పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు వ్యాపారులు కూడా ముందుకురావాలని పొగాకుబోర్డు తాత్కాలిక అధ్యక్షురాలు కె. సునీత సూచించారు. పంటలో నాణ్యతను పెంచి మెరుగైన ధరలు ఇప్పించడానికి బోర్డు నిరంతరం కృషి చేస్తుందని ఆమె హామీఇచ్చారు. పొగాకుబోర్డు 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జనవరి 4వ తేదీన గుంటూరులో జరిగిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పొగాకు రైతులు బ్యారన్లలో వినియోగించేందుకు పెద్ద ఎత్తున వంట చెరకు రూపంలో చెట్లను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యారన్లకు అనుమతిని మంజూరు చేయడం, తిరిగి పునరుద్ధరించే సమయంలో ఇందుకు సంబంధించిన అంగీకార పత్రంపై సంతకం చేయించి పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు పెంచే పనిని కూడా చేసే విధంగా కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. బోర్డు మధ్యవర్తిత్వం కృషి వల్ల ఈ సంవత్సరం 10 శాతం అదనపు ధరకు పొగాకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు అంగీకరించినట్లు ఆమె తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు కార్యదర్శి అద్దంకి శ్రీధర్‌బాబు వివరించారు. ఎగుమతులు పెంచడానికి కేంద్ర, ప్రభుత్వ స్థాయిలో వాణిజ్య మంత్రిత్వశాఖ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా పొగాకు పంటలో పురుగు మందుల అవశేషాలు తగ్గితేనే ఎగుమతులు పెరుగుతాయని జాతీయ సమగ్ర మొక్కల ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ జయలక్ష్మి సూచించారు. నాలుగేళ్ళ క్రితం పురుగు మందుల వినియోగం గురించి, క్రమేణ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పొగాకుబోర్డుతో ఒక ఒప్పందం చేసుకున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. ఈ సంవత్సరం 449 పొగాకు శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరిశోధన చేయించగా 7 శాతం పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలిందని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు ఎగుమతుల్లో భారత్‌ 3వ స్థానంలో ఉన్నట్లు ఆమె వివరించారు. పొగాకు రైతులు తమ సాధికారత కొరకు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని సూచించారు.

గుంటూరులోని ఇండియన్‌ టొబాకో హాలులో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు, వర్జీనియా పొగాకు రైతు సంఘం గౌరవ అధ్యక్షులు డా|| యలమంచలి శివాజి, బోర్డు వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు బాలినేని సీతయ్య, కిరణ్‌కుమార్‌, బసవరాజప్ప, నితిన్‌ బిహారీ చౌదరి, ఐటిసి సిఇఒ సంజయ్‌ రంగరాజన్‌, ఐటిఏ అధ్యక్షులు మిట్టపల్లి ఉమా మహేశ్వర రావు, వై.ఎ చౌదరి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా, గద్దె మంగయ్య, చుంచు శేషయ్య, గద్దె శేషగిరి రావు, రెడ్డి బాబు, అత్తోట సుబ్బారావు, వెలగా వెంకటేశ్వరరావు, మాజేటి పాపారావు, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

బోర్డు 43వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులు, వ్యాపారులు, ఎగుమతి దారులు, సిగరెట్‌ తయారీ దారులకు ప్రశంసాపత్రాలు అందచేసి అవార్డులతో సత్కరించారు. పొగాకుబోర్డు వ్యవస్థాపకులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కొత్తా రఘురామయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

-అగ్రిక్లినిక్‌ డెస్క్‌