పన్నీరు మొక్క తమిళనాడు రాష్ట్రంలోని కింద పళిని మరియు నీలగిరి కొండ ప్రాంతాల్లో కర్ణాటక మరియు ఆంధ్రలో సాగు చేస్తున్నారు. ఈ పన్నీరు మొక్క అడుగుల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక జాతికి చెందిన గుబురు మొక్క. దీని తైలాన్ని ఖరీదైన సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. నూనె నుండి 'ప్రాక్షనల్‌ డిస్టిర్లిషన్‌' పద్ధతి ద్వారా 'రొడినాల్‌' అనబడే రసాయనం తీస్తారు. దీన్ని ఖరీదైన పరిమణాల తయారీలో ఉపయోగిస్తారు.

నేలలు :

నీరు నిలువని తేలికపాటి నుండి లోతైన ఎర్రనేలలు అనుకూలం. నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు పనికిరావు.

సాగుకు అనువైన ప్రాంతాలు :

పన్నీరు మొక్క సాగుకు మన రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలు, విశాఖపట్నం (అరకు లోయ) మరియు చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అనుకూలం. గాలిలో తేమ అధికంగా ఉండే ప్రాంతాలు అంతగా అనుకూలం కాదు.

ప్రవర్ధనం :

కొమ్మల మొక్కల ద్వారా ప్రవర్ధనం చేయాలి. నారు మొక్కల కొరకు ఎతైన నారుమళ్ళు సెప్టెంబరు, అక్టోబరులో కార్బండిజమ్‌ మరియు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందులతో నేలను శుద్ధి చేసి తయారు చేయాలి. ఏపుగా పెరిగిన ఆరోగ్యమైన మొక్కల కొమ్మల చివరిభాగాల నుండి సుమారు 10-15 సెం.మీ. పొడవైన మొక్కలను కత్తిరించి పైభాగాన 2-3 ఆకులు వదలి మిగిలిన ఆకులను తీసివేసి అడుగు భాగాన ఏటవాలుగా డి-1 శాతం కార్బండిజమ్‌ ద్రావణంలో మరియు 2000 సెం.మీ పి.యం.ఐ.బి.వి ద్రావణంలో 1.2 నిమిషాలు ముంచి రెండు కణుపులు నేలలోకి పోవునట్లు నారుమడిలో నాటుకోవాలి. ప్రతి దినం తేలికపాటి తడులివ్వాలి. సుమారు 30-40 రోజుల్లో వేళ్ళు వచ్చి మొక్కలు నాటడానికి సిద్దంగా ఉంటాయి.

నాటేకాలం :

వేళ్ళు వచ్చిన మొక్కలను నారుమళ్ళ నుండి తీసి వరుసల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 45 సెం.మీ. ఎడంతో నాటుకోవాలి. ఒక ఎకరాకు నాటడానికి సుమారు 15000 మొక్కలు అవసరం. వేళ్ళు తొడిగిన మొక్కలను అక్టోబరు నుండి డిసెంబరు వరకు నాటుకోవచ్చు. నవంబరు చివరివారం నుండి జనవరి మొదటివారం వరకు నేరుగా పొలంలోనే నాటుకోవచ్చు. అయితే నేరుగా పొలంలో నాటుకున్న ఎడల ఎక్కువగా చనిపోవడానికి అవకాశం ఉంది.

ఎరువులు :

ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు, 30 కిలోల యూరియా, 30 కిలోల సూపర్‌ఫాస్ఫేట్‌ మరియు 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఆఖరి దుక్కిలో వేయాలి. నాటిన రెండు నెలల తరువాత ఎకరాకు 30 కిలోల యూరియా వేయాలి. అలాగే ప్రతి కోత తరువాత అంతే మోతాదులో యూరియా వేయాలి.

నీటి యాజమాన్యం :

మొక్కలు నాటిన వెంటనే నీటితడి ఇవ్వాలి. నెల రోజుల వరకు ప్రతి 3 రోజులకొకసారి తేలికపాటి నీరు పెట్టాలి. తరువాత వారం రోజుల వ్యవధిలో నేల, వాతావరణాన్ని బట్టి నీరు పెట్టుకోవాలి.

