కూరగాయల సాగులో అధిక ఉత్పాదకత, దిగుబడి కొరకు నాణ్యమైన నారు ఉత్పత్తి చేయడం ముఖ్యం. నాణ్యమైన నారు నాటడం వల్ల మొక్క వేగంగా ప్రధాన పొలంలో నిలదొక్కుకొని శాఖీయంగా పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది.

నారుమళ్ళ పెంపకం - స్థల ఎంపిక :

రైతులు నారుమళ్ళను ప్రతి ఏటా ఒకే చోట బావులకు దగ్గరగాకానీ, కల్లాల దగ్గరగా కాని పెంచుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గత పంట కాలంలో భూమిలో ఉండిపోయిన హానికరమైన శిలీంధ్రాలు, తదుపరి వేసే నారుమొక్కల పైన ప్రభావం చూపి నష్టపరిచే అవకాశముంటుంది. కాబట్టి నారుమళ్ళపెంపకాన్ని ప్రతీ సంవత్సరం వేరు వేరు స్థలాల్లో పెంచుకోవాలి. పంట మార్పిడి చేసిన తర్వాతే పాత స్థలాల్లో తిరిగి నారుమళ్ళను పెంచుకోవాలి. నారుమళ్ళను పూర్తిగా నీడవున్న ప్రాంతాల్లో గాని, చెట్లకు అతి దగ్గరగా పెంచడం వల్ల మొక్క ఎదుగుదలలో సమతుల్యత లోపించడమే కాకుండా, చీడపీడల ఉధతి ఎక్కువగా ఉంటుంది.

నారుమళ్ళ తయారీ :

నారుమళ్ళ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మొదట లోతుగా దుక్కి చేసి తర్వాత రెండు, మూడుసార్లు మట్టి బాగా గుల్లబారేల దున్నుకోవాలి. వర్షాకాలంలో తప్పనిసరిగా ఎత్తైన నారుమళ్ళు చేసి కూరగాయ నారుమళ్ళను పెంచుకోవాలి. ఒక మీటరు వెడల్పు, మూడు నుంచి నాలుగు మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తు ఉన్న నారుమళ్ళను పక్కపక్కగా తయారు చేసుకోవాలి. మడికి, మడికి మధ్య కనీసం 30 సెం.మీ. దూరంతో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకుంటే అధికంగా పడే వర్షాన్ని ఈ కాలువల ద్వారా బయటకు పంపించుకోవచ్చు.

నారుమళ్ళ శుద్ధి :

భూమిలో ఉన్న హానికరమైన శిలీంద్రాలను నిర్మూలించి, నారు మొక్కలను సంరక్షించుటకు తయారు చేసి ఉంచుకున్న ఎత్తైన నారుమళ్ళను శుద్దిచేయాలి. సొలరైజేషన్‌ పద్ధతి ద్వారా శుద్ధి చేయటానికి ముందుగా మళ్ళను బాగా నీటితో తడిపిన తరువాత తెల్లని పాలిథిన్‌ కవరుతో గాలి చొరబడకుండా కప్పి ఉంచితే నేల ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రత కంటే 5-60 సెం. వరకు పెరుగుతుంది. ఈ విధంగా 10-15 రోజుల పాటు ఉంచితే భూమిలోని శిలీంద్రాలను సమూలంగా నివారించవచ్చు.

ఎత్తైన మళ్ళలో విత్తనాన్ని విత్తే ముందు లీటరు నీటికి 5 మి.లీ. ఫార్మాల్డిహైడ్‌ లేదా 3 గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ గాని కలిపిన మందు ద్రావణాన్ని మళ్ళు బాగా తడిచేలా పిచికారి చేసి కూడా భూమిని శుద్ధి చేసుకోవచ్చు.

