మన రాష్ట్రంలో పప్పుదినుసులు ముఖ్యంగా ఖరీఫ్‌ మరియు రబీ సీజన్‌లో సుమారు 7.0 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు కావాల్సిన మాంసకృత్తులను, ఖనిజ లవణాలను అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేయడానికి మరియు పరిపక్వత దశలో రాల్చే ఆకులు, అవశేషాలు, భూమిలో కలియ దున్నిన ఎడల సేంద్రియ పదార్థం భూమిలో కలిసి భూభౌతిక రసాయన ప్రక్రియలను సకారాత్మాకంగా మార్చి తదుపరి పంటల దిగుబడి, నాణ్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం తలసరిగా ప్రతి రోజు 80 గ్రాముల పప్పు దినుసులు తీసుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం అవి 30 గ్రా. మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిఫార్సు మేరకు అందుబాటులోకి రావాలంటే అపరాల ఉత్పాదకత మరియు విస్తీర్ణం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రైతు ప్రధాన పంట తీసిన తరువాత స్వల్పకాలిక పంటలైన పెసర, మినుము సాగు చేసుకునే అవకాశమున్నందున వేసవిలో ఈ పంటలు సాగు చేసుకున్నట్లయితే గృహవసరాలకు సరిపోయేంత పప్పు, శాఖీయ మాంసకృత్తులు అందుబాటులోకి రావడమే కాకుండా, పంట మార్పిడి జరిగి, భూసారం పెరిగి ప్రధాన పంటలు స్థిరమైన దిగుబడి సాధించుటకు మరియు తక్కువ కాలంలో రైతుకు ఆర్ధికంగా లాభం చేకూర్చుటకు దోహద పడుతుంది.

పంట మార్పిడి - అవకాశాలు :

రబీ మొక్కజొన్న, వేరు శనగ తీసిన తరువాత

పత్తి పంటను తీసిన తరువాత

పసుపు పరిపక్వత చెందిన లేదా తీసిన తరువాత

రబీలో వరి వేయని మాగాణిలో మెట్ట పంటగా మరియు జనవరి మాసాంతం వరకు పక్వత చెంది కోతకు వచ్చిన ఇతర పంటల తరువాత, 4-5 నీటి తడులిచ్చే సౌకర్యం కలిగిన పరిస్థితుల్లో కూడా పెసర లేదా మినుము పంటను సాగు చేయవచ్చు.

నేలలు :

నీరు బాగా ఇంకే తేమను పట్టి ఉంచే మధ్యస్థ, బరువైన నేలలు అనుకూలమైనవి. చౌడు నేలలు పనికి రావు. మినుము సాగుకి బరువైన నేలలు బాగా అనుకూలం. వేసవిలో సాగు చేసేటప్పుడు, రబీలో వేసిన పంట కోత తరువాత తడి ఇచ్చి 2-3 సార్లు బాగా దున్ని కలుపు మొక్కలు మరియు పూర్వ పంటలు అవశేషాలు లేకుండా చేసి నేలను విత్తుటకు సిద్ధం చేయాలి.

విత్తనం / విత్తన శుద్ధి :

ఎకరానికి 6-8 కిలోల విత్తనం అవసరముంటుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 5 గ్రా. థయోమిథాక్సమ్‌ లేదా 5 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ను కలిపి విత్తనశుద్ధి చేసినట్లుయితే తొలిదశలో వచ్చే రసం పీల్చే పురుగుల బెడద మరియు విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ బారి నుండి పంటను కాపాడవచ్చు. చివరిగా భూమిలో భాస్వరపు పోషక సమర్ధ వినియోగానికి మరియు నత్రజని స్థిరీకరణకు గాను ఎకరానికి సరిపడే విత్తనానికి 250 గ్రాముల ఫాస్ఫేట్‌ సొల్యుబి లైజింగ్‌ బాక్టీరియా మరియు రైజోబియం కల్చర్‌ (200 గ్రా.) విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవలెను.

విత్తే దూరం :

నీటి వినియోగ సామర్ధ్యం పెంచడానికి, సులభతర యాజమాన్యానికి విధిగా సాళ్ళ పద్ధతిలో విత్తాలి. సాళ్ళ పద్ధతిలో సాలుకు సాలుకు మధ్య 22.5 సెం.మీ - 25 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ, ఎడంతో విత్తి, విత్తనం 4-5 సెం.మీ లోతులో తగు పదనులో పడేలా విత్తాలి.

విత్తే సమయం :

సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు 18-2000 సెం. ఉన్నట్లుయితే మొలక శాతం బాగా ఉంటుంది. ఫిబ్రవరి నుండి మార్చి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చును. సకాలంలో విత్తుకున్నట్లయితే నీటి సద్వినియోగం పెరిగి, మంచి దిగుబడులు సాధించవచ్చును, ఆలస్యంగా విత్తినచో పూత, కాయ సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగి గింజకట్టడం, పూత రాలడం వంటి సమస్యల మూలంగా దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.

ఎరువులు :

ప్రధాన పంటల్లో అధిక మొత్తంలో వాడిన రసాయనిక ఎరువుల అవశేషాలు ఉన్నప్పటికీ తొలి దశలోని అవసరాల నిమిత్తం ఆఖరి దుక్కిలో ఎకరానికి 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరపు ఎరువులు అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ను వేయాలి.

కలుపు నివారణ :

పెసర మరియు మినుము పంటల్లో విత్తిన 20-30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి

మొలకెత్తక ముందు :

పెండి మిథాలిన్‌ 30 శాతం ఎకరాకు 1.3-1.6 లీటర్ల మందును, 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనం విత్తిన తరువాత, విత్తనం మరియు గడ్డి మొలవక ముందు (48 గంటల లోపల) పిచికారి చేయాలి.

మొలకెత్తిన తరువాత :

పైరు విత్తిన 20 రోజుల్లో వెడల్పాకు కలుపు నివారణకు ఇమాజితాఫిర్‌ 300 మి.లీ. ఎకరాకి లేదా గడ్డి జాతి కలుపు నివారణకు క్విజాలఫాప్‌ ఇథైల్‌ 400 మి.లీ. ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు నేలలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.

నీటి యాజమాన్యం :

సాధారణంగా పెసర, మినుము ఖరిఫ్‌లో వర్షాదారంగా పండిస్తారు. పెసర మరియు మినుము పంటలకు సుమారు 300- 450 మి.మీ నీరు అవసరముండును. బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు మరియు నేల స్వభావాన్ని బట్టి కీలక దశలైనటువంటి మొగ్గ దశలో, కాయ మరియు గింజ కట్టే దశలో 1-2 తడులు ఇచ్చినట్లయితే నాణ్యమైన మరియు అధిక దిగుబడులు సాధించవచ్చును. సాధారణంగా తేలిక పాటి తడి ఆ తరువాత అంతర కృషి చేసినట్లయితే పంట ఎదుగుదలకు తోడ్పడును. బెట్ట పరిస్థితుల్లో పంట ఎదుగుదల ఆగకుండా ఉపశమనానికై 2 శాతం యూరియా ద్రావణం లేదా మల్టీ కే 5 గ్రా. లీటరు నీటికి కలిపి 1-2 సార్లు పిచికారీ చేయాలి.

వేసవికి అనువైన రకాలు :

పెసర :

రకం కాలం పరిమితి ( రోజులు) దిగుబడి ఎకరాకు ( కిలోలు ) ప్రత్యేక లక్షణాలు
డబ్యు.జి.జి-42 55-60 400-600 పల్లాకు తెగులును సమర్ధవంతంగా తట్టుకొని, పొడవైన కాయలు, లావు మెరుగు గింజలు కలిగి వేసవికి బాగా అనువైనవి.
డబ్యు.జి.జి-37 60-65 500-600 పల్లాకు తెగులును తట్టు కొనును. ఒకేసారి కాపుకు వచ్చును. గింజలు మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉంటాయి.
డబ్యు.జి.జి-295 60-65 500-600 ఆకుమచ్చ తెగులును తట్టుకొనును. గింజలు మధ్యస్థ లావుగా ఉండి సాదాగా ఉండును. కాయలు పైభాగమున కాయును
డబ్యు.జి.జి-347 65-70 500-600 ఆకుమచ్చ, బెట్టను తట్టుకొనును. గింజలు ముదురు ఆకుమచ్చ రంగులో మధ్యస్థ లావుగా ఉండును. ఒకేసారి కోతకు వచ్చును.
డబ్యు.జి.జి-348 60-65 500-600 బెట్టను కొంత వరకు తట్టుకోనును. గింజలు లేత ఆకు పచ్చగా ఉండును.
డబ్యు.జి.జి-2 65-70 500-600 బూడిద తెగులును తట్టుకోనును. ఒకేసారి కోతకు వచ్చును. గింజలు మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉంటాయి.

