మన దేశంలో రైతులు హరిత విప్లవం నుండి రసాయనిక ఎరువులు విరివిగా వాడుతున్నారు, దీని వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవటంతో పాటు నేలలు నిస్సారం అవుతున్నాయి. కావున నేలల పునరుజ్జీవం కొరకు సేంద్రియ ఎరువులు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సేంద్రియ వ్యవసాయంలో పండించిన వ్యవసాయోత్పత్తులకు వినియోగదారుల నుండి మంచి స్పందన, డిమాండ్‌ ఉండడంతో ఎక్కువ విలువను కలిగి ఉన్నాయి. అదేకాక, వ్యవసాయాన్ని క్రమబద్దీకరించుకోవడానికి, నేలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, క్రమంగా పంటలపై పెట్టుబడులను తగ్గించుకుంటూ అధిక దిగుబడులను సుదీర్ఘ కాలం పాటు పొందడానికి రైతులు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించుకోవడం ఎంతో ముఖ్యం. ఇలా రసాయనిక ఎరువులు వాడని వ్యవసాయానికి తోడ్పాటును ఇచ్చే కొన్ని రకాల ఎరువులు, వాటి ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం.

సేంద్రియ ఎరువులు ముఖ్యంగా స్థూల మరియు గాఢ సేంద్రియ ఎరువులగా విభజించవచ్చు. స్థూల సేంద్రియ ఎరువులను ఎక్కువ మొత్తంలో పొలంలో చల్లుతారు. ఇవి కొంత మేర పంటకు పోషకాలను అందించడమే కాక, మట్టి భౌతిక స్వరూపాన్ని మరియు నీటిని పట్టి ఉంచే గుణాన్ని పెంచి, నేలలోని పోషకాలను మొక్కలకు అందేలా చేస్తాయి. ఇతర సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందించడమే కాక వ్యాధికారక శిలీంధ్రాల నియంత్రణలో తోడ్పడతాయి. సాధారణంగా పొలం ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు (వానపాముఎరువు), పచ్చి రొట్ట ఎరువులను స్థూల సేంద్రియ ఎరువులుగా పరిగణించవచ్చు.

పొలంలోని చెట్ల ఆకులు, ఇతరత్రా మొక్కల మరియు జంతువుల వ్యర్ధాలు పశువుల పేడ, మూత్రంతో సహజం గానే కుళ్ళి మట్టిలా మారిన దాన్నే పొలం ఎరువు అంటాం. బంగాళాదుంప, టమాటా తీపి బంగాళా దుంప, క్యారెట్‌, ముల్లంగి, ఉల్లి మొదలగు కూరగాయలు పొలం ఎరువుకు చక్కగా స్పందిస్తాయి. అదేవిధంగా చెరకు, వరి, అరటి, మామిడి, కొబ్బరి ఇతరత్రా గడ్డి మొక్కలు పొలం ఎరువు చేసుకునేందుకు చాలా అనుకూలం.

కుళ్ళిన చెట్ల మరియు పశువుల సేంద్రియ పదార్ధాలనే కంపోస్టు అంటాం. ఇకపోతే, వానపాము ఎరువును మన పొలంలోనే తయారు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ/ఉద్యాన శాఖ వివిధ రకాల ప్రోత్సాహకాలను, సబ్సిడీలను అందిస్తుంది. అదీకాక, మనకు దగ్గర్లోని ఎక్కడైనా ఈ వానపాము ఎరువులు తయారు చేసే యూనిట్లను సంప్రదించినా మనం సులభంగా ఈ ఎరువును పొలంలో వాడుకోవచ్చునో తెలుసుకోవచ్చు. ఈ వానపాము ఎరువులో నత్రజని, భాస్వరం, పోటాష్‌తో పాటు సల్ఫర్‌, కాల్షియమ్‌, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌ మరియు కాపర్‌ వంటి చాలా రకాల పోషకవిలువలు ఉంటాయి. ఇతర ఏరకమైన ఎరువులోను లభించని వివిధ రకాల ఎంజైములు ఈ వానపాము ఎరువులో లభిస్తాయి. ఇవి మట్టిలోని సూక్ష్మ జీవుల పెరుగుదలకు తోడ్పడి, నేలలోని వ్యర్ధపదార్ధాలు త్వరగా కుళ్ళి కంపోస్ట్‌గా మారడానికి ఉపయోగపడతాయి. వర్మికంపోస్ట్‌ వేసిన నేలను పరిక్షిస్తే నాలుగు నుండి ఐదు రెట్లు ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయని పరిశోధనలో తేలింది.

