మునగాకు మన పెరటిలో దొరికినప్పటికీ మునక్కాయలు తిన్నంతగా ఇది ఉపయోగించదు. ఈ ఆకులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. దీనిలో 38 శాతం ప్రోటీన్లు, 8 రకాల ఎసెన్షియల్‌ ఆమ్లాలు ఉంటాయి. ఇంకా బీటాకెరోటిన్‌, ప్రతి వంద గ్రాముల ఆకుల్లో కాల్షియం 297 మి.గ్రా. నుంచి 425 గ్రా. వరకు ఉంటుంది. పొటాషియం 70 మి. గ్రా. 7 మి. గ్రా. ఇనుముతో పాటు సల్ఫర్‌ వంటి ఇతర ఖనిజాలు, విటమిన్‌ ఎ, సి సమద్ధిగా ఉంటాయి.

మిరాకిల్‌ ట్రీ గా పిలవబడే మునగ చెట్టులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. వైద్యంలో దాదాపు 300 రకాల రోగాలను నయం చేయగల సామర్ధ్యం కలిగి ఉంది. పోషకాహారంగా, వ్యాధుల నివారణకు, లేపనంగాను ఉపయోగించవచ్చు.

ఉపయోగాలు - వాడే విధానం :

మునగాకుని కూరల్లో, పప్పులో వేసి తినవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కషాయంలా కాచి కూడా తాగవచ్చు. మునగాకు అనేక వ్యాధుల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. మునగాకు రసంలో సమాన పరిమాణంలో కొబ్బరి నీళ్ళు కలిపి తాగితే జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం, విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మునగాకులో ప్రోటీన్లు, విటమిన్‌-ఎ, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్‌ ఉంటాయి. బాలింతలు ప్రసవం తరువాత మునగాకును ఏ రూపంలో తిన్నా పాలు సమద్ధిగా పడతాయి. మన ఆయుర్వేదంలో ఐరన్‌ లోపాన్ని, రక్తహీనతను నివారించడంలో మునగదే కీలక పాత్ర. స్థూలకాయం ఉన్నవారు మునగ పొడిని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. మునగాకులో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండడం వల్ల కంటికి చాలా మేలు కలుగుతుంది. ఆకుకూరలను ఎలా వండుకుంటామో అలాగే మునగాకును కూడా వండుకోవచ్చు. ఆకులో మరియు పువ్వులో కూడా ఎన్నో పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకులు, పూలు ఉపయోగించి తేనియం కూడా తయారు చేయవచ్చు. ూఖవీ-1, భాగ్య వంటి మునగ రకాలు సాగు చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడి వచ్చి లాభాలు పొందుతున్నారు.

మునగాకు పొడి :

కావాల్సిన పదార్ధాలు :

మునగాకు- ఒక కప్పు, కరివేపాకు- ఒక రెబ్బ, మినపప్పు- 1 టీస్పూన్‌, పశ్చి శెనగపప్పు- 1 టీస్పూన్‌, వేరుశెనగ గుళ్ళు- ఒక కప్పు, ధనియాలు-1 టీస్పూన్‌, జీలకర్ర- 1 టీస్పూన్‌, ఎండుమిరప- 5, వెల్లుల్లి -5, చింత పండు- 10 గ్రా., ఉప్పు- తగినంత.

తయారీ విధానం :

మునగాకుని బాగా కడిగి పొడి గుడ్డలో ఆరబెట్టాలి. ఒక గిన్నెలో మునగాకు మరియు కరివేపాకుని వేసి నూనె లేకుండా వేయించాలి. వేరే బాణలిలో మినపప్పు, సెనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరప కాయలు, వెల్లుల్లి, చింతపండు వేసి వేయించాలి. 10 నిమిషాలు చల్లారిన తరువాత మిక్సీజార్‌లో వేసి పొడి చేసుకోవాలి. తరువాత మునగాకు కూడా వేసుకుని బరకగా పొడి చేసుకోవాలి. అన్నంలోకి, ఇడ్లీలోకి తింటే రుచిగా ఉంటుంది.

మునగాకు పచ్చడి :

కావాల్సిన పదార్ధాలు :

మునగ ఆకు- రెండు కప్పులు, కరివేపాకు- ఒక రెబ్బ, జీలకర్ర- 1/2 టీస్పూన్‌, మెంతులు- 1/4 టీస్పూన్‌, ధనియాలు-2 టీస్పూన్‌, నువ్వులు- 2 టీస్పూన్‌, ఎండుమిరప- 3, పచ్చిమిర్చి- 5, వెల్లులి-6, చింత పండు- 10 గ్రా, నూనె, ఉప్పు- తగినంత.

తయారీ విధానం :

ఒక బాణలిలో నూనె పోసి జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. కాస్త వేగిన తరువాత నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. వేరే బాణలిలో నూనె వేసి మునగాకు వేసి బాగా వేయించాలి. తయారు చేసిన మిశ్రమంలో నానబెట్టిన చింతపండు, ఉప్పు వేసుకుని రుబ్బాలి. రుబ్బిన మిశ్రమంలో మునగాకుని కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న బాణలిలో నూనె, పోపుగింజలన్నీ వేసి పచ్చడిలో వేస్తే మునగాకు పచ్చడి తయారు.

మునగాకు పప్పు :

కావాల్సిన పదార్ధాలు :

మునగ ఆకు- ఒక కప్పు, పెసరపప్పు- ఒక కప్పు, పచ్చిమిరపకాయలు- 3 లేక 4, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, నిమ్మ చెక్క- ఒకటి, నూనె- తగినంత, పోపు గింజలు- టీస్పూను.

తయారుచేసే విధానం :

ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును ఉడికించుకోవాలి. అది ఉడికే సమయంలో అందులో వరసగా మునగ ఆకు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పప్పు పూర్తిగా ఉడికిన తరువాత నిమ్మకాయ పిండాలి. ఆ తర్వాత స్టవ్‌ పై కడాయి పెట్టి అందులో కాస్త పోపు గింజలు వేసి వేగించి పప్పులో కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.

సి. సింధు, డా|| యం. కవిత, డా|| పి. మంజరి, డి. వినోద్‌ నాయక్‌, కషీ విజ్ఞాన కేంద్రం,

పెరియవరం గ్రామం, వెంకటగిరి మండలం, నెల్లూరు జిల్లా, ఫోన్‌: 9492891392