మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా ఎన్నికల కోడు ఖరీఫ్‌ రైతులకు శాపంగా మారింది. వాతావరణ సూచనలు రైతులకు శుభం కలుగుతుందని సంకేతాలు అందిస్తున్న నేపద్యంలో అందని ద్రాక్షలా రుణ సంక్షోభం రైతుల ఆశలపై నీళ్ళు చల్లుతుంది. ఒక వంక దూసుకువస్తున్న తొలకరి పలకరింపులు రైతుల ఆశలు మోసులై పులకరిస్తున్న సమయానికి కొత్త ప్రభుత్వాలు ఏర్పడక ప్రజాప్రతినిధులు లేని సమయంలో దిక్కుతోచని రీతిలో వ్యవసాయ గమ్యం అగమ్య గోచరమవుతుంది. వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయానికి సరిపడా విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే సమయం ఆసన్నమైంది.

బ్యాంకుల నుండి రుణాలు వస్తాయో లేదో తెలియని పరిస్థితుల్లో నేడు రైతాంగం ఉంది. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, గ్రామీణ వాణిజ్య బ్యాంకులు బకాయిల కోసం రైతులకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు సంబంధిత అధికారులు క్రింది స్థాయి సిబ్బందికి ఆదేశాలను జారీ చేసి రైతుల నుండి బలవంతంగా బ్యాంకు రుణాలు కట్టించుకునేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది. ఖరీఫ్‌ రైతులకు రుణమాఫీ గండం పొంచి ఉంది. బకాయిలు పడిన రుణాలను రద్దు చేసే విషయంలో ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వరుసగా ఎన్నికల ఎన్నికల కోడ్‌ రావడంతో వ్యవసాయ రుణాలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటి వరకు మొదలుపెట్టలేదు. తద్వారా త్వరలో ప్రారంభంకాన్ను ఖరీఫ్‌ పనులకు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకర్లే తేల్చి చెబుతున్నారు.

బయట అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నేడు మార్కెట్‌లో రేటు లేక రైతులు దివాళాచెందుతున్న తరుణంలో ఖరీఫ్‌ సాగు రానేవచ్చింది. మునుపటి అప్పు తీరక కొత్త అప్పులు దొరకక రైతులు దిగులు చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినట్లు కానీ, కొత్త రుణాలు ఇస్తున్నట్లుగాని ఎటువంటి ప్రకటనలు చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన చోటుచేసుకుంది. రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం పంట రుణాలు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు బకాయిలు పడి ఉంటే తిరిగి మరోసారి రుణాలు ఇవ్వడానికి వీలు లేదు. అదే సమయంలో రుణాలు రీ షెడ్యూలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఒక వేళ ఇచ్చినా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి ఎంతలేదన్నా నేల రోజుల సమయం పడుతుంది. మరో కోణంలో చూస్తే రీ షెడ్యూల్‌ చేసిన రుణ ఖాతాదారులకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రుణమాఫీ వర్తించదు. ఇటువంటి పరిస్థితులను గమనిస్తే ఖరీఫ్‌ రైతులకు ఈసారి పంట రుణాలు అందడం అసాధ్యమని స్పష్టమవుతుంది.

రైతులకు బ్యాంకర్ల నోటీసు :

రుణాలను రాబట్టేందుకు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఒక్కొక్క రైతుపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు జరిగినప్పటికీ మిగతా మొత్తం ఇప్పటికీ ఆయా బ్యాంకుల్లో బకాయిపడి ఉన్నారు. ఆ తరువాత కూడా దాదాపు 40 శాతం మంది రైతులు కొత్త రుణాలు పొంది ఉన్నారు. ప్రభుత్వ హామీతో గత ఏడాది కాలంలో ఈ మొత్తాన్ని వసూలు చేయడం నిలిపివేసిన ఆయా బ్యాంకులు ఈ ఏడాది ఎలాగైనా రాబట్టాలనే దిశగా చర్యలు ప్రారంభించాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మొదలుకొని గ్రామీణ వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు నోటీసులు జారీచేసే ప్రక్రియను ప్రారంభించాయి. రైతులు రుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

దండిగా నిధులు... తప్పని తిప్పలు :

ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్‌లో ఆరున్నర వేల కోట్లు కేటాయించింది. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఆ నిధులను సకాలంలో బ్యాంకర్లకు చేర్చలేకపోతున్నారు. రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించి లబ్దిదారుల జాబితాను సిద్దం చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదు. ఒక వేళ ప్రారంభించినా ఎంతలేదన్నా 45 రోజుల సమయం అవసరమవుతుందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే మరో రెండు నెలల పాటు కోడ్‌ అమలవుతుంది. దీంతో ప్రభుత్వ బడ్జెట్‌లోని నిధులు కేటాయించిన రైతులకు, వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు నిరుపయోగంగా మారనున్నాయి.

అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉండడంతో రైతుల సమస్యలు ఝటిలం కానున్నాయి. ఇది వరకు నాలుగు విడతలుగా రూ. 17 వేల కోట్ల రైతు రుణ బకాయిలను రద్దు చేసిన ప్రభుత్వానికి సాంకేతిక సమస్య తలెత్తడంతో రైతాంగానికి తగిన న్యాయం జరుగడం లేదు. 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని' అన్నట్లుగా ఉంది నేడు తెలంగాణ రైతుల పరిస్థితి. ఒక పక్క ఎన్నికల కోడ్‌ మరో పక్క సాంకేతిక లోపం, తరుముకొస్తున్న ఖరీఫ్‌కాలం చేతిలో చిల్లి గవ్వ లేకుండా సాగుకు ఎలా సిద్దమవ్వాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు.

ఈ ఏడాది సాగు సాగేదెలా?

ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధరలు అందకపోవడం మరో వైపు ప్రారంభం కానున్న ఖరీఫ్‌ సీజన్‌కు నిధులు సమకూర్చకపోవడం లాంటి సమస్యలతో చిన్న, సన్నకారు రైతాంగం పాతబకాయిల వసూళ్ళుతో ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో కాకుండా ఇతర చోట్ల తెచ్చిన ప్రైవేటు అప్పులు తీర్చే స్తోమతలేక బకాయిలుపడిన మొత్తాలను చెల్లించడం వారికి తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వ పరంగా వ్యవసాయ రంగానికి సహాయ సహకారాలు అందుతున్నప్పటికీ బ్యాంకు నిబంధనల ప్రకారం మిగిలి ఉన్న మొత్తాలను రాబట్టడం కొంత సమస్యగా తయారైంది. చాలా మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. రబీ సీజన్లో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యంలో 40 శాతం పంట రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. రబీలో మొత్తం రూ. 789 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా రైతులకు అందింది కేవలం రూ. 373 కోట్లు మాత్రమే. అలాగే 2018-19 ఖరీఫ్‌ సీజన్లో రుణ లక్ష్యాలు పూర్తికాలేదు. రూ. 14 వందల కోట్ల పంట రుణాలు ఇప్పించాలన్న ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యాయి. రుణమాఫీ నిధులు విడుదల చేసే సందర్భంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు రుణ లక్ష్యం రూ. 1287 కోట్లకు చేరుకోగలిగారు. ఈ రెండు సీజన్లు కలిపి రూ. 2189 కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలనుకుంటే రూ. 1681 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు రికార్డుల ద్వారా స్పష్టమవుతుంది. ప్రస్తుతం పాత బకాయిల వసూళ్ళు కొనసాగుతున్న నేపద్యంలో వచ్చే ఖరీఫ్‌ పరిస్థితి ఆందోళనగా కనిపిస్తుంది. డిఫాల్టర్లుగా దృవీకరాంచిన వారిలో దాదాపు 90 శాతం రైతులు ఆ మొత్తాలను చెల్లించలేని స్థితిలో ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే 2019-20 వ్యవసాయ సంవత్సరం త్వరలో ప్రారంభంకానున్న ఖరీఫ్‌లో ప్రభుత్వం ఎంచుకునే రుణ లక్ష్యాలు 40 శాతం కూడా మించలేని పరిస్థితి నేడు నెలకొని ఉంది. ఇటువంటి తరుణంలో రైతు ఖరీఫ్‌కు సిద్ధమవడం కష్టంగానే మారనుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి, ఫోన్‌ : 9949285691