రబీ వేసవిలో రైతులు ఆరుతడి పంటలైన వేరుశనగ, నువ్వులు, అపరాలు, మొదలగు పంటలను సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటలను వివిధ రకాల వైరస్‌ తెగుళ్ళు ఆశించి అపార నష్టాన్ని కలుగచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్‌ తెగుళ్ళు రసంపీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెంది తీవ్ర నష్టాన్ని కలుగచేస్తున్నాయి. కాబట్టి వైరస్‌ తెగుళ్ళను సమర్థవంతంగా నివారించడానికి వీటిని వ్యాపింపచేసే కీటకాలను ముందుగా తగ్గించి తెగుళ్ళ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు.

వేరు శనగ :

మొవ్వు కుళ్ళు తెగులు :

మొవ్వు కుళ్ళు వైరస్‌ తెగులు వేరుశనగకు అధిక నష్టాన్ని కలుగచేస్తుంది. ఈ తెగులు తామర పురుగల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల మొవ్వు కుళ్ళిపోతుంది. మొక్కలు ఎదగక గింజలు చిన్నవిగా ఉంటాయి.

యాజమాన్యం :

ఈ తెగులును కొంత వరకు తట్టుకునే వేమన, ఐసిజియస్‌ 11, ఆర్‌ 8808 రకాలను సాగుచేయాలి.

తామర పురుగులను ఆకర్షించడానికి నీలిరంగు ఆకర్షక ఎరలను ఎకరానికి 15-20 వరకు అమర్చాలి.

ఒక కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తన శుద్ధి చేయాలి.

కీటకాల ఉధృతిని తగ్గించడానికి పిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా అసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు :

ఈ వైరస్‌ తెగులు తొలిదశలో ఆకులపై, ఆకు ఈనెలపై మచ్చలు ఏర్పడి ఆకుతొడిమ నుండి కాండానికి విస్తరిస్తాయి. అంతేకాకుండా మొవ్వు ఎండిపోతుంది. పంట తొలిదశలో ఈ వైరస్‌ తెగులు ఆశిస్తే మొక్కలు చనిపోతాయి. తరువాత దశలో ఆశిస్తే మొక్కలు గిడసబారడమే కాకుండా ఊడలు నల్లగా మారతాయి.

యాజమాన్యం :

కీటకాల వల్ల వైరస్‌ వ్యాపిస్తుంది. కనుక వ్యాపింపచేసే కీటకాలను తగ్గించాలి. రసాయమందులైన అసిఫేట్‌ 1.5 గ్రా. లేదా డైమిధోయేట్‌ 2 మి.లీ. లేదా పిప్రోనిల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

నువ్వులు :

వెర్రితెగులు :

దీన్నే ఫిల్లోడి అని అంటారు. ఈ వైరస్‌ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు పూత సమయంలో ముఖ్యంగా ఆలస్యంగా వేసే నువ్వు పంటల్లో ఎక్కువగా కనబడుతుంది. తెగులు సోకిన మొక్కల్లో పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు.

యాజమాన్యం :

ఈ తెగులు కనిపించిన వెంటనే ఆశించిన మొక్కలను పీకి తగులబెట్టాలి. దీపపు పురుగుల ఉధృతిని తగ్గించడానికి డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా అసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

అపరాలు :

పల్లాకు తెగులు :

అపరాల పంటల్లో పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు పసుపు మరియు ఆకుపచ్చ రంగులో మారతాయి. అందువల్ల దీన్ని మొజాయిక్‌ తెగులు అంటారు. తొలిదశలో ఈ తెగులు ఆశిస్తే పైరు పసుపు రంగుకు మారి పూత మరియు పిందె ఏర్పడ్డాక అధిక నష్టం వాటిల్లుతుంది. కాయ ఏర్పడే దశలో ఈ తెగులు సోకినట్లయితే కాయలు తాలు కాయలుగా మారతాయి.

యాజమాన్యం :

ఈ వైరస్‌ తెగులును కొంత వరకు తట్టుకునే డబ్ల్యుజిజి-42, ఎల్‌బిజి-460, పియు-31 వంటి రకాలను సాగుచేసుకోవాలి.

పంట విత్తుకునే ముందు కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ. లేదా థయోమిథాక్సమ్‌ 5 గ్రా. కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

పసుపు రంగు జిగురు ఆకర్షక ఎరలను 15-20 ఎకరాకు పెట్టి తెల్లదోమ ఉధృతిని తగ్గించవచ్చు.

పంటతొలి దశలో అంటే 15-20 రోజులకు వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికాచి చేయాలి.

తెల్లదోమ నివారణకు థయోమిథాక్సమ్‌ 0.25 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ లేదా అసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పచికారి చేయాలి.

బొబ్బర తెగులు :

ఈ తెగులు మినుము పంటలో అధికంగా కనిపిస్తుంది. ఈ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కలు ఆకులు వెడల్పుగా ఉండి, దగ్గరగా ముడతలు పడి ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. పూత ఏర్పడ్డాక వెర్రి తలలు వేస్తాయి. ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది.

యాజమాన్యం :

వైరస్‌ సోకని పొలం నుండి విత్తనం సేకరించాలి.

పంటను బెట్టకు గురికాకుండా చూసుకోవాలి.

పంట విత్తే ముందు విత్తనశుద్ధి 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌తో చేసుకోవాలి.

పేనుబంక నివారణకు అసిఫేట్‌ 1.5 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మొవ్వు కుళ్ళు తెగులు :

అపరాల్లో ఈ తెగులు తామరపురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారిచ రాలిపోతాయి. ఆకుల అడుగుభాగంలో ఈనెలు రక్త వర్ణంలో ఉంటాయి. మొక్కల తలలు మాడిపోయి ఈ తెగులు సోకితే కాపుతగ్గును.

యాజమాన్యం :

విత్తన శుద్ధి విధిగా పాటించాలి.

తామర పురుగుల నివారణకు నీలిరంగు లింగాకర్షక ఎరలను వాడాలి.

విత్తిన 15-20 రోజులకు వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి పిచికారి చేయాలి.

తామరపురుగుల నివారణకు ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

రబీ కంది :

స్టెరిలిటి మొజాయిక్‌ వైరస్‌ (గొడ్డు మోతు తెగులు) :

ఈ వైరస్‌ తెగులు నల్లుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు చిన్న చిన్న లేత ఆకుపచ్చ ఆకులను విపరీతంగా తొడుగుతాయి. పూత సరిగా పూయదు. బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఈ నల్లుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

యాజమాన్యం :

డైకోపాల్‌ 5 మి.లీ. లేదా గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వైరస్‌ తెగుళ్ళని వాహకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వాహకాలను అదుపు చేపట్టిపట్లయితే వైరస్‌ తెగుళ్ళను నివారించుకోవచ్చు.

యస్‌. ఓం ప్రకాష్‌, శాస్త్రవేత్త (ఎంటమాలజీ), ఎమ్‌. రాజేంద్రప్రసాద్‌, అగ్రానమి, డా|| బి. శ్రీనివాస్‌, శాస్త్రవేత్త, (బ్రీడింగ్‌)

డా|| ఆర్‌. ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల, ఫోన్‌ : 9866373563