గత ఐదేళ్ళుగా భారత రైతాంగం చేసిన పోరాటాలు, ఉద్యమాల వెల్లువలు, ''లాంగ్‌మార్చ్‌'' ప్రతిధ్వనులు భారతదేశపు రాజకీయాల్లో సమూలమైన మార్పులకు, పాలకుల దృక్పదాల నవీకరణకు, రైతు రాజ్య సాధికారత నినాదాలకు మే 23న సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చే తీర్పు ఉపకరించనుందా? అంటే సమాధానం స్పష్టంగా చెప్పలేము. గత 6 దశాబ్దాలుగా ఎన్నికలు రావడం, సానుకూల నినాదాలు ప్రస్తావించడం, మభ్యపెట్టి అధికారం పొందిన తరువాత వాగ్దానాలకు జెల్లకొట్టి పలాయనవాదం చిత్తగించడం మనం చూస్తూనే ఉన్నాం. కార్పోరేట్‌ కంపెనీల పడగనీడకు ప్రభుత్వాలు జారిపోవడంతో స్వాతంత్రోద్యమంలోనూ ఆ తరువాత హరిత విప్లవంలోనూ ప్రముఖపాత్ర వహించిన వ్యవసాయ రంగం, రైతులు దేశ ఆహార భద్రతకు చేసిన త్యాగాలు వృధా అయిపోయాయి. దళారులు, పరాన్నభుక్కులు, ప్రజావ్యతిరేకులు పాలకులుగా మారి మారీచుల్లా ఆహారాన్ని సృష్టిస్తున్న అన్నదాతలను అణచివేసి తృతీయ పౌరులుగా మార్చివేసిన నేపధ్యంలో మళ్ళీ ఒకసారి మనం చరిత్రగతిలోకి పయనిద్దాం.

మహాత్మా గాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, సర్థార్‌ వల్లభాయ్‌పటేల్‌ వంటి మ¬న్నతుల సారధ్యంలో నిర్వహించిన మ¬న్నత స్వాతంత్య్ర పోరాటంలోనూ అనేక ఉద్యమాల్లోనూ కుల, మత, జాతి రహితంగా రైతాంగం మొత్తం పాల్గొన్నది. విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి పిలుపులకు స్పందించి వేలాది మంది రైతులు తమ శక్తి వంచన మేరకు పోరాటం చేసి జైళ్ళకు వెళ్ళిన సంఘటనలు కోకొల్లలు. ఆ సమయంలోనే నిజాం నవాబుకు వ్యతిరేకంగా, రజాకారులపై తిరుగుబాటు చేసి 4 వేల మంది తెలంగాణ సాయుదపోరాట రైతాంగ యోధులు అశువులు బాశారు. మహారాష్ట్రలోని వర్లి ప్రాంతంలో గోదావరి పరులేకర్‌ నాయకత్వంలో గిరిజన రైతాంగం వీరోచిత పోరాటం జరిపింది. స్వాతంత్య్ర ఉద్యమంతోపాటు అనంతరం ఆహారందొరకక డొక్కల కరువుతో మరణించిన అనేకవేల మంది భారతీయుల హృదయవిదారక సంఘటనలు చూసి చలించిన నాటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పిలుపు మేరకు నిర్వహించిన మొదటి సస్య విప్లవంలో రైతుల పాత్రే ప్రధానమైనది.

అంతర్జాతీయ యవనికపై, భారత గణతంత్ర సామ్రాజ్యం ఆకలి కేకల ముందు నిలబడలేదని పతనం తధ్యమని హేళన చేస్తూ, మన స్వాతంత్య్రం బ్రతికి బట్టకట్టదని ఊహించిన వారందరివి పగటి కలలని, తమ కృషి ద్వారా, అజేయమైన పట్టుదల ద్వారా భారత రైతాంగం నిరూపించుకుంది. పియల్‌-480 నిబంధనల కింద అవమానకర రీతిలో అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్న పరిస్థితి నుండి బయటపడి ఒక్క అర్థ దశాబ్దకాలంలోనే లక్షలాది టన్నుల గోధుమలను ఉత్పత్తి చేసి భారత రైతాంగ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పి, మువ్వన్నెల జెండా గౌరవాన్ని సమూలంగా నిలబెట్టిందీ దేశ భక్తియుత భారత రైతాంగమే. నేడు దేశ భక్తి అని గొప్పలు చెప్పుకునే నేతలకు ఆరోజే చేతలతో దేశభక్తిని నిరూపించుకుంది భారత రైతాంగం మరియు నాటి సమున్నత నాయకత్వం.

