మన రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సంప్రదాయ పద్ధతిలో అంటే నాటు పద్ధతిలో సాగు చేస్తున్నారు ఒక ఎకరం నాటు వేయడానికి సుమారు 8-10 మంది కూలీలు అవసరం. వర్షా కాలం మరియు యాసంగిలో వరి నాట్లు 30-40 రోజుల్లో పూర్తవుతాయి వరి నాట్లు వేసే సమయానికి కూలీల కొరత ఏర్పడుతుంది. వరి సాగు చేసే రైతులు తమ నాట్లను సకాలంలో వేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దమ్ము చేసిన పొలంలో సరైన సమయంలో నాటు వేయక పోవడంతో మళ్ళీ వరి పొలాలను దమ్ము చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది వీటన్నింటిని దష్టిలో ఉంచుకొని పాలిథీ¸న్‌ షీట్‌ పై సులువుగా నారు పెంచుకొని యాంత్రీకరణ పద్ధతిలో వరి నాట్లు వేసుకున్నట్లైతే కూలీల కొరతను అధిగమించి సకాలంలో నాటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది

పాలిథీన్‌ షీట్‌పై వరి నారు పెంపకం :

ఆయా ప్రాంతానికి అనువైన వరి రకాలను ఎంపిక చేసుకోని కార్బండిజంతో (1 గ్రా. కిలో విత్తనానికి) విత్తన శుద్ధి చేయాలి తరువాత విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టిన తరువాత 24 గంటలు మండెకట్టినట్లైతే సమానంగా మొలకెత్తుతాయి.

నారుమడిని కలుపు లేకుండా ఒకటి లేదా రెండు సార్లు దున్నాలి దమ్ము చేసిన నారు మడిని తప్పనిసరిగా చదును చేసుకోవాలి.

దీర్ఘచతురస్రకారంలో 10-15 మీ. పొడవు, 1-3 మీ. వెడల్పు 15 సె.మీ. ఎత్తు ఉండేలా నారు మడులను తయారు చేసుకోవాలి.

సి.సి. రోడ్లు వేస్తునప్పుడు సిమెంట్‌ మెటీరియల్‌ జారిపోకుండా రోడ్డు కింద వేసే తెల్లని లేదా నల్లని పలుచటి పాలిథిన్‌ షీట్‌ను నారు పెంచుకోవడానికి వాడుకోవాలి.

ఈ షీట్‌ వెడల్పు 1 మీ. ఒక కిలో షీట్‌ పొడవు 30 మీటర్లుగా ఉంటుంది.

ఒక కిలో పాలిథీన్‌ షీట్‌ కవరును మధ్యలో నుంచి రెండుగా మలిచి ఈ బెడ్ల పైన సమానంగా పరుచుకోవాలి.

ప్లాస్టిక్‌ ట్రే సైజుతో తయారు చేసిన చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఫ్రేమును పాలిథీన్‌ షీట్‌పై ఎదురెదురుగా ఉంచాలి. (ప్లాస్టిక్‌ ట్రే సైజు అనేది మనం నాటు వేసుకోవడానికి వాడే యంత్రాల మీద ఆధారపడి ఉంటుంది)

ఇద్దరి మనుషులు ఎదురెదురుగా నిలబడి వాళ్ళ కాళ్ళ దగ్గరి నుంచి దమ్ము చేసిన బురద మట్టిని రాళ్ళూ లేకుండా చూసుకొని ఫ్రేముల్లో నింపాలి బురద మట్టి మరి గట్టిగ లేదా పలుచగా కాకుండా చూసుకొని ఫ్రేముల్లో నింపాలి

ఒక్కో ట్రేలో లేదా గాడిలో మట్టి మందం ఒక అంగుళం దాటకూడదు ఎక్కువైనా మట్టిని రేకుతో లేదా కట్టే స్కేలుతో తీసివేయాలి. ఈ బురద మట్టిని చేతితో ఒత్తి సమం చేయరాదు మట్టి మందం ఎక్కువైతే రోలింగ్‌ చేసేటప్పుడు ముక్కలు ముక్కలుగా అవుతుంది సరిగ్గా నాటు పడదు.

మొలకెత్తిన (ముక్కు పగిలిన) వరి గింజల్ని ఫ్రేములోని ఒక గాడిలో 150 గ్రా. (సన్న గింజ రకాలైతే) లేదా 180 గ్రా (దొడ్డు గింజ రకాలైతే ) వచ్చేలా సమతూకంగ చల్లుకోవాలి.

ఎకరాకు సుమారు 75-80 షీట్ల నారు అవసరం కాబట్టి సన్న గింజ రకాలైతే 10-12 కిలోలు, దొడ్డు గింజ రకాలైతే 12-14 కిలోల విత్తనం వాడాలి.

వర్షాలకు విత్తనం దెబ్బతినకుండా, పక్షులు తినకుండా నారు మళ్లపై గడ్డిని లేదా గొనె సంచులను వాడుకోవచ్చు.