ఎత్తైన నారుమళ్ళు :

4I1 మీ. సైజు కలిగిన 15 సెం.మీ. ఎత్తు ఉన్న నర్సరీ బెడ్సును తయారు చేసుకోవాలి. అందులో బాగా చివికిన 10-15 గంపల పశువుల ఎరువును కలుపుకోవాలి. విత్తనాన్ని వరుసల పద్ధతిలో 0.5 అంగుళం లోతులో నాటి వరుసల మధ్య 3-5 సెం.మీ. దూరాన్ని ఉంచుకోవాలి. నాటిన తరువాత ఎండుగడ్డితో కప్పుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని, తేమను ఎక్కువ రోజులు ఉంచుకొని తొందరగా మొలకెత్తుతాయి.

ప్రోట్రే పద్ధతి :

ఆధునిక వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులలో ఒకటైన ఈ ప్రోట్రే పద్ధతిలో నారు పెంపకం పై రైతులు మొగ్గు చూపుతున్నారు. గత కొద్దికాలంగా హైబ్రిడ్స్‌ ఎక్కువగా పెంపకంలో ఉన్నాయి. హైబ్రిడ్‌ విత్తనాలు ఎక్కువ ఖరీదు కలిగి ఉండడం వల్ల ప్రతి గింజ ముఖ్యమే. ప్రోట్రే అనగా ప్లాస్టిక్‌తో తయారై 50-90 గళ్ళును కలిగి ఉంటుంది. ఈ ప్రోట్రేలలో కొబ్బరి పొట్టును నింపి, నానబెట్టి గింజను 50 గళ్ళులలో పెడతారు. కనుక విత్తనం వధా కావడం జరగదు. ప్రతి గింజ మొలకెత్తడానికి ఎక్కువ అవకాశం ఉండి ప్రతి గింజ ఒకే విధంగా పెరగడంతో నాటుకోవడానికి వీలుగా ఉంటుంది. కొబ్బరి పొట్టు ఉండడం వల్ల తడిని ఎక్కువ సార్లు ఇవ్వనక్కర్లేదు. నాటుకునేటప్పుడు ప్రతి గడిలోని మొక్కను పూర్తిగా కొబ్బరి పొట్టుతో నాటుకోవచ్చు. ఈ ప్రోట్రేలను వేరే ప్రదేశాలకు కూడా రవాణా చేయడానికి వీలుగా ఉంటుంది. మరియు మొక్కలు నలిగిపోకుండా, నష్టం కలుగకుండా సుదూర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు.

విత్తే పద్ధతి :

శుద్ధి చేసిన ఎతైన నారుమళ్ళలో నాణ్యమైన విత్తనాన్ని విత్తుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన నారు మొక్కలను పొందవచ్చు. ముందుగా నారుమళ్ళను చదును చేసి ఉత్తర దక్షిణ దిశలుగా ఉన్న నారుమళ్ళపైన తూర్పు పడమరలుగా 2 సెం.మీ. లోతు, వరుసకు వరుసకు 5-10 సెం.మీ. దూరంతో గీతలు గీసి అందులో విత్తనాన్ని తగిన రీతిలో ఒక్కొక్కటిగా విత్తుకోవాలి. బాగా చివికిన పశువుల ఎరువుతో కలిపినా మట్టిని విత్తిన విత్తనలపై పలుచగా చల్లి కప్పి పెట్టాలి. తరువాత రోజ్‌ క్యాన్‌లతో నీటి తడినివ్వాలి. విత్తిన వెంటనే నారుమడిని వరి గడ్డితో కప్పాలి. దీనివల్ల తేమను సంరక్షించుకోవడంతో పాటు, మొలకెత్తు శాతాన్ని కూడా వద్ధి చేసుకోవచ్చు.

మొదటి వారం రోజుల వరకు ఉదయం, సాయంకాలాల్లో నీటిని చిలకరించాలి. వారం రోజుల తరువాత రోజుకు ఒక నీటి తడి ఇస్తే సరిపోతుంది. మొలక వచ్చిన వెంటనే పైన కప్పి ఉంచిన వరి గడ్డిని తీసివేయాలి. విత్తిన 10-15 వ రోజు నుంచి కలుపు మొక్కలను తరుచు తీసి వేస్తుండాలి. అలాగే ఎక్కడైనా బాగా ఒత్తుగా కానీ, గుంపులు గుంపులుగా కానీ నారు మొక్కలు ఉన్నట్లయితే వాటిని నెమ్మదిగా తీసి ఖాళీలు ఉన్న చోట నాటుకోవాలి.