ఇక అసలు విషయానికొస్తే హరిత విప్లవ మూలాలు, లక్ష్యాలు అది నిర్వహించిన తీరును భారత జాతి ముందు మరోసారి సాక్ష్యాధారాలతో ఉంచేందుకు ఈ వ్యాసం ఉద్ధేశింపబడింది. 1960 దశకంలో అమెరికా శాస్త్రవేత్త డా|| విలియం గాండే రూపొందించిన ఈ హరిత విప్లవ భావన భారత సమాజపు రూపురేఖలను, సామాజిక రాజకీయ మార్పులకు ఎలా కారణమైందో మనం గమనిద్దాం... ఏ దేశమైనా దాని ప్రతిష్టను కొలిచేందుకు మనం గమనించేది దాని రాజకీయ, ఆర్థిక, సామాజిక, సుస్థిరత ప్రామాణ్యాలను బట్టే. 200 ఏళ్ళ అణచివేతలో దేశంలోని వనరులన్నింటినీ వలస ప్రభుత్వం దొంగిలించుకుపోగా, వారి సవతి ప్రేమకు తీవ్రంగా నష్టపోయింది, బలైంది వ్యవసాయ రంగం, రైతులే. ప్రపంచ జనాభాలో అగ్ర దేశంగా ఉన్న చైనా తరువాతి స్థానంలో భారత్‌ అత్యంత మానవ వనరులు కలిగిన, సారవంతమైన భూమిని కలిగిన, అనేక పుణ్యనదులతో పునీతమైన దేశం భారతదేశం.

ఈ దేశపు సుగంధ భరితమైన, సారవంతమైన భూములను సాగులోకి తెచ్చి జన్మభూమి రుణం తీర్చుకున్న మన వారసత్వ వ్యవసాయ పద్ధతులు మన జాతి జీవనాన్ని ఆ నాటి నుండి పరిపుష్టంగా ఉంచుతున్నాయి. తెల్లవాడి పాలనలో కుమిలిపోయిన, కునారిల్లిన వ్యవసాయానికి జవం, జీవం కల్పించే ప్రణాళికా శైలిని రచించి నూతన సస్య విప్లవానికి శ్రీకారం చుట్టింది. అప్పటి స్వాతంత్య్ర సమరయోదులతో కూడిన భారత ప్రభుత్వం, జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన డా|| ఎమ్‌.ఎస్‌. స్వామినాధన్‌ ఆధ్యర్యంలో ఈ కింది ప్రదానాంశాలను పొందుపరచారు.

హరితవిప్లవ ప్రేరణకు భారత్‌కు సహకరించింది ఆనాటి అమెరికా శాస్త్రవేత్త సర్‌ నార్మన్‌ బోర్లాగ్‌, ఆయనను ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా, గోధుమల ఉత్పత్తిలో అగ్రగణ్యుడిగా కీర్తిస్తారు. వీరితోపాటు మరో తెలుగుతేజం హరిత విప్లవంలో ప్రముఖపాత్రను పోషించారు. ఆయనే డా|| మంగిన వెంకటేశ్వరరావు. గోదావరి జిల్లాకు చెందిన ఈ తెలుగుతేజం సర్‌ నార్మన్‌ బోర్లాగ్‌కు ప్రియశిష్యుడు. గోధుమల దిగుబడుల పెంపునకు తీవ్రంగా శ్రమిస్తున్న అప్పటి ప్రధాని నెహ్రూ సూచనల మేరకు 15 గ్రా. గోధుమ విత్తనాలు సర్‌ నార్మన్‌ బోర్లాగ్‌ నుండి సేకరించి వాటిని భారతదేశంలో లక్షల టన్నుల ఉత్పత్తికి వినియోగించి డా|| రావ్‌ ధన్యజీవులయ్యారు.

అనంతరం భారత ప్రభుత్వం డా|| ఎమ్‌.వి.రావు సేవలను గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రధానం చేసింది. అనంతరం ఆయన పంత్‌నగర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు ఉపకులపతిగా ఉండి భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక సేవలను అందించారు. డా|| రావుతో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు మొదటి సస్యవిప్లవ సందర్భంగా ఎన్నో పరిశోధనలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రైతుల సహకారంతో మొదటి సస్య విప్లవంలో ధృవతారలుగా వెలుగొందారు. అవి

1. అధిక దిగుబడి వంగడాల వినియోగం.

2. రసాయణిక ఎరవుల, క్రిమిసంహారక మందుల వినియోగం ద్వారా ఉత్పత్తిని పెంచడం.

3. నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి ద్వారా బీడు భూములు సైతం సాగులోకి తెచ్చి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం.

4. వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ ఆధునిక శాస్త్రీయ పద్దతులను అమలు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదనలు చేయడం

ఈ నాలుగు ప్రదానాంశాలతో పాటు భూసంస్కరణల అమలు, గ్రామీణ విద్యుదీకరణ, విద్యుత్‌ పంపుసెట్ల అభివృద్ధి, మార్కెటింగ్‌ సదుపాయాల కల్పన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపన మొదలైన అంశాలు కూడా హరిత విప్లవంలోని భాగాలే.

మొదటి హరిత విప్లవం ద్వారా ఒక్కసారి దేశ వ్యవసాయ ముఖచిత్రం మారిపోవడం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం భారత్‌ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో గగన తలానికి చేర్చినట్లయింది. హరిత విప్లవం మొదట నీటి పారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉన్న పంజాబ్‌, హర్యాన, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే అధిక ప్రయోజనాలు కలిగాయి. గోధుమ పంట ఉత్పత్తి రెండింతలైంది. గోధుమతోపాటు వరి, జొన్న, మొక్కజొన్న పంటలు కూడా లబ్ధిపొందాయి. ఆ తరువాత సతత హరితం పేరిట మిగిలిన రాష్ట్రాలకు, ఇతర ప్రధాన పంటలకు విస్తరించడం జరిగింది. మొదటి హరిత విప్లవ ఫలితాలతో స్ఫూర్తి పొందిన స్వామినాధన్‌ పిలుపుమేరకు దేశంలోని ప్రజలందరికీ మరింత ఆహార భద్రతను కల్పించే దిశలో వాటి ఉత్పత్తి 2020 మిలియన్‌ టన్నులకు రెట్టింపు చేసే లక్ష్యంతో నిరంతర హరిత విప్లవానికి పిలుపునిచ్చారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్ధకు ప్రణాళికాబద్ధంగా పరిపుష్టత చేకూర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పంచవర్ష ప్రణాళికలు దేశ గతిని మార్చివేశాయి. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి దశ - దిశను చూపిస్తూ ప్రవేశపెట్టిన అంశాలను ఇప్పుడు మనం గమనిద్దాం..

1. నీటి పారుదల సౌకర్యాలను రెట్టింపు చేయడం

2. మృత్తికా పరిరక్షణ, క్రమక్షయానికి గురైన నేలల అభివృద్ధి

3. వర్షపు నీటి నిల్వ, భూగర్భజాలాల అభివృద్ధి

4. రైతులకు పరపతి సౌకర్యాలను సకాలంలో అందించడం

5. పరిశోధనా ఫలితాలను ఎప్పటికప్పుడు రైతుల వద్దకు తీసుకువెళ్ళడం (ల్యాబ్‌ టు లాండ్‌)

. వ్యవసాయ విస్తరణ పథకాలను విస్తృతంగా అమలు చేయడం

ప్రణాళికాబద్ధంగా వ్యవసాయాన్ని ఒక వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళడం, తద్వారా ఆహార భద్రత, గ్రామీణ ఉపాది కల్పనా లక్ష్యాలతో ముందుకు నడిపిస్తున్న సమయంలోనే వ్యవసాయ అనుబంధ రంగాల తోడు ప్రధాన రంగానికి అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం వాటి అభివృద్ధికి కూడా హరిత విప్లవంలాగానే ఒక ఉద్యమ రూపంలో కార్యాచరణ ప్రారంభించింది. దేశంలోని ఆహార ఉత్పత్తి పంటలకు ప్రోత్సాహం లభించినట్లుగానే వివిధ రంగాల్లో విప్లవ కార్యాచరణను ముందుకు తీసుకువచ్చింది. సగటు భారతీయుని ఆహారపు కంచంలో ప్రముఖ పాత్ర వహించే నూనెలు, పాలు, చేపలు, కోడిగుడ్లు, మాంసం, రొయ్యల ఉత్పత్తికి వేరువేరుగా ప్రణాళికలు రచించింది. అలాగే ఉత్పత్తులు పెంచేందుకు చేసిన ప్రయత్నాలను వాటి తీరుతెన్నులను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పసుపు పచ్చ విప్లవం (నూనె గింజల ఉత్పత్తి) :

నూనె గింజల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, విదేశాల నుండి దిగుమతులను తగ్గించి, స్వదేశీ వంటనూనెలతో నాణ్యమైన ఆహార భద్రతను కల్పించడానికి తీసుకువచ్చిన ఒక బృహత్తరమైన ఉద్యమ కార్యక్రమం. వివిధ నూనె గింజల పంటల్లో ఉత్పత్తిని రెట్టింపుచేయడానికి పరిశోధన ద్వారా ప్రవేశపెట్టిన నూనెగింజల సాగు ద్వారా 1996-97లో 12.6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి ఉంటే దాన్ని 1987-88 నాటికి 24.4 మెట్రిక్‌ టన్నులకు ఉత్పత్తిని పెంచారు. పిలిప్పియన్స్‌ దేశంలో సంభవించిన ప్రజావిప్లవం సందర్భంగా వినియోగించిన శాంతియుత పసుపు పచ్చ రిబ్బన్ల స్పూర్తితో దీన్ని పసుపు పచ్చ విప్లవంగా నామకరణం చేశారు.