మినుము :

రకం కాలం పరిమితి ( రోజులు) దిగుబడి ఎకరాకు ( కిలోలు ) ప్రత్యేక లక్షణాలు
ఎమ్‌.బి.జి-207 75-80 600-700 బెట్టను తట్టుకొని, పల్లాకు తెగులు కొంత వరకు తట్టుకొనును. గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి.
పి.యు-31 70-75 600-700 పల్లాకు తెగులును తట్టు కొనును. చిన్న గుబురైన మొక్క కాయలు చిన్నవిగా నూగు కలిగి ఉండును.
యల్‌.బి.జి-752 75-80 700-800 పల్లాకు, ఎండు తెగులును తట్టు కొనును, గింజలు లావుగా, మెరుస్తూ ఉంటాయి. మొక్క ఎత్తుగా పెరుగును.
యల్‌.బి.జి-787 80-85 800-850 పల్లాకు తెగులును తట్టుకోనును. గింజలు మధ్యస్థ లావుగా మెరుస్తూ ఉండును.

సస్య రక్షణ :

వేసవిలో ఉష్ణోగ్రతల మార్పు ఆధారంగా తొలి దశలో మరియు పూత దశలో రసం పిల్చే పురుగులు, తామర పురుగులు, పేనుబంక మరియు తెల్ల దోమ ఆశిస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు మరియు గాలిలో తేమ తగ్గినప్పుడు వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. లేని యెడల ఆకులు, మొగ్గ (తామర పురుగులు, తెల్ల దోమ), అన్ని భాగాలూ (పేనుబంక) రసం పీల్చి మొక్క ఎదుగుదల కుంటుపడి, పూత, కాయ దిగుబడులు తగ్గును. తెల్ల దోమ సకాలంలో నివారించని యెడల పల్లాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా జరిగి దిగుబడి పూర్తిగా తగ్గవచ్చును.

పల్లాకు తెగులు :

తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌ వల్ల పల్లాకు తెగులు సోకుతుంది. తెగులు సోకిన మొక్కలలో మొదట లేదా ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు, ముదురు ఆకుపచ్చ రంగులు మేళవింపుతో కూడిన పొడలు కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కలు గిడసబారి, ఎదుగుదల, పూత, కాత తగ్గిపోయి, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయలు, గింజలు కూడా పసుపు రంగుకు మారి గింజ పరిమాణం తగ్గుతుంది. సకాలంలో నివారించని యెడల దిగుబడులు పూర్తిగా క్షీణించి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది.

1. నివారణకై పల్లాకు తెగులును తట్టుకునే రకాలను సాగు చేయాలి.

2. తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గమనించి, వెంటనే పెకిలి కాల్చి వేయాలి.

3. ఎప్పటికప్పుడు తెల్ల దోమ ఉధృతిని గమనించి, నివారణ చర్యలు చేపట్టాలి.

4. తెల్ల దోమ నివారణకై ''పసుపు పచ్చ జిగురు అట్టలు'' అక్కడక్కడ పంట పొలంలో అమర్చాలి.

5. ముందుగా వేప కాషాయం (5%) లేదా 5 మి.లీ./లీటరు నీటికి వేపనూనె పిచికారి చేయాలి.

6. ఆ తరువాత మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా 1.5 గ్రా. డైఫెన్‌ తయూరాన్‌ ప్రతి లీటరు నీటికి కలిపి 1-2 సార్లు మందులు మార్చి పిచికారి చేయాలి.

తొలి దశలో ఆశించు పురుగులు :

చిత్తపురుగులు, కాండపుఈగ, తామరపురుగులు, తెల్లదోమ, పేనుబంక :

నివారణ :

డైమిధోయేట్‌ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్‌ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుతినే పురుగులు/ కాయ తొలుచు పురుగులు

ఆకు చుట్టు పురుగు, పొగాకు లద్దె పురుగు :

క్లోరోపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా క్వినాల్‌ ఫాస్‌ 2 మి.లీ. ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

శనగపచ్చ పురుగు :

స్పైనోసాడ్‌ 0.75 మి.లీ. లేదా ఇండాక్సాకార్బ్‌ 2.0 మి.లీ. నోవాల్యురాన్‌ 1 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.3 మి.లీ. ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను.

మరుకా మచ్చల పురుగు :

శనగ పచ్చ పురుగు నివారణకై సిఫార్సు చేసిన కీటక నాశినితో పాటు డైక్లోరోవాస్‌ 1 మి.లీ. ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

ఆకుమచ్చ, బూడిద తెగుళ్ళు

నివారణ :

కార్బండిజమ్‌ 1 గ్రా. లేదా మాంకోజెబ్‌ 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

జె. విజయ్‌, సేద్య విభాగపు శాస్త్రవేత్త, డా|| ఎన్‌. వెంకటేశ్వరరావు, సీనియర్‌ శాస్త్రవేత్త&హెడ్‌, డి. శ్రీనివాస్‌ రెడ్డి, సస్యరక్షణ శాస్త్రవేత్త,

జమ్మికుంట, ఫోన్‌ : 8500119198