కలుపు మొక్కల యాజమాన్యం :

మొక్కలు నాటిన 2-3 నెలల వరకు పంటలో ఎటువంటి కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట కోసిన ప్రతి సారి ఒక నెల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.

సస్యరక్షణ :

ఎండు తెగులు ఇది పంటకు అపార నష్టం కలిగిస్తుంది. తెగులు సోకిన ఆకులు పసుపుపచ్చగా మారి కొమ్మలు వాడి క్రమేపి మొక్క ఆకులా వాడి ఎండినట్లుగా కనిపిస్తుంది. వేరు నల్లబడిపోతుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి పారవేసి మిగతా మొక్కల మీద మరియు మొదలు చుట్టూ 0.1 శాతం కార్బండిజమ్‌ మందును లేక బినోమైల్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలి.

ఆకు ఎండు లేక లంబాడి తెగులు :

ఈ తెగులు లక్షణాలు ప్రధమంగా ఆకు అంచు భాగాన కనిపిస్తాయి. గోధుమ రంగు మచ్చలు ఆకు అంచు భాగాల్లో ఏర్పడి క్రమేపి పెద్దదిగా మారుతూ నడిమి ఈనె వైపు పయనించి తదుపరి ఆకులు పూర్తిగా కుళ్ళిపోతాయి. తెగులు నివారణకు క్యాప్టాపోల్‌ లేక క్లోరోధనోలిన్‌ 0.3 శాతం లేక బినోమైల్‌ 0.1 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు :

మొక్క లోపలి ఆకుల్లో మచ్చలు ఏర్పడి 10-15 రోజుల్లో మొక్కలు పూర్తిగా చనిపోతాయి. నివారణకు 0.3 శాతం మాంకోజెబ్‌ లేక కాప్టాన్‌ ద్రావణంతో నేలను తడపాలి.

చెద పురుగులు :

పొడి వాతావరణం ఉన్నప్పుడు చెదలు బాగా ఆశించి మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2 మి.లీ./ ఒక లీటరు నీటిలో కలిపి మొక్క చుట్టూ తడపాలి.

పంట కోత :

నాటిన 5-6 నెలల తరువాత మొదటి పంట కోతకు వస్తుంది. తదుపరి పంట కోతలు మాసానికొకసారి తీసుకోవచ్చు. పదునైన కొడవళ్ళను లేదా సికేచర్లను ఉపయోగించి మొక్క లేత భాగాలున్న కొమ్మలను కోయాలి. పంట కోసినప్పుడు మొక్కల కుదుళ్ళు కదలకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలను పూర్తిగా నేల మట్టం వరకు కోయరాదు. పంట కోసిన ప్రతి సారి 0.1 శాతం తీసి కోయాలి. మొక్కలను ద్రావణంతో పిచికారి చేసి నీటితడులివ్వాలి. ఇలా వారం వ్యవధిలో 2-3 సార్లు చేయలేని ఎడల ప్రతి కోత తరువాత కొన్ని మొక్కలు చనిపోతాయి.

నూనె తీసే విధానం :

పన్నీరు మొక్కల నుండి డిస్టిలేషన్‌ పద్ధతి ద్వారా తీస్తారు. తాజాగా కోసిన పంటను యంత్రంలో వేసి నూనెను కండెన్సర్‌ పద్ధతి ద్వారా ఏర్పరచాలి. నూనెలో నీరు మరియు ఇతర పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొని శుభ్రపరచిన నూనెను గాజు లేక అల్యూమినియం లేక స్టీల్‌ డ్రమ్ములో భద్రపరచాలి.

ఆదాయం :

పన్నీరు మొక్కల నుండి ఎకరాలకు సం|| 10-12 కిలోల నూనె తద్వారా రూ. 30 వేల నుండి 45 వేల వరకు నికరాదాయం లభిస్తుంది. కిలో నూనె ధర 5 నుండి 8 వరకు ఉంటుంది.

ఎస్‌. నాగరాజు, ప్రాజెక్ట్‌ అసిస్ట్‌, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ & ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌, హైదరాబాద్‌,

డి. రమేష్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌, జనగామ, ఫోన్‌ : 8500824812