పాలిథీ¸న్‌ షీట్‌ పరిచిన పక్క నుంచి బురద మట్టి తీస్తాం కాబట్టి అది ఒక కాలువ లాగా మరి బెడ్‌కు నీళ్లు పెట్టుకోవడానికి తీసుకోవడానికి ఉపయోగపడతుంది.

15-20 సెంటి మీటర్ల ఎత్తు పెరిగి 3-4 ఆకులు కలిగిన 14-17 రోజుల నారు యంత్రాలతో నాటు వేయడానికి అనుకూలం.

ఆరోగ్యంగా పెరిగిన నారు మొక్కల మ్యాట్‌ సుమారు 4-5 కిలోల బరువుంటుంది, నారును మడతగా (రోలింగ్‌) చేసి నాటు యంత్రాల్లో పెట్టి నాటువేసుకోవచ్చు.

వర్షం పడని రోజు మినహా మిగతా రోజుల్లో తప్పని సరిగా నీరు పెట్టి లేనిచో సూర్యరశ్మి వేడికి షిట్‌ బాగా వేడెక్కి నారు చనిపోతుంది.

కాలువల్లో నీరు బెడ్‌లు పూర్తిగా తడిచే వరకు మాత్రమే పెట్టాలి బెడ్‌లు మునిగి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి.

అవసరాన్ని బట్టి నారు పై 19:19:19 లేదా 13:0:45 ఒక శాతం (10 గ్రా./లీ. నీటికి) ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

నారుమళ్ళలో జింకు ఇనుపధాతు లోపాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇనుప ధాతు లోపం వల్ల లేత చిగురుటాకులు తెల్లగా మరి ఉదతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి నివారణకు 10 లీటర్ల నీటికి 25 గ్రా. ఫెర్రస్‌ సల్పేట్‌ కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి.

జింకు లోపం సాళ్ళ మధ్యనే ఇరుప్రక్కలా తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు వస్తాయి నివారణకు 10 లీటర్ల నీటికి 10 గ్రా. జింకు సల్పేట్‌ చొప్పున పిచికారీ చేయాలి.

నాటు వేసే ప్రధాన పొలం తయారీ :

యంత్రాలతో వరి నాటడానికి ముందుగ పొలాన్ని రెండు మూడు సార్లు రోటోవేటర్‌తో దమ్ము చేయాలి యంత్రాలతో నాటు వేసే పొలాలను ట్రాక్టర్‌ లతో ఎక్కువ సార్లు దమ్ము చేయడం వల్ల భూమిలో నాటు వేసే లోతు ఎక్కువై నాటు కష్టమవుతుంది అందువల్ల ఎక్కువ సార్లు దమ్ము చేయరాదు.

నాటు వేసే యంత్రాలు :

1. వాకింగ్‌ టైపు (వెనుక నడుస్తూ నాటు వేసే యంత్రాలు)

2. రైడింగ్‌ టైపు (కూర్చొని నడుపుతూ నాటు వేసే యంత్రాలు)

నారుమడి నుంచి మ్యాట్‌లను మడతగా చేసి యంత్రాల్లో పెట్టుకోవాలి. నాట్లు వేస్తునప్పుడు యంత్రానికి మట్టి అంటుకోకుండా ఉండటానికి 1-2 సెం.మీ. నీరు పలుచగా ఉంచాలి

వరి నాటు యంత్రాల్లో సాలుకు సాలుకు మధ్య దూరం 30 సెం.మీ. ఉంటుంది మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని 12, 14, 16, 18, 21 సెం.మీ. వరకు యంత్రాలను బట్టి సరిచేసుకోవచ్చు అలాగే కుదురుకు 3 లేదా 6 మొక్కలు నియంత్రించుకునే అవకాశం ఉంది.

యాన్మార్‌ నాటు యంత్రం ఒకే సారి 8 వరుసల్లో నాటు వేస్తుంది ఒక గంటలో ఎకరం నాటు వేయవచ్చు గంటకు మూడు నుంచి మూడున్నర లీటర్ల డీజిల్‌ అవసరం.

కుబోట నాటు యంత్రం ఒకేసారి 6 వరుసల్లో నాటు వేస్తుంది ఒక ఎకరం నాటు వేయడానికి గంటకు నాల్గున్నర లీటర్ల పెట్రోల్‌ అవసరం.

ఒక ఎకరానికి సుమారుగా 70-80 షీట్ల నారు అవసరం నాట్లు వేసాక పొలంలో నీరు ఎక్కువగా ఉంటే తీసివేసి పైరు పచ్చబడే వరకు పలుచగా ఉంచాలి.

డి. అనిల్‌, శాస్త్రవేత్త (సేద్యశాస్త్ర విభాగం), శ్రీధర్‌ సిద్ది, శాస్త్రవేత్త (ప్లాంట్‌ బ్రీడింగ్‌), పి . మధుకర్‌ రావు, శాస్త్రవేత్త (సేద్యశాస్త్ర విభాగం)

వ్యవసాయ పరిశోధనా స్థానం, కూనారం