దేశానికి స్వాతంత్య్రం లభించిననాటి నుండి ఇప్పటివరకు పగలు, రాత్రి అనకుండా అ¬రాత్రులు కష్టపడి, చమటోడ్చి పంటలు పండిస్తున్న రైతు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికి, చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని రైతులు పొందడానికి అవకాశం ఇవ్వని ప్రభుత్వాలు ఇప్పుడు తాజాగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పుంఖాను పుంఖాలుగా వాగ్ధానాలు వల్లె వేస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందు ఈ నినాదం షరామామూలుగానే ఓటర్లను ముఖ్యంగా రైతులను ఆశల పల్లకిలో విహరింపచేస్తూనే ఉంది. ఓట్ల పబ్బం గడచి విజయోత్సవాలు జరుపుకొని, అందలమెక్కిన తరువాత ఏరుదాటి తెప్పతగలేసినట్లు పాలకులు రైతులను ఏమార్చి దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

దేశ సమగ్రాభివృద్ధి కొరకు అనేక ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దేశంలోని బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు, ఉప్పు సముద్రం పాలవుతున్న జలాలకు అడ్డుకట్టవేసి, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి, దేశ వ్యాప్తంగా ఆధునిక దేవాలయాలుగా పిలవబడే జలాశయాలను నిర్మించి పొలాలపై పారించి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేయడం ద్వారా ఆహార భద్రతకు పెద్దపీట వేశారు. ఆయన హయాంలోనే ప్రారంభమైన మొదటి సస్యవిప్లవం రైతుల పట్టుదలతో ''కృషితో నాస్తి దుర్బిక్షం'' అనే ప్రాచీన నానుడిని నిజం చేయడం ద్వారా దేశానికి ఆహార భద్రతను కల్పించారు. కానీ రైతులకు ఒరిగిందేమీ లేదు. సరిహద్దుల్లో సైనికులు మూడు యుద్ధాలు చేసి జై జవాన్‌ నినాదాన్ని నిజం చేశారు. అదే స్ఫూర్తితో భారత రైతాంగం ఎల్లలు లేని వ్యవసాయ స్ఫూర్తితో దేశానికి ఆహార భద్రత కల్పించారు. భారత సార్వభౌమాధికారాన్ని హేళన చేసిన పాశ్చాత్య దేశాల అహంకారాన్ని తమ కృషి ద్వారా కిసాన్‌లు ప్రశ్నించి ఆత్మగౌరవాన్ని, సాధికారతను ప్రతిబింబింపచేశారు. అయినా కూడా ఆదాయపరంగా రైతులకు ఒరిగింది ఏమీ లేదు.

దేశంలో ఇప్పటి వరకు వచ్చిన పార్టీల ప్రభుత్వాలు రూపొందించిన అన్ని ప్రణాళికలు వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, ఆహార భద్రత సాధించడంపైనే దృష్టి సారించాయి. పంటల బాగు కొరకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, నూతన వంగడాలు వాడడం ద్వారా ఉత్పాదకతను పెంచడం బాగానే ఉన్నాయి. ఉత్పాదకాలకు సబ్సిడీలు, కొద్ది పంటలకు కనీస మాత్రంగా గిట్టుబాటు ధరలు లభించాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, ఇబ్బడి ముబ్బడిగా పరిశోధనా సంస్థలు స్థాపించడంతో పాటు వ్యవసాయ రంగానికి పెట్టుబడుల శాఖకు కూడా గణణీయంగా పెరిగింది. అయినా రైతుల వెతలు తీరలేదు. వారి కష్టాలు కడగండ్లు తీర్చే నాధుడే లేరు.

