ప్రకృతి బీభత్సానికి అన్నదాత కుదేలయ్యాడు. అకాల వర్షాలు తెలంగాణ రైతులను దెబ్బతీశాయి. మండు వేసవిలో కురిసిన అకాల వర్షాలు రైతుల పంటలకు భారీగా నష్టాన్ని కలిగించాయి. ఆరుగాలం కష్టించి పంటను సాకుతున్న రైతుకు కన్నీళ్ళే మిగిలాయి. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నేలమట్టమవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్న దీన స్థితి. రెక్కలు ముక్కలు చేసుకొని పంటపైనే ఆశలు పెట్టుకున్న రైతుకు వడగండ్ల వాన నిలువునా దహించివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో అపార నష్టం వాటిల్లింది. వరి పైరు నేల మట్టానికి పడిపోయి చాపలా చుట్టుకుంది. మామిడి, బొప్పాయి, సపోటా తదితర వాణిజ్య పంటలు వడగండ్లకు నేల కూలాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికందిన పంట నేలపాలయ్యేసరికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతన్న. పంటలే కాకుండా పశువులపై పిడుగులు పడడంతో మృతి చెందాయి. భారీ ఈదురుగాలుల వర్షాలకు సుమారు 15 మంది మృత్యువాత చెందారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, కరీంగనర్‌, జగిత్యాల, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కుమరంభీం, ఆసిఫాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో వానలు పడడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎటువంటి ప్రకటనలు చేయకపోవడంతో రైతులు దిగులుచెందుతున్నారు. ఈ ఏడాది అకాల వర్షాల వల్ల మూడు దఫాలుగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట నష్టాన్ని అంచనా వేయడంలో జాప్యం చేస్తూ రైతుకు అందవలసిన నష్టపరిహారం సరిగా అందక రైతులు అధికారుల చుట్టూ నేటికీ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. మరోమారు వడగండ్ల వాన రైతుపై పెనుభారాన్ని మోపింది. ఈసారైనా నష్టపరిహారం అందుతుందో లేదో అని రైతులు దిగులు చెందుతున్నారు. వేలాది ఎకరాల చేతికందిన పంట నేల మట్టం అవ్వడంతో ఇంత వరకు పంట నష్టపరిహారాన్ని అంచనా వేయలేదని రైతులు వాపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ప్రకృతి వైపరిత్యాలతో రైతు నష్టపోతూ వస్తున్నా ప్రభుత్వాలు ఇటువంటి నష్టాలకు పూర్తిస్థాయి పరిష్కారం చూపడం లేదు.

ఇన్సూరెన్సుల పేరుతో డబ్బు పోగేసుకుంటున్నారే తప్ప రైతులకు మాత్రం ఎటువంటి పారితోషికం లభించడం లేదు. ఇటీవల కాలంలో రైతుల పంటలకు పూర్తిస్థాయిలో ఇన్సూరెన్సు సౌకర్యాలు ప్రకటించిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు గైకొనకపోవడంతో రైతుల్లో ఒక పక్క ఆందోళన చెందుతున్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని పలు పార్టీల రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులు అధైర్యపడొద్దు :

- పౌరసరఫరాల కమీషనర్‌ - అకున్‌ సబర్వాల్‌

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పౌరసరఫరాల కమీషనర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు. వర్షాలకు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని భయాందోళనతో తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరలకు అమ్ముకొని మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బును జమచేస్తున్నట్లు తెలిపారు. రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించేందుకు టోల్‌ఫ్రీనెం. 1822 4250 0333, వాట్స్‌ఆప్‌ నెం. 7330774444 ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు సలహాలు, సూచనల కోసం, తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులన్నీ పరిశీలించామని రైతులకు అన్ని ఏర్పాట్లు చేశామని రైతులకు కావలసిన టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కరించేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి, ఫోన్‌ : 9949285691