పచ్చి రొట్ట ఎరువులు అనేవి సేంద్రియ వ్యవసాయంలో ఒక ప్రముఖ పాత్రని పోషిస్తాయి. ముఖ్యంగా పశువుల ఎరువులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇవి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయానికి వాడుకోవచ్చును. వీటిని పొలంలోనే ప్రధానపంటతో పాటుగా పెంచి, పచ్చిగా ఉండగానే తిరిగి మట్టిలోనికి కలిపి దున్నేయాలి. జనుము, పిల్లి పెసర, జీలుగ, అలసంద, వెంపలి, ఉలవతో పాటు పెసర మినపలను పచ్చి రొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువులు చాలా ముఖ్యమైనవి, వీటి కాయలు కోసుకున్న అనంతరం నేలలో కలియ దున్నుకోవచ్చును. ఒక టన్ను పచ్చి రొట్ట ఎరువు మూడు టన్నుల పొలం ఎరువుకు సమానం అంటే, పది కేజీల యూరియాకు సమానం. పచ్చిరొట్టను ప్రధాన పంటకు ముందుగా కానీ లేదా అంతర పంటలా కానీ వేసుకోవచ్చును. పచ్చి రొట్ట ఎరువుతో తక్కువ ఖర్చుతో లాభసాటిగా మట్టిని ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చును. తొలకరి వర్షాలకు ఏ రకపు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలనైనా విత్తుకోవాలి. ఒక ఎకరాకు 15-20 కిలోల జనుమును జల్లుకుంటే అది 45 రోజుల్లోనే 8-10 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. దీనివల్ల 50కిలోల నత్రజని ప్రధానపంటకు అందుతుంది. ఈ పచ్చిరొట్టను పూత పూసే సమయానికి నేలలో కలియ దున్నాలి అనగా సుమారు 45 రోజులకు. అలాకాక పోతే, కాండం గట్టిపడి దున్నటానికి ఇబ్బందిగాను, కుళ్ళకుండా అలానే ఉంటాయి. పచ్చిరొట్ట కుళ్ళుటకు సుమారు 15 రోజులు సమయం పడుతుంది. గొర్రె, మేక మొదలగు పశువుల ఎరువులు కూడా స్థూల సేంద్రియ ఎరువులే, అందుబాటులో ఉంటే వీటినే ఎరువులుగా వాడు కోవచ్చు.

గాఢ సేంద్రియ ఎరువుల్లో స్థూల సేంద్రియ ఎరువు కంటే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి. వివిధ రకాల నూనె గింజల యొక్క గానుగ వ్యర్ధాలు, పశువుల ఎముకల, కొమ్ములు, గిట్టల వ్యర్థాలు గాఢ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయి. ఈ రకపు ఎరువులు నెమ్మది నెమ్మదిగా పోషకాలను మొక్కలకు చాలా ఎక్కువ రోజుల పాటు అందిస్తాయి. గానుగ వ్యర్ధాలు అంటే నూనె గింజల నుండి నూనెను సేకరించగా మిగిలి, మిల్లు నుండి వెలువడే వ్యర్థాలు. వేరు శనగ, నువ్వులు, ఆముదం, కొబ్బరి, వేప, పత్తి మొదలగు గానుగ వ్యర్ధాలు సులభంగానే ఆయా ప్రాంతాలను బట్టి లభిస్తాయి. దాదాపు అన్ని రకాల గానుగ వ్యర్ధాలు మొక్కలకు కావలసిన ముఖ్యమైన పోషణను అందిస్తాయి.

రైతులు సాధారణంగా వాడే కత్రిమ రసాయన ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పోటాష్‌లు ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికి, అవి క్రమ క్రమంగా నేలలోని మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోయేలా చేస్తాయి. నేలయొక్క భౌతికస్వభావం కూడా పూర్తిగా దెబ్బ తింటుంది. కాల క్రమేణా, పంటలు ఈ కత్రిమ ఎరువులు వేస్తేనే కానీ స్పందించని పరిస్థితి ఎదురవుతుంది. అధిక పెట్టుబడి తో కూడిన వ్యవసాయం చేస్తూ, నేలను నిర్వీర్యం చేస్తూ భవిష్యత్తులో వ్యవసాయం మరింత క్లిష్టమైన స్థితికి చేరుతుంది. అందుకనే, క్రమ క్రమంగా ఈ సేంద్రియ ఎరువులను పంటలకు అందిస్తూ, నేలభౌతిక స్వభావాన్ని, సూక్ష్మజీవులను కాపాడుతూ ఆరోగ్యవంతమైన నేలను, పంటలను, పర్యావరణాన్ని మరియు జీవనాన్ని పొందడం మన అందరి భాద్యత.

రైతులు ఇప్పటికిప్పుడు రసాయన ఎరువులను పూర్తిగా విడిచిపెట్టి, సేంద్రియ ఎరువులను ప్రత్యామ్నాయంగా వాడాలని అనుకుంటే అది చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన పని అవుతుంది. అందుకనే రసాయన ఎరువులకు అనుబంధంగా సేంద్రియ ఎరువులను ''సమగ్ర పోషక యాజమాన్యం'' చేస్తూ కాలక్రమేణా సేంద్రియ వ్యవసాయాన్ని అవలంభించవచ్చును. తద్వారా ఆరోగ్య కరమైన నేలను తిరిగి పొంది, మంచి దిగుబడులను పొందగలరు.

డా|| యు. సాయి శ్రావణ్‌, డా|| నీల హేమ శరత్‌ చంద్ర, బి. రామ కష్ణ, డా|| జి. సాంబశివ, డా|| ఎం. రంజిత్‌, ఐ. వెంకటేష్‌