ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్యపరంగా సాగుచేయబడుతున్న పూలమొక్కల్లో జెర్బెరా (జెర్బెరా జామ్‌సోని) ముఖ్యమైనది. ప్రపంచ పూల వాణిజ్యంలో ఎల్లప్పుడూ మొదటి 10 స్థానాల్లో జెర్బెరా ఒకటిగా ఉంటుంది. పలు రకాల శుభకార్యాల్లో అలంకరణకు ఉపయోగించే పూలలో జెర్బెరా పుష్పాలు పసుపు, నారింజ, తెలుపు, గులాబి, ఎరుపు, మెరున్‌, స్కార్లెట్‌ రంగుల్లో లభ్యమవుతాయి. కొన్ని రకాలు రెండు రంగులు మిశ్రమంగా కూడా లభిస్తాయి. ఈ పూల కాడలు చాలా పొడవుగా ఏ విధమైన ఆకులు లేకుండా ఉంటాయి. జెర్బెరా మొక్కలు కాండం లేకుండా గుబురుగా పెరుగుతాయి. ఆకులు పొడవుగా, చివరలు మందంగా ఉంటాయి. ఒకసారి నాటిన జెర్బెరా మొక్కలు 3-5 సంవత్సరాల వరకు పూలనిస్తాయి.

జెర్బెరాను ఆరుబయట పొలాల్లో (లేదా) హరితగృహాల్లో (లేదా) పాలీహౌస్‌ల్లో సాగుచేయవచ్చు. అయితే ఆరుబయట పొలంలో వేసిన జెర్బెరా కన్నా పాలీహౌస్‌ (లేదా) హరిత గృహాల్లో సాగుచేసిన జెర్బెరా పుష్పాలు మంచి నాణ్యత కలిగి అధిక దిగుబడిని ఇస్తుంది.

పాలీహౌస్‌ల్లో ఉష్ణోగ్రత, వెలుతురు, సాపేక్ష ఆర్థ్రత అదుపులో ఉంటాయి. వర్షాల నుండి, తుఫాను తాకిడి నుండి అధిక సూర్యకాంతి నుండి రక్షించవచ్చు. చీడపీడలు బాగా తక్కువ, ఒకవేళ వచ్చినా తక్కువ ఖర్చుతో నియంత్రించవచ్చు. నాణ్యమైన పూలను పండించవచ్చు. బయట ప్రదేశాల్లో కన్నా అధిక దిగుబడిని పొందవచ్చు.

పాలీహౌస్‌ల్లో జెర్బెరా సాగుకు అనువైన పరిస్థితులు :

బాగా గాలి, వెలుతురు, లభించే ప్రదేశాల్లో మురుగునీరు ఇంకే స్వభావం గల తేలికపాటి నేలలను ఎంపిక చేసుకోవాలి. నేల ఉదజని సూచిక 5.5-6.5 వరకు ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి. నేలకు లవణ సాంద్రత 1.5 సెం.మీ. కన్నా ఎక్కువ ఉండకూడదు.

పాలిహౌస్‌ పొడవు ఉత్తరం నుండి దక్షిణం దిశగా ఎత్తు 5.5-6.5 మీ. ఉండాలి. నిర్మాణానికి వాడే పాలిథీన్‌ షీటు మందం 200 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. ప్రతి రెండు పాలిహౌస్‌ల మధ్య కనీసం 4 మీ. దూరం ఉండాలి. వెలుతురు, సూర్యరశ్మి కావలసిన మేరకు ఉండాలంటే పాలీహౌస్‌ లోపల ఒకటి లేక రెండు తెలుపు వర్ణపు జాలీలను వాడాలి. పాలీహౌస్‌ లోపల ఒకటి లేదా రెండు తెలుపు వర్ణపు జాలీలను వాడాలి. పాలీహౌస్‌ లోపల వెలుతురు దాదాపు 35,000-40,000 లక్స్‌ ఉండాలి.

సాపేక్ష ఆర్థ్రత 80-85 శాతం ఉన్న ప్రదేశాలు అనుకూలం. ఇంతకంటే అధిక తేమ ఉన్నట్లయితే చీడపీడలు ఉదృతి మరియు పూల విరూపం జరిగే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత 22-250 సె., రాత్రి ఉష్ణోగ్రత 12-160 సె., ఉండాలి. 120 సె. కన్నా తక్కువ లేదా 250 సె. కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పూల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కలదు. కార్బన్‌ఆక్సైడ్‌ గాఢత 700 పిపియం ఉండేటట్లు చూసుకోవాలి.

