నూనె గింజలు, అపరాలు మరియు చిరుధాన్యాల్లో

అధిక దిగుబడి సాధించుటకు ఖరీఫ్‌కి అనువైన రకాలు వాటి గుణగణాలు

భారతదేశంలో నూనెగింజలు, అపరాలు సాగుచేయడంలో ముందంజలో ఉన్నప్పటికీ సగటు దిగుబడి తక్కువగా ఉంది, కాబట్టి మేలైన వంగడాలను ఎంపిక చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అలాగే చిరుధాన్యాల సాగు వల్ల రైతుకు ఆదాయ భద్రత, పర్యావరణ సంరక్షణ మరియు వినియోగదారునికి ఆరోగ్య భద్రత ఉంటుంది. కాబట్టి ఉత్తమ దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకొని విత్తుకోవడం మంచిది.

మేలైన వేరుశనగ రకాలు :

కదిరి - 6 :

చిన్న గుత్తిరకం, గింజ పరిమాణం జె.ఎల్‌-24 కంటే 5 శాతం పెద్దదిగా ఉంటుంది. పంటకాలం 100 రోజులు. నూనె శాతం 48 వరకు ఉంటుంది. ఎకరాకు 800-880 కిలోల దిగుబడిని ఇస్తుంది.

కదిరి- 9 :

చిన్నగుత్తిరకం, వర్షాభావ పరిస్థితులను, బెట్టను బాగా తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్ళు తెగుళ్ళను, రసం పీల్చే పచ్చదోమ, తామర పురుగులు, నులిపురుగు, ఎర్రనల్లిని తట్టుకుంటుంది. నిద్రావస్థ 30 రోజులు. పంట కాలం 105-110 రోజులు. నూనె శాతం 52 వరకు ఉంటుంది. ఎకరాకు 800-1000 కిలోల దిగుబడిని ఇస్తుంది.

కదిరి హరితాంధ్ర :

బెట్టను,ఆకుమచ్చ తెగులును, తామర పురుగులను తట్టుకుంటుంది. పక్వదశ వరకు ఆకుపచ్చగా ఉండి, ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది. నూనె శాతం 48 వరకు ఉంటుంది. ఎకరాకు 800-1000 కిలోల దిగుబడిని ఇస్తుంది.

కదిరి అమరావతి :

మేలైన చిన్న గుత్తి రకం. ఆకుమచ్చ తెగులును, రసం పీల్చే పురుగులను, మొవ్వు కుళ్ళును, కాండం కుళ్ళు వైరస్‌ తెగులును సమర్ధవంతంగా తట్టుకొనే రకం. పంట కాలం 115-120 రోజులు. నూనె శాతం 50 వరకు ఉంటుంది. ఎకరాకు 800-1000 కిలోల దిగుబడిని ఇస్తుంది.

ధరణి :

చిన్న గుత్తి రకం, బెట్టను తట్టుకుంటుంది. మొక్కలు మధ్యస్థంగా ఉంటాయి. పంట కాలం 100-105 రోజులు. నూనె శాతం 49 వరకు ఉంటుంది. ఎకరాకు 600-1000 కిలోల దిగుబడిని ఇస్తుంది.

ఐ.సి.జి.వి. 91114 :

తొందరగా పంటకు వస్తుంది. పంట మధ్యకాలం, ఆఖరిదశలో వచ్చే బెట్టను తట్టుకుంటుంది. పంట కాలం 100 రోజులు. నూనె శాతం 48 వరకు ఉంటుంది. ఎకరాకు 800-900 కిలోల దిగుబడిని ఇస్తుంది.

నిత్యహరిత :

రసంపీల్చే పురుగులను తట్టుకుంటుంది. మొక్క చిన్నగా ఉండి పక్కకొమ్మలు ఎక్కువగా వస్తాయి. నేలలోని తేమను బాగా ఉపయోగించుకుంటుంది. గింజల్లో నిద్రావస్థ 20 రోజులు ఉంటుంది. పంట కాలం 105-110 రోజులు. నూనె శాతం 50 వరకూ ఉంటుంది. ఎకరాకు 1000 కిలోల దిగుబడిని ఇస్తుంది.

మేలైన కంది రకాలు :

ఎల్‌.ఆర్‌.జి-41 :

పైరు ఒకేసారి పూతకు రావడం వల్ల కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు అనుకూలం. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు. పంటకాలం 180 రోజులు. ఎకరాకు 8-10క్వి. దిగుబడిని ఇస్తుంది.

పి.ఆర్‌.జి-158 :

ఎండుతెగులును కొంత వరకు తట్టుకుంటుంది. రాయలసీమ ప్రాంతాల్లోని తేలికపాటి, ఎర్ర చల్కా నేలల్లో వర్షాధారంగా సాగుచేయడానకి అనువైనది. పంటకాలం 145-150 రోజులు. ఎకరాకు 6-7క్వి. దిగుబడిని ఇస్తుంది.