స్వాతంత్య్రానికి ముందు, ఆ తరువాత దేశంలో ఆహార ధాన్యాల కొరతతో బెంగాల్‌, ఇతర ప్రాంతాల్లో డొక్కల కరువు సంభవించి లక్షలాదిగా ప్రజలు ఆకలి చావులతో మరణించడం, ఈ విపత్తు నుండి దేశాన్ని రక్షించేందుకు ఆరుగాలం పంటలు పండించి రైతులు ఇక దిగుమతుల అవసరం లేకుండా ఆహార ఉత్పత్తుల రంగంలో స్వయం సమృద్ధిని సాధించి నిజమైన దేశ భక్తిని నిరూపించుకన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి పి.యల్‌-484 నిబంధన కింద గోధుమలు, బియ్యాన్ని దిగుమతి చేసుకొని, భారత ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టే విధంగా ఉన్న షరతులను ఇక పాటించవలసిన అవసరం లేకుండా మువ్వన్నెల జండాను అత్యున్నతంగా నిలబెట్టింది భారత రైతులే. కానీ భారత ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ రైతులకు మిగిల్చింది ఆకలి మంటలే.

1990 దశకం నుండి వ్యవసాయం పరాధీనమై, విత్తనంపై రైతు సాధికారతను కోల్పోయి, రుణ భారాలతో, గిట్టుబాటు ధరలు లేక, అమ్ముకోవడానికి మార్కెట్‌ సౌకర్యాలు కరువై, బ్రతుకు బరువై, ఆత్మగౌరవాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాశకు గురై ''పురుగుల మందునే పెరుగన్నంగా భావించి'' ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని సాక్షాత్తుగా మన పాలకులే తెచ్చిపెట్టారు. 1990 నుండి ఇప్పటి వరకు పవిత్ర భారత దేశంలో అన్నదాతలు 3 లక్షలకు పైగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత అమానవీయ స్థితి నెలకొందో మనం అర్ధం చేసుకోవచ్చు.

దేశ స్వాతంత్య్రం సిద్ధించిన ఆరున్నర దశాబ్ధాల అనంతరం కూడా రైతు నిరంతరం ప్రకృతిపై ఆధారపడి వ్యవసాయం చేయడం ఒక జూదంగా మారింది. అతివృష్టి, అనావృష్టి వల్ల నిలకడ లేని వ్యవసాయ ఆదాయంతో ఇక కాడిని మోయలేమని లక్షలాది మంది రైతులు దాన్ని కిందపడవేసి, తాము పవిత్రంగా పూజించి, తరించే భూమీకి పచ్చాని రంగులద్దడం మానివేసి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం ప్రారంభించారు. భూమిపై హక్కుదారులైన రైతులు తమ తరువాతి తరం వారు కూడా వ్యవసాయం చేయడం ఇష్టం లేక శాశ్వతంగా సాగును వీడి పట్టణీకరణ ప్రభావంలో మునిగితేలుతున్నారు. భూమి యజమానులైన రైతులు వ్యవసాయం వదలివేయడంతో గ్రామాల్లోని పేదలు, దళిత, అల్పాదాయ వర్గాలు కౌలు రైతులుగా రంగ ప్రవేశం చేసి త్రిశంఖు స్వర్గంలా మరో వేదనాభరిత వర్గంగా తయారయ్యారు. వీరి ఆలనా పాలనా పట్టించుకునే నాధులే లేరు.

ప్రతికూల పరిస్థితుల మధ్య వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే రైతులు చేస్తున్న కృషివల్ల ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గి, ఎగుమతులకు మన దేశం ఎదగగలిగింది. కానీ ప్రభుత్వాలు, పరాన్న భుక్కులైన దళారీల దోపిడీ విధానంతో, కార్పోరేట్‌ శక్తులు లాభపడేందుకు మాత్రమే ఇప్పటికీ కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్ల రైతాంగానికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపద్యంలోనే ప్రతి వ్యక్తికి సాలీన 45 శాతం ఆహార ధాన్యాల అందుబాటు పెరిగింది. అయినా రైతులకు ఒరిగిందేమీ లేదు. అందరూ దేశానికి వెన్నెముక అని రైతుని పొగుడుతూనే అధికారంలోకి రాగానే దళారీ వ్యవస్థ ప్రభావంతో అన్నదాతలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఆదాయం పెరగక, ఉత్పత్తి ఖర్చులు తడిసిమోపెడై వ్యవసాయం దండగన్న భావనకు వచ్చేసిన రైతులోకం వారి తరువాత తరాలు నిరాశ చెంది సంక్షోభంలో శలభాలుగా మారుతున్నారు. ఒక రైతు వ్యవసాయం చేసే మరో రైతు బిడ్డకు వివాహార్ధం బిడ్డనిచ్చే దానికి కూడా వెనుకాడుతుండడంతో రైతు కుటుంబాల దుస్థితిని మానవీయ కోణంలో పరిశీలించక తప్పనిసని పరిస్థితి.

ఏ వస్తువునైనా ఉత్పత్తి చేసేవారు, దానికి సంబంధించిన వాణిజ్యం, లావాదేవీలు, లాభనష్టాలపై సుదీర్ఘంగా ఆలోచించి ఒక అంచనాకు వస్తారు. అదే ఇతర ఉత్పత్తులకు భిన్నంగా తన ఉత్పత్తికి తాను ధరను నిర్ణయించుకోలేని స్థితిలో రైతు లెక్కలు అసహజంగా, అంచనాలకు అందకుండా ఉంటున్నాయి. ఒక రకంగా ఇది అత్యంత విపత్కర పరిస్థితి. తన ఉత్పత్తికి తాను ధరను నిర్ణయించుకోలేని రైతన్న ఆదాయ వ్యయాలను పరిశీలించే ప్రపంచ వ్యాప్త ఎస్‌ఎస్‌ఓ సర్వే 70వ రౌండ్‌ ప్రకారం రైతు కుటుంబానికి ఒక క్షేత్రం నుండి సాలీన వచ్చే వ్యవసాయేతర ఆదాయం కలిపి రూ. 77,112 అందులో 60 శాతం సాగు, పశుపోషణ ద్వారా లభిస్తుండగా 40 శాతం మాత్రం కూలి, సాగు ఇతర వ్యాపారాల వల్ల ఆర్జించినవి. 1993-94 నుండి 2015-16 వరకు నామమాత్రపు విలువల్లో నిజ రైతు ఆదాయం రెట్టింపు కావడానికి 22 ఏళ్ళు పట్టింది. రైతు ఆదాయం 9 ఇంతలైనా కానీ ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక లెక్కలతో పోల్చినప్పటికీ సాలీనా వ్యవసాయ వృద్ధి రేటు 14.86 శాతం ఉండాలి.

రైతు ఆదాయం పెంచడానికి 1. వ్యవసాయ ఆదాయం, 2. వ్యవసాయేతర ఆదాయాలను వృద్ధి చేయడం అనే రెండు కర్తవ్యాలు ఉన్నాయి. దానికి కేవలం రైతు నిర్ణయించుకుంటే సరిపోదు. ఆహార ధాన్యాలను, వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకునే వారి ప్రాధాన్యతలు కూడా ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. ఆహార ధాన్యాలు, నూనె గింజలు, అపరాలతో పాటు, పండ్లు, కూరగాయల వినియోగంపై కూడా అంచనాలుండి తద్విధంగా సాగు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇటీవల కాలంలో పండ్లు, కూరగాయల వినియోగం భారీ ఎత్తున పెరిగిన దృశ్యాన్ని కూడా మననంలో ఉంచుకోవాలి. ప్రధాన పంటలైన ఆహార ధాన్యాలు, నూనె గింజలు, పప్పుపంటల మొత్తం సాగు విస్తీర్ణంలో 77 శాతం ఉంది. కానీ వాటి వాణిజ్య విలువ 41 శాతం మాత్రమే కావడం విశేషం.

సమాజ ఆహార అవసరాలు శరవేగంతో మార్పు చెందుతున్న నేపద్యంలో పండ్లు, కూరగాయలు, నువ్వులు, సుగంధ ద్రవ్యాలు విలువైన మార్కెట్‌ ధరను పొందుతున్నాయి. కానీ సాగు విస్తీర్ణంలో కేవలం 19 శాతం మాత్రమే ఇవి ఉత్పత్తిని అందిస్తున్నాయి. వీటి ద్వారా హెక్టారుకు రానున్న సరాసరి దిగుబడి విలువ రూ. 1,41,777 కాగా ప్రధాన పంటల ఉత్పత్తి విలువ కేవలం రూ. 41,169 మాత్రమే. కావున మార్కెట్‌ విలువ కలిగిన పంటలను సాగులోకి తీసుకువస్తే ఒక్కో హెక్టారుకు అదనంగా రైతు ఆదాయం లక్షకు పైనే పెరుగుతుంది. దేశంలో ఖరీఫ్‌, రబీల్లో ప్రధాన పంటల సాగే అధికంగా ఉంటుంది. రబీలో సాగునీటిని అందించగలిగి అదే విస్తీర్ణంలో సాగును కొనసాగిస్తే పంటల సాగు సరళి పెరిగి ఒకే పొలంలో ఆదాయం రెట్టింపు కాగలదు.

రైతు ఆదాయం పెరగడానికి కర్ణాటక తరహాలో మార్కెట్‌ సంస్కరణలు అన్ని చోట్లా ప్రారంభమైనప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా కర్ణాటకలోని అధికశాతం మంది రైతులు అధిక ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఇక ఉపాది కల్పన విషయానికొస్తే ప్రాధాన్యత సెక్టారులోకి వచ్చే వ్యవసాయ రంగంలోనే అత్యధికంగా ఇప్పటికీ 64 శాతం మందికి ఉపాది కలుగుతుండడం విశేషం.

2011-12 గణాంకాల ప్రకారం వ్యవసాయంలో రైతు ఉత్పాదకత విలువ రూ. 62, 235 అయితే వ్యవసాయేతర రంగంలో ఉపాది ఉత్పాదకత 2.76 రెట్లు ఎక్కువ కాబట్టి వ్యవసాయేతర ఉపాది మార్గాల పెంపుతో రైతుల ఆదాయాలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది.

ఇక దశాబ్దకాలంగా వ్యవసాయ వృద్ధి రేట్లను పరిగణనలోకి తీసుకుంటే 2022 - 23 నాటికి రైతుల ఆదాయంలో 75 శాతం పెరుగుదల ఉండనుంది. మిగతా 25 శాతం చేరుకోవడానికి వివిధ ఆదాయ మార్గాల్లో 33 శాతం వృద్ధి అవసరం. పంటల ఉత్పాదకతలో 4.1 శాతం, పశుగణాభివృద్ధిలో 6 శాతం వృద్ధి సాలీన ఉండే అవకాశం ఉంది. 2015-16 సం||లోని పంటల అమ్మకపు విలువ ధరతో పోలిస్తే 17 శాతం అధిక ధరలు రావాలి. అందులో రైతుల వాటాకు 2.26 శాతం పెరిగిన ధరలు అందాల్సిన అవసరం ఉంది.

దేశంలో వ్యవసాయాభివృద్ధి చర్యలపై దృష్టి సారిస్తే రైతుల ఆదాయం రెట్టింపవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. దాని కొరకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి జరగాలి. దానితో పాటు వ్యవసాయ విద్యా ప్రణాళికను, వ్యూహాలను మార్చి, విజ్ఞానాభివృద్ధికి నూతన దృక్పదంతో కృషి జరగాలి. గతంలోలా ఉన్న పరిశోధనా దశ నుండి పొలం గట్ల వరకు అన్న నినాదానికి విస్తృత అర్ధాన్ని కల్పిస్తూ పరిశోధనలను మార్కెట్ల వరకు విస్తరించే పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కళాశాలలు రూపొందించుకోవాలి. అందుకు తగినట్లు వ్యవసాయ విద్య పాఠ్య గ్రంధాలలో మార్పులు తీసుకురావాలి. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న వినూత్న వ్యవసాయ పద్ధతులను మరింతగా రైతులకు చేరువ చేసేందుకు విస్తరణ వ్యవస్ధ పటిష్టం కావలసి ఉంది. అంతేకాకుండా విత్తనాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి, విత్తన రంగంలో పరిశోధన-అభివృద్ధి కార్యక్రమంలో రైతుల ప్రమేయాన్ని, సాధికారతను పెంపొందించాలి. ఉత్పత్తికారకాలైన ఎరువులు, సాగునీరు, వ్యవసాయ రసాయనాల నాణ్యత, అందుబాటు, దానితోపాటు వినియోగ సామర్థ్యం పెరగాలి.79.7 లక్షల టన్నుల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి.