నేలను తయారుచేసే విధానం :

పాలీహౌస్‌లో సాగుకు ముందుగా నేలను తయారు చేయాలి. తరువాత బెడ్లను తయారు చేయాలి. బెడ్లు 60-70 సెం.మీ. వెడల్పు, 30-40 సెం.మీ ఎత్తు, రెండు బెడ్ల మధ్య 30-40 సెం.మీ. కాలిబాట ఉండేటట్లుగా తయారు చేయాలి.

నేల శుద్ధి :

పాలీహౌస్‌లో సాగుకు ముందు నేలను క్రిమిసంహారకం చేయడం చాలా అవసరం. ఈ పద్ధతి ద్వారా హానికరమైన శిలీంద్రం మరియు బ్యాక్టీరియాలను నివారించవచ్చు.

వేడిమి పద్ధతి :

పద్ధతిలో 6-8 వారాలు నేలను నల్లటి పాలిథీన్‌ షీటుతో మూసి ఉంచాలి. అన్ని వైపుల నుండి సూర్మరశ్మిలోపలికి వచ్చే విధంగా ఉండాలి. ఈ విధంగా నేల వేడెక్కి తద్వారా మట్టిలోని హానికరమైన క్రిములు నాశనం చేయబడతాయి.

రసాయన పద్ధతి :

ఈ పద్ధతిలో రసాయనాలైన ఫార్మలిన్‌, మిధైల్‌ బ్రోమైడ్‌, డాజోమెట్‌ గుళికలు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ విత్‌ సిల్వర్‌ వంటి రాసాయనాలు వాడవచ్చు. రసాయన పద్ధతుల్లో ఫార్మలిన్‌ పద్ధతి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. మళ్ళను 2 శాతం ఫార్మలిన్‌ (100 మి.లీ. ఫార్మలిన్‌ను 5 లీటర్ల నీటికి)తో తడపాలి. ఈ గాఢతతో ఉన్న రసాయనాన్ని 10 వంతుల ఎక్కువ నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని నేలమీద పోయాలి. వెంటనే ప్లాస్టిక్‌ షీటుతో నేలను వారం రోజులపాటు కప్పి ఉంచాలి. వారం తరువాత వెంటనే లోపలికి ప్రవేశించకుండా ముందుగా పరదాలు ఎత్తి కనీసం 4-5 గంటల పాటు ఆగాలి. తరువాత నేలను కప్పిన షీటును తొలగించి అత్యధిక మోతాదులో 100 లీటర్ల నీటిని చదరపు మీటరు నేలపై పోయాలి. తద్వారా మట్టిలోని రసాయనం అంతా తొలగించబడుతుంది. ఈ పద్ధతి పూర్తవడానికి, మొక్కలు నాటడానికి మధ్య కనీసం రెండు వారాల సమయమైనా ఉండాలి. మిథైల్‌ బ్రోమైడ్‌ 25-30 గ్రా. / చ.మీ.రుకు, డాజోమెట్‌ గుళికలు 30-40 గ్రా. / చ.మీ.రుకు ఉపయోగించి క్రిములను నాశనం చేయవచ్చు.

అధిక దిగుబడినిచ్చే రకాల సాగు :

పాలీహౌస్‌లో సాగుకు కణజాల వర్థనం చేసిన జెర్బెరా మొక్కలను ఎంచుకోవాలి. ఎందుకంటే ఇవి ఒకే వయసు కలిగి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. సవన్నా, మెడగాస్కర్‌, వైసిడి-1 మరియు వైసిడి-2 (తమిళనాడు రకాలు) అల్కట్రాజ్‌, గోల్డ్‌స్పాట్‌, రోజబెల్ల రకాలు అందుబాటులో ఉన్నాయి.

మొక్కలు నాటే విధానం :

జెర్బెరాను ఆగష్టు నుండి నాటుకోవచ్చు. మొక్కలు నాటిన తరువాత 45-60 రోజుల్లో పూతకు వస్తాయి. మొక్కల్ని 30I30 సెం.మీ. దూరంలో ప్రతి బెడ్‌కు రెండు వరుసలుగా నాటుకోవాలి. రెండు వరుసల మధ్య దూరం 30-40 సెం.మీ వరకు ఉండవచ్చు. మొక్కల్ని పక్క పక్కగా కాకుండా జిగ్‌జాగ్‌ పద్ధతిలో నాటుకోవాలి. ఈ విధంగా నాటడం వల్ల మొక్కకు మొక్కకు మధ్య ఎక్కువ స్థలం ఉండి గాలి విస్తరణ, మొక్క పెరుగుదల అధికంగా ఉంటుంది. మొక్క క్రౌన్‌ భాగం బెడ్‌ ఉపరితలం కన్నా రెండు సెం.మీ. పైకి ఉండేలా నాటుకోవాలి. ఎందుకంటే మొక్క పెరిగి వేర్లు వృద్ధి చెందుతున్న కొద్దీ మొక్క భూమిలోకి లాగబడి క్రౌన్‌ నుండి పూలు రావడం వచ్చిన పూలు కోయడం ఇబ్బందిగా మారుతుంది. నాటిన వెంటనే 2-3 వారాలు శలీంధ్రనాశిని మందులు కాప్టాన్‌ 2 గ్రా. / లీటరు నీటికి బెనోమిల్‌ 2 గ్రా., లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం :

పాలిహౌస్‌లో నీటి యాజమాన్యానికి బిందు సేద్యం ఏర్పాటు చేసుకోవాలి. మొదటి 2-3 వారాల వరకు రోజ్‌కాన్‌ ద్వారా నీటిని ఇవ్వాలి. తరువాత నుండి బిందుసేద్యం ద్వారా నీటిని అందించాలి. పంట పండించే కాలం, పెరిగే దశ, నేల స్వభావం బట్టి ఒక జెర్బెరా మొక్కకు 500-700 మి.లీ. నీరు ఒక రోజుకు అవసరమవుతుంది. వేసవిలో ఎక్కువగాను, శీతాకాలంలో తక్కువగానూ నీటి వినియోగం ఉంటుంది.

ఎరువుల యాజమాన్యం :

జెర్బెరా మొక్కలు పెరిగే దశలో మొదటి మూడు మాసాల్లో 10:15:20 గ్రా., చ.మీ. నెల నెలకు నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను అందించాలి. పూత మొదలయ్యే నాలుగవ వారం నుండి 15:10:30 గ్రా., చ.మీ., నేలకు నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను రెండు సమభాగాలుగా 15 రోజుల వ్యవధితో అందించితే మంచి ఫలితం ఉంటుంది. సూక్ష్మధాతు పోషకాలైన బోరాన్‌, కాల్షియం, మెగ్నీషియం, రాగిలను 1.5 మి.గ్రా., / లీటరు నీటికి కలిపి నెల వ్యవధితో అందించినట్లయితే మంచి నాణ్యతతో కూడిన జెర్బెరా పూమొగ్గలను అధిక సంఖ్యలో పొందవచ్చు.

అంతర కృషి :

పండు బారిన, ఎండిపోయిన ఆకులను వెంటనే ఆకు తొడిమను వదలిపెట్టి పత్రాన్ని మాత్రం కత్తిరించి తీసివేయాలి. కొద్ది రోజులకు ఆకు కాడ కూడా వాడిపోతుంది. అలా ఎండిన వాటిని తొలగించాలి. 45 మైక్రాన్ల మందం గల మల్చ్‌ను బెడ్స్‌ పై అమర్చడం వల్ల మట్టిలోని తేమ కాపాడబడుతుంది. చల్లని వాతావరణాన్ని పెంచుతుంది. పిచ్చి మొక్కలు పెరగకుండా చేస్తుంది. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు పూల కాడలు పక్కకు వాలే అవకాశం ఉంది. పూల కాడలు నిటారుగా పెరుగుటకు వీలుగా బెడ్‌ పక్కన కర్రలు పాతి, మెత్తటి దారాన్ని బెడ్‌కు ఇరువైపులా మీటరు ఎత్తులో కట్టిన పూలు ఈ దారంపై వాలి నష్టం జరుగదు.

పూల కోత :

ఉదయం లేదా సాయంత్రం వేళలో పూలను కోయాలి. ఎప్పుడైతే బయట రెండు వరుసల పూరేకులు పూర్తిగా విచ్చుకుంటాయో అవి కోతకు సిద్ధంగా ఉన్నాయని అర్ధం. ఈ విధంగా పూర్తిగా తయారైన పూలను కాడ చివర్లో అంటే మొక్క యొక్క క్రౌన్‌ భాగం నుండి వేరు చేయాలి. కత్తిరించిన కాడలను వెంటనే వడలిపోకుండా క్లోరిన్‌ కలిపిన నీటిలో మునిగేటట్లుగా అమర్చాలి.

పూల కోత అనంతరం పాటించవలసిన జాగ్రత్తలు :

దూర ప్రాంతాలకు పూలను ఎగుమతి చేయదలచనివారు నీటిలో సోడియం హైపోక్లోరేట్‌ 7-10 మి.లీ. / లీటరు నీటికి సిట్రిక్‌ఆమ్లం 5 మి.లీ. + ఆస్కార్బిక్‌ ఆమ్లం 5 మి.లీ. లీటరు నీటికి కలపాలి. తద్వారా పూలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

పూల కాడలు 45-60 సెం.మీ. పొడవు, పూల వ్యాసం 9-12 సెం.మీ. ఉండాలి.

