మన రాష్ట్రంలో పండించే అపరాల్లో కంది, పెసర, మినుము ముఖ్యమైనవి. ఈ అపరాలు మనిషి శారీరక పెరుగుదలకు, పిల్లల్లో మెదడు బాగా అభివృద్ధి చెందటానికి కావలసిన మాంసకృత్తులను, ఖనిజ లవణాలను అందిస్తాయి. కంది, మినుము/పెసర పైర్లను మెట్ట ప్రాంతాలలోను, నల్లరేగడి నేలల్లో వర్షాధారంగాను, తేలిక భూముల్లో ఆరుతడి పైరుగా కూడా సాగు చేయవచ్చు. కంది పంటను ఖరీఫ్‌ మరియు రబీలోనూ, పెసర మరియు మినుము పంటలను అన్నికాలాల్లో మెట్టలో మరియు వరిమాగాణుల్లో కూడా సాగు చేయవచ్చు. ఇంత విస్తారంగా అన్ని కాలాల్లోను, అన్ని రకాల భూముల్లోను పండించబడుతున్నప్పటికీ ఈ పప్పు ధాన్యాలు మనకు సరిపోయినంతగా పండటం లేదు. సగటున ప్రతి మనిషికి రోజు సుమారు 80 గ్రా అవసరం కాగా కేవలం 40 గ్రా. కంటే తక్కువగా లభ్యమవుతున్నాయి. అపరాల పంటలో తొలిదశ నుండి వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళు ఆశించడం, మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడం జరుగుతుంది.

ఈ చీడపీడలను అరికట్టటానికి రైతాంగం పురుగు మందులను అధికంగా వాడటం జరుగుతున్నది. అనేక రకాల పురుగు మందులు అందుబాటులో ఉండటం, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పురుగులను అరికట్టకలగడం వల్ల పురుగు మందుల వాడకానికి ఆదరణ పెరిగింది. కాని విషపూరిత మందులను విచక్షణారహితంగా అవసరానికి మించి వాడటం వల్ల పురుగులు వాటిని తట్టుకొనే శక్తిని పెంపొందిచుకుంటున్నాయి. దీనితో పాటుగా వివిధ పంటల్లో సహజ సిధ్దంగా లభించే బదనికలు లేక మిత్ర పురుగులు తుడిచిపెట్టుకొని పోతున్నాయి. అంతేకాక మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ విషపూరితమై అనేక రకాల రోగాల బారిన పడుతున్నాం. పురుగు మందులు అధికంగా వాడటం వల్ల తాత్కాలికంగా అధిక దిగుబడులు సాధించినా పైన తెలిపిన దుష్ఫలితాల ప్రభావం మనం ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి అపరాల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు అవలంబించినట్లయితే ప్రకృతినే కాక మన ఆరోగ్యాన్ని కూడ కొంత వరకు కాపాడుకోవచ్చు.

సమగ్ర సస్యరక్షణ అనగా?

కీటక సంహారానికి వాడుతున్న క్రిమిసంహారక మందులను క్రమబద్దీకరించి మనకు అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన వివిధ పధ్దతులను ఉపయోగించి కీటకాలను అదుపులో ఉంచుతూ పంటలో జీవుల సమతుల్యతను కాపాడుకోవడాన్ని సమగ్ర సస్యరక్షణ అంటారు.

అపరాలలో ఆచరించతగిన సమగ్ర సస్యరక్షణ పద్దతులు

1. సేద్య పద్ధతులు/యాజమాన్య పధ్దతులు

2. యాంత్రిక పద్ద్దతులు

3. జీవశాస్త్ర ప్రక్రియలు

4. రసాయనిక పురుగు మందుల వాడకం.

సేద్య పద్ధతులు :

ఎండాకాలం పైరు లేనప్పుడు లోతుగా దున్నడం వల్ల భూమిలో దాగి ఉన్న గొంగళి పురుగులను, కోశస్థ దశలను, వేరు పురుగులను, అలానే కొన్ని రకాల శిలీంధ్రాలను నాశనం చేయవచ్చు. భూమి లోపల ఉండే అయా చీడ పీడలు వెలుపలికి వచ్చి సూర్యరశ్మికి చనిపోవడంగానీ లేక పక్షులు బారినకానీ పడి చనిపోతాయి. సంవత్సరాల తరబడి ఒక చేలో ఒకే పంటను సాగు చేసినట్లయితే చీడ పీడల ఉధృతి పెరుగుతుంది. కాబట్టి పంటమార్పిడి తప్పనిసరిగా అనుసరించాలి.