పాత వ్యవసాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా ఆధునిక వ్యవసాయాన్ని నిర్వహిస్తూ అనేక మంది యువతరం వ్యవసాయ విద్య అభ్యసించిన రైతుల రంగ ప్రవేశంతో పంజాబ్‌ రాష్ట్రంలో సస్యవిప్లవ సమయంలో వచ్చిన మార్పుకు ప్రతిరూపంగా నూనె గింజల విత్తనాల సాగు ప్రాచుర్యంలోకి వచ్చింది. నూనె గింజల ఉత్పత్తి పెంపుకు స్పష్టమైన లక్ష్యంతో భారత ప్రభుత్వం అనేకచోట్ల ఐ.సి.ఎ.ఆర్‌. ఆధ్వర్యంలో నూనెగింజల పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన నూనెగింజల పరిశోధనా కేంద్రం విశిష్టమైన సేవలను అందిస్తుంది. భారతదేశంలో సాంప్రదాయక నూనెగింజల స్థానంలో థాయిలాండ్‌, మలేషియా నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌ పామ్‌ తోటలసాగు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత సంపాదించుకుంది. వేరుశనగ, కొబ్బరి, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటలకు భిన్నంగా ఆయిల్‌ పామ్‌ తోటలు ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి ఆయిల్‌ పామ్‌ పరిశోధనా కేంద్రం స్పూర్తితో ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా కోకో విస్తరించడం ఇది నూతన పరిణామం.

శ్వేత విప్లవం లేక ఆపరేషన్‌ ఫ్లడ్‌ :

భారత వ్యవసాయ రంగ గమనాన్ని మలుపు తిప్పిన మరో మహావిప్లవం ''పాలవెల్లువ''. 1970లో నేషనల్‌ డయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రారంభించిన ఈ పథకం ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టుగా ప్రసిద్ధిపొందింది. అంతకుముందు పాలు - పాలఉత్పత్తుల కొరతను ఎదుర్కొన్న మన దేశం ఈ రంగంలో పాల వెల్లువ ద్వారా స్వయం సమృద్ధిని సాధించింది. అంతే కాదు 1998 నాటికి ప్రపంచంలో పాల ఉత్పత్తిలో అగ్రస్థానాన్ని అధిరోహిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలను వెనుకకు తోసి ప్రపంచ అధిపతిగా భారత్‌ ముందుకు వచ్చింది. 30 సంవత్సరాల్లో పాల ఉత్పత్తిని రెట్టింపు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద స్వయం సమృద్ధి చెందిన దేశంగా పాలు - పాల ఉత్పత్తుల రంగంలో సంచలనం సృష్టించింది. ఎన్‌.డి.డి.బి. నేతృత్వంలో, వ్యూహాత్మక నాయకత్వ పాత్రతో రైతులకు ఉపయోగపడే స్వయం సమృద్ధి చేందేందుకు వారి హస్తాలను బలోపేతం చేసేందుకు సహకారం లభించింది. ఇదంతా కూడా శ్వేత విప్లవం వలనే సాధ్యమైనట్లు రుజువవుతుంది.

దేశంలోని సహకార వ్యవస్థకు చిరస్థాయి సూచికగా నిలిచిన అమూల్‌ తరహా పాల ఉత్పత్తి సంచలనం సృష్టించింది. పాల వెల్లువను ముందుకు తీసుకువెళ్ళడంలో అమూల్‌ కంపెనీ అధినేత వర్గీస్‌ కురియన్‌ చేసిన కృషి అమోఘమైనది. ఆయన కృషికి మెచ్చి భారత ప్రభుత్వం అప్పటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి డా|| కురియన్‌కు పాలవెల్లువ బాధ్యతలను సంపూర్ణంగా అప్పగించి ప్రోత్సహించారు. తనదైన శైలి, నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ అవగాహన, మెరుగైన ఆచరణతో భారత్‌ను పాలరంగంలో అగ్రస్థానంలో ఉంచి పాల విప్లవ పితామహుడిగా కురియన్‌ నిలిచిపోయారు.

