సోయా చిక్కుడు తూర్పు ఆసియాలో ఆవిర్భవించిన పంట. సోయాచిక్కుడు అన్ని కాలాల్లో మురుగునీరు పోయే వసతి గల భూముల్లో పండించే పప్పు ధాన్యపు పంట. సోయాచిక్కుడులో 36 శాతం మాంసకృత్తులు, 30 శాతం కార్భోహైడ్రేట్స్‌ మరియు 20 శాతం నూనెను కలిగి ఉంటుంది. ప్రపంచంలో ముఖ్యంగా సోయాను 5 దేశాల్లో పండిస్తున్నారు. అవి అమెరికా, బ్రెజిల్‌, అర్జెంటీనా, చైనా మరియు భారతదేశం. మనదేశంలో సోయాను 11 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు పండిస్తున్నారు. పైరు వేరు బుడిపెలో రైజోబియం జపానికమ్‌ అనే బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ గాలిలో గల నత్రజనిని స్థిరీకరించి వేరుబుడిపెల ద్వారా మొక్కకి అందిస్తూ భూమిని సారవంతం చేస్తుంది.

సోయా చిక్కుడు వల్ల కలిగే ప్రయోజనాలు :

బహుళ ప్రయోజనకారి వీటిని ఆహారంలో తీసుకోవటంవల్ల చెడు కొలస్ట్రాల్‌ని రక్తంలో నియంత్రించును. ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

రక్తపోటును తగ్గించును అలాగే పీచుపదార్థం సోయాలో ఉండుటం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరుచును.

స్త్రీలలో మోనోపేజ్‌ సమయంలో వచ్చే మార్పులను ఎదుర్కొనుటకు ఉపయోగపడే పోషకాలు అయిన ఫైలస్టీరాన్స్‌ లెసిథిన్స్‌, ఐసోప్లేవిన్స్‌, ఇనుము, కాల్షియం, అమైనో ఆసిడ్స్‌, బి. కాంప్లెక్స్‌, ఇ-విటమిన్లు ఉంటాయి.

సోయా చిక్కుడులో గల ఔషదగుణం వల్ల గుండెజబ్బులు, కాన్సర్‌ రాకుండా చేస్తాయి.

సోయాచిక్కుడు ఓమేగా 3 కొవ్వు పదార్థానికి మంచి వనరు.

100 గ్రా. సోయాచిక్కుడులో పోషక విలువలు :

నీరు 63 శాతం

ప్రొటీన్‌ 16.6 గ్రా.

కార్బోహైడ్రేట్‌ 9.9 గ్రా.

చెక్కర 3 గ్రా.

పీచు పదార్థం 6 గ్రా.

కొవ్వు 9 గ్రా.

శక్తి 173 కేలరీలు

సోయా ఉత్పత్తులు / విలువ ఆధారిత పదార్థాలు :

సోయా పాలు :

100 గ్రా. సోయా పాలలో 33 కిలోల కేలరీల శక్తి, 2.86 గ్రా., ప్రొటీన్‌, 1.61 గ్రా., క్రొవ్వు పదార్థం మరియు 1.74 గ్రా., కార్బోహైడ్రేట్‌ ఉంటాయి.

కావలసిన పదార్థాలు :

1/2 కప్పు తెల్ల సోయా చిక్కుడు, 2-3 కప్పు నీరు నానబెట్టుటకు 4 కప్పు నీరు మిశ్రమం కలుపుటకు చక్కెర (తగినంత)

తయారీ :

1. రాత్రిపూట 2-3 కప్పుల నీటిలో సోయాబీన్స్‌ను నానబెట్టాలి.

2. ఉదయం పూట నీరు తొలగించి సోయాబీన్స్‌ను శుభ్రం చేసి పైన గల తొక్కను తీయాలి.

3. 4 కప్పుల నీటిని ఈ శుభ్రం చేసిన సోయాబీన్స్‌కి కలపాలి.

4. తరువాత పలుచటి గుడ్డ సహాయంలో పైన తెలిపిన మిశ్రమాన్ని వడగట్టాలి. గుడ్డను గట్టిగా తిప్పి సోయా పాలును వడగట్టి సేకరించాలి.