ఎల్‌.ఆర్‌.జి-52 :

ఎండుతెగులును మరియు వెర్రి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. గింజలులావుగా ఉంటాయి. పంటకాలం 155-160 రోజులు. ఎకరాకు 8-9 క్వి. దిగుబడిని ఇస్తుంది.

పి.ఆర్‌.జి-176 :

బెట్టను తట్టుకుంటుంది. తేలికపాటి ఎర్రనేలలకు అనువైన రకం.

మేలైన ఆముదం రకాలు :

డి.సి.హెచ్‌-519 :

ఎండుతెగులును తట్టుకుంటుంది. పంటకాలం 90-180 రోజులు. ఎకరాకు 6.0-7.5క్వి దిగుబడిని ఇస్తుంది.

చిరుధాన్యాలు :

మేలైన రాగి రకాలు :

చంపావతి (వి.ఆర్‌-708) :

ఈ రకం అన్ని కాలాలకు పనికి వస్తుంది. రాగి పండించే అన్ని ప్రాంతాలకు అనువైనది. అంతర పంటగా కందితో పండించేందుకు అనువైనది. బెట్టను తట్టుకుంటుంది. పంటకాలం 80-85 రోజులు. ఎకరానికి 10-12 క్వి. దిగుబడిని ఇస్తుంది.

భారతి (వి.ఆర్‌-762) :

ఈ రకం అన్ని కాలాలకు పనికి వస్తుంది. వెన్నులు పెద్దగా ముద్దగా ఉంటాయి. అగ్గితెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 14-16క్వి దిగుబడిని ఇస్తుంది.

శ్రీ చైతన్య :

పైరు ఎత్తుగా పెరిగి పిలకలు ఎక్కువగా వేస్తుంది. ఖరీఫ్‌లో అన్ని ప్రాంతాలకు అనువైనది. పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 13-15 క్వి . దిగుబడిని ఇస్తుంది.

మేలైన కొర్ర రకాలు :

సూర్యనంది ఎస్‌.ఐ.ఎ-3088 :

గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. అగ్గితెగులును మరియు వెర్రితెగులును తట్టుకుంటుంది. అంతర పంటగా వేసుకోవచ్చు. పంటకాలం 75 రోజులు. ఎకరాకు 10-12క్వి దిగుబడిని ఇస్తుంది.

ప్రసాద్‌ :

కంకులు పెద్దగా ఉండి గింజలు లావుగా, లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 100 సెం.మీ. ఎత్తు పెరిగి ఆకులు వెడల్పుగా ఉండి, 3,4 పిలకలు వేస్తాయి. పంటకాలం 70-75 రోజులు. ఎకరాకు 8-12 క్వి. దిగుబడిని ఇస్తుంది.

కష్ణ దేవరాయ :

గింజలు లావుగా, లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 సెం.మీ. ఎత్తు పెరిగి 4-6 పిలకలు వేస్తాయి. చొప్ప నాణ్యమైనది. పంటకాలం 80-85 రోజులు. ఎకరాకు 10-12క్వి. దిగుబడిని ఇస్తుంది.

ఎస్‌.ఐ.ఎ-3156 :

అధిక గింజ దిగుబడి, వెర్రితెగులును తట్టుకుంటుంది. పంటకాలం 80-85 రోజులు. ఎకరాకు 11-13 క్వి. దిగుబడిని ఇస్తుంది.

ఎస్‌.ఐ.ఎ-3085 :

బెట్టను తట్టుకుంటుంది. అగ్గితెగులును, గింజ బూజు తెగుళ్ళను తట్టుకుంటుంది. గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. పంటకాలం 80-85 రోజులు. ఎకరాకు 10-12క్వి. దిగుబడిని ఇస్తుంది.

ఎస్‌.ఐ.ఎ-3222 :

అన్ని కాలాలకు అనువైనది. అతి స్వల్పకాలిక రకం. పంట సరళిలో అనువైనది. యాంత్రీకరణకు అనువైన రకం. పంటకాలం 58-62 రోజులు. ఎకరాకు 6-8 క్వి దిగుబడిని ఇస్తుంది.

ఊద రకాలు :

డి.హెచ్‌.బి.ఎం-93-3 :

పంటకాలం 90-95 రోజులు. ఎకరాకు 9-10 క్వి దిగుబడిని ఇస్తుంది.

యస్‌. నజ్మ, రీసర్చ్‌ అసోసియేట్‌ (సస్య ఉత్పత్తి), బి. షైనీ ప్రియాంకా, రీసర్చ్‌ అసోసియేట్‌ (సస్య రక్షణ), కె. రాఘవేంద్ర (ఎస్‌.ఎం.ఎస్‌, విస్తరణ),

డా. జి. ప్రసాద్‌ బాబు (సమన్వయకర్త), ఏరువాక కేంద్రం, బనవాసి.