జాతీయ పాల గ్రిడ్‌ను ఏర్పాటు చేయడం, పాల ఉత్పత్తిదారులైన రైతులను, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశంలోని 700 పట్టణాలు, నగరాలను అనుసంధానం చేసి, గ్రామస్థాయి వరకు సహకార రంగాన్ని పటిష్టం చేసిన ఘనత డా|| కురియన్‌దే. గ్రామస్థాయిలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వినూత్నమైన సహకార ఉద్యమాన్ని నిర్మించి, ఆధునిక పరిజ్ఞానంతో పాలవెల్లువను ఉరకలెత్తించిన ఘనత కూడా డా|| కురియన్‌దే.

భారతదేశంలో 3 దఫాలుగా ఆచరణలోకి వచ్చిన పాలవెల్లువ మొదటి దశ 1970-80 మధ్యలో వినూత్నమైన రీతిలో ముందడుగు వేసింది. పాల నుండి తీసిన పౌడర్‌, వెన్న, యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటీకి విస్తరించి భారతదేశపు పాడి పరిశ్రమ వైభవానికి పెట్టని కోటగా మారింది. ప్రపంచ ఆహార పథకం ద్వారా మానవాళికి పౌష్టికాహార ప్రధాతగా భారత్‌ సంచలనాలకు నిలయమైంది. ముఖ్యంగా ఇక్కడి పాల ఉత్పత్తులు ఐరోపా దేశాల ఆర్థిక సహకారంతో ప్రపంచస్థాయి ఖ్యాతిని పొందాయి. ఢిల్లీ, ముంబై, కలకత్త్తా, చెన్నై, మహానగరాల్లో మదర్‌ డయిరీల స్థాపన ద్వారా పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు రంగం సిద్ధమైంది. 1975లోనే పూర్తికావలసిన మొదటి దఫా పాలవెల్లువ పథకం డయిరీ రంగాన్ని మరింత పరిపుష్టం చేసే విధంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు మేలు జాతి పశువులను సరఫరా చేయడం ద్వారా ముందుకు కొనసాగింది.

పాలవెల్లువ రెండవ దశ :

1981 నుండి 1985 వరకు కొనసాగిన ఈ రెండవ దశ పాలవెల్లువలో పాల శీతల కేంద్రాలు 18 నుండి 136గా విస్తరించాయి. పట్టణ ప్రాంతాల్లో 290 మార్కెటింగ్‌ కేంద్రాలు వెలిశాయి. 1985లో ముగిసిన రెండవ దశ పాలవెల్లువలో భాగంగా దేశంలోని 43 వేల గ్రామాల్లో సహకార పాల ఉత్పత్తి సొసైటీలు ఏర్పడ్డాయి. వీటిలో 4 కోట్ల 250 లక్షల పాల ఉత్పత్తిదారులు దీనిలో సభ్యులు. పాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు వినియోగించుకునేందుకు జాతీయ ఉత్పత్తి కేంద్రాల్లో పాలపౌడర్‌ ఉత్పత్తి 22 వేల టన్నుల నుండి ఒక లక్షా 40 వేల టన్నులకు ఎదిగింది. పాలవెల్లువలో భాగంగా ప్రారంభమైన పాల డయిరీలు గణనీయంగా యూరోపియన్‌ ఆర్థిక సంఘం, ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఆసరాతో సమృద్ధి దిశగా సాగింది. అంతేకాకుండా పాల ఉత్పత్తిదారుల నుండి సరఫరా అయ్యే పాలు అనేక మిలియన్‌ లీటర్లకు చేరుకున్నాయి. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం పాలవెల్లువలో స్వర్గీయ కాకాని వెంకటరత్నం నేతృత్వంలో అపూర్వంగా దూసుకుపోయింది. అనేక మందికి ఉపాధి లభించింది.

పాలవెల్లువ మూడవ దశ :

1985 నుండి 1996 వరకు కొనసాగిన మూడవ దశ పాలవెల్లువ కార్యక్రమం పూర్తిగా మౌలిక సౌకర్యాల కల్పనకే సరిపోయింది. పాడి పశువుల ఆరోగ్యం కాపాడేందుకు దేశవ్యాప్తంగా పశు వైద్య కేంద్రాలు, కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలు, వీర్యం ఉత్పత్తి కేంద్రాలు ఈ సమయంలోనే నెలకొల్పబడ్డాయి అంతేకాకుండా పాల ఉత్పత్తికి తోడ్పడే మెరుగైన దాణా ఉత్పత్తి కొత్త కొత్త పశుగ్రాసాల పరిచయం ప్రారంభమైంది. ఒక పటిష్టమైన పశువైద్య విద్యావ్యవస్థ ఏర్పడడంతో పాటు సహకార రంగంలో పాల ఉత్పత్తి గణనీయంగా మోసులెత్తింది. అప్పటికే ఏర్పడి ఉన్న 43 వేల సొసైటీలతోపాటు మరో 30 వేల సహకార పాల ఉత్పత్తి సొసైటీలు ఏర్పడ్డాయి. మిల్క్‌షెడ్‌ల నిర్వహణలో మహిళా సహకార సొసైటీలు ప్రవేశించి పాల ఉద్యమాన్ని విస్తృతం చేయడంతో పాటు గణనీయంగా పాలు, పాల ఉత్పత్తుల పెంపునకు తోడ్పడింది. దానితోపాటు పరిశోధన - అభివృద్ధిపై జరిగిన కృషిలో పశువుల ఆరోగ్యం, పోషకాల పెంపునకు జరిపిన కృషి అభినందనీయం.

