సంపాదకీయం

యువతే నవతకు నాంది కావాలి!

ప్రపంచం మొత్తంలో అత్యధిక శాతం యువతరం కలిగిన భారతదేశం ఖచ్ఛితంగా ఇకపై ధనిక దేశమే. శక్తివంతమైన మానవ వనరులే సంపద సృష్టికి మూలకారణమని ప్రపంచం మొత్తం విశ్వసిస్తున్న నేపద్యంలో మన యువతరమే మన జాతికి అతిపెద్ద సంపద. ఎముకలు కుళ్ళిన, వయసు మళ్లిన సోమరులు ఇక అన్ని రంగాల నుండి నిష్క్రమిస్తే, నెత్తురుమండే శక్తులు నిండే యువసైనికులు హరోం హర అంటూ జయజయ ద్వానాలతో నాయకత్వ బాధ్యతలు చేపడితే అన్ని రంగాల్లో ఇక పురోగమనం మనదే. పేదరికంతో కునారిల్లుతున్న భారతదేశపు సగటు మనిషి ఇక ఈ యువతరం విజృంభణతో దేశ ప్రగతికి మూలాధారం తానేననే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా గల దేశంగా చైనా పరిగణించబడుతున్నప్పటికీ అత్యధిక యువశక్తి గల దేశంగా భారత్‌ ఇక వెలిగిపోవడం ఒక్కటే మిగిలింది. యువతరం గళమెత్తితే నవతరం సిగమెత్తితే ఈ దేశ రక్షణతో పాటు అటు రైతుగా ఇటు బాధ్యత గల పౌరునిగా, ఒక దార్శనిక విద్యాధికునిగా భవిష్యత్‌ గురించి అద్భుతమైన కలలుకని వాటిని సాధించుకోగలిగిన ధీశాలురుగా యువతరం చేతిలో జాతి భద్రత శత్రుదేశాలకు దుర్భేద్యంగా కనబడి తీరుతుంది. అణుబాంబులాంటి ఆలోచనాశక్తి, అణుకువ గలిగిన వివేచనా యుక్తి, భావి ప్రపంచం మనదేనంటూ ముందుకు సాగగల శక్తివంతమైన, కఠోరమైన, అనితర సాధ్యమైన నిర్ణయాత్మక శక్తి యువతరానిదేనని భావించక తప్పదు. స్వాతంత్రోద్యమంలో నాడు యువకులుగా ఉన్న భారతీయ సమర యోధులు అటు గాంధీగారు ప్రవచించిన శాంతి మంత్రాన్ని, ఇటు భగత్‌సింగ్‌ లాంటి మిలిటెంట్‌ పోరాటాల బాటలో పయనించిన నాటి యువతరం నేడు మళ్ళీ ఈ జాతి పునరుజ్జీవనానికి ఎంతో అవసరం.

ప్రపంచ వ్యాప్తంగా యువకులైన భారతీయ మేధావులు నింగి నేలను ఏకం చేసి ప్రపంచ భవిష్యత్‌ను తామే నిర్ణయించగల శక్తికి ఎదుగుతున్న నేపధ్యంలో వివిధ ఖండాలలో ఉత్తుంగ తరంగాలై గహనాంతర సీమల చిచ్చర పిడుగులై భారతీయ యువశక్తి ప్రపంచ నాయకత్వానికి దగ్గరవుతున్న నేపద్యంలో ఇక భవిష్యత్‌ మనదేనని మనదేశంలోని అన్ని వ్యవస్థలను, రోగ గ్రస్థమైన సమాజాన్ని సంస్కరించడంలో యువతరం ముందుకు రావాలి ముఖ్యంగా సామాజిక, ఆర్థిక రంగాల్లో తమ చైతన్య స్రవంతిని ఎల్లలు లేని విజయాలకు చేరువ చేయాలి. అందుకు అనుగుణంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీల్లో యువ నాయకత్వాలకు పెద్ద ప్రాచుర్యమే లభించిందని చెప్పవచ్చు. ఈ స్పూర్తితో దేశ చరిత్ర గతిని మార్చే శక్తి ఒక్క యువతరానికే ఉంది. నవభారత నిర్మాణంలో తమ వంతు పాత్రను నిర్వహించేందుకు పీడిత, తాడిత, బహుజన, శ్రామిక, మహిళ, మైనారిటీ, దళిత, గిరిజన, సమస్త జన సర్వహితం కోరే సమాజ నిర్మాణం కొరకు యువతలో ప్రతి ఒక్కరూ నేను సైతం ప్రపంచాగ్నికి ఓ సమిధనై పనిచేస్తానన్న దీక్షతో ముందడుగు వేయాలి. దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అన్న గురజాడ వారి ప్రవచనాన్ని అణువణువునా గుర్తించి మానవత్వపు విలువలున్న మ¬న్నత సమాజం వైపు అడుగువేయాలి. మతం మత్తు, కులం కుళ్ళుకు దూరంగా ప్రవర్తిస్తూ, మనిషన్నవాడు మాయమైపోయాడన్న ఆవేదనకు దూరమై మానవత్వం పరిఢవిల్లే మంచితనానికి, విలువలకు పెద్దపీఠ వేస్తూ పావన నవజీవన సమాజ నిర్మాణ కలలను సాకారం చేసుకోవాలి. పేర్లకి, పకీర్లకు, పుకార్లకు అతీతంగా మనలో సగమైన మహిళామ తల్లుల, మానవత్వపు మాధుర్యాలు జనజీవనంలో సుగంధాలు వెదజల్లే నవీన సమాజం కొరకు కృషి చేద్దాం. అలనాడు పెద్దలు వచించినట్లు ఉందిలే మంచి కాలం ముందుముందునా.... అందరూ సుఖపడాలి నందనందనా అనే పదాలను గుర్తుంచుకోవాలి. సర్వేజనాః సుఖినోభవంతు..