భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారోత్పత్తి జరగడానికి కాను ''హరిత విప్లవం'' రూపుదిద్దుకుంది. అధిక దిగుబడికి గాను హరితవిప్లవంలో సాంద్ర వ్యవసాయంలో రసాయనాలను (ఎరువులు, సస్యరక్షణ మందులను) విరివిగా, విచక్షణారహితంగా వినియోగంచడం వల్ల ఆహారోత్పత్తి పెరిగి దేశం స్వయం సమృద్ధిని సాధించింది. అదేవిధంగా భూమి, నీరు కలుషితమయ్యాయి. భూసారం క్షీణించింది. భూమిని సారవంతం చేసే సూక్ష్మజీవులు నశించాయి. నేలలో సేంద్రియ పదార్ధం తగ్గి నీటిని పట్టి ఉంచే గుణం కోల్పోయింది. తొలుత దిగుబడులు పెరిగినా గత కొంతకాలంగా దిగుబడులు పెరగకపోవడం ఆందోళనకరమైన పరిస్ధిది. భూసారం తగ్గిపోవడం ముఖ్యకారణంగా గమనించడం జరిగింది. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు, వానపాముల ఎరువులు, పచ్చిరొట్ట వంటి ఎరువులు వాడి సమగ్ర పోషక యాజమాన్యాన్ని అవలంభించినప్పుడే అధిక దిగుబడులు వస్తాయి. ఆధునిక వ్యవసాయంలో పశువుల సంఖ్య తగ్గిపోవడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట పైర్లు పెంచి ఎరువును వేయడం సులభమైన మార్గం.

పచ్చిరొట్ట పైర్ల రకాలు :

ఎరువు కొరకు ఒక పైరును ప్రత్యేకంగా పెంచి పూత వచ్చే దశలో భూమిలోనే కలియదున్ని తగినంత నీరు పెట్టి కుళ్ళనివ్వాలి. తదుపరి పంటవేసే సమయానికి పచ్చిరొట్ట పైరు కుళ్ళి ఎరువుగా మారి ఉండాలి. ఉదా : పిల్లిపెసర, అలసంద, జనుము, జీలుగ

పచ్చి ఆకు ఎరువు :

పచ్చిరొట్ట పంటను పండించడానికి అవకాశం లేనప్పుడు పచ్చిరొట్ట చెట్ల ఆకులు, లేత కొమ్మలు, తెచ్చి పొలంలో కలియదున్ని నీరుపెట్టి కుళ్ళనివ్వాలి. ఉదా : సుబాబుల్‌, గానుగ, జిల్లేడు, నేల తంగేడు.

పచ్చిరొట్ట పైరు త్వరగా పెరిగి ఆకులు ఎక్కువగా, కాండం మెత్తగా ఉండాలి.

లెగ్యూమ్‌ జాతి మొక్కలైతే వేర్లపైన నత్రజని బుడిపెల ద్వారా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి.

అన్ని నేలలకు, శీతోష్ణస్థితులకు, నీటి ఎద్దడిని తట్టుకోగలగాలి.

త్వరగా కుళ్ళే స్వభావం కలిగి ఉండాలి.

త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి.

పచ్చిరొట్ట పైర్ల వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకునే గుణం కలిగి ఉండాలి.

పచ్చిరొట్ట పైర్ల వల్ల లాభాలు :

సేంద్రియ పదార్థం చేర్చడం మూలంగా నేల గుల్లబారి తేమను నిలుపుకునే శక్తిని కలిగి ఉంటుంది.

నేలకు నీటిని, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి పెరిగి మొక్కల వేర్లకు గాలి, నీరు, పోషకాలు బాగా అందుతాయి.

భూమిలో ఆమ్ల, క్షార గుణాలను తగ్గిస్తుంది.

సేంద్రియ కర్బన శాతం పెరగడం వల్ల మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.

సూక్ష్మధాతులోపాలు లేకుండా అన్ని రకాల సూక్ష్మధాతువులు మొక్కకు అందుబాటులో ఉంటాయి.

పంట పంటకు మధ్యలో పచ్చిరొట్ట పైర్లు వేయడం వల్ల చీడపీడలు తగ్గుతాయి.

