వేరుశనగ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఎంతో కొంత పంటనివ్వగల మొండి పంట. అందుకే ఈ పంటను అనంతపురం జిల్లాలో వర్షాధారం కింద దాదాపు 3,50,000 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. వర్షాధార వేరుశనగ నైరుతీ రుతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. అనువైన సమయంలో ఆశించినంత వర్షం పడకపోవడం వల్ల వర్షాభావ మరియు కరువు పరిస్థితులు ఈ జిల్లాలో సర్వసాధారణం.

ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కదిరి-6, ధరణి, టాగ్‌-24 రకాలను సబ్సిడీకి అందిస్తున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ వ్యవసాయ మెట్ట పంటల పరిశోధనా సంస్ధ ఇక్రిసాట్‌ హైదరాబాద్‌ వారు డిఆర్‌డిఎ, వెలుగు శాఖతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నారు. వీరు జిల్లాలోని 14 మండలాల్లోని వేరుశనగ రైతు ఉత్పత్తిదారుల సంఘాలలోని రైతులకు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం ప్రాజెక్టుల భాగంగా ఇక్రిసాట్‌ వారు రూపొందించిన ఐసిజివి 91114 అనే బ్రీడరు వేరుశనగ రకాన్ని ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో 17 మంది రైతులతో సాగు చేయించడం జరిగింది.

శింగనమల మండలంలోని చిన్నజలాలపురం గ్రామంలోని నరసింహులు పొలంలో ఐసిజివి 91114 సాగుచేయడం జరిగింది. సాధారణ పొలంలో ఈ రకం 100 రోజుల ముందు కోతకు వచ్చి ఎకరాకు 25 బస్తాలు (42 కిలోల) దిగుబడి ఇస్తుంది. వర్షాధారం కింద బెట్ట పరిస్థితులను తట్టుకొని ఎకరాకు 15 బస్తాలు రావడం జరుగుతుంది. ఈ రకం వేరుశనగ జూన్‌ 30వ తేదీన విత్తనం వేయడం జరిగింది. ఎకరాకు 70 కిలోల విత్తనం వేశారు. విత్తే ముందు దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువు 100 ఎస్‌.ఎస్‌.పి, యూరియా 25 కిలోలు, జింక్‌ సల్ఫేట్‌ 10 కిలోలు, బోరాన్‌ 1 కిలో వేయడం జరిగింది. అలాగే పూత దశలో ఎకరాకు 200 కిలోలు జిప్సంను పొలంలో చల్లి కలియదున్నడం జరిగింది. ఊడలు దిగే సమయంలో పంట వాడినట్లు అనిపించడంతో స్పింక్లర్లు సహాయంతో నీటిని అందివ్వడం జరిగింది. పంటకు విత్తనం దగ్గర నుండి కోత వరకు ఇక్రిసాట్‌ సాంకేతిక అధికారి నరసింహారావు మరియు వెలుగు అధికారులు వెంకట రాయుడు, జ్యోతి పర్యవేక్షిస్తూ తగు సూచనలు అందించారు. పంటను 10 అక్టోబరు 2018 పంట తీయడం జరిగింది. ఎకరాకు 26 బస్తారు (1బస్తా 42 కిలోలు) ఎండు కాయలు రావడం జరిగింది. ఒక ఎకరా సాగుఖర్చు రూ.24,800/- అయినది. బస్తా (42 కిలోల) రూ. 3,200/- వంతున రూ. 83,200/- మొత్తం ఆదాయం రావడం జరిగింది. సాగు ఖర్చులు పోను రైతుకు రూ. 58,400/-నికర ఆదాయం రావడం జరిగింది. కాయ నాణ్యత, బరువు, నూనెశాతం అధికంగా ఉండడం వల్ల రైతుకు మంచి ధర దక్కింది.

అదే విధంగా ఈ రైతు పక్కన 1 ఎకరాలో కదిరి-6 అనే రకాన్ని సాగుచేయడం జరిగింది. పైన పేర్కొన్న విధంగా సాగు, యాజమాన్య పద్ధతులు ఒకే విధంగా పాటించడం జరిగింది. ఇందులో 1 ఎకరానికి 17 బస్తాలు (బస్తా 42 కిలోలు) ఎండు కాయలు రావడం జరిగింది. 1 ఎకరాసాగు ఖర్చు రూ.20,600 అయినది. బస్తా రూ. 2100 వంతున 35,700 మొత్తం ఆదాయం రావడం జరిగింది. సాగు ఖర్చులు పోను రైతుకు ఒక ఎకరానికి రూ. 15,100 నికర ఆదాయం రావడం జరిగింది.

సాగు వివరాలు వేరుశనగ రకాలు
ఐసిజివి 91114 కె6
దుక్కి దున్నడానికి (2 సార్లు) 2500 2500
విత్తనం వేయడానికి 600 600
విత్తనం 13500 7000
ఎరువులు 2300 2300
అంతరకృషి 1200 1200
పురుగు మందులు (2సార్లు) 2500 2500
కట్టె పీకడానికి 2000 2000
కట్టే మిషన్‌ పట్టడానికి 2500 2500
ఖర్చు మొత్తం 27,100 20,600
దిగుబడి ఎకరాకు (బస్తా-42 కి.) 26 17
ధర (బస్తా 42 కిలోలు) * 3200 * 2100
వచ్చిన మొత్తం 83,200 35,700
ఖర్చు 27,100 20,600
మొత్తం ఆదాయం 56,100 15,100

డా|| శ్రీకాంత్‌, పి. నరసింహారావు, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, డిజిటల్‌ అగ్రికల్చర్‌, ఇక్రిసాట్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 8977379077

వెంకటరాయుడు (సమన్వయ కర్త), జ్యోతి, డిఆర్‌డిఎ, వెలుగు, అనంతపురం జిల్లా