వ్యవసాయంలో శాస్త్ర సాంకేతిక రంగం దినదినాభివద్ధి చెందుతుంది. నూతన ప్రయోగాలతో పాటు, సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు తయారవుతున్నాయి. వ్యవసాయంలో పనులని సులభం చేసే నూతన పరికరమే ఈ డ్రోన్‌. డ్రోన్‌ వినేందుకు కొత్త పదం అనిపిస్తున్నా వ్యవసాయంలో దీని పాత్ర అమోగం.

వ్యవసాయ డ్రోన్‌ అనేది ఒక వైమానిక వాహనం, ఇది పంట ఉత్పత్తిని పెంచటానికి మరియు పర్యవేక్షించటానికి ఉపయోగపడుతుంది. దీనికున్న అధునాతన సెన్సార్లు మరియు డిజిటల్‌ ఇమేజ్‌ ద్వారా రైతులు తమ పొలం యొక్క చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చును. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడానికి రైతులు మరియు వ్యవసాయ నిపుణులు పారిశ్రామిక డ్రోన్ల మీదే ఆధారపడుతున్నారు.

డ్రోన్‌ యొక్క పరికరాలు - ఎలా పని చేస్తుంది :

పైలట్‌ కంట్రోలర్‌, రెక్కలు, చార్జర్‌, బ్యాటరీలు, కెమెరాలు, నాజిల్స్‌, మెమొరీ కార్డులు, టాబ్లెట్‌, క్లౌడ్‌ ప్రాసెసింగ్‌కి సమాచారం పంపే సాఫ్ట్‌ వేర్‌. ఇవి ప్రాధమిక డ్రోన్‌ పరికరాలు. మైక్రో ఎలక్ట్రో కంప్యూటర్‌ ప్రాసెసర్లు, డిజిటల్‌ రెడియోస్‌ డ్రోన్‌లోని నూతనత్వాలు. 3 లీటర్ల సామర్ధ్యం ఉండే డ్రోన్‌ లైతే 1.5 లక్ష, 5లీ. అయితే 3 లక్షలు, 20లీ. అయితే 6 లక్షలు వరకు ధర ఉంది.

డ్రోన్స్‌ పైలట్‌ కంట్రోలర్‌, మొబైల్‌ యాప్‌, స్మార్టు ఫోను లేదా కంప్యూటర్‌ ఆదేశాల ద్వారా పని చేస్తుంది. మనకు కావలసిన నిర్దిష్ట ప్రాంతంలో వైమానిక ఇమేజింగ్‌ మ్యాపింగ్‌ ద్వారా నడిపించవచ్చును.

డ్రోన్స్‌ ఉపయోగములు :

ఈ వ్యవసాయ డ్రోన్‌లు రోజుకి 50-100 ఎకరాలు పిచికారీ చేయగలదు. ఇది మామూలు పద్ధతిలో మనం పిచికారీ చేసే స్ప్రేయర్‌లతో పోలిస్తే 30 రెట్లు ఎక్కువ.

పంటల్లో పురుగులు, తెగుళ్ళ తాకిడి ఎక్కువైనప్పుడు వెంటనే పురుగు మందులు పిచికారి చేయటానికి కూలీల కొరత ఎక్కువయింది. అటువంటి సమయంలో మనకు డ్రోన్స్‌ ఎంతగానో సహాయ పడుతుంది. పది మంది చేసే 7పనిని డ్రోన్‌ ఒక్కటే చేస్తుంది

డ్రోన్లతో పిచికారీ చేయడం వల్ల నీరు, మందు, సమయం చాలా వరకు ఆదా అవుతుంది. పిచికారీ కోసం ఎక్కువ నీరు, పురుగు మందు వాడాల్సిన అవసరం లేదు.

పురుగు మందులు మరియు కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు వచ్చే విష వాయు ప్రభావం నుండి మరియు గుండెపోటు నుండి ఈ వ్యవసాయ డ్రోన్‌లు రైతులను రక్షిస్తాయి.

డ్రోన్ల వల్ల మరో సౌలభ్యం కూడా ఉంది. మొబైల్‌ యాప్‌, జీపీయస్‌ మ్యాపింగ్‌, వెబ్‌ ల్యాండ్‌ ద్వారా పొలం సర్వే నంబర్లు, విస్తీర్ణం తెలియడంతో పాటు నిర్దిష్ట పరిమాణంలో పొలంలోని మొక్కలన్నింటికి సమానంగా మందుని ఎగురుతూ చల్లుతుంది.

డ్రోన్స్‌కి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా పొలంలో కావల్సిన చోట డ్రోన్‌, కెమెరాని తిప్పుతూ ఫోటోలు, దశ్యాలను తీయవచ్చును.

డ్రోన్స్‌ వలన ప్రతికూలతలు :

డ్రోన్స్‌ని ఉపయోగించటానికి ప్రాధమిక జ్ఞానము మరియు నైపుణ్యము అవసరం ఉంటుంది.

డ్రోన్స్‌ని కొనుగోలు చేయుటకు ఖరీదైనవి.

డ్రోన్స్‌ని ఉపయోగించటానికి ప్రభుత్వం నుండి అనుమతిని పొందాలి.

ప్రతికూల వాతావరణం సంభవించినప్పుడు డ్రోన్స్‌ని ఎగరవేయటం కష్టం.

డ్రోన్‌లు ఏ కారణం చేతనైన పనిచేయకపోతే వాటిని రిపేరు చేయించుకొనే సదుపాయం ప్రస్తుతానికి రైతులకు అందుబాటులో లేదు.

డా. బి. సుధానంద్‌, ఎ. ప్రేమ్‌ కుమార్‌, వ్యవసాయాభివద్ధి ప్రయోగశాల, తిరుపతి, ఫోన్‌: 0877-2244866