కలుపు మొక్కలు తగ్గి కలుపు నివారణ అవుతుంది.

పంట నాణ్యత పెరుగుతుంది.

మొక్కలకు భాస్వరం లభించడానికి సేంద్రియ పదార్ధం సహాయపడుతుంది.

భూభౌతిక లక్షణాలను మెరుగుపరుస్తూ, నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ భూసారాన్ని పెంచి పంట అధిక దిగుబడులకు తోడ్పడతాయి.

పచ్చిరొట్ట పైరు సాగుకు అనుకూల సమయం :

సాధారణంగా తొలకరి చినుకులు పడినవెంటనే జూన్‌ నెలలో రైతులు భూమిని దుక్కి చేసుకోవడానికి సరైన తేమ కలిగిన పరిస్థితుల్లో వెంటనే పచ్చిరొట్ట పైర్లు (జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, పెసర, మినుము లాంటి లెగ్యూమ్‌ జాతి పైర్లు) విత్తి, సుమారు 45-50 రోజులకు పైరు పూత పూసే సమయంలో భూమిలో బాగా కలియదున్నడం వల్ల భూసారాన్ని పెంచుకొని తరువాత వేసే పంటల్లో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు. నీటి వసతి ఉన్న పరిస్థితుల్లో రబీ పంట కోసిన పిదప ఎప్రిల్‌-మేలో జనుము, జీలుగ విత్తుకొని జూన్‌-జులైలో భూమిలో కలియదున్నవచ్చు. అదే విధంగా పత్తి, మొక్కజొన్న మరియు చెరకు పంటల్లో వరుసల మధ్య జనుము, అలసంద పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు.

పచ్చిరొట్ట పైరు భూమిలో కలియదున్నే సమయం :

పచ్చిరొట్ట పైర్లను సుమారు 45-50 రోజుల వయసులో పూత పూసే ముందు భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు కలియదున్నడం మంచిది. అసమయంలో పచ్చిరొట్ట పైరులో అధిక నత్రజని, ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. పీచుపదార్ధం, కార్బన్‌, నత్రజని నిష్పత్తి తక్కువగా ఉంటాయి. అందువల్ల త్వరగా కుళ్ళే అవకాశం ఉంది. భూమిలో తగినంత తేేమ లేకపోతే పచ్చిరొట్ట పైరును పడగొట్టాలి.

పచ్చిరొట్ట పైరును భూమిలో కలియదున్నే లోతు :

పచ్చిరొట్ట పైర్లను భూమి లోతు పొరల్లోకి వేళ్ళే విధంగా కాకుండా పైపొరల్లో కలిసే విధంగా కలియదున్నాలి. వాతావరణం పొడిగా ఉన్న ఎడల లోతుగా కలియదున్నాలి. తడిగా ఉన్న ఎడల భూమి పై పొరల్లో కలియదున్నాలి. తేలికపాటి నేలల్లో భూమి లోపలి పొరల్లో కలిసే విధంగా కలియదున్నాలి. బరువు నేలల్లో భూమిపై పొరల్లో కలిసే విధంగా కలియదున్నాలి. పచ్చిరొట్ట పైరు కలియదున్నిన పిదప తదుపరి పంటకు వేసే సమయం.

పచ్చిరొట్ట పైర్ల కలియదున్నిన పిదప బాగా కుళ్ళిన తరువాత పంట వేసుకోవాలి. పచ్చిరొట్ట పైరు కుళ్ళుటకు సుమారు 4-5 వారాలు పడుతుంది. 35-45 రోజుల తరువాత తదుపరి పంటను విత్తుకోవాలి.