కొన్ని రకాల తెగుళ్ళు, నులిపురుగులు వంటివి విత్తనాల ద్వారా, నారు ద్వారా పొలంలోకి వ్యాపిస్తాయి. కాబట్టి తెగుళ్ళు లేనటువంటి ఆరోగ్యకరమైన విత్తనాన్ని లేక నారును వాడాలి. కొన్ని రకాల పురుగులు కొన్ని పైర్లకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. అలాంటి వాటిని ''ఎరపైర్లు'' అంటారు. పొలంలో అక్కడక్కడా బంతి మొక్కలను వేసుకొన్నట్లయితే శనగపచ్చ పురుగు యొక్క రెక్కల పురుగులు బంతి పూలకు ఆకర్షించబడి వాటిపై గుడ్లను పెడతాయి. దీని ద్వారా ప్రధాన పంటలో శనగపచ్చ పురుగు ఉధృతి తగ్గించవచ్చు. కంది, పెసర లేక మినుము పంటల్లో అక్కడక్కడా జనుము మొక్కలను వేసుకొన్నట్లతే అవి మారుకా మచ్చల పురుగుకు ఎర పంటగా పనిచేసి ప్రధాన పంటలో కొంత వరకు మారుకా గొంగళి పురుగు ఉధృతి తగ్గుతుంది. అలాగే పంటచుట్టూ రెండు నుండి నాలుగు వరుసల్లో జొన్న లేక మొక్కజొన్న వంటి రక్షక పైర్లను వేసుకున్నట్లయితే ప్రక్క పొలాల నుండి రెక్కల పురుగులు మన పొలానికి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. దీని వలన పెసర మరియు మినము పంటలను ఆశించే తెల్లదోమ మరియు తామరపురుగు ఉధృతి కొంత వరకు తగ్గడమేకాక ఆయా పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌ తెగుళ్ళను కూడా కొంత వరకు నివారించవచ్చు. సిఫారసు చేసిన మోతాదు మేరకు మాత్రమే రసాయనిక ఎరువులను ఉపయోగించాలి. సేంద్రియ ఎరువులను ఉపయోగించినట్లయితే మొక్కల్లో చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.

యాంత్రిక పద్దతులు :

చిన్న పరికరాలు లేక పనిముట్లు ఉపయోగించి చీడపీడలను అదుపులో ఉంచేవే యాంత్రిక పద్ధతులు. అపరాల్లో శనగ పచ్చపురుగు, పొగాకు లద్దెపురుగు మొదలైన వాటికి లింగార్షక బుట్టలను విధిగా ఉపయోగించాలి. దీని వల్ల మగ రెక్కల పురుగుల ఆకర్షించబడి చనిపోవడం వల్ల పురుగుల్లో సంతతి పెరుగుదల తగ్గిపోతుంది. దీని ద్వారా తరువాత పంటలో పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాక లింగాకర్షక ఎరల్లో మూడు రోజులపాటు వరుసగా 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే పురుగు మందులను పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. ఎకరాకు 4 లేదా 5 బుట్టలను పెట్టినట్లయితే సుమరుగా 20-30 శాతం పురుగుల ఉధృతిని తగ్గించవచ్చును. ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను ఉపయోగించి తెల్లదోమలను, నీలిరంగు జిగురు అట్టలను ఉపయోగించి తామర పురుగుల ఉనికిని గుర్తించటమే కాక కొంత వరకు ఉధృతిని తగ్గించవచ్చు.

జీవశాస్త్ర ప్రక్రియలు :

పైరుకు హానిచేసే పురుగులు ఉన్నట్లే, ప్రకృతిలోనే ఆ పురుగులకు హని చేసే పురుగులు, సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. వాటినే సహజ శత్రువులు అంటారు. చీడపీడలను అదుపులో ఉంచడానికి సహజ శత్రువులను ఉపయోగించడాన్ని జీవశాస్త్ర నియంత్రణ అంటారు. ఈ సహజ శత్రువులను పరాన్నజీవులు, బదనికలు మరియు రోగాలను కలుగ జేసే సూక్ష్మజీవులుగా విభజించవచ్చు. పరాన్నజీవులు పురుగుల లోపల గాని, వాటిపైన కాని చేరి వాటిని చంపేస్తాయి. పురుగుల యొక్క వివిధ దశల్లో అనగా గుడ్డు దశ, గొంగళి పురుగు దశ, కోశస్థదశ లేక రెక్కల పురుగు దశలో వేరు వేరు సహజ శత్రువులు ఆశించి అదుపులో ఉంచుతాయి. ఉదాహరణకు ట్రైకోగ్రామా, ఇది అనేక రకాల గొంగళి పురుగుల యొక్క గ్రుడ్డుదశను ఆశించి వాటిని నాశనం చేస్తుంది. వివిధ పంటలో కనిపించే అక్షింతల పురుగులు, సాలీళ్ళు, కందిరీగలు, గొల్లభామ పురుగులు, కొన్ని రకాల పెంకుపురుగులు, బగ్స్‌ వంటివి పురుగుల యొక్క వివిధ దశలను తిని వేస్తాయి. వీటినే బదనికలు అంటారు.

ఇవే కాకుండా పురుగులకు రోగాలను కలుగచేసే బాక్టీరియా, వైరస్‌ మరియు శిలీంధ్రాలు కూడా ప్రకృతిలో లభ్యమవుతాయి. ఇవి ఒక జాతికి చెందిన పురుగులను మాత్రమే ఆశిస్తాయి. ఉదాహరణకు బాసిల్లన్‌ ధూరిజెనిసిస్‌ గొంగళి పురుగులను మాత్రమే ఆశించి చంపేస్తుంది. అలాగే ఎన్‌.పి.వి వైరస్‌, ఇది కూడ శనగ పచ్చపురుగు లేక పొగాకు లద్దె పురుగులను మాత్రమే ఆశించి నశింపజేస్తాయి. ఇవే కాక నొమురియా లేక బవేరియా వంటి శిలీంధ్రాలు గొంగళి పురుగులను, పెంకు పురుగులను ఆశించి చంపివేస్తాయి.

వృక్ష సంబంధిరత పురుగు మందుల వాడకం :

వేపగింజల కషాయం (5%) లేక వేపనూనెలను పంట శాఖీయ దశలోనూ మరియు పూత దశలోనూ వినియోగించడం వల్ల రసంపీల్చు పురుగులనేకాక కాయలను ఆశించే పురుగులను కూడా నియంత్రించవచ్చు. వేరు సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వల్ల రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక రసంపీల్చు పురుగులు మరియు గొంగళి పురుగులు మొక్క భాగాల నుండి రసం పీల్చడం కాని, మొక్క భాగాలనుకాని తాకుటకు ఇష్టపడవు. తద్వారా పంటలో పురుగు నష్టం తగ్గుతుంది. అంతేకాక వేప సంబంధిత మందులు గుడ్లు మరియు పిల్ల పురుగులను చంపివేయడానికి కూడా దోహదపడతాయి కావున పురుగుల సంతతి పెరుగుదల మరియు ఉధృతి తగ్గుతుంది.

రసాయనిక పురుగు మందుల వాడకం :

పైన తెలిపిన విధంగా మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పధ్దతులను ఉపయోగించినట్లయితే అపరాల్లో కొంత వరకు పురుగులను అదుపులో ఉంచవచ్చు. చివరిగా పంటలో పురుగుల ఉధృతిని బట్టి, పురుగులు ఆర్ధిక నష్టపరిమితి స్థాయిని దాటినట్లయితే రసాయనిక పురుగు మందులు ఉపయోగించాలి. కొన్ని రకాల పురుగు మందులు కొన్ని రకాల పురుగులపై మాత్రమే పనిచేస్తాయి. ఉదాహరణకు రసం పీల్చు పురుగులను సమర్ధవంతంగా నివారించే పురుగు మందులైన ఇమిడాక్లోప్రిడ్‌, ఎసిటామిప్రిడ్‌ లేక ఫ్లోనికామైడ్‌ వంటివి శనగపచ్చ పురుగును లేక మారుకా మచ్చల పురుగులను నివారించలేవు. అలాగే గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారించకలిగే రైనాక్సిపిర్‌, ఫ్లూబెండిమైడ్‌ లేక ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ వంటివి రసం పీల్చు పురుగులను నియంత్రించలేవు. కాబట్టి పురుగు మందును పిచికారీ చేయునప్పుడు పంటలో ఉన్న పురుగులను నిర్ధారిచుకుని ఆ పురుగులపై సమర్ధవంతంగా పనిచేసే పురుగు మందులను సిఫారసు చేసిన మోతాదు మేరకు మాత్రమే ఉపయోగించాలి. లేనప్పుడు పురుగు మందు వృధాయై పెట్టుబడి నష్టపోవడమే కాక పురుగుల్లో పురుగు మందును తట్టుకొనే శక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

పెసర, మినుము పంటల్లో ఆచరించదగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు :

1. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి.
పెసర : ఎల్‌.జి.జి 407, ఎల్‌.జి.జి 460, పి.డి.యం 54 మరియు డబ్లూ.జి.జి 42.
మినుము : పి.యు 31, ఎల్‌.బి.జి 787, ఎల్‌.బి.జి 752, టి-9 మరియు ఎల్‌.బి.జి 20 రకాలను సాగుచేసుకోవాలి.

2. ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ. లేదా ధయోమిధాక్సిమ్‌ 5 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తుకొనే రెండు రోజుల ముందుగా విత్తనశుద్ది చేసినట్లయితే పైరును తొలి దశలో వైరస్‌ తెగులును వ్యాపింపచేయు రసం పీల్చే తెల్లదోమ పురుగుల నుండి కాపాడవచ్చును.

3. పైరు చుట్టూ నాలుగు వరుసలు మొక్కజొన్న గానీ లేక జొన్న విత్తుకున్నట్లయితే వైరస్‌ తెగుళ్ళను వ్యాపింప చేసే తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక వంటి రసంపీల్చే పురుగులను పక్క పొలాలనుండి వ్యాపించకుండా నివారించవచ్చు.

4. పొలము గట్లమీద మరియు రోడ్డు ప్రక్కన వైరస్‌ ఆశించిన కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి.

5. తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే పీకి నాశనం చేయాలి.

6. పొలంలో అక్కడక్కడా జిగురు పూసిన పసుపు రంగు వేసిన అట్టలనుగాని లేక రేకులనుగాని ఉంచినట్లయితే తెల్లదోమ ఉధృతిని అంచనా వేసుకోవచ్చు. కొంత వరకు తెల్లదోమను నివారించుకోవచ్చును.

7. విత్తిన 20 రోజులకు మరియు 45 రోజులకు ఒకసారి వేపనూనె 5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి లేక 5 శాతం వేప గింజల కషాయం కాని పిచికారీ చేసినట్లయితే పంటను రసంపీల్చు పురుగులు మరియు మారుకా మచ్చల పురుగు ఆశించకుండా కాపాడుకోవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వల్ల రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు, అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితిగల పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం.

8. రసంపీల్చు పురుగుల నివారణకు ట్రైజోఫాస్‌ 1.25 మి.లీ లేక మోనోక్రోటోఫాస్‌ 2.0 మి.లీ లేక ఎసిఫేట్‌ 1.0 గ్రా. లేక ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేక థయోమిధాక్సమ్‌ 0.2 గ్రా లేక ప్రొపినోఫాస్‌ 1.5 మి.లీ ఏదేని ఒకదానిని ఒక లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

9. పంట మొగ్గ, పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి మారుకా పిల్ల పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. పిల్ల పురుగులు కనిపించినట్టయితే వెంటనే క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ లేదా ధయోడికార్బ్‌ 1 గ్రా. లేక ఎసిఫేట్‌ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్‌ 1 గ్రా. లేక క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేక నొవాల్యురాన్‌ 1 మి.లీ లో ఏదో ఒక మందుతోపాటుగా తప్పనిసరిగా ఊదర స్వభావం కలిగిన డైక్లోరివాస్‌ మందును 1 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మరల అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత, పిందె మరియు కాయ దశల్లో పిచికారి చేయాలి. పురుగు ఉదృతి అధికంగా గమనించినపుడు స్పైనోశాడ్‌ 0.3 మి.లీ నేక ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా. లేదా ప్లుబెండిమైడ్‌ 0.2 మి.లీ. లేదా రైనాక్సిపిర్‌ 0.3 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

కంది పంటలో ఆచరించదగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు :

1. వేసవిలో లోతు దుక్కి చేయాలి.

2. సజ్జ, సోయాబీన్‌, పెసర, మినుము, జొన్న మొ|| పంటలను అంతర పంటలుగా సాగుచేయాలి.

3. పంట మార్పిడి చేపట్టాలి.

4. శనగపచ్చ పురుగును తట్టుకునే రకాలు - ఎల్‌.ఆర్‌.జి 41, డబ్ల్యూ.ఆర్‌.జి 27, పురుగు ఆశించినప్పటికి తిరిగి పూతకు రాగల ఎల్‌.ఆర్‌.జి 30, ఎల్‌.ఆర్‌.జి 38, ఐ.సి.పి.ఎల్‌ 332, ఐ.సి.పి.ఎల్‌ 84060, ఎమ్‌.ఆర్‌.జి 66 రకాలను సాగు చేసుకోవాలి. సరైన సమయంలో రైతులందరూ సామూహికంగా ఒకేసారి విత్తనం విత్తుకోవాలి.

5. ఆకర్షక మొక్కలుగా బంతి, రక్షిత పైరుగా కంది చుట్టూ నాలుగు వరుసల జొన్న/మొక్కజొన్న విత్తుకోవాలి.

6. పంట పూతదశకు రాగానే ప్రతి ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకుని రెక్కల పురుగు ఉధృతిని గమనిస్తూ తదనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

7. ఎకరాకు 10 పంగల కర్రలను పంట ఎత్తు కన్నా ఒక అడుగు ఎత్తులో పాతినట్లయితే పక్షులు వాలి పెద్ద గొంగళి పురుగులను ఏరుకుని తింటాయి.

8. విత్తిన 90-100 రోజుల్లో చిగుర్లు ఒక అడుగు మేర తుంచాలి

9. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన యన్‌.పి.వి ద్రావణాన్ని చల్లుకోవాలి.

10. బాక్టీరియా సంబంధిత మందులను ప్రతి ఎకరాకు 400 గ్రాములు పిచికారి చేయాలి.

11. 5% వేప గింజల కషాయం (లేదా) వేపనూనే 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను నాశనం చేయాలి. పెరుగుదల ఉధృతి బాగా ఉన్నప్పుడు దులుపుడు పద్దతిని అవలంబించి పురుగుమందులు లేకుండా పురుగులను చాలా వరకు నాశనం చేయవచ్చు.

12. పంట మొగ్గ, పూత దశలో పంటను తరచూ గమనిస్తూ గొంగళి పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. గొంగళి పురుగులు కనిపించినట్టయితే వెంటనే క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ లేదా ధయోడికార్బ్‌ 1 గ్రా లేక ఎసిఫేట్‌ 1 గ్రా ఒక లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్‌ 1 గ్రా లేక క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేక నొవాల్యురాన్‌ 1 మి.లీ. ఏదో ఒక మందుతోపాటుగా తప్పనిసరిగా ఊదర స్వభావం కలిగిన డైక్లోరివాస్‌ మందును 1 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. శనగపచ్చ పురుగు లేక మారుకా మచ్చల పురుగు ఉదృతి అధికంగా గమనించినపుడు స్పైనోశాడ్‌ 0.3 మి.లీ నేక ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా లేదా ప్లుబెండిమైడ్‌ 0.2 మి.లీ. లేదా రైనాక్సిపిర్‌ 0.3 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మరల అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత, పిందె మరియు కాయ దశల్లో పిచికారి చేయాలి.

ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న ఆచరణకు సాధ్యమైన అన్ని రకాల పద్ధతులను ఉపయోగించినట్లయితే అపరాల్లో పురుగుల ఉధృతిని తగ్గించడమే కాకుండా ఆహార కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతిలో జీవ సమతుల్యతను కాపాడుకొంటూనే అధిక దిగుబడులను, అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.

డా|| యం. శేషమహాలక్ష్మి, డా|| యం. శ్రీకాంత్‌, డా|| యం. ఆదినారాయణ, డా|| యం.వి. రమణ

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు, ఫోన్‌ : 9989130480