కొబ్బరిని ఆశించు తెగుళ్ళలో బూజు జాతి శిలీంధ్రాల వల్ల కలిగే గానోడెర్మా (ఎర్రలక్క), నల్లమచ్చ మరియు మొవ్వు కుళ్ళు, కాయకుళ్ళు తెగుళ్ళు ముఖ్యమైనవి.

గానోడెర్మా తెగులు :

కొబ్బరి తోటలను ఆశించే తెగుళ్ళలో గానోడెర్మా తెగులు ముఖ్యమైనవి మరియు చాలా ప్రమాదకరమైనది. దీన్ని సిగతెగులు, ఎర్రలక్క తెగులు, బంకకారు తెగులు, పొట్టులక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు నల్ల నేలలు కంటే తేలిక నేలల్లోని కొబ్బరితోటల్లో ఎక్కువగా కనబడుతుంది. వ్యాప్తి కూడా తేలిక నేలల్లో విస్తారంగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండడం గమనించవచ్చు. ఈ తెగులు తీవ్రత మరియు తెగులు వ్యాప్తి నీటి ఎద్దడి అధికంగా ఉండే తోటల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రైతులు, కొబ్బరి చెట్ల వేర్లను నరికి వేయడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. కొబ్బరి వేర్లు నరికి వేయడం వల్ల వేర్లకు గాయం ఏర్పడి నేలలో ఉండే గానోడెర్మా తెగులు కలుగచేసే శిలీంధ్ర బీజాలు గాయమైన వేర్ల ద్వారా చెట్లను ఆశించడం జరుగుతుంది.

లక్షణాలు :

గానోడెర్మా తెగులు నేలలో ఉండి బూజు జాతి శిలీంధ్ర బీజాల వల్ల కొబ్బరికి సోకుతుంది. గానోడెర్మా తెగులు తీవ్రత భూమిలో నుండే వేర్లను ఆశించును. ఈ దశలో మనం తెగులును గమనించలేము. అధిక శాతం వేర్లు కుళ్ళిన తరువాత కాండంలోకి వ్యాపించి కణాలు పూర్తిగా కుళ్ళేలా చేస్తుంది. అయితే ఈ కుళ్ళు భూమిలోను, కాండంలోనూ అంతర్గతమవడం వల్ల బయటకు కనిపించదు. క్రమ క్రమంగా ఈ తెగులు వేర్ల నుండి కాండంలోకి ప్రవేశించును. ఈ దశలో కాండం మొదలు చుట్టూ ఉన్న చిన్న చిన్న పగుళ్ళ నుండి ముదురు గోధుమ రంగు నుండి తెలుపు వర్ణం కలిగిన చిక్కటి జిగురు వంటి ద్రవం కారడం గమనించవచ్చు. కాండంలోని కణ సముదాయం పూర్తిగా కుళ్ళిపోవడం వల్ల చెట్టు అవసరమైన నీరు, పోషక లవణాలను భూమి నుండి తీసుకోలేకపోతుంది. ఈ దశలో కాండం మొదలు చుట్టూ ముందుగా చిన్న చిన్న పగుళ్ళ ద్వారా జిగురు కారును.

ఈ బంక కారుట క్రమేణా పైకి వ్యాపించును. తెగులు సోకిన చెట్ల ఆకులు పసుపు వర్ణానికి మారి వడలిపోయి గోధుమ వర్ణానికి మారతాయి. కొత్త ఆకులు ఆలస్యంగా రావడం వల్ల తెగులు సోకిన చెట్టుపై ఆకుల సంఖ్య తక్కువగా ఉండడం గమనించవచ్చు. అదే విధంగా ఆకుపరిమాణం కూడా తగ్గిపోతుంది.

తెగులు సోకిన కొబ్బరి మొక్కల్లో పుష్పాల సంఖ్య బాగా తగ్గిపోవడమే కాకుండా మగ పుష్పాల సంఖ్య పెరిగి ఆడపుష్పాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. పిందెలు, కాయలు రాలడం కూడా ఈ తెగులు యొక్క లక్షణము. ఈ తెగులు ఆశించిన కొబ్బరి చెట్టు వేర్లను గమనించినట్లయితే పూర్తిగా కుళ్ళిపోయి నలుపురంగులో మారడం చూడవచ్చు. తెగులు తీవ్రతగా ఉన్న చెట్లలో సుమారు 70 శాతం వేర్లు కుళ్ళిపోయి ఉంటాయి. కొత్త వేర్లు పుట్టవు. ఏ మాత్రం అశ్రద్ద చేసినా తెగులు తీవ్రమై చెట్టు ఆకులు పసుపు వర్ణంలోకి మారి వడలి వేలాడిపోయే దశకు చేరును.

