విత్తన అంకురణలో విశేషకృషి చేసి నూతన వంగడాలను రైతులకు అందించడంలో హరీష్‌రెడ్డి చేసిన కృషి నేటి రైతాంగానికి ఆదర్శమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, పార్థసారధి విత్తన అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ డా|| కేశవులు అభిప్రాయపడ్డారు. జనవరి 3వ తేదీన అకస్మాత్తుగా హరీష్‌రెడ్డి (50) మృతి చెందారు. భౌతిక గాయాన్ని సందర్శించిన ప్రముఖులు ఆయన రైతులోకానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విత్తనాభివృద్ది సంస్ధలో 24 సంవత్సరాల అనుభవంతో చిన్న స్థాయి నుండి విత్తన పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావడంలో హరీష్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

1968లో డిసెంబరులో జన్మించిన హరీష్‌రెడ్డి గ్రామీణ ప్రాంతం నుండి విద్యాభ్యాసాన్ని ప్రారంభించి ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్‌ డిగ్రీని పూర్తి చేసి విత్తన రంగాన్ని అభివృద్ధిపరచాలనే సంకల్పంతో విత్తన రంగంలోకి అడుగిడి అనేక పదవులను చేపట్టారు. దేశంలో అత్యున్నత విత్తన అసోసియేషన్‌ అయిన నేషనల్‌ సీడ్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీగా, సీడ్స్‌మెన్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌గా పనిచేసిన కాలంలో భారత విత్తన పరిశ్రమలో అనేక నూతన సంస్కరణలను తీసుకువచ్చి విత్తన పరిశ్రమకు బాటలు వేశారు. సీడ్‌ ప్రాసెసింగ్‌ వంటి సాంకేతిక విధానాన్ని జోడించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు.

నేడు తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడానికి హరీష్‌రెడ్డి కృషి ఎనలేనిదని కొనియాడారు. గంగా కావేరి విత్తనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి రైతులకు మేలైన విత్తనాలను అందించడంలో విశేష కృషి చేశారు. వీరు ఉత్పత్తిచేసిన విత్తనాలు దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు గాంచాయి. వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జ. పొద్దుతిరుగుడు విత్తనాలు దేశ వ్యాప్తంగా ఎగుమతి చేసి తెలంగాణ విత్తనానికి మంచి పేరుతీసుకురావడంలో తన కృషి ఎంతో ఉంది. నేడు వీరు లేని లోటు రైతాంగానికి తీరని లోటేనని పలువులు వక్తలు వ్యక్తంచేశారు. హరీష్‌రెడ్డి భౌతిక గాయాన్ని ఇతర రాష్ట్రాల్లోని విత్తన రంగ సంస్థల ప్రముఖులు, విత్తనోత్పత్తిదారులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొని కడసారిగా నివాళులు అర్పించారు.

-అగ్రిక్లినిక్‌ డెస్క్‌