక పొరను ఏర్పాటు చేయాలి. (ఈ పొర పులియ పెట్టు క్రమంలో లవణాలు అందించడంతో పాటు అడుగు భాగంలో ద్రావణాలు సేకరించడానికి సహాయ పడుతుంది)

ఈ రాళ్ల పొరపైన చేప వ్యర్థాలు మరియు బెల్లం మిశ్రమాన్ని ఒక పొరలాగా అమర్చాలి.

ఈ పొరను చేప వ్యర్థాలు బయటకు కనిపించకుండా ఎక్కువ మొత్తంలో బెల్లంతో కప్పిఉంచాలి.

ఇలా చేప వ్యర్థాలు మరియు బెల్లం యొక్క మిశ్రమం మరియు బెల్లాన్ని వీలైనన్ని ఎక్కువ పొరలను ఒకదాని తరువాత ఒకటి వచ్చునట్లు అమర్చుకోవాలి.

జాగ్రత్తలు :

పాత్ర పైపొర తప్పని సరిగా బెల్లం వచ్చేటట్లు చూసుకోవాలి.

చేప వ్యర్థాలు బహిర్గతంగా కనబడకుండా బెల్లంతో పూర్తిగా కప్పి ఉంచాలి.

ఈ పాత్రను ఒక బట్టతో కప్పి ఉంచి చల్లని వెలుతురు గల ప్రదేశంలో ఉంచాలి.

3-4 రోజుల్లో చేప వ్యర్థాలు పులియబడడం మొదలౌతుంది.

బెల్లం ద్రవాభిసరణ పీడనం కలగ చేయడం వల్ల చేపవ్యర్థాల్లో గల ద్రవరూపం ఆమ్లాలు బెల్లంలోకి చేరి ఒక ద్రావణం తయారవుతుంది. ఈ ప్రక్రియ 2-3 నెలల్లో పూర్తవుతుంది.

పూర్తిగా పులియబడిన మిశ్రమం తియ్యగా మరియు కొద్ద్ది మొత్తంలో చేప వాసన కలిగి ఉంటుంది.

పాత్రలో ఉన్న ద్రావణాన్ని వడపోసి మీనామ్నతంగా వాడుకోవాలి. మిగిలిన చేపవ్యర్థాలను కంపోస్టు చేసుకోవచ్చు.

మీనామ్నతంఉపయోగించే విధానం :

మీనామ్నతం మొక్క ప్రారంభ దశలో మరియు శాఖీయ పెరుగుదల దశల్లో ఉపయోగించవచ్చు.

1 మీ.లి మీనామ్నతం లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు.

0.1 శాతం మీనామ్నతం మొక్క మొదళ్ళలో నేలపై పోసుకోవచ్చు.

ఉపయోగాలు :

ఆకు కూరలలో పిచికారీ చేయడం ద్వారా సువాసన, రుచి మరియు దిగుబడులు పెరగడానికి సహాయపడుతుంది.

మొక్కలకు నత్రజని అందించడం ద్వారా పత్రహరిత ఉత్పత్తిని పెంచి దిగుబడులు పెరగడానికి తోడ్పడుతుంది.

జాగ్రత్తలు :

ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మీనామ్నతం ఉపయోగించ వద్దు. దీనివల్ల ఆకులు మాడిపోయే ప్రమాదంఉంది.

ద్రావణాన్ని వడపోయునప్పుడు చేతికి తొడుగులు ధరించాలి.

- జి. మహేష్‌, ఫోన్‌ : 8179360367, 9603169239