ప్రస్తుతం ఒక హెక్టారు పంటకు సరాసరిన 175 కిలోలు విత్తనాన్ని వాడుతున్నారు. వీటి వినియోగ సామర్ధ్యం పెంపుతో పంటల ఉత్పాదకత పెరిగేలా ముందుకు వెళ్లాలి. సాగునీటి పారుదల కింద స్థూల సాగు విస్తీర్ణం 53 శాతానికి చేరాలి. పంట సరళి 153 కు పెరగాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధానమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థ భారీగా మెరుగుపడాలి. దేశంలోని సాగులో ప్రస్తుతం పండ్లు, కూరగాయలు 1.675 కోట్ల హెక్టార్లలో సాగవుతున్నాయి. మొత్తం పంటల్లో వీటి శాతం 8.6 మాత్రమే ఈ శాతం గణనీయంగా పెరిగిప్పుడు రైతులకు అదనపు ఆదాయం సాధ్యమవుతుంది.

రైతు ఆదాయం రెట్టింపు :

2022 మోది ప్రభుత్వం లక్ష్యం :

గత నాలుగేళ్ళుగా దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్‌డిఏ ప్రభుత్వం తీవ్రమైన ఉద్యమాల ¬రును చూసింది. ఎన్నడూ బయటకు చెప్పని, నోరు విప్పి ఆవేదననను వినిపించని రైతన్న రోడ్డుకెక్కిన సందర్భాలు అనేకం. గతంలో ఉధృతంగా రైతాంగ ఉద్యమాలు నిర్వహించిన చరణసింగ్‌, దేవీలాల్‌, శరద్‌జోషి వంటి రైతు నేతలు కనుమరుగు కావడంతో రైతాంగ ఉద్యమానికి చుక్కాని కరువైంది. ఈ నేపద్యంలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర స్థానిక రైతునేతలు సంఘటితమై రైతులను చైతన్యపరచి ఉద్యమాల బాటపట్టించారు. మహారాష్ట్ర, మద్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, హర్యాన, ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో రైతుల ఉద్యమాల ప్రభావం విస్తృతంగా ఉండి రాజకీయంగా బిజెపి నష్టపోతున్న నేపద్యంలో నరేంద్రమోది ప్రభుత్వం కన్నులు తెరచింది. దానికితోడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశావ్యాప్తంగా రూ. 2 లక్షలను రుణమాఫీని ఒకే సారి మాఫీ చేస్తామని ప్రకటించడంతో నరేంద్ర మోది ప్రభుత్వం 2022 లక్ష్యంగా రెట్టింపు ఆదాయాన్ని తీసుకువచ్చే పథకాలకు రూపకల్పన చేసింది. తన ఆధ్వర్యంలోని నీతిఅయోగ్‌ ద్వారా 2022-23 నాటికి రైతుల ఆదాయం పెంచే ప్రణాళికలను రచిస్తుంది. తాజాగా నీతి అయోగ్‌ అభివృద్ధి, సాంకేతికాలు, విస్తరణ విధానాలు సంస్కరణలతో కూడిన త్రిముఖ వ్యూహాన్ని కేంద్రం ముందుంచింది. లక్ష్యం చేరువకు ప్రణాళికాబద్ధ సూచనలు మార్గనిర్ధేశ్యం చేసింది. అయితే లక్ష్యం చేరడం సాధ్యమా అన్న మీమాంస అలాగే ఉంది. విభిన్న పంధా ప్రణాళికల అమలులో రాజీలేని తత్వంతో లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

వ్యవసాయేతర రంగంలో ఉన్న ఆదాయాలతో సమానంగా రైతుల వ్యవసాయాదాయం పెరగాలి. సమ్మిళిత వృద్ధి పెరగాలి. రైతు గౌరవంగా పెరగాలి. యువత సైతం స్వచ్ఛందంగా వ్యవసాయంలోకి రావాలి. అప్పుడే దేశంలో రైతు ఆదాయ భద్రత సుసాధ్యం.

స్థిరమైన రాజకీయ ఆలోచన, పథకాల అమలుకు ప్రదర్శించాల్సిన చిత్తశుద్ధి, రైతుల పట్ల అంకిత భావం ఉంటే రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అనేది ఖచ్చింతగా సాధ్యమే. వేచిచూద్దాం.... ఆశిద్దాం... అండగా ఉందాం.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