తరువాత మొవ్వు భాగం మొత్తం వడలిపోయి చెట్టు ఎండిపోతుంది. కొబ్బరి ఆకులు పూర్తిగా రాలిపోవడం వల్ల కాండం మొండిగా తయారై చెక్కిన పెన్సిల్‌ మొన మాదిరిగా కనిపిస్తుంది. తరువాత 5, 6 నెలల్లో చెట్టు చనిపోతుంది. తెగులు సోకి చివరి దశలో ఉన్న చెట్ల మొదళ్ళపై పుట్టగొడుగులు మొలుస్తాయి. ఈ పుట్టగొడుగులపై భాగం లక్క రంగులో ఉండును. కింది భాగం తెలుపు లేక బూడిద రంగులో ఉండును. వీటి నుండి కోట్ల కొలది తెగులు కలిగించే శిలీంద్రం యొక్క బీజములు బయల్పడి గాలి ద్వారా వ్యాప్తి చెందును. తడికి ఇవి మొలకెత్తి శిలీంద్రమును పెంచి దగ్గరలో ఉన్న కొబ్బరి వేర్లను తెగులుకు గురిచేయును. అందుచేతనే ఈ గానోడెర్మా తెగులను పుట్టగొడుగులు ఏర్పడే వరకు రానివ్వడం అత్యధిక ప్రమాదకరం. బలమైన గాలులు వీచేటప్పుడు ఈ గానోడెర్మా తెగులు సోకి చనిపోయిన చెట్లు, అడుగుభాగంలో విరిగి పడిపోవడం కొబ్బరితోటల్లో గమనించవచ్చు. ఈ పడిపోయిన కొబ్బరి దుంగలను గమనించినప్పుడు దుంగ లోపలి భాగం కుళ్ళిపోయి గుల్లమాదిరిగా ఉంటుంది.

నివారణ పద్ధతులు :

తోటలో గానోడెర్మా తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు ఉన్న ప్రాంతాన్ని ఒక మీటరు లోతు, 50 సెం.మీ. వెడల్పు గల గోతిని తవ్వి తెగులు సోకిన చెట్ల నుండి వేరు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తెగులు సోకిన చెట్ల వేర్ల వద్ద ఉన్న తెగులు కలుగచేసే శిలీంధ్ర బీజాలు ఆరోగ్యవంతమైన చెట్టు దగ్గరికి వెళ్ళవు.

తోటలో చనిపోయిన మరియు తెగులు ఎక్కువగా సోకిన చెట్లను వేర్లతో సహా పెలించి తగులబెట్టాలి. లేనిచో చనిపోయిన చెట్ల కాండంపై పుట్టగొడుగులు మొలిచి తెగులు వ్యాప్తిని నిరోధించుట కష్టమవుతుంది.

కొత్త మొక్కలను తిరిగి నాటేటప్పుడు చెత్త వేసి కాల్చిన గోతుల్లో బాగా చివికిన పశువుల ఎరువు, కంపోస్టు ఎరువులతో పాటు 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 1 కిలో వేపపిండి మిశ్రమంలో నింపి మొక్కను నాటవలయును.

గానోడెర్మా తెగులు కలిగించే శిలీంధ్ర బీజాలు నేలలో ఉండి తెగిన లేక దెబ్బతిన్న వేర్ల ద్వారా చెట్లకు వ్యాపిస్తుంది. కనుక కొబ్బరి చెట్ల వేర్లు నరుకుట, వేర్లు తెగునంత వరకు లోతుగ దుక్కి చేయుట పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోను చెట్ల వేర్లు నరకరాదు.

ఈ తెగులు ఎక్కువగా తేలిక నేలల్లో వస్తుంది. అందువల్ల ఈ తేలిక నేలల్లో జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పంటలు చిక్కగ పెంచి పూతకు వచ్చే దశలో భూమిలో కలియదున్నాలి.

చెట్ల మొదలు చుట్టూ రెండు మీటర్ల వ్యాసార్థం గల పళ్ళాలు చేసి, బోదెల ద్వారా ప్రతి చెట్టుకు విడివిడిగా నీరు పెట్టాలి.

నల్లమచ్చ తెగులు :

నల్లమచ్చ తెగులును నల్ల లక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ధీలావియాప్సస్‌ పేరడాక్సా అనే బూజు జాతి శిలీంధ్రము వల్ల కలుగుతుంది. ఈ తెగులు అన్ని వయస్సుల కొబ్బరి చెట్లను ఆశిస్తుంది.