1996 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తొలిదశలో అనేక వర్ధమాన పారిశ్రామిక వేత్తలు డయిరీ రంగంలో ప్రవేశించి ఈ రంగానికి కొత్త వెలుగును రంగరించారు. దేశంలోనూ, ప్రపంచంలోనూ పాలు - పాలపదార్థాల వినియోగానికి ఆదరణ పెరగడంతో పాడిపరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు కూడా ఆచరణాత్మకమైన పథకాల ద్వారా మేలు జాతి పశువులను, పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందచేయడం, ఇబ్బడి ముబ్బడిగా పశువైద్యశాలలను, విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు గణనీయంగా పాలసేకరణ ధరలను పెంచి రైతాంగానికి తోడ్పాటునిస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలో పాలవెల్లువను ఇంకా ఉధృతంగా కొనసాగించే కార్యక్రమంలో భాగంగా లీటరు పాల సేకరణ ధరకు మద్దతుగా నాలుగు రూపాయలను పెంచాలని ఎన్‌.డి.డి.బి. సిఫార్సు చేయడం, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు వాటిని అమలు చేయడం వల్ల పాలవెల్లువ స్ఫూర్తి ఉదృతమైంది.

నీలి విప్లవం :

వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరో కీలకమైన రంగం మత్స్య పరిశ్రమ. ఈ పరిశ్రమ అభివృద్ధికి నీలి విప్లవంగా నామకరణం జరిపి నీలి క్రాంతి మిషన్‌గా అనేక పథకాలను రూపొందించి దాని దశ-దిశను మార్చి సుసంపన్న భారత్‌కు దారులు ఏర్పాటు చేస్తున్నారు. అనేక శతాబ్దాలుగా సముద్రాన్ని, నదులను, తటాకాలను నమ్ముకొని జీవిస్తున్న కోట్లాది మంది మత్స్య రైతులకు ఉపాదిని, భరోసాను కల్పిస్తూ నీలివిప్లవం దేశంలో పెనుసంచలనాలను సృష్టిస్తుంది. దేశ జనులకు కావలసిన ఆహార భద్రతను కల్పిస్తూనే పోషకాహార బాధ్యతను కూడా ఈ రంగం తన నెత్తిమీద వేసుకున్నది. జాతీయాదాయంలో గణనీయమైన వాటా ఈ రంగానిదే. జలపుష్పాల ద్వారా సంపదను సృష్టిస్తూనే స్వావలంబన దిశగా సాగేందుకు ఉద్ధేశించింది ఈ నీలివిప్లవం.

సమీకృత మత్స్య అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగపడే వ్యూహాలను తయారుచేసి, మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు, జీవ నియంత్రణ, పర్యావరణానికి సంబంధించిన విషయాల పరిశీలనకు నీలివిప్లవ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.

2020 నాటికి మత్స్య ఉత్పత్తులను మూడు రెట్లకు పెంచడం.

మత్స్య రంగాన్ని ఆధునిక పరిశ్రమగా రూపుదిద్దడం.

మత్స్య రైతుల ఆదాయాన్ని ప్రత్యేక శ్రద్ధతో మూడు రెట్లు పెంపుదల చేయడం, వారికి ఆధునిక చేపల వేట, యాంత్రీకరణ నైపుణ్యాన్ని కల్పించడం, వాణిజ్యపరంగా వ్యూహరచనలో నిమగ్నం చేయడం ఈ విప్లవ కర్తవ్యాలు.

2020 నాటికి మత్స్య పరిశ్రమ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మూడురెట్లు పెంచడం, ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు ద్వారా మార్కెటింగ్‌ వ్యవస్థను బలపరచడం కర్తవ్యాలు

2015 నుండి 2020 వరకు ఈ నీలివిప్లవ లక్ష్యాలను సాధించవలసి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ, పశు సంవర్థక, డయిరీ, మత్స్య శాఖల పరిధిలోని కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి వాటిని జాతీయ మత్స్య అభివృద్ది బోర్డుకు అనుసంధానం చేయడం ఈ నీలివిప్లవ కార్యక్రమంలో ఒక ప్రధానమైన భాగం.

