మన రాష్ట్రంలో వర్షాధారంగా పంటలు పండించే సాగు విస్తీర్ణం, నీటి పారుదల సాగు విస్తీర్ణం కన్నా ఎక్కువగా ఉంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌, మే వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అడపాదడపా తొలకరి వర్షాలు కురుస్తుంటాయి. నీటి వసతి ఉన్న భూములు తప్ప వర్షాధారంగా పండించే భూములన్నీ వేసవికాలంలో ఖాళీగా ఉంటాయి. వేసవికాలంలో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 38-440 సెం. వరకూ ఉంటాయి. తొలకరి వర్షాలు కురిసినప్పుడు భూమిని లోతుగా దుక్కులు చేసుకోవడం వల్ల భూమిపై పొరలు లోపలికి, లోపలి పొరలు భూ ఉపరితలానికి చేరతాయి. ఈ దుక్కులను వేసవిదుక్కులు అంటారు.

వేసవి దుక్కులకు అనుకూల పరిస్థితులు :

భూమిలో నిల్వ ఉంచుకునే తేమలో 25-50 శాతం ఉన్నట్లయితే అది దుక్కి చేసుకోవడానికి అనుకూలమైనది.

భూమిలో తక్కువ తేమ ఉన్నప్పుడు దుక్కి చేసినట్లయితే దుక్కి చేయడానికి ఎక్కువ శక్తి అవసరమై దుక్కి కూడా బాగుండక భూమి గుల్లబారదు.

భూమిలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు దుక్కి చేసినట్లయితే నాగలికి మట్టి అంటుకుంటుంది. మరియు కింద ఉన్న మట్టి గట్టిపడి భూమిలో గట్టిపొరలు ఏర్పడతాయి.

దుక్కి చేయడం అనేది భూమిలో ఉన్న తేమపైన ఆధారపడి ఉంటుంది. తేలిక నేలల్లో కొంచేం తేమ ఎక్కువగా ఉన్నా కూడా దుక్కి చేసుకోవచ్చు. అయితే బరువునేలల్లో తగినంత తేమ ఉన్నప్పుడే దుక్కి చేసుకోవాలి. ఎక్కువ తేమ ఉన్నట్లయితే దుక్కి చేసుకోకూడదు.

దుక్కి లోతు మనం పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెద్దమడకతో లోతుదుక్కి అంటే 30 సెం.మీ. (ఒక అడుగు) చేయడం మంచిదని సిఫార్సు చేశారు. ప్రతి సంవత్సరం వర్షాలను బట్టి 15-20 సెం.మీ. లోతు వరకు దున్నుకోవాలి. సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ ఉన్న పంటలకు లోతు దుక్కి అవసరం. పీచు వేర్లు ఉన్న పంటలకు కొంచెం తక్కువ లోతు దుక్కి సరిపోతుంది. తేలికపాటి నేలల్లో 1-3 సార్లు దున్నితే సరిపోతుంది. కలుపు మొక్కలు మరియు అంతకు ముందు పంట అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లయితే భూమిని కనీసం 3 దఫాలైన దున్నాలి.

దుక్కి చేయడానికి వాడవలసిన నాగళ్ళు :

పైపైన దుక్కి చేయుటకు మామూలు నాగలి లేదా చెక్కల గుంటక కాని వాడాలి.

ఎరువును భూమిలో కలియదున్నడానికి ఎద్దులతో లాగే మోల్డ్‌బోర్డ్‌ మడకను వాడాలి.

బాగా లోతు దుక్కి చేసి నేలను తిరగతోడడానికి ట్రాక్టరుతో లాగే మోల్డ్‌బోర్డ్‌ మడకను వాడాలి.

అధునాతనంగా వచ్చిన ట్రాక్టరుతో లాగే పెద్ద మడకలు, రోటోవేటర్స్‌ వంటి వ్యవసాయ పనిముట్లను ఉపయోగించవచ్చు.

వేసవి దుక్కుల వల్ల ప్రయోజనాలు :

వేసవి దుక్కుల వల్ల నేల బాగా గుల్లబారుతుంది. తరువాత పడే వర్షపు నీరు వృధాకాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు.

నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలను లోతుగా వాలుగు అడ్డంగా దున్నుకోవడం వల నేలకోతను మరియు భూమిపై పొరల్లోని భూసారాన్ని కొట్టుకొనిపోకుండా అరికట్టవచ్చు.

భూమిని ఒక అడుగు (30 సెం.మీ.) లోతు వరకు దున్నుకుంటే విత్తనం మొలకెత్తి వేర్లు సులభంగా భూమిలోపలికి దిగి భూమిలోని పోషక పదార్థాన్ని, తేమను గ్రహించి మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి.

లోతు దుక్కుల వల్ల భూమిలోకి నీరు ఇంకి, తేమ శాతం పెరగడం వల్ల సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్ళి పోషక రూపంలో అందుబాటులోకి వస్తాయి.

