దక్షిణ భారతదేశంలో ఇంటి పెరటిలో పెంచే బహువార్షిక మొక్కగా మునగ ప్రముఖ స్ధానాన్ని సంపాదించుకుంది. కానీ ప్రస్థుతం ఏక వార్షిక రకాలు అందుబాటులోకి రావటంతో రైతులు మునగకి ఉన్న మార్కెట్‌ డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకొని వ్యాపార సరళిలో మునగను సాగుచేయుటకు ఉత్సాహంచూపుతున్నారు. మునగలో లేత కాయలనే కాక మునగ ఆకును కూడా కూరగా వాడతారు. దీని ఆకుల్లో విటమిన్‌ ఎ.సి. మరియు కాల్షియం, ఐరన్‌ ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఆకుల నుంచి తీసిన రసంలో బ్యాక్టీరియా నిరోధక గుణం కలదు. దీనిలో ఔషద గుణాలు ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకుల గుజ్జును పండ్లపై పూతగా కూడా వాడతారు.

వాతావరణం :

మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మునగ పంటను సాగుచేయవచ్చు. నీటి వసతిగల ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇది ఉష్ణమండలపు పంట కనుక వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. అధిక చలిని, మంచును తట్టుకోలేదు. పగటి ఉష్ణోగ్రతలు 20-250 ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం.

నేలలు :

నీరు నిలవని ఎర్రనేలలు, ఇసుక భూములు, ఒండ్రునేలలు, మునగసాగుకు అనుకూలమైనవి. మురుగునీరు పోయే నల్లరేగడి నేలలు కూడా అనుకూలం. కొద్దిపాటి సున్నం ఉన్న నేలల్లో కూడా మునగ నుంచి మంచి దిగుబడులను పొందవచ్చు. సాధారణంగా నేల ఉదజని సూచిక 8.0-8.5 వద్ద కూడా మధ్య ఉంటే మంచిది.

రకాలు :

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన పి.కె.యం-1 రకం, వార్షిక మునగ సాగుకు అనుకూలమైనది. మొక్కలు 6 మీ. ఎత్తు వరకు పెరిగి, నాటిన 90-100 రోజుల్లో పూతకు వస్తుంది. మొదటి కోత నాటిన 160-170 రోజుల్లో వస్తుంది. కాయలు పొడుగ్గా (65-70 సెం.మీ), లావుగా, లేత గులాబి రంగులో ఉంటాయి. కాయలు అధిక గుజ్జుతో రుచికరంగా ఉంటాయి. ఇది నాటిన 6 నెలల్లో కాపుకు వచ్చి రెండు సంవత్సరాల్లో 3 కాపునిస్తుంది. కాయబరువు 150 గ్రా|| దిగుబడి 200-250 కాయలు /1 మొక్కకి./ 1సం ||

ప్రవర్థనం :

ఏక వార్షిక రకాలను విత్తనం ద్వారా వ్యాప్తి చేస్తారు. కిలో విత్తనంలో సుమారుగా 2500-2600 గింజలు ఉంటాయి. గింజలు కాయల నుండి తీసిన 75-90 రోజులలోపే నాటుకుంటే 90-95 శాతం విత్తనాలు మొలకెత్తే అవకాశముంటుంది. సేకరించిన విత్తనాన్ని కిలో విత్తనాలకి 2-3 గ్రా|| కాప్టాన్‌ లేదా మాంకోజెబ్‌తో విత్తన శుద్ధి చేయాలి. విత్తనాలను నేరుగా పొలంలో విత్తుకోవచ్చు లేదా పాలిథీన్‌ సంచుల్లో విత్తి 15-20 సెం.మీ. ఎత్తు పెరిగిన తరువాత పొలంలో నాటుకోవచ్చు. నాటిన 10-12 రోజులలో విత్తనం మొలకెత్తుతుంది. ఒక ఎకరానికి 250-300 గ్రా|| విత్తనం సరిపోతుంది. విత్తనాలను పాలథీన్‌ సంచుల్లో విత్తినప్పుడు 40 రోజుల్లో మొక్కలు తోటల్లో నాటడానికి సిద్దమౌతాయి. నారుమడిలో ఆకులను తినే తుట్ట పురుగు ఆశించినప్పుడు 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

నాటడం :