ఈ పథకం కింద లబ్దిదారులకు అందే సేవలు ఈవిధంగా ఉంటాయి.

జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డిబి), దాని కార్యకలాపాలు అనుసంధానించబడినవి.

మంచినీటిలో చేపల పెంపకం, మరియు ఆక్వా కల్చర్‌

సముద్రంలో చేపల వేట, మౌలిక సౌకర్యాల కల్పన, పోస్టు హార్వెస్టు పనుల నిర్వహణ

మత్స్య ఉత్పత్తుల పెంపకానికి కావలసిన సమాచార సేకరణ, భౌగోళిక సమాచారం అందుబాటులో ఉంచడం

మత్స్య రంగానికి అందుబాటులో ఉన్న వ్యవస్ధల తోడ్పాటును నిర్ధారించడం

ఆర్థిక అవసరాలను గుర్తించడం, నియంత్రించడం, పర్యవేక్షంచడంతో పాటు అవసరమైనప్పుడు జోక్యం చేసుకునే వ్యవస్థ ఏర్పాటు

మత్స్య అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి ఉద్ధేశించిన జాతీయ పథకాల అమలు. సముద్రంలో చేపల వేట విరామ సమయంలో మత్యకారులకు వేతన భృతి అమల్లోకి తెచ్చారు.

రజత విప్లవం :

వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరో కీలకమైన రంగం కోళ్ళ పరిశ్రమ. ఈ పరిశ్రమ అభివృద్ధికి దీన్ని రజత విప్లవంగా ముందుకు తీసుకువచ్చారు. కోళ్ళ పెంపకం అనేది మన అతి పురాతనమైన వ్యవసాయ ప్రక్రియలో అతి ముఖ్యమైన భాగం. కుటీర పరిశ్రమగా ప్రారంభమై కోళ్లు, టర్కీ, బాతులు, ఇతర పక్షి జాతుల పెంపకం దీనిలో ప్రధానమైంది. మానవుల మాంస అవసరాలకు, పౌష్టికాహారంగా పిలుచుకునే కోడిగుడ్ల ఉత్పత్తికి నిలయమైంది కోళ్ళ రంగం. గ్రామీణ స్థాయిలో సులభంగా ఉపాది పొందేందుకు ప్రారంభమైన కోళ్ళ పెంపకం నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పరిశ్రమగా రూపొందింది. తక్కువ పెట్టుబడితో ప్రారంభమై సులభంగా లాభాలను ఆర్జించి పెట్టే స్థాయి నుండి కార్పోరేట్‌ స్థాయి వరకు ఎదిగిన ఈ పరిశ్రమ దాదాపు స్వయం ప్రకాశితమే.

తమకు తాముగా పెట్టుబడులు పెట్టుకొని, మార్కెట్‌ సృష్టించుకొని, కావలసిన పరిజ్ఞానాన్ని స్వానుభవంతో సంపాదించి, స్వావలంబన దిశగా పయనిస్తున్న ఈ పరిశ్రమ చరిత్రను పరిశీలిస్తే వ్యవసాయం దండగని నిరాశపడే వారు కోళ్ళ పరిశ్రమ విజయాలను గమనిస్తే ఆ భావాన్ని వదులుకొని వ్యవసాయం పండుగ అని నిరూపించుకునే అవకాశమున్న అద్భుతమైన పరిశ్రమగా అభినందించక తప్పదు. స్వర్గీయ పద్మశ్రీ డా. బి.వి. రావు లాంటి మ¬న్నతులు ఈ రంగానికి తమ స్వయం ప్రతిభతో పరిపుష్టి కల్పించి పౌల్ట్రీ పితామహునిగా గణతికెక్కారు.

కోళ్ళ పెంపకం ప్రయోజనాలు :

తక్కువ పెట్టుబడితో ఎక్కువ అదనపు లాభాలను ఆర్జిస్తూ గ్రామీణ ఉపాది రంగంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న రంగం.

సాంకేతికంగా అనుభవాలతోనే పాఠాలు నేర్చుకొని పురోగమిస్తున్న వారే ఈ రంగంలో ఎక్కువ మంది ఉన్నారు.

అత్యధికమంది వినియోగదారులచే ఆదరించబడే కోళ్ళ పరిశ్రమ రంగంలో అనేకమైన దీర్ఘకాలిక సమస్యలున్నప్పటికీ కోట్లాది మందికి పోషకాహార లభ్యత అందిస్తున్నందున ఇది సర్వకాల సర్వావస్థలందు మనుగడ సాగించే రంగం.

ఫ్యాక్టరీ తరహా యాజమాన్యంతో కోళ్ళను పెంచడం పర్యావరణ సమస్యలు తెచ్చిపెడుతుందని, ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయనే భయాలు ఉన్నప్పటికీ ఇది అనేక కారణాల వల్ల సజీవమైన రంగం.