భూమిలో దాగి ఉన్న చీడపీడల కోశస్థదశలు, పురుగులు, బ్యాక్టీరియా, శిలీంధ్ర సిద్ధ బీజాలు, కలుపు మొక్కల విత్తనాలు ఎండవేడిమికి లోనై చాలా వరకు నశిస్తాయి.

వేసవి దుక్కుల వల్ల కలుపు మొక్కలు వేర్లతో సహా పెకిలించబడి నేలలో కలసిపోతాయి మరియు సేంద్రియ పదార్థంగా ఏర్పడతాయి.

భూసార పరీక్షల ఆవశ్యకత :

పైర్లకు కావలసిన అన్ని రకాల పోషకాలు కొంత ప్రమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. ఇవి తయారై పైర్లకు లభ్యం కావడమనేది నేల భౌతిక, రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఎంతో తేడాలుండే అవకాశం ఉంది. నేలలో అవి ఎంత వరకు లభ్యమవుతున్నాయో వేయదలచిన పైరుకు ఎంత తక్కువపడుతుందో నిర్థారించి ఎరువులు వాడాలి. పోషకాల సమతుల్యత పాటించడానికి, రసాయినిక ఎరువుల సక్రమ వినియోగానికి భూసార పరీక్షల ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైతు నేల యొక్క పోషక సామర్ధ్యాన్ని తెలుసుకోవడం వల్ల ఏయే నేలల్లో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకోవచ్చు. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్షల ద్వారా నేలలో ఏయే పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వల్ల పంట మంచి దిగుబడులను అందించడమే కాక నేలక అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు.

భూసార పరీక్షల్లో వివిధ దశలు :

ప్రామాణిక మట్టి నమూనాల సేకరణ

ప్రయోగశాలలో పరీక్షలు

ఫలితాలనాధారంగా ఎరువుల సిఫారసులు, సమస్యాత్మక నేలలకు తగు సూచనలు

ప్రామాణిక మట్టి నమూనాసేకరణ :

మట్టి నమూనాను భూవిస్తీర్ణంను బట్టి, వాలును బట్టి, రంగును బట్టి సేకరించవలసి ఉంటుంది. ఒకటి నుండి ఐదు ఎకరాల భూమిని ప్రామాణికంగా తీసుకొని 10-15 చోట్ల మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలో త్రిభుజాకారంలో 15-20 సెం.మీ. వరకు పారతో గుంట తీసి పైపొర నుండి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఆ విధంగా 10-15 చోట్ల నుండి సేకరించిన మట్టిని చతుర్భాగ పద్ధతిలో 1 కిలో వచ్చే వరకు చేయాలి.

మట్టి నమూనాలు సేకరించడంలో మెలకువలు :

చెట్ల కింద, గట్లపక్కన, కంచెల దగ్గర, కాలిబాటల్లో నమూనాలు తీయకూడదు. పశువుల ఎరువు, కంపోస్టు కుప్పలు నిల్వఉంచిన చోట్ల నమూనాలు తీయకూడదు.

చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి.

రసాయన ఎరువులు వేసిన 45 రోజుల్లోపు నమూనాలు తీయకూడదు.

నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించిచరాదు.

పండ్ల తోటలు వేయదలసిన పొలంలో సుమారు 3-5 అడుగుల లోతు వరకు ప్రత్యేకంగా ప్రతి అడుగుకు 1,2,3 అని గుర్తుపెట్టి పంపాలి.

నమూనా తీసేటప్పుడు నేలపైనున్న ఆకు, అలము, చెత్త, చెదారం తీసివేయాలే గాని పై మట్టిని తొలగించకూడదు.

చౌడు భూముల్లో 0-15 సెం.మీ., 15-30 సెం.మీ. లోతులో రెండు నమూనాలు తీయాలి.

మెట్ట, ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసినప్పుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి.

భూసార పరీక్షా కేంద్రం ద్వారా నేల రంగు స్వభావం వంటి భౌతిక లక్షణాలేకాక, ఉదజని సూచిక, లవణపరిమాణం, సేంద్రియ కర్బనం, లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాష్‌ నిర్థారిస్తారు. సమస్యాత్మక నేలలకు వేయాల్సిన జిప్సం, సున్నం పరిమాణాన్ని నిర్ణయిస్తారు. అవసరానికి అనుగుణంగా సూక్ష్మపోషకాల లభ్యతను కూడా తెలుపుతారు.

ఆధునిక వ్యవసాయంలో భూసార పరిరక్షణ దృష్ట్యా తొలకరిలో వేసవిదుక్కులు, నేల స్వభావం, లక్షణాలను కనుగొనేందుకు భూసార పరీక్షల ఆవశ్యకత ఎంతైనా ఉంది. తద్వారా సరైన ఎరువులు యాజమాన్యం పాటించి నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంది.

డా|| యస్‌. జాఫర్‌భాష, సీనియర్‌ శాస్త్రవేత్త, యస్‌. బాలాజి నాయక్‌, డా|| యమ్‌. సుబ్బారావు,

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల, కర్నూలు