పొలాన్ని దున్ని కలుపు లేకుండా శుభ్రం చేయాలి. నేలను చదును చేసి 2-5 మీ. ఎడంలో వరుసలను ఏర్పరచుకొని, ఒక్కో వరుసలో 2.5 మీ. ఎడంలో 44I45I45 ఘనపు సెం.మీ గుంతలు తీసి మొక్కలను నాటుకోవాలి. ప్రతి గుంతకు 10 కిలోల పశువుల ఎరువు, 250 గ్రా|| వేపపిండి మరియు 200 గ్రా|| సూపర్‌ ఫాస్పేట్‌ వేయాలి. మొక్కలను నాటేటప్పుడు వేర్లకు ఏమాత్రం హాని కలుగకుండా గుంతల్లో సంచిని మాత్రమే తొలగించి, మట్టితో సహా మొక్కలను గుంతల్లో నాటుకోవాలి. ఎకరా పొలంలో నాటుకోవడానికి 640 మొక్కలు సరిపోతాయి.

అధిక సాంద్రతలో పి.కె.యం 1 రకాన్ని 1.5I1మీ. ఎడంలో మరియు పి.కె.యం 2 ని 1.2I1.2 మీ. ఎడంలో నాటిన ఎడల అధిక దిగుబడిని (ఒక హెక్టరుకి 138 టన్నులు) పొందవచ్చును.

నాటేకాలం :

మునగను జూన్‌ నుండి ఆగష్టులో నాటుకోవడం లాభదాయకం. అంటే సుమారు ఫిబ్రవరి-మార్చిలో కాయలు కోతకు వస్తాయి కనుక ఫిబ్రవరి - మార్చికి 7-8 నెలల ముందుగా మొక్కలను నాటుకోవడం మంచిది.

నీటి యాజమాన్యం :

నాటిన వెంటనే నీరు పెట్టాలి. నేల స్వభావాన్ని బట్టి 15-20 రోజులకు నీళ్ళతో తడి చేయాలి. వర్షాకాలం సకాలంలో వర్షాలు పడితే మునగకు నీరు పెట్టకపోయిన, దిగుబడిలో ఎటువంటి మార్పు ఉండదు. మునగ కొంత వరకు నీటి ఎద్దడిని తట్టుకోగలదు. కానీ పూత సమయంలో నీటి పారుదలలో ఒడుదుడుకులుంటే పూత రాలిపోతుంది. పూత, కాయలు వచ్చే సమయంలో 4-6 రోజులకొకసారి నీరు పెట్టుకుంటే మంచి దిగుబడులను పొందవచ్చు. డ్రిప్పు ద్వారా అయితే రోజు 10-15 లీటర్ల నీరు ఇవ్వాలి.

ఎరుపులు :

పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కిచేసి, ఆఖరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి, లేదా ప్రతి గుంతకు 10 కి., పశువుల ఎరువుతో పాటు 250 గ్రా|| వేపపిండి, 250 గ్రా|| సూపర్‌ ఫాస్పేట్‌ వేయాలి. నాటిన 3, 6, 9 నెలలకు ఒక్కో మొక్కకు 100 గ్రా || యూరియా, 50 గ్రా|| యం.ఒ.పి., 50 గ్రా|| జిప్సం వేసి నీరు పారించాలి. కాయలు కోతకు వవ్చే సమయం నుండి 25-30 రోజులకొకసారి చెట్టుకి 75-100 గ్రా|| 17:17:17 ఎరువలను వేయాలి. దీని వల్ల కాయసైజు పెరుగుతుంది.

అంతరకృషి :

మొక్కలు 75 సెం.మీ. ఎత్తు పెరగగానే వాటి చివర్లు తుంచి వేస్తే పక్కకొమ్మలు వచ్చి కాపు ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు కూడా 2 అడుగుల లోపే తుంచి వేస్తే మొక్కలు గుబురుగా పెరిగి ఎక్కువ పూత కోత వచ్చే అవకాశముంది. కాయలు కోసిన తరువాత చెట్లను ఒక మీ. ఎత్తు వరకు కత్తిరించి రెండవపంటకు పైన తెలిపిన మోతాదులో ఎరువు వేసి నీరు పెట్టాలి. ఏక వార్షిక రకాల నుండి ఈ విధంగా 3 సంవత్సరాల వరకు పంటను తీసుకోవచ్చు. మునగలో అంతరపంటగా అలసంద, బెండ, వంగ, గోరుచిక్కుడు, ఫ్రెంచ్‌ చిక్కుడు మొదలగు కూరగాయలను మరియు ఆకు కూరలను వేసుకోవచ్చు.

సస్యరక్షణ :

మునగలో వివిధ రకాల చీడపీడల వల్ల దిగుబడి, కాయ నాణ్యత తగ్గి అపార నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడల్లో ముఖ్యమైనవి.

