వ్యవసాయ రంగాన్ని నూతన సాంకేతిక పద్ధతిలో అభివృద్ధి పరచి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వ్యవసాయ ఉపకరణాల సంస్థలకు ప్రోత్సాహకాలు కల్పించి, పురోగమన పధంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాజధాని నగరంలోని పార్క్‌ హయత్‌ సమావేశ మందిరంలో ఏప్రిల్‌ 27న ఘనంగా నిర్వహించిన వ్యవసాయ, వాణిజ్య సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను, వినూత్నమైన ఆవిష్కరణలను రప్పించి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనుకునే సంస్థలను, వ్యక్తులను గుర్తించి రాయ్‌ కన్సల్‌టెన్సీ సంస్థ పరిశ్రమాధిపతులకు పురస్కారాలను అందచేసి, ముందుకు నడిపింపచేయడం ముదావహమని మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాల నమోదుకు ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తిదాయకమని సానుకూల మార్పుకు దోహదం చేసే ప్రక్రియని మంత్రి అభినందించారు .

ఈ సందర్భంగా ఐటిసి డైరెక్టర్‌ శివకుమార్‌ ప్రసంగిస్తూ రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనల నేపధ్యంలో ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులను కోరమాండల్‌ ఇంటర్‌నేషనల్‌ మాజీ అధ్యక్షులు డా|| రవి ప్రసాద్‌ వివరించారు. వివిధ సాంకేతిక పద్ధతుల ద్వారా రైతులు పంటలు పండించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను పొంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయని వివరించారు,

భవిష్యత్‌ తరాలు వ్యవసాయ ఉపకరణాల వ్యాపారాన్ని దిగ్విజయంగా నిర్వహించే అంశంపై సదస్సులో జరిగిన చర్చలో ధనుకా గ్రూప్‌ చైర్మన్‌ ఆర్‌జి అగర్వాల్‌ కీలక ఉపన్యాసం చేశారు. అదే విధంగా ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పడిన జ్యూరీ ఆధ్వర్యంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమంలో వ్యవసాయ ఉపకరణాల పరిశ్రమల పాత్ర గురించి కాగాషిన్‌ కంపెనీ వ్యవస్థాపకులు అనురాగ్‌ సురానా, అమెరికాకు చెందిన బయోఅగ్‌లింకేజస్‌ వ్యవస్థాపకులు రోగర్‌త్రిపాఠి, టాటా కెమికల్స్‌ మాజీ అధ్యక్షులు రోలాన్డ్‌, క్రీడామాజీ డైరెక్టర్‌ డా|| బి. వెంకటేశ్వరు,్ల పసురా గ్రూప్‌ చైర్మన్‌ డా|| మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వాణిజ్య సదస్సులో పురస్కారాలు :

వ్యవసాయ వాణిజ్య ఉత్పత్తులకు సంబంధించి వినూత్న విధానాలను ప్రోత్సహించేందుకు రైతుల ఆదాయం పెంపులో వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ వాణిజ్య సదస్సులో విశిష్ట సేవలందిస్తున్న అగ్రి ఉత్పత్తి అధిపతులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. వ్యవసాయ రంగం అభివృద్ధి పధంలో నిలిపేందుకు వ్యవసాయ రంగ నిపుణులను ఉత్పత్తి దారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి సదస్సులు అవసరమేనని నిపుణులు భావించారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రారంభించడం శుభసూచకమేనని రానున్న రోజుల్లో వ్యవసాచ విస్తరణను పెంచి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలను ఆర్జించే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని నిలపాలని సదస్సు అభిప్రాయపడింది.

మారుతున్న వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా నేడు వ్యవసాయ రంగం కొత్తపుంతలు ఏర్పరచుకుంటుందని ప్రజా ఆరోగ్యపరిరక్షణలో భాగంగా సహజ పండ్లు, కూరగాయలతో పాటు చిరుధాన్యాలను, ప్రజలకు అందించి మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు మేధోమథనం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర జనాభాకు తగ్గట్లుగా ఆహార ఉత్పత్తులు అందడంలేదని, ఇతర రాష్ట్రాల, దేశాల నుండి దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నామని ఇటువంటి పరిస్ధితిని అధిగమించి ఉత్పత్తులను పెంచుకోవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉందని సదస్సులోని వక్తలు అభిప్రాయం వ్యక్తపరచారు. సహజసిద్ధమైన ఉత్పత్తుల నుండి సాంకేతిక పద్ధతుల్లో ఉత్పత్తులను సాధిస్తున్న నేడు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఉత్పత్తి పెరగడం లేదని వ్యవసాయ రంగం వైపు యువతరాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, నూతన ఉత్తేజం వ్యవసాయ రంగంలో ఎంతో అవసరమని సదస్సు అభిప్రాయపడింది.

ఏలూరికి వ్యూహాత్మక నాయత్వ పురస్కారం

మంత్రి నిరంజన్‌ రెడ్డి చేతులమీదగా అవార్డు అందజేత

జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అగ్రి 2019 అవార్డును నోవా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ & అగ్రిక్లినిక్‌ మాసపత్రిక సంపాదకులు, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావుకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అందచేశారు. వ్వవసాయ రంగ ఉత్పత్తుల్లో విశిష్ట సేవలు అందిస్తూ రైతాంగానికి నోవా అగ్రిటెక్‌ అండదండలు అందిస్తూ నూతన వ్యవసాయ విధానాలు, ఉత్పత్తి మెలకువలు అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం తమ సంస్థ నాణ్యమైన ఉత్పత్తులను రైతులకు అందిస్తూ నిరంతరం ప్రజాసేవలో అంకితమై పనిచేస్తున్న ఏలూరి సాంబశివరావుకు వ్యూహాత్మక నాయకత్వపు పురస్కారం అందడం గర్వకారణం. నోవా అగ్రిటెక్‌ సంస్థ చేపట్టిన సేవలకు బహుమతిగా ఉత్తమ సంస్థగా గుర్తింపు అందింది. ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజలకు ఎటువంటి కష్ట, నష్టాలు పడకూడదనే దృక్పదంతో వ్యవసాయ ఉత్పత్తుల సంస్థను ఏర్పాటుచేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేస్తూ ప్రజలకు వెన్నంటి సేవలందించే ఒక నమ్మకం, విశ్వాసం, విశ్వసనీయత అనే లక్ష్యంతో పనిని ప్రారంభించి నేడు సమాజంలో నోవా అగ్రిటెక్‌ సంస్థ ఉత్తమ సంస్థగా ఎదగడానికి దోహదపడిందని రైతాంగాన్ని ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దేందుకు సంస్థ కృషి చేస్తుందని నిరంతరం ప్రజాసేవలో అంకితమై ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా ప్రజల కష్టాలను దూరం చేస్తూ ఏలూరి ప్రజాభిమాన నాయకుడిగా ప్రజల్లో నిలిచిపోయారు. పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావుకు ఇటువంటి పురస్కారం లభించడంతో ప్రముఖ అగ్రి బిజినెస్‌ యాజమాన్యాలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏలూరి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

అగస్త్య ఆగ్రో లిమిటెడ్‌ సంస్థకు విశిష్ట అవార్డు దక్కింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ రైతుల పక్షాన నిలబడి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ రైతుల్లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. అగస్త్య ఆగ్రో లిమిటెడ్‌, చైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లంపాటి మురళి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని రైతాంగాన్ని అన్ని విధాలా అభివృద్ధిపరచేందుకు సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు మాలాంటి సంస్థలకు ఊతం అందిచినట్లు ఉంటుందని అన్నారు.

- అగ్రిక్లినిక్‌ డెస్క్‌