సస్యరక్షణ :

నారుమళ్ళలో సాధారణంగా మాగుడు తెగులు కనిపిస్తుంది. ముఖ్యంగా 2-3 రోజులు ఎడ తెరపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కలు మొదళ్ళ దగ్గర కుళ్ళి నారు చనిపోతుంటాయి. దీని నివారణకు 2.5గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ మందును ఒక లీటరు నీటికి చొప్పున కలిపి నారుమడి పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి. ముందు జాగ్రత్తగా ఈ మందును నారుమడి పైన 10-13 రోజులప్పుడు ఒకసారి, 18-20 రోజులప్పుడు మరోసారి పిచికారి చేసి నివారించుకోవచ్చు.

ముఖ్యంగా మిరప నారుమళ్ళను కోనోఫోరా ఎండుతెగులు ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు లేత చిగుళ్ళు వాడిపోయి కొమ్మల కణుపుల వద్ద కుళ్ళి విరిగిపోతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ + 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్‌ చొప్పున కలిపి రెండు, మూడు సార్లు పిచికారి చేయాలి.

నారుమళ్ళలో వచ్చే రసం పీల్చే పచ్చదోమ, పెనుబంక, తామర పురుగుల నివారణకు నారుమడిని తయారు చేసుకున్నప్పుడే ఎకరాకు సరిపడే నారుమడికి 80 గ్రా. ఫిఫ్రోనిల్‌ గుళికలను చల్లి కలియబెట్టిన తరువాత విత్తనాన్ని విత్తుకోవాలి లేదా నారుమడిపైన మలాథియాన్‌ 2 మి.లీ. లేదా డైమిధోయేట్‌ 2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి 1-2 సార్లు పిచికారి చేసి కూడా ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.

కూరగాయ పంటలను ఆశించు తెగుళ్ళు /పురుగులు/విత్తనశుద్ధి :

కూరగాయల పంట తెగులు / పురుగులు విత్తనశుద్ది / రసాయనాలు /కిలో విత్తనానికి
వంగ ఆకుమాడు, కాయకుళ్ళు, ఫోమప్సిన్‌ ఎండుతెగులు విత్తనాలను విత్తుకొనే ముందు 500 సెం. ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి ఆ తరువాత ఆరబెట్టి విత్తుకోవాలి.
క్యాబేజీ, కాలీఫ్లవర్‌ నారుకుళ్ళు తెగులు ఆకు తినే పురుగు 3 గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ లీటరు నీటికి 2.5 మి.లీ. మలాథియాన్‌ లీటరు నీటికి
టమాటో రసంపీల్చే పురుగులు నారుకుళ్ళు తెగులు 5 గ్రా. ఇమిడాక్ల్రోపిడ్‌ 3 గ్రా.కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ లేదా 0.5 శాతం బోర్డో మిశ్రమంతో నారుమళ్ళను శుద్ధి చేయాలి. (100 లీ. మందు ద్రావణం 40 చ.మీ.నారుమడికి)
మిరప రసం పీల్చే పురుగు, పచ్చ దోమ, 80 గ్రా.ఫిఫ్రోనిల్‌ గుళికలు లేదా మలాథియాన్‌ 2 మి.లీ. లేదా డైమిధోయేట్‌ పెనుబంక తామర పురుగు 2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి 1-2 సార్లు పిచికారి చేయాలి.

ఎన్‌. విద్య రాణి, డా|| డి.మనోహర ప్రసాద్‌, కె.సి. భాను మూర్తి, డా|| ఎస్‌.ఆదర్శ, పి. రాజశేఖర్‌

కషి విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి, తూర్పు గోదావరి జిల్లా, డా.వై.ఎస్‌.ఆర్‌.ఉద్యాన విశ్వ విద్యాలయం