ఆకుతినే తుట్ల పురుగు / గొంగళి పురుగు :

వర్షాకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగులు రాత్రి వేళల్లో ఆకులను తిని పగలు కాండం మీద ఒకే చోట చేరుతాయి. నివారణకు పురుగులకు మాత్రమే తగిలేలా మంట పెట్టాలి.

ఆకులు చిరుకొమ్మలతో కలిపి కట్టిన గూళ్ళను గమనించిన వెంటనే 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. గొంగళి పురుగులు కోశస్థ దశలో నేలలో నిద్రావస్థకు పోతాయి. అందుకని చెట్టు చుట్టూ తవ్వి కార్బరిల్‌ 10 శాతం పొడి లేదా కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలు మొక్కకు 15-30 గ్రా. వేసి మట్టితో కలపాలి

కాయతొలిచే ఈగ :

వార్షిక మునగలో జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈగలు పిందెలు చివరి భాగంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి. నులి పరురుగులు పూర్తిగా లోపలికి చొచ్చుకుని పోయి గుజ్జును తినడం వల్ల కాయ పూర్తిగా అభివృద్ధి చెందదు. కాయ చివరి భాగం ఎండిపోయి సన్నగా మారుతుంది. ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు రంధ్రాల నుంచి బంక కారుతుంది. నివారణకు పూత మొదలయ్యే దశలో 2 మి.లీ. జోలాన్‌, పూర్తిగా పూత వచ్చిన దశలో 2 మి.లీ. డైమిధోయేట్‌, పిందె కట్టిన దశలో ఫిప్రోనిల్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు :

ఇది చిగుళ్ళ నుంచి రసం పీల్చడం వల్ల కొత్త చిగుళ్ళు రాక, వచ్చినా గిడస బారిపోయి చెట్లు వెర్రి తెగులు సోకిన విధంగా మారతాయి. ఈ చెట్లలో పూత కాపు ఉండదు. నివారణకు 2 మి.లీ. మెటాస్టాక్స్‌ లేదా ఎసిఫేట్‌ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాండం తొలుచు పురుగు :

లద్దెపురుగు కాండంపైన రంద్రం చేసి లోపలికి తొలుచుకునిపోతుంది. దీని ఉనికిని కాండం దగ్గర రంపపు పొడిని లేదా తెల్లటి పొడిని చూసి గుర్తుపట్టవచ్చు. నివారణకు రంద్రాలలో ఇనుప చువ్వను చొప్పించి పురుగులను చంపేయాలి. రంద్రాల్లో కిరోసిన్‌ లేదా పెట్రోల్‌ ముంచిన దూదిని లేదా బిళ్ళలను రంద్రాల్లో ఉంచి పైన మట్టితో కప్పాలి.

తెగుళ్ళు :

వేరు కుళ్ళు, కాండం కుళ్ళు :

వర్షాకాలంలో మురుగు నీరు సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళిపోయి చెట్లు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. నిరవారణకు మొక్కల మొదలు వద్ద 1 గ్రా., కార్బండైజమ్‌ లేదా 3 గ్రా. డైధేన్‌ యం.45 ఒక లీటరు నీటికి కలిపి ద్రావణం గాని లేదా 1 శాతం బోర్డ్‌ మిశ్రమాన్ని గాని ముంపుగా తడపాలి. మొక్క మొదలు వద్ద మురుగు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి చెట్టు మొదల్లో ట్రైకోడెర్మా విరిడి (2 కిలోలు/ఎకరాకు) కలిపిన పశువుల ఎరువును 5 కిలోల చొప్పున వేయాలి.

దిగుబడి :

ఏక వార్షిక రకాలైన పి.కె.యం.1 ఒక సం.కు. 250-270 కాయలని ఇస్తుంది. ఒక సంవత్సరానికి ఒక చెట్టు నుంచి 50-55 టన్నుల దిగుబడిని పొందవచ్చు. ప్రతి సం|| ఒక్కొ మొక్కకు 25 -30 కిలోల పశువుల ఎరువు వేసి, రసాయన ఎరువులు పైన చెప్పిన మోతాదులో వేసి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ప్రతి సం|| మంచి దిగుబడి పొందవచ్చు.

డా|| జి. క్రాంతి రేఖ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హార్టి), .

డి. త్రివేణి, డి. శ్రీకాంత్‌, ఉద్యాన పరిశోధనా స్థానం,

వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా,

ఫోన్‌ : 957163997, 94438813