మన దేశంలో హరిత విప్లవం మొదలైన తరువాత అనేక అధిక దిగుబడినిచ్చే వంగడాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ అధిక మోతాదులో ఎరువులను వాడడం వల్ల పంటలను ఆశించే చీడ పురుగుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీని వల్ల రైతులు చీడ పురుగులను నియంత్రించడానికి వివిధ రకాల పురుగు మందులను విచక్షణ రహితంగా అవగాహన లోపంతో వినియోగిస్తున్నారు. అందువల్ల కొన్ని చీడపురుగులు క్రిమి సంహారక మందులకు తట్టుకునే శక్తిని సంతరించుకోవడం, పురుగు మందుల ప్రభావం పంట ఉత్పత్తుల నాణ్యతపైన, పర్యావరణం మీద అధికంగా ఉండడం వల్ల పూర్తిగా పురుగు మందులను వాడకుండా ఇతర పద్ధతుల ద్వారా చీడ పురుగులను నియంత్రించవలెను.

సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఎరపంటలు పెంచడం ద్వారా పురుగుల వల్ల, పురుగు మందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. కొన్ని రకాల పురుగులు కొన్ని పంటలను మాత్రమే ఎక్కువగా ఆశిస్తాయి. కావున ఆ పంటలను పురుగులను ఆకర్షించడానికి ఎరగా వాడాలి వీటినే ఎర పంట అంటారు.

ఎర పంటలను వాడడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు. ఎరపంటను ఎన్నిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎర పంటను పురుగు ఉనికి తగ్గట్టుగా ఎన్నిక చేయవలసి ఉంటుంది. ఎర పంట అనేది తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా చీడపురుగులను ఆకర్షించేదిగా మరియు ముఖ్యపంటను అన్ని దశల్లో కాపాడే విధంగా ఉండాలి. ఎర పంటలను ముఖ్య (ప్రధాన) పంటలో వేసినప్పుడు ఎరపంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

ప్రధాన పంట ఎర పంట ఆకర్షించబడే కీటకం
పత్తి బంతి శనగపచ్చ పురుగు
పత్తి ఆముదం పొగాకు
పత్తి బెండ మచ్చల కాయతొలుచు పురుగు, పచ్చదోమ
మొక్కజొన్న జొన్న కాండం తొలుచు పురుగు
క్యాబేజి ఆవాలు డైమండ్‌ బ్యాక్‌ మాత్‌
టమాట బంతి శనగపచ్చ పురుగు
టమాట ఆముదం పొగాకు లద్దె పురుగు
పొగాకు ఆముదం పొగాకు లద్దె పురుగు

ఈ విధంగా ప్రకృతిలో పురుగులను ఆకర్షించే పంటలున్నప్పుడు రైతులు ఈ ఎరపంటలను వేసి పురుగులను ఆకర్షించేలా చేసి వాటిని నాశనం చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

యస్‌. ఓం ప్రకాశ్‌, శాస్త్రవేత్త (కీటక శాస్త్రం), జి. మహేష్‌, డా|| ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల, ఫోన్‌ : 9866373563