పచ్చిరొట్ట పైర్లు-పోషక విలువ శాతం :

పచ్చిరొట్ట పైరు నత్రజని భాస్వరం పొటాషియం‌
జనుము 2.3 0.5 1.8
జీలుగ 3.5 0.6 1.2
అలసంద 1.7 0.3 1.3
పెసర 2.2 0.3 1.3
గ్లైరిసిడియా 2.8 0.3 4.6
కానుగ 3.3 0.4 2.4
వేప 2.8 0.3 0.4
పెద్దతురాయి 2.7 0.5 0.5
కొండచింత 2.6 0.4 0.5
వయ్యారి భామ 2.7 0.7 1.5
గుర్రపు డెక్క 3.0 0.9 0.2
జిల్లేడు 2.1 0.5 0.3

పచ్చిరొట్ట పైర్ల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

పచ్చిరొట్ట పైర్లు పెంచడానికి తగినంత నీటి సౌకర్యం, కలియ దున్నిన తరువాత అవి కుళ్ళడానికి తగినంత నీరు ఉన్నప్పుడు మాత్రమే పచ్చిరొట్ట పైర్లు ప్రయోజనకారిగా ఉంటాయి.

పచ్చిరొట్ట పైరు విత్తే ముందు ఎకరాకు 50 కిలోల సూపర్‌ఫాస్పేటు అలాగే భూమిలో కలియదున్నేటప్పుడు మరో 50 కిలోలు వేస్తే పచ్చిరొట్ట త్వరగా కుళ్ళిపోయి పోషకాలు అందించి భూసారాన్ని పెంచుతాయి. సూపర్‌ఫాస్ఫేటును వరి పైరుకు నేరుగా కాక, పచ్చిరొట్ట పైరుకు వేయడం మంచిది.

పచ్చిరొట్ట వేసి దమ్ము చేస్తున్నప్పుడు పొలంలో 5-10 సెం.మీ. మించి నీరు ఉండకూడదు. పచ్చిరొట్ట చివకడానికి 3 వారాల వ్యవధి అవసరం. 2వ వారంలో పొలంలో నీరు తీసివేస్తే త్వరగా కుళ్ళుతుంది. దమ్ము చేసిన తరువాత నాట్లు వేసే వరకు కనీసం 5 సెం.మీ నీరు ఎప్పుడూ ఉండాలి. పాతనీటికి బయటకు పంపించకపోతే విషపదార్థాలు వరి పంటకు హానికలిగిస్తాయి.

కాలువ నీరు ఆలస్యంగా విడదలవుతాయనుకున్నప్పుడు గాని, చౌడు పొలాల్లో గాని, నీరు ఎక్కువగా నిలిచే పొలాల్లో గాని జనుము పనికిరాదు. కాబట్టి జీలుగను పెంచడం చాలా మేలు.

పచ్చిరొట్ట పైర్లను పూత పూసిన తరువాత ఎక్కువ రోజులు ఉంచి కలియదున్నితే మొక్కల కాండం, కొమ్మలు బాగా ముదిరిపోయి కుళ్ళడం చాలా కష్టమవుతంది.

రైతుకు ఆదాయం రావాలంటే కొంత పంటను కోసుకొని తరువాత పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే పైర్లు (పెసర, మినుము) పెంచడం లాభదాయకం

పచ్చిరొట్ట పైర్లు సాగుచేయలేని ప్రాంతాల్లో గానుగ, సుబాబుల్‌, అవిశె, తంగేడు చెట్ల నుండి ఆకులు, లేత కొమ్మలు కత్తిరించి పచ్చిరొట్ట ఎరువుగా పొలాలకు వాడుకోవచ్చు.

పండ్ల తోటల్లో మొక్కల మధ్య జనుము, జీలుగ, వెంపల్లి, పిల్లి పెసర పైర్లును వేసుకొని పూత దశలో కలియదున్నాలి. నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం సులవైన మరియు చౌకైన పద్ధతి. పచ్చిరొట్ట పంటల్లో జీలుగు అధిక పచ్చిరొట్ట దిగుబడినిచ్చే పంట. అలాగే పప్పుజాతి పంటల్లో అలసంద పంట అధిక గింజ మరియు పచ్చిరొట్ట నిస్తుంది. పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులను ఉపయోగించి భూసారం పెంచుకొని రసాయనిక ఎరువుల వాడకాన్ని మూడోవంతుకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యవంతమైన పంటతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రభుత్వ పరంగా పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుటకు రైతులకు పచ్చిరొట్ట పంట విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నారు.

- డా|| యస్‌. జాఫర్‌ బాష, యస్‌. బాలాజి నాయక్‌,

డా|| యమ్‌. సుబ్బారావు,

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల