వెదురు మానవ జీవనంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. నిత్యం జీవితంలో ఉపయోగించే అనేక వస్తువులు వెదురుతోనే తయారవుతున్నాయి. మానవ మనుగడకు వెదురుతో అవినాభావ సంబంధం ఏర్పడింది. అటవీ భూముల్లో గుట్టలపై విస్తరించి ఉన్న వెదురు మానవ నాగరికతతో పెనవేసుకుంది. వెదురు ఉత్పత్తులపై ఆధారపడిన పల్లె, పట్టణ వాసులకు గిరజన గ్రామాల ప్రజలకు వెదురు వ్యాపార సరుకుగా మారింది. అటవీ ప్రాంతాల్లో నివశించే గిరిజన ప్రజలు అడవిని ఆధారం చేసుకొనే జీవించారు. అడవిలో దొరికే వెదురును అనేక అలంకరణ వస్తువులుగా తయారు చేసి పట్టణ ప్రాంతాల్లోని సంతల్లో విక్రయిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకునే వారు. నేడు మానవుని నాగరికత ఆధునిక పద్ధతిలోకి రావడంతో వెదురు ఉత్పత్తుల విలువ పెరిగింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అలంకార ప్రాయంగా మారింది. తద్వారా వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది.

సహజ సిద్ధంగా పెరిగే వెదురు క్రమ క్రమంగా అంతరించిపోతూ వస్తుంది. నేడు వెదురు ఉత్పత్తుల కొరత ఏర్పడడంతో వెదురు అల్లికలకు మంచి ప్రాధాన్యాత సంతరించుకుంది. అటవీ ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు వెదురు బియ్యం సైతం ఆహారంగా భుజించేవారు. వెదురు పంట మీదనే గిరిజన ప్రాంతాల ప్రజలు ఆధారపడి జీవించేవారు. నేడు వెదురు అంతరించిపోతుందని భావించిన ప్రభుత్వం వెదురును సాగుగా మర్చాలనే ఉద్ధేశంతో రూ.13 కోట్లతో సాగుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ భూముల్లో వెదురు సాగు చేసేందుకు ఉద్యానవనశాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 1927 చట్టం ప్రకారం వెదురు అటవీ చట్టం పరిధి నుండి సడలించి వ్యవసాయ పంటగా గుర్తించినప్పటికీ వ్యవసాయ భూముల్లో వెదురుసాగుపై అవగాహన లేకపోవడం వల్ల అంతగా ప్రాచుర్యం పొందలేక పోయింది. నేడు వెదురు, ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా వెదురు నుండి విద్యుత్‌, బొగ్గు, సాంప్రదాయేతర ఇంధనాలైన ఇథనాల్‌ అగ్రో గ్యాస్‌, హైడ్రోజన్‌ గ్యాస్‌ వంటి ఉత్పత్తి సామర్ధాలను గుర్తించడం జరిగింది.

వెదురు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల్లో ప్రోత్సహించడానికి జాతీయ వెదురు మిషన్‌ పథకాన్ని పునర్వవస్తీకరించింది. 2018-19 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించనుంది. రైతు భూముల్లోని గట్ల మీద వెదురు సాగు చేసుకోవచ్చునని అధిక విస్తీర్ణంలో సాగును ప్రాత్సహించి పరిశ్రమలకు అవసరమైన వెదురు రకాలను సరఫరా చేయడం, తద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడం, అలాగే వెదురు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి కల్పించడం. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ నోడల్‌ ఏజన్సీగా, ఉద్యాన సంచాలకులను రాష్ట్ర వెదురు మిషన్‌ డైరెక్టర్‌గా నియమించడం జరిగింది. ఈ పధకాన్ని అమలును పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీని నిర్వహిచడం జరిగింది.

వెదురు సాగుపై సమాలోచన :

వెదురు సాగు అమలు చేసే విధానంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు సాగు విధానంపై పూర్తిస్థాయి సమాచారాన్ని చేరవేసే విధానాలపై ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి అద్యక్షతన మొట్టమొదటి రాష్ట్ర స్థాయి సమావేశం సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ ఉత్పత్తల కమీషనర్‌, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారధి, అటవీ పర్యావరణ శాఖ సాంకేతిక పత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, పరిశ్రమల కార్యదర్శి జయేష్‌ రంజన్‌, కమీషనర్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ నీతూ ప్రసాద్‌, రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ సంచాలకులు వెంకట్రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారత ప్రభుత్వం తరుపున డా|| దుష్యంత్‌ గెహాలత్‌ వ్యవసాయ మరియు రైతు సంక్షేమశాఖ, ఎన్‌. భారతి, డైరెక్టర్‌ - గ్రోమోర్‌ బయోటెక్‌ వారు పాల్గొని వెదురు గురించి వివరించారు.

క్షేత్రస్థాయిలో రైతు పొలాల్లో వెదురు మొక్కల పెంపకం, రైతులకు అవగాహన కార్యక్రమాలు రైతులకు వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయ పడ్డారు. వెదురు మిషన్‌ వార్షిక ప్రణాళికలో పొందుపరచిన విధంగా వెదురు నర్సరీల అభివృద్ధి ప్రదర్శనా క్షేత్రాలు రైతు పొలాల్లో వెదురు మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టాలని చర్చించడం జరిగింది.

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిది, ఫోన్‌ : 9949285691