ప్రకాశం జిల్లాను అంధత్వ రహితంగా తీర్చిదిద్దాలన్నదే తన జీవితాశయమని, ఇందు కొరకు లక్ష కంటి ఆపరేషన్లు, అర్హులైన రోగులకు కంటి అద్దాలు అందంచడమే తన ధ్యేయమని ఆ సంస్థ చైర్మన్‌, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. తన తండ్రి స్వర్గీయ ఏలూరి నాగేశ్వరరావు స్మారకార్థం గత 10 ఏళ్ళుగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, వృద్ధులకు ఎంతో ఉపకరిస్తున్నాయని ''సర్వేంద్రియానాం నయనం ప్రధానం'' అనే నినాదం, ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయమన్న స్వర్గీయ ఎన్‌టిఆర్‌ ఉవాచ తనకు స్ఫూర్తిదాయకమని ఆ బాటలోనే వ్యయ ప్రయాసల కోర్చి తాము ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పర్చూరు నియోజక వర్గంలోని అన్ని మండలాలతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా ఈ శిబిరాలను నిర్వహించి ఆపన్నులను ఆదుకున్నామని వెల్లడించారు. తాజాగా పర్చూరు నియోజక వర్గంలోని పర్చూరు, కారంచేడు మండలాల్లో కంటి వైద్య శిబిరాలను ప్రారంభించి ఉచిత వైద్య సేవలను అందించామని ఏలూరి తెలిపారు.

అంధకారంలో ఉన్న ప్రజలకు వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. వేలాదిగా ప్రజలకు కంటి పరీక్షలు చేయించడం జరిగిందని రానున్న కాలంలో లక్షకు పైగా ప్రజలకు కంటి పరీక్షలు చేసే విధంగా తన లక్ష్యం కొనసాగుతుందని తెలిపారు. పర్చూరు నియోజక వర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు ఇకపై అనేక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కీళ్ళ, మోకాళ్ళ పరీక్షలు, ఉచిత గుండె పరీక్షలు, స్త్రీలకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను ఉచితంగా అందించడానికి ట్రస్టు దోహదపడుతుందని ఆయన అన్నారు.

ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టు కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విజ్ఞానాన్ని అందించేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. నేటి యువత సమాజ మార్పు కోసం పాటుపడే విధంగా సామాజిక కార్యక్రమాలతో పాటు క్రీడా రంగంలో రాణించే విధంగా తమ ట్రస్టు తోడ్పాటు అందిస్తుందని, ఇప్పటికే యువతకు క్రీడా సామగ్రిని అందచేయడం జరిగిందని వివరించారు. విద్యార్థులకు 10 వ తరగతి స్టడీ మెటీరియల్‌తో పాటు ఉచితంగా నోటు పుస్తకాలను సరఫరా చేయడం జరిగింది. నియోజక వర్గంలోని ప్రజలందరికీ తమ ట్రస్టు ద్వారా ఏదో విధంగా సేవలను అందించేందుకు విస్తరింప చేస్తున్నామని తెలిపారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రానున్న కాలంలో ఈ జిల్లాను అంధత్వ నివారణ జిల్లాగా రూపుదిద్దేందుకు ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి సాగుతుందని తమ ట్రస్టుతో పాటు గుంటూరు శంకర నేత్ర వైద్యశాల, రమేష్‌ హాస్పటల్‌ గుండె, మోకాళ్ళ సంబంధ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తమ సంస్థతో పాటు వారి సహకారంతో ఉచిత వైద్య సేవలను జిల్లా వ్యాప్తంగా విసృతపరచేందుకు కృషి చేస్తున్నామని అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు.

డిసెంబరు 15 వ తేదీన యద్దనపూడి మండలం పూనూరు హైస్కూల్‌లో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో 400 పైగా కంటి పరీక్షలకు హాజరైనారు. వీరికి కంటి పరీక్షలు నిర్వహించగా 130 మందికి శుక్లాలు ఉన్నట్లుగా గుర్తించారు. 30 మందికి తక్షణమే ఆపరేషన్ల కోసం గుంటూరు శంకర నేత్ర వైద్యశాలలో ఏర్పాటు చేశామని తెలిపారు. మిగతా మిగతా వారికి దశల వారీగా చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 10 మందికి మోకాళ్ళ ఆపరేషన్లు, 7 గురికి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వీరికి కూడా ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు ఏలూరి తెలిపారు.

కారంచేడు మండలం కుంలమర్రులో నిర్వహించిన వైద్య శిబిరంలో 500 మంది వైద్య పరీక్షలకు హాజరవ్వగా 110 మందికి మోకాళ్ళ ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. 100 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. కంటి ఆసుపత్రి వైద్యులు కంటి ఆపరేషన్లు చేసేందుకు తక్షణ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోవా అగ్రిటెక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పుల్లెల అజయ్‌బాబు, గుంటూరు శంకర వైద్య నిపుణులు, రమేష్‌ హాస్పటల్‌ వైద్యులు, సిబ్బంది మరియు యద్దనపూడి టిడిపి మండల అధ్యక్షులు రంగయ్య చౌదరి, ఆర్‌. సీతయ్య, ఇంటూరి మురళి, బోయపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

-అగ్రిక్లినిక్‌ డెస్క్‌