ప్రపంచవ్యాప్తంగా మనవజాతి మనుగడ విస్తరించడం, వారి ఆహార అవసరాలు ముఖ్యంగా పోషకాహార అవసరాలు మితిమీరి పోవడంతో కోళ్ళ పరిశ్రమ ఆవశ్యకత, ఆధునిక యాజమాన్య పద్ధతుల్లో ఈ రంగం పురోగమిస్తున్న వైనాన్ని మనం గమనించవచ్చు.

దేశీయ కోళ్ళ పరిశ్రమ కష్ట నష్టాలు :

భారత్‌లో అతిప్రాచీనమైన కోళ్ళ పెంపకం నేడు పెద్ద పరిశ్రమగా మారి ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు మిలియన్ల ప్రజలకు ఉపాది కల్పనా కేంద్రంగా మారింది.

50 శాతం మంది భూమిలేని నిరుపేదలకు ఇది పెద్ద ఆదాయ వనరుగా ప్రసిద్ధి చెందింది.

2006 వరకు రోగాలకు అతీతంగా సాగిన కోళ్ల పరిశ్రమ పయనం ఆ సంవత్సరం 18 ఫిబ్రవరి నాడు ఒక భయంకరమైన ''ఎవియన్‌ ఇన్‌ఫ్లూఎంజా'' అనే భయంకరమైన వ్యాధిని ఎదుర్కొంది. ఆ తరువాత కోళ్ళలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, పరిశ్రమను రక్షించడానికి అనేక మంది వ్యక్తులు, శాస్త్రవేత్తలు పారిశ్రామిక వేత్తలు కృషి జరుపుతూ వస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ కోళ్ళ అభివృద్ధి సంస్థ ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ, పరిశ్రమ పరిరక్షణకు రంగంలోకి దిగింది.

ప్రపంచంలోని ఆకలిని తీర్చి, పౌష్టికాహార లోపాన్ని సరిదిద్ది మానవ వనరుల అభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా పని ప్రారంభమైంది. కోళ్ళలో గుడ్ల ఉత్పత్తి శాతాన్ని పెంచడానికి నిరంతరం కృషి జరుగుతుంది. అదే విధంగా కోళ్ళ బరువు పెంచి మాంసాన్ని అందించడానికి నియర్‌బీర్‌, హితకారి, వనరాజా, ష్యామ, కరి, ఛాబ్రో వంటి మేలు రకాల కోళ్ళ జాతులు పరిశోధకుల నుండి రైతుల చేతుల్లోకి అందుబాటులోకి వచ్చాయి.

అదేవిధంగా ఉత్పత్తి పెంచడానికి కావలసిన నాణ్యమైన దాణా కూడా అందుబాటులోకి వచ్చింది.

10వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకునే ప్రణాళికలను ప్రవేశపెట్టింది. 2004-05 సంవత్సరాల్లో కోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలిస్తూ దాణా పరిశ్రమల స్థాపన, రోగనిరోధక మందుల తయారీకి సబ్సిడీలను ప్రకటించింది.

నాబార్డు ద్వారా జాతీయ బ్యాంకుల సహకారంతో అనేక పథకాలను ప్రకటించింది.

2004-05లో డయిరీ / పౌల్ట్రీ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ అనే దాన్ని సబ్సిడీ పధకంగా ప్రవేశపెట్టింది.

భారత వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా ఉన్న అనుబంధ రంగాల్లో ప్రధానమైన తోటల పెంపకం, పట్టుసాగుతో పాటు పైన పేర్కొన్న ఐదు అనుబంధ వ్యవసాయ విప్లవాలు విజయవంతమై రైతు జీవనాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చి ఆదాయపరంగా ముందుకువెళ్ళాలనే సదుర్దేశంతో ప్రవేశపెట్టినా ఇతర అవరోధాల వల్ల రైతాంగం పరిస్థితి మెరుగుపడలేదు. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లోపం, క్షీణిస్తున్న వాతావరణ స్థితిగతులు, పంటల సాగుకు పెరుగుతున్న వ్యయం అతణ్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. సర్వత్రా రైతాంగ సంక్షోభం నెలకొని వ్యవసాయం దండగని భావిస్తున్న నేపద్యంలో ఇటీవల ప్రభుత్వాలు రుణమాఫీ, పంట పెట్టుబడి, ఇతర అరకొర పథకాలు ప్రవేశపెట్టిన రైతు సుఖంగా వ్యవసాయ పధాన్ని నమ్ముకుని జీవించే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో మే 23 తరువాత సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఏ రకంగా మేలు చేస్తాయో, దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులకు ఎలా న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