కోసిన పూలను 4/4 సెం.మీ. ఉన్న ప్లాస్టిక్‌ కవరులో ఒక పూవు తలను మాత్రం ఉంచి పూలకాడను మెత్తగా ఉన్న రబ్బరు బ్యాండుతో కట్టాలి.

ఒక కట్టకు 10 పూలు ఒకే రంగు (లేదా) ఒకే రకానికి చెందినవి ఉంచాలి.

ప్యాకింగ్‌ :

దూరప్రాంతాలకు పంపడానికి కార్డుబోర్డు పెట్టె (100I30I12 సెం.మీ.)లో ప్యాక్‌ చేయాలి. ఈ పెట్టెలో 150-200 పూలను అమర్చవచ్చును. సాధారణంగా జెర్బెరా కట్‌ఫ్లవర్‌ 8-10 రోజుల వరకు తాజాగా ఉంటుంది.

సస్య రక్షణ :

పాలిహౌస్‌లో సాగు చేసే జెర్బెరా మొక్కల్ని సాధారణంగా తెల్లదోమ, ఎర్రనల్లి, పేనుబంక, తామర పురుగులు, వేరుకుళ్ళు, తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరుస్తాయి.

తెల్ల దోమ :

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకుల నుండి రసంపీల్చి నష్టపరుస్తాయి.

నివారణ :

వీటిని నివారించేందుకు పాలిహౌస్‌లో జిగురు అట్టలను ఒక మీటరు ఎత్తులో కట్టించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

ఎసిఫేట్‌ 2 గ్రా. / లీటరు డైక్లోరోవాస్‌ 1 మి.లీ. / లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవాలి.

ఎర్ర నల్లి :

ఈ పురుగులు ముందుగా ఆకుల కింది భాగంలో రసం పీల్చడం వల్ల పడవ ఆకారంలో వెనుకకు వంగుతాయి. పూలు సరిగా విచ్చుకోవు. వీటి ఉధృతి ఎక్కువగా వేసవి కాలంలోనూ, చలి కాలంలోనూ ఉంటుంది.

నివారణ :

డైపెంతూరాన్‌ 1.5 గ్రా./ లీటరు (లేక) మిటిగేట్‌ 1.5 మి.లీ. / లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పేను బంక :

ఇవి గుంపులు, గుంపులుగా చేరి లేత ఆకులు, పూ మొగ్గల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు, పూలు ఎండిపోతాయి.

నివారణ :

ఎసిఫేట్‌ 2 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు :

ఇవి జెర్బెరాలో ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఈ పురుగులు ముఖ్యంగా పూ రెక్కలపై రసం పీల్చడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతాయి. పూల ఆకారం దెబ్బతింటుంది. ఆకులపై వెండి రంగులో మచ్చలు, ఆకు తొడిమలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగులు ఆశించిన మొక్కలు పెరుగుదల లోపించి గిడసబారి చనిపోతాయి. పూలు మార్కెట్‌కు పనికిరావు. ఇవి ముఖ్యంగా చలికాలం, వేసవికాలం, పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా వృద్ధి చెందుతాయి.

నివారణ :

ఇమిడాక్లోప్రిడ్‌ 1.22 మి.లీ./లీటరు (లేదా) ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ./లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేరుకుళ్ళు తెగులు :

ఆకులు పండుబారి కాండం, వేర్లు నల్లబడతాయి. పూలకు కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. అధిక తేమ ఉన్న సమయంలో ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.

నివారణ :

మొక్కల దగ్గర నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.

రోగం సోకిన మొక్కలకు బెనోమిల్‌ 2 గ్రా./లీటరు (లేదా) కాప్టాన్‌ 2 గ్రా./లీటరు నీటిలో కలిపి మొక్క చుట్టూ పోసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

ఆకుమచ్చ తెగులు :

ఆకుపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు వడలి చివరకు ఎండిపోతాయి. వేసవిలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది.

నివారణ :

బెనోమిల్‌ 2 గ్రా. / లీటరు (లేదా) అలియేట్‌ 0.5 గ్రా. / లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఎల్‌. గౌతమి, డా|| విజయ భాస్కర్‌, ప్రొఫెసర్‌, డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. విశ్వవిద్యాలయం, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట, కోడూరు మండలం, కడప, ఫోన్‌ : 8897093584