రైతాంగాన్ని నాశిరకంతో పూర్తిగా నింపేశారు. ఏది అసలో? ఏది నకిలీనో తెలుసుకోలేని విధంగా నకిలీ విత్తనాలను రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా రైతులను బురిడీకొట్టిస్తూ యదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఏటేటా విత్తన దొంగలు రెచ్చిపోతున్నారు. నాణ్యతలేని పత్తి గింజలు సేకరించి వాటికి రంగులద్ది రసాయనాలు పూసి, ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేసి రైతులకు అంటగట్టి నిలువునా ముంచేస్తున్నారు. ఈ దందా ప్రతి ఏటా సర్వసాధారణంగా కొనసాగుతూనే ఉంది. దీనిపై సంబంధిత వ్యవసాయ, పోలీస్‌, విత్తన ధృవీకరణ సంస్థలు సరైన దృష్టిసారించకపోవడంతో నకిలీల దందా ఇరు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వ్యాపించింది. వారి దందాకు అడ్డు చెప్పేవారే లేరన్నట్టుగా ఖరీఫ్‌ వచ్చిందంటే వీరి వ్యాపారం మూడు పూలు, ఆరు కాయల్లా వర్థిల్లుతుంది.

నకిలీ విత్తనాలతో రైతులు ప్రతి యేడాది మోసపోతూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో మిర్చి, పత్తి గింజలు నాణ్యత లేకపోవడం వల్ల ఖమ్మం, వరంగల్‌, గుంటూరు, కరీంనగర్‌ జిల్లాలో వేసిన పంటలకు పూత, కాత లేకుండానే నిలువునా నిలబడి పోయాయి. ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున విత్తన సంస్థలపై తిరగబడినా రైతులకు సరైన న్యాయం జరుగలేదు. విత్తన సంస్థలు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారు. ఖరీఫ్‌ వచ్చిందంటే అన్నదాత గుండెలు గుబేలుమంటున్నాయి. ఏది అసలు? ఏది నకిలీ రకమో తెలియక అమాయకంగా వ్యాపారులను నమ్మి కల్తీ సరుకును కొనుగోలు చేసిన రైతు మొక్కలు వచ్చే వరకు తాము విత్తినది నాశిరకమని గుర్తించలేక నష్టపోతున్నారు. రైతులు నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఇటీవల కాలంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి.

రైతు శ్రమను పెట్టుబడిగా పెట్టి పంట సాగు చేపట్టిననా సరైన ఫలితాలు రాకపోవడంతో రైతు కుటుంబాలు బుగ్గిపాలు అవుతున్నాయి. నకిలీ విత్తనాలతో రైతు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైతులకు సరైన విత్తనాలను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రైతాంగానికి వ్యవస్థపై నమ్మకం సడలుతూ వస్తుంది, రైతుల పక్షాన నిలబడిన ప్రభుత్వాలు లేకపోవడం వల్లనే నకిలీల దందా కొనసాగుతుందని దీన్ని అరికట్టే నాధుడే కరువయ్యాడని ప్రతి ఏడాది నకిలీల బెడద తప్పేటట్లు లేదని ఈ ఏడాది కూడా ఇదే తంతు కొనసాగుతుందని రైతులు దిగులు చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది.

2017లో 17.19 లక్షల హెక్టార్లు, 2018లో 17.20 లక్షల సాగు చేయగా 2019లో ఖరీఫ్‌లో పత్తిసాగు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని ప్రణాళిక తయారు చేశారు. విత్తనాల విక్రయం మొత్తం ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి రాయితీ మద్దతు ఉండదు. దీనితో 100 శాతం ప్రైవేటు వ్యాపారులే ధరలు నిర్ణయించి రైతులకు విక్రయిస్తుంటారు. కానీ అధికారులు విత్తన నాణ్యత గురించి పట్టించుకుంటున్న దాఖలాలు అంతగా లేకపోవడంతో రైతుల్లో ప్రభుత్వాలపై, అధికారులపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల కాలంలో విత్తన వ్యాపారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలను జారీచేసింది. చర్యలు చేపట్టాల్సిన అధికారుల యంత్రాంగం మామూళ్ళ మత్తులో జోగుతుండగా నానాటికీ కల్తీల ప్రభావం పెచ్చరిల్లుతుంది. పత్తి, మిర్చిలతో పాటు మినుము, సోయాచిక్కుడు, వరి, కూరగాయ విత్తనాల్లోనూ, నకిలీల ఉధృతి అధికంగా పొడచూపుతుంది. ఏటా వేల కోట్ల రూపాయల అక్రమవ్యాపారం అడ్డు, అదుపు లేకుండా సాగుతుంది. నాశిరకం విత్తనాల తయారీ సరఫరా నిలువదారులపై కాకుండా లోపాయికారిగా సాయపడిన అధికార సిబ్బందిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పీడిచట్టం కేసులు, నమోదు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం లోతుగా పరిశీలించి నకిలీవిత్తన సరఫరాలో సహకరించిన వారందరిపై కఠినంగా వ్యవహరించిన నాడే కొంతమేర, నాశిరక విత్తనాల బెడదను తగ్గించవచ్చు. ఇప్పటివరకు నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా 15-20 శాతం మేర అధిక దిగుబడులకు దోహదపడుతుందని వీటికి తోడు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు జతకూడితే 45 శాతం దాకా మంచి ఫల సాయం సాధిస్తుందని అధ్యయనాల ద్వారా వెల్లడవుతున్నాయి. వాస్తవంలో దేశవ్యాప్తంగా ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు 80 శాతం రైతులకు అందడం లేదని విశ్లేషకులు దిగుబడుల్లో మందకొడి తనానికి మూలకారణమేమిటో తెలుసుకునేందుకు పటిష్ట ప్రణాళిక సమర్థ కార్యాచరణతో విశ్లేషణను చేపట్టడం జరుగుతుంది. తద్వారా నాశిరకం విత్తనాలకు తావులేకుండా చేసేందుకు ఈ ప్రయోగాలు దోహదపడతాయి.

