పంటల సాగులో సస్యరక్షణ ప్రధానం. మిత్రపురుగులు, బదనికలకు హాని జరుగకుండా నష్టపరచే పురుగుల ఉనికిని కనిపెట్టి అవి స్థాయికి మించి ఉంటేనే పురుగు మందులు వాడాలి. తెగుళ్ళ మందులు పురుగులకు, పురుగుల మందులు తెగుళ్ళ నివారణకు పనికిరావు. మందుల పిచికారి వాడే స్ప్రేయర్లు, వాడాల్సిన మందు పరిమాణం కొన్ని సమయాల్లో పురుగు, తెగుళ్ళ మందులు కలిపి పిచికారి చేయాల్సివచ్చినప్పుడు దిగువ జాగ్రత్తలు తీసుకోవాలి.

బోర్డోమిశ్రమం పిచికారి చేసేటప్పుడు నీటిలో కరిగే గంధకం, డైథయోకార్బోనేట్స్‌ తప్ప మరే ఇతర పురుగు మందులను కలుపరాదు. వీలైనంత వరకు బోర్డోమిశ్రమాన్ని అప్పటికప్పుడు తయారుచేసి శిలీంధ్రనాశినిగా వాడుకోవాలి. జింక్‌ సల్ఫేట్‌, యూరియా లాంటి పోషకాలను కలుపుకోవచ్చు.

జింక్‌ సల్ఫేట్‌-సున్నం మిశ్రమాన్ని పిచికారి చేసేటప్పుడు రాగి ధాతువు, గంధకం సంబంధ పదార్థాలు, బోర్డోమిశ్రమం తప్ప ఇతర పురుగు మందులు కలుప రాదు.

లైమ్‌-సల్ఫర్‌కు నీటిలో కరిగే గంధకం తప్ప ఏ ఇతర పురుగు మందులు కలుపరాదు.

బాక్టీరియా తెగుళ్ళ నివారణకు స్ట్రెప్టోమైసిన్‌ పిచికారి చేసేటప్పుడు బోర్డో మిశ్రమం, డైకోఫాల్‌ తప్ప ఇతర పురుగు, తెగుళ్ళ మందులు కలిపి పిచికారి చేసుకోవచ్చు.

మామిడి, బత్తాయి, నిమ్మలో పిందెరాలుడు అరికట్టడానికి పిచికారి చేసే 2.4-డి రసాయనాన్ని పైరెత్రిన్‌ మందులు తప్ప ఇతర పురుగు మందులు, తెగుళ్ళ మందులు, యూరియా, సూక్ష్మపోషక పదార్థాలతో కలిపి పిచికారి చేసుకోవచ్చు. మందుల్ని కలిపిన వెంటనే పిచికారి చేసుకోవాలి. నిల్వ ఉంచితే దాని ప్రభావం తగ్గుతుంది.

లోవాల్యుమ్‌ స్ప్రేయర్లు అంటే పవర్‌ స్ప్రేయర్లు. హైవాల్యుమ్‌ స్ప్రేయర్లు అంటే మామూలు కంప్రెషన్‌ స్ప్రేయర్లు. ఈ రెంటిలో ఏది వాడినా ఎకరానికి వాడాల్సిన మందు పరిమాణంలో తేడా ఉండదు. అయితే పవర్‌స్ప్రేయర్లు వాడినప్పుడు నీటి పరిమాణం మూడవ వంతుకు తగ్గించవచ్చు. అందుకే మామూలు స్ప్రేయర్లతో కంటే పవర్‌ స్ప్రేయర్లు వాడినప్పుడు మందు మూడురెట్లు అధికంగా కలపాలి.

వృక్ష సంబంధిత పదార్థాలు ముఖ్యంగా వేప గింజల ద్రావణం చల్లడం వల్ల పైరుపైన పురుగులు గుడ్లు పెట్టడం తగ్గుతుంది. చిన్న పురుగుల్లో పెరుగుదల లోపిస్తుంది.

పురుగు మందులు వాడేటప్పుడు టీపాల్‌ సబ్బుపొడి, ఇతర జిగురు పదార్ధాలు కలుపడం వల్ల మందు ద్రావణం పైరు ఆకులకు పట్టుకొనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పురుగు మందులలో వంటనూనెలు కలిపి చల్లినప్పుడు మందుల ప్రభావం అధికంగా ఉంటుంది.

చేతిపంపులతో పిచికారి చేస్తే ద్రావణం చిన్న చిన్న తుంపర్లలాగా ఆకులపైపడి సమానంగా వ్యాపించక పురుగుల, తెగుళ్ళ నివారణ సరిగా జరుగదు. అదే పవర్‌స్ప్రేయర్లతో పిచికారి చేస్తే మందు ద్రావణం పొగలాగ మొక్కలోని అన్ని భాగాలకు వ్యాపించి పురుగు, తెగుళ్ళ నివారణ బాగా జరుగుతుంది.

- డా|| ఆర్‌. శ్రీనివాసరావు, శాస్త్రవేత్త,

డా|| యం. వెంకట్రాములు, శాస్త్రవేత్త,

డా|| జె. హేమంతకుమార్‌, కో-ఆర్డినేటర్‌, డాట్‌ సెంటర్‌, ఖమ్మం,

డా|| పి. రఘురామిరెడ్డి, ూణ=, =ూ=ూ, వరంగల్‌