5. ఈ వడకట్టిన సోయా పాలను 1000 సెం. (2120) వద్ద 20 నిమిషాలు వేడి చేయాలి. అలాగే సోయాపాలకి రుచికి తగినంతగా చెక్కర వేసుకోవాలి.

6. సోయా పాలు 4 రోజుల వరకు రిఫ్రిజరేటర్‌లో నిల్వ చేయవచ్చును.

సోయా పన్నీర్‌ లేదా (టోఫు) :

వేడి చేసిన సోయా పాలను విరగొట్టి దాని సోయా పెరుగు చేసి మరల దాన్ని నుండి సోయా పన్నీర్‌ టోఫు చేయవచ్చు. 100 గ్రా. సోయా పన్నీర్‌లో 5 గ్రా. కార్బోహైడ్రేట్స్‌, 3 గ్రా. చెక్కర, 1 గ్రా. పీచుపదార్థం, 7 గ్రా. కొవ్వు పదార్థం, 14 గ్రా. ప్రోటీన్‌, 1500 మి. గ్రా. సోడియం మరియు 117 మి.గ్రా. పొటాషియం ఉంటాయి.

కావలసిన పదార్థాలు :

సోయా పాలు, 1/2 కప్పు వెనిగర్‌, పలుచటి గుడ్డ

తయారీ :

1. సోయా పాలును 1000 సెం. వద్ద 10-15 నిమిషాలు మరగించాలి. తరువాత 1 గ్లాస్‌ నీటిని ఉష్ణోగ్రత తగ్గించుటకు కలిపి, తరువాత వేడిచేసిన సోయ పాలకు 1/2 కప్పు వెనిగర్‌ని కలపాలి.

2. తరువాత పలుచడి గుడ్డను తీసుకొని పైన పేర్కొన్న మిశ్రమాన్ని వడగట్టాలి.

3. వడగట్టగా మిగిలిన పదార్థాన్ని ఒక గుడ్డలో చుట్టి గట్టిగా నొక్కి మిగిలిన నీటిని తీసివేయాలి. తరువాత దానిపై బరువైన వస్తువును అరగంట సేపు పెట్టినట్లయితే సోయా టోఫు తయారవుతుంది.

4. సోయా టోఫు లేదా సోయా పన్నీర్‌ను కావలసినట్లుగా కట్‌ చేసుకోవాలి.

5. కట్‌ చేసిన సోయా టోఫుని నీటిలో ఉంచాలి. లేదంటే పొడిబారిపోతుంది.

గమనిక : సోయా పాలను మరగించేటప్పుడు కలుపుతూ ఉండాలి. లేదంటే చెడు వాసన వస్తుంది.

సోయా గింజలు :

1. ముడి సోయా గింజలను నానబెట్టి వేయించడం లేదా ఓవెన్‌లో వేడి చేయడం ద్వారా సోయా గింజలు తయారు చేసుకోవచ్చు.

2. పప్పు ధాన్యాల్లో కూరలు చేసే రాజ్మా ఇంకా చోళి, దాల్‌ వంటి వాటిలో కూడా 20 శాతం వరకు సోయా గింజలను వాడవచ్చు.

3. 100 గ్రా. సోయా గింజల్లో 60-75 శాతం మాంసకృత్తులు ఉంటాయి.

సోయా అప్పడాలు :

నూనె తీసిన సోయా పిండిని 30-40 శాతం వరకు మినపప్పు, పెసరపప్పుతో కలిపి అప్పడాలు చేసి నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల 21-30 శాతం వరకు మాంసకృత్తులు పెరుగుతాయి.

డా|| వి. దీప్తి , ఇ. కరుణశ్రీ, డా|| కె. వెంకట సుబ్బయ్య, జి. శాలిరాజు,

డా|| టి. విజయనిర్మల. డా|| ఎ. దేవి వరప్రసాద్‌ రెడ్డి, డా||. ఆర్‌విఎస్‌కె రెడ్డి,

కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటరామన్న గూడెం, ఫోన్‌ : 9989575162