లక్షణాలు :

కాండంపై పగుళ్ళ నుండి ముదురు రంగు ద్రవం కారుట ప్రధాన లక్షణాలు అలా కారిన ద్రవం నలుపు రంగులోకి మారి నల్లమచ్చగా మారుతుంది. ఈ నల్లమచ్చ కిందనున్న భాగమంతా కుళ్ళిపోతుంది. ఈ నల్లమచ్చ ప్రాంతంలో చెక్కినట్లయితే పసుపు నుండి గోధుమ వర్ణం కలిగిన ద్రవం బయటకు వస్తుంది. తెగులు బాగా అభివృద్ధి చెందితే కాండంపైన బెరడు ఊడిపోతుంది. ఈ తెగులుకు అనుకూల పరిస్థితులు తోడు అయినప్పుడు కాండం అంతా నల్లని చారలుగా కనిపించును. ఈ తెగులు ఆశించిన చెట్లలో కొబ్బరి కాయల దిగుబడి తగ్గిపోతుంది. ఈ తెగులు కలుగచేసే బూజు శిలీంధ్రం కాండంపై ఏర్పడిన గాయాల ద్వారా, పగుళ్ళ ద్వారా చెట్టులోనికి ప్రవేశించి తెగులును కలుగచేయును.

యాజమాన్య పద్ధతులు :

కొబ్బరి చెట్టు కాండంపై ఎటువంటి గాయం కలిగించరాదు.

ఈ తెగులు లక్షణాలు కాండంపై కనిపించిన వెంటనే ఆ భాగంపై ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని పేస్టుగా తయారుచేసి పూయాలి. (50 గ్రాముల పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్టు తయారగును).

ఈ తెగులు కలిగించే శిలీంధ్ర బీజాలు కూడా గానోడెర్మా తెగులు కలిగించే శిలీంధ్ర బీజాలవలనే నేలలో ఉండి తగిన వాతావరణ పరిస్థితుల్లో కాండంపై ఉన్నటువంటి సహజమైన పగుళ్ళ ద్వారా కొబ్బరిని ఆశించి తెగులును కలిగిస్తాయి. కావున నేలలో ఉన్నటువంటి శిలీంధ్ర బీజములను అరికట్టుటకు ప్రతి సంవత్సరం చెట్టుకు 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని 5 కిలోల వేపపిండితో కలిపి పాదుల్లో వేయడం లాభదాయకం.

మొవ్వుకుళ్ళు తెగులు :

మొవ్వుకుళ్ళు, కాయకుళ్ళు తెగులు వర్షాకాలంలో కొబ్బరిని ఆశించి నష్టపరుస్తాయి. వర్షాల ఆరంభంతోనే ఈ తెగులు లక్షణాలు కనిపించడానికి అవకాశం కలదు. మొవ్వుకుళ్ళు, కాయకుళ్ళు తెగులు సోకిన చెట్లు నివారణ చర్యలు తీసుకొనినచో చనిపోతాయి. ఈ తెగులు ఫైటోప్తోరో పామివోరా అనే బూజుజాతి శిలీంధ్రం కలుగచేస్తుంది. కొబ్బరిలో మొవ్వు, కాయకుళ్ళు తెగులు నారుమడిలోని చిన్న మొక్కల నుండి 25 ఏళ్ళలోపు చెట్లకు ఆశించి నష్టపరుస్తుంది. నీటిముంపునకు గురైన తోటల్లో ఇది ఎక్కువగా ఆశిస్తుంది. లంక భూమిలోని తోటల్లో వరద ముంపునకు తోటల్లో ఎక్కువ నష్టం కలిగిస్తుంది.

లక్షణాలు :