రైతాంగానికి మేలురకమైన వంగడాలు అందించడంలో ఇప్పటి వరకు అనేక తప్పిదాలు చేసుకుంటూ వచ్చారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాయి. రైతాంగానికి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమే.

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం :

కల్తీ విత్తనాలను అమ్మినవారిపై పీడియాక్ట్‌ - సిఎం కెసిఆర్‌

కల్తీ విత్తన సరఫరా పై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కల్తీ విత్తన వ్యాపారుల ఆటలు కట్టించాలని రాష్ట్రంలో కల్తీ అన్న మాట వినిపించకూడదని వ్యవసాయ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను పురమాయించారు. రైతులు వ్యాపారులను నమ్మి విత్తనం కొనుగోలు చేసి ఆరుగాలం కష్టంపడి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎరువులు, పురుగు మందులు ఉపయోగించి తీరా పంట చేతికి రాకపోతే ఎంతగా కృంగిపోతారో నాకు తెలుసు. కల్తీ విత్తనాల కారణంగా రైతులు ఆత్మహత్యలపాలవుతున్నారు. కల్తీ విత్తనాలను అమ్మండం హత్యానేరానికంటే మించినది. కల్తీ విత్తన వ్యాపారుల నడ్డి విరవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయానికి తెలంగాణలో స్థానం ఉండకూడదని నకిలీ విత్తనాలు తయారుచేసే కంపెనీలు సరఫరాదురులపై కఠినంగా వ్యవహరించాలని కల్తీవిత్తనాలు మార్కెట్‌లోకి అడ్డదారిన సరఫరా చేసేవారిని, నిల్వ చేసే వారిని గుర్తించి పీడియాక్ట్‌ కింద కేసులను నమోదుచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఒకవైపు వానాకాలం పంటలకు రైతన్నలు సన్నద్దం అవుతున్న నేపధ్యంలో ఇదే అదునుగా భావించి కల్తీ విత్తనాలను అంటగట్టేవారు వస్తారని ఇలాంటి వారిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్ర డిజిపిని ఆదేశించారు. ఈ దందా వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులనైనా వదిలే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో నకిలీ విత్తనాల పేరు వినపడొద్దని రైతులు నిర్భయంగా విత్తనాలు నాటుకునేటట్లు చేయాలని వ్యవసాయ రంగంపై రైతులకు కృషి సన్నగిల్లకుండా ఉండేందుకు తోడ్పాటు ప్రభుత్వం తరుఫున అందిస్తూ వెన్నుదన్నుగా నిలిచే విధంగా అధికారుల పనివిధానం రైతులు గుర్తించే విధంగా ఉండాలని అన్నారు.

15 టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో తనిఖీలు :

సీజన్‌ ప్రారంభానికి ముందే మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని భావించిన వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో 15 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు జిల్లా, మండల స్ధాయిలో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో ఒక వ్యవసాయ శాఖ అధికారి, విత్తన ధృవీకరణ అధికారి, పోలీస్‌ అధికారి, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారి ఉంటారు. ఈ టీంలు మార్కెట్‌లోని విత్తన దుకాణాలు, కంపెనీ గోదాముల్లో తనిఖీలు నిర్వహిస్తాయి. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఈ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు మంచిర్యాల, సికింద్రాబాద్‌, ఆసిఫాబాద్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి కేసులను నమోదుచేశారు. తనిఖీలు పూర్తిస్థాయిలో చేపట్టినట్లయితే నకిలీ దందాను అరికట్టవచ్చు. ఇకనైనా నకిలీ విత్తన దందాను అడ్డుకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

- ఎలిమిశెట్టి రాంబాబు,

అగ్రిక్లినిక్‌ డెస్క్‌