సంవత్సరం పొడవునా కాయలిచ్చే నిమ్మ ఔషదగుణాలకు అమ్మ వంటిది. అధిక మోతాదులో విటమిన్‌-సి ని కలిగి ఉండడం వల్ల మానవశరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి ఆకలిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాక నిమ్మలో యాంటిఆక్సిడెంట్లు. మినరల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ, జుట్టులో దీర్ఘకాలిక చుండ్రు నివారణకు ఎంతగానో దోహదపడతాయి.

నిమ్మ తెలంగాణలో నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాగుచేయబడుతుంది. రాష్ట్రంలో 52.53 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిమ్మ సాగుచేయబడుతూ 84055 వేల మిలియన్‌ టన్నుల దిగుబడిని ఇస్తుంది. 100 గ్రా. నిమ్మ రసంలో పోషక విలువలు క్రింది పట్టికలో చూపిన విధంగా ఉన్నాయి.

నిమ్మకి సంవత్సరం పొడవునా కాయలిచ్చే లక్షణం ఉండడం వల్ల మన మార్కెట్‌ అవసరాలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, నేల రకాలను బట్టి కావలసిన సమయంలో కాయలు ఇచ్చే విధంగా నిమ్మ చెట్ల పూత సమయాన్ని నిర్ణయించవచ్చు. ఈ విధంగా పూయించడాన్ని బహార్‌ పద్ధతి, వాడు, ఎండకట్టడం అంటారు.

బహార్‌ యొక్క ఆవశ్యకత :

సహజంగా నిమ్మ జాతి మొక్కలు సంవత్సరం పొడవునా పూతను అందిస్తాయి. కానీ దీనివల్ల రైతులకు సరైన దిగుబడి అందదు. కాబట్టి ఒక్క సీజన్‌లో మాత్రమే అధిక దిగుబడిని పొందడం కోసం మొక్కలో ఒత్తిడి పెంచి నిర్ణీత సమయంలో పూత తీసుకురావలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో నిమ్మజాతి మొక్కలు మూడు కాలాల్లో పూతను, కాపును ఇస్తాయి.

మినరల్స్‌ విటమిన్లు
పొటాషియం-138 మి.గ్రా. సి-53 మి.గ్రా.
కాల్షియం-26 మి.గ్రా. బి4-5.1 మి.గ్రా.
పాస్ఫరస్‌-16 మి.గ్రా. బి5-0.19 మి.గ్రా.
మెగ్నీషియం-8 మి.గ్రా. ఇ-0.15 మి.గ్రా.
సోడియం-2 మి.గ్రా. బి6-0.08 మి.గ్రా.
ఇనుము-0.6 మి.గ్రా. బి1-0.04 మి.గ్రా.
జింక్‌-0.06 మి.గ్రా. బి2-0.02 మి.గ్రా.
కాపర్‌-0.037 మి.గ్రా. ఎ-4 మైక్రో.గ్రా.
ఎండగట్టడం పూత కాపు
అంబె-నవంబరు, డిసెంబరు జనవరి-ఫిబ్రవరి జూన్‌-జులై
మ్రిగ్‌-మే జూన్‌ నవంబరు
హస్త-ఆగస్టు-సెప్టెంబరు అక్టోబరు-నవంబరు మార్చి-ఏప్రిల్‌

నీటి సమృద్ధి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేసవికాలంలో చెట్లకు నీరు పెట్టడం సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల వారు మ్రిగ్‌ బహర్‌ను అనుసరించడం మంచిది. వేసవికాలంలో చెట్లను వాడబెట్టినట్లయితే వర్షాకాలంలో నీరు పెట్టవచ్చు. ఏ ప్రాంతాలైతే పండ్ల రసాన్ని పీల్చే రెక్కలపురుగు సమస్యను కలిగి ఉన్నాయో ఆయా ప్రాంతాలవారు మ్రిగ్‌ బహార్‌ను అనుసరించకపోవడమే మంచిది. ఎందుకంటే జూలై-ఆగస్టులో (పిందె దశ) రెక్కల పురుగు సమస్య అధికంగా ఉంటుంది.

ఏ ప్రాంతాలైతే నీటి సమృద్ధి తక్కువగా ఉండి, పండ్ల రసాన్ని పీల్చి రెక్కల పురుగు సమస్య కూడా కలిగి ఉంటాయో వారు మ్రిగ్‌ బహార్‌ను అనుసరిస్తూ రెక్కల పురుగు నివారణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. హెక్టారుకు ఒక ఫ్లోర్‌సెంట్‌ బల్బులు కాయలు పక్వానికి రాక ముందు అంటే ఒక నెల ముందు ప్రతిరోజూ రాత్రి 7 గం|| నుండి ఉదయం 6 గం|| వరకు పెట్టాలి. లైట్ల కింద మలాథియాన్‌ 1 మి.లీ. మందు మరియు ఒక శాతం పంచదారను పండ్ల రసంలో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగును అరికట్టడం ద్వారా మ్రిగ్‌ బహార్‌ను అనుసరించవచ్చు.