తెగులు సోకిన మొక్కల్లో మొదట మొవ్వు ఆకు, దాని పక్కనున్న రెండు లేదా మూడు ఆకులు వడలిపోతాయి. మొవ్వు నుండి బయటికొచ్చే భాగంలో ఎండుకుళ్ళు ఏర్పడుతుంది. మొవ్వు ఆకు పుసుపురంగుకు మారి ఎండిపోతుంది. తరువాత ఇతర పరాన్నజీవులు చేరి మొవ్వు పూర్తిగా కుళ్ళి, చెడువాసన వస్తుంది. ఈ ఆకును లాగితే ఊడివస్తుంది. ఈ కుళ్ళు మొవ్వు ఆకు కిందకు వ్యాపించి కొబ్బరి చెట్టులోని ఏకైక అంకురాన్ని ఆశించి తద్వారా అంకురం చనిపోయి చెట్టు చనిపోతుంది. కొన్నిసార్లు మొవ్వు కుళ్ళినప్పటికీ అంకురం బ్రతికి ఉండడంచేత కొన్నిమాసాల తరువాత కొత్త ఆకులు జనిస్తాయి. కాని అవి అంచులు మాడి కురచగా గిడసబారినట్లుగా ఉంటాయి. ఇటువంటి ఆకులు మొవ్వులోని పీచుతో నొక్కివేయబడి గుబురుగా ఉంటాయి. తగిన సమయంలో నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ఈ తెగులు కొబ్బరి తోటలకు విపరీతంగా నష్టాన్ని కల్గించును. మొవ్వుకుళ్ళు శిలీంధ్రమే నడివయసు చెట్లలో కాయకుళ్లు కలుగచేస్తుంది. కాయలపై మొదట నీటిమచ్చలుగా ఏర్పడి క్రమేపి గోధుమ రంగులోకి మారి ఒకదానితో ఒకటి కలసి పెద్దమచ్చలుగా ఏర్పడతాయి. ఈ మచ్చల దిగువనున్న పీచు, చిప్ప, కొబ్బరి పూర్తిగా కుళ్ళి నీటితో పిండి కుళ్ళు వాసన వస్తుంది.

కుళ్ళు వలన పీచులో తేమశాతం పెరిగి కాయ బరువెక్కి ముచ్చిక బలహీనపడి కాయలు రాలిపోతాయి. ముందుగా గెలలోని ఒకటి, రెండు కాయలకు తెగులు సోకి నెమ్మదిగా గెలలోని ఇతర కాయలకు, ఇతర గెలలకు వ్యాపిస్తుంది, తగిన సమయంలో నివారణ చర్యలు తీసుకొన్నచో కాయకుళ్ళు తెగులు కొబ్బరి తోటలకు విపరీతంగా నష్టాన్ని కలిగించును. మొవ్వుకుళ్ళు వర్షాలు అధికంగా ఉన్న సంవత్సరంలో కొబ్బరి మొక్కలు దగ్గరగా అంటే 8 మీ. మధ్య దూరం కంటే తక్కువగా పెట్టి నాటినప్పుడు తోటల్లో మురుగునీరు నిల్వ ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు యొక్క అభివృద్ధి, వ్యాప్తి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అధిక వర్షపాతం, గాలిలోని తేమ, సమశీతోష్ణస్థితి ఈ తెగులు అభివృద్ధి మరియు వ్యాప్తికి బాగా అనుకూలిస్తాయి. గాలిలోని తేమ 95 శాతం ఉండి, సమతల శీతోష్ణస్థితి 240 సెం. ఈ తెగులు అభివృద్ధి మరియు వ్యాప్తికి బాగా అనుకూలం.

నివారణ :

సిఫారసు చేసిన విధంగా 8 మీ. ఎడంతో కొబ్బరి మొక్కలు నాటాలి. దగ్గర దగ్గరగా నాటితే గాలిలో తేమ పెరిగి త్వరగా, సులభంగా తెగులు వ్యాప్తి చెందుతుంది.

తోటల్లో మురుగు నీరు నిల్వకుండా బయటకుపోయే ఏర్పాటు చేయాలి.

తెగులు సోకి చనిపోయిన చెట్లను తీసి కాల్చివేయాలి. మొవ్వు కుళ్ళు సోకిన మొవ్వు, దాని పక్కన కుళ్ళిన భాగం తీసివేసి తగులబెట్టాలి. గిడసబారి కురచ ఆకులున్న చెట్ల మొవ్వులోని పీచు కోసివేసి ఆకులు సులభంగా బయటికొచ్చేలా వదులు చేయాలి.

సిఫారసు చేసిన మోతాదులో పొటాష్‌ ఎరువులు క్రమం తప్పకుండా వేస్తే మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వు భాగం తడిచేలా రాగిధాతు శిలీంధ్రం మందు (కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌) లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.

బి. నీరజ, శాస్త్రవేత్త (ప్లాంట్‌ పాథాలజీ), డా|| జి. రామానందం, (ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త) మరియు అధిపతి (హార్టికల్చర్‌),

డా|| ఎన్‌.బి.వి చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్త (ఎంటమాలజీ), ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట, ఫోన్‌ : 9441474967, 7382633653