ఎక్కడైతే సంవత్సరం పొడవునా నీరు పుష్కరలంగా అందుబాటులో ఉంటాయో వారు అంబె బహారును అనుసరించడం మంచిది. ఎందుకంటే వేసవికాలంలో నిమ్మకు మార్కెట్‌ డిమాండ్‌ అధికంగా ఉండడం వల్ల రైతులు మంచి లాభాలు తీయవచ్చు.

బహార్‌ పద్ధతి :

పూత సమయానికి నెల ముందు నీటితడులు బాగా తగ్గించి నీటిని ఆపివేయడం వల్ల ఆకులు వాడిపోయి రాలిపోతాయి. దీన్నే బహార్‌ అంటారు. వాడు బెట్టడానికి ముందుగానే పాదులు చేసుకోవాలి. వాడు పెట్టిన తరువాత చెట్లకు పాదులు చేస్తే చెట్లు షాక్‌కి గురై పూర్తిగా ఎండిపోవడం గానీ, తక్కువ దిగుబడిని ఇవ్వడం గానీ జరుగుతుంది. చెట్టు యొక్క కాండానికి 1.5 అడుగుల దూరం నుండి పాదులు చేసుకోవాలి. తరువాత మొక్కలను ఎండబెట్టాలి. ఆ తరువాత పాదిలో 10 సెం.మీ. లోతులో మట్టిని గుల్ల చేసి, సూచించిన మోతాదులో చెట్టు వయసును బట్టి ఎరువులను అందించి నీరు కట్టినట్లయితే పూత బాగా వస్తుంది.

ఇటువంటి పరిస్థితుల్లో మొదటి తడిని తక్కువగా ఇచ్చి ఆ తరువాత నుండి ఎక్కువ నీరు అందించినట్లయితే మొదటి తడి తరువాత నెల రోజులకు పూత ప్రారంభమవుతుంది. చెట్టు కాండానికి 1.5 అడుగు దూరంలో 1 చెట్టుకు 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 400 గ్రా. యూరియా, 1 కిలో ఎస్‌.ఎస్‌.పి, 1/2 కిలో ఎం.ఓ.పిలను 10 సెం.మీ. లోతు వరకు మట్టిని గుల్లచేసి చెట్టుపాదులో వేసి నీటి తడులను ఇవ్వాలి. సేంద్రీయ ఎరువులను వాడాలనుకునే వారు ఘన జీవామృతం ద్రవ జీవామృతం వాడొచ్చు. అంతేగాక పులిసిన మజ్జిగ స్ప్రే చేయడం వల్ల నిమ్మ తెగులును నివారించవచ్చు. ద్రవ జీవామృతాన్ని నిమ్మ చెట్లపై పిచికారి చేయడం వల్ల నిమ్మ ఆకు ముడతను అరికట్టవచ్చు.

నీటి యాజమాన్యం :

ఎరువులను ఫెర్టిగేషన్‌ విధానం ద్వారా అందించినప్పుడు అధిక పండ్ల దిగుబడితో పాటు 25 శాతం ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు. కానీ బహార్‌కి మొదటి తడిని మాత్రం డబుల్‌ రింగ్‌ పద్ధతిలో కట్టడం మంచిది. మొదట పిల్ల పాదిని 2-4 అడుగుల వ్యాసంలో మొక్క మొదలు దగ్గరగా చేసి చెట్టు మొదలుకు నీరు తాకకుండా చూడాలి.

నిమ్మలో పూత నియంత్రణ :

అధిక దిగుబడులు సాధించడానికి పూతను ముందుగానే నియంత్రించవచ్చు. బహార్‌ తరువాత నీటి తడులకు ముందు ఎరువులతో పాటు 50 పి.పి.యం (50 మి.గ్రా. / లీటరు నీటికి), జిబ్బరిల్లిక్‌ ఆమ్లాన్ని, పిందె దశలో ఉన్ప్పుడు 1000 పి.పి.యం సైకోలెస్‌ ద్రావణాన్ని ఆ తరువాత 1 శాతం పొటాషియం నైట్రేట్‌ ద్రావణాన్ని (10 గ్రా. / లీటరు నీటికి) పిచికారి చేయాలి.

పూత, పిందె రాలడాన్ని అరికట్టుట :

నీటి ఒడిదుడుగులు హఠాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులు, కొన్ని రసాయనిక చర్యలు చెట్లలో జరగడం వల్ల పిందె, కాయ రాలడం జరుగుతుంది. చెట్లు పూత, పిందెలతో ఉన్ప్పుడు తవ్వడం, దున్నడం చేయరాదు. ఎండలు ముదిరే కొద్దీ క్రమం తప్పకుండా నీరు కట్టాలి. 1 మి.లీ. ప్లానోఫిక్స్‌ 4.5 లీ. నీటిలో లేదా 10 పి.పి.యం 2,4-డి మందు (1 గ్రా. 100 లీ. నీటిలో) కలిపి పూత సమయంలో ఒక మారు కోతకు రెండు నెలల ముందు పిచికారి చేయడం వల్ల పిందెరాలుడును అరికట్టి మంచి దిగుబడి సాధించవచ్చు.

వై. పూజ, డా|| సి.హెచ్‌. రాజాగౌడ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

శ్రీ కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 9676499546