ఇంటర్వ్యూ

పద్మశ్రీ డాక్టర్‌ ఎమ్‌.వి.రావు మనో విశ్లేషణ

విత్తన సాధికారతే ఆహార భద్రతకు పునాది

‘‘వ్యవసాయం సమృద్ధిగా ఉందని భావిస్తే విత్తన కార్యక్రమం పటిష్టంగా ఉందని అర్ధం. విత్తన కార్యక్రమం బలహీనంగా ఉందంటే వ్యవసాయరంగం బలహీనమైనట్లే. వ్యవసాయ రంగం కుంటుబడితే ఆహారభద్రత లేనట్లే. ఆహారభద్రత లేనినాడు జాతీయ భద్రత కరువైనట్లేనంటున్నారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా॥ఎం.వి రావు’’

భారత వ్యవసాయ పరిశోధనా రంగానికి ఎనలేని సేవచేసి నోబల్‌ బహుమతి గ్రహీత ‘‘నార్మన్‌ బోర్లాగ్‌’’ డా॥ స్వామినాథన్‌ల సహచరుడిగా ‘‘ఆకుపచ్చ విప్లవ’’ సేనానిగా తనకంటూ ప్రత్యేక స్దానాన్ని పొందిన డా॥ రావు ‘‘అగ్రి క్లినిక్‌’’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో అనేక అనుభవాలను ఉద్వేగ భరితంగా పంచుకున్నారు. నిరంతరం వ్యవసాయ రంగం ఆధునీకరణకు తపించే ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొన్నది. బెంగాల్‌లో ఏర్పడిన డొక్కల కరువు లక్షల మందిని కబళించివేసింది. దక్షిణ భారతదేశంలో ఆకలి బాధకు అనేక లక్షల మంది మరణించారు. దేశంలోని కోట్లాది ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు అప్పటి వరకు ప్రభుత్వం పిఎల్‌ 480 నిబంధనకు అనుగుణంగా అమెరికా నుండి గోధుమలు దిగుబడి చేసుకొనేది. ఈ నిబంధనలోని షరతులు జాతి ఆత్మగౌరవానికి భంగకరమని భావించిన నెహ్రూ ప్రాధాన్యంశంగా దేశంలో జలవనరులను వినియోగించుకోవడానికి అవకాశాలను పరిశీలించారు. ప్రధాన నదులపై బహుళార్ద సాధక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. భాక్రానంగల్‌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించి నిర్మించడంతో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లలో గోదుమ ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్‌ వంటి ఆధునిక దేవాలయాల నిర్మాణంతో దక్షిణాదిలో కూడా భారత్‌ వ్యవసాయ విప్లవానికి శ్రీకారం జరిగిందని డా॥ రావు అన్నారు.

భారత ప్రభుత్వం నదీజలాల వినియోగంతోపాటు, వరి, గోదుమల అధికోత్పత్తికి రంగం సిద్దం చేసింది. అందుకు అనుగుణంగా మేలురకం విత్తనాల ఉత్పత్తి అవసరాన్ని గుర్తించింది. భారత్‌లో ఆహార సంక్షోభ నివారణకు మేలురకం విత్తనాల తయారీలో తలమునకలవుతున్న సందర్భంలో అదృష్టవశాత్తూ డా॥ బోర్లాగ్‌ తనకు పదిహేను గ్రాముల మేలుజాతి గోదుమ వంగడాలను పంపించారని, వాటిని ద్విగుణీకృతం చేసి దేశంలో ప్రవేశపెట్టిన అనంతరం మిలియన్‌ టన్నుల కొద్దీ గోధుమ దిగుబడికి అవకాశం లభించిందని, భారతీయ అక్షయపాత్రలో బోర్లాగ్‌ ఆశీర్వదించి సమర్పించిన ఆ పదిహేను గ్రాములే ఆ తరువాత వ్యవసాయ విప్లవానికి ఎంతో ఊతమిచ్చాయని డా॥ రావు తెలిపారు.

భారతీయ శాస్త్రజ్ఞుల విశేష కృషి, రైతుల అకుంఠిత దీక్షతో ప్రస్తుతం భారత్‌లో 30 మిలియన్‌ టన్నుల బియ్యం 25 మిలియన్‌ టన్నుల గోధుమలు భారీ నిల్వలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అధికోత్పత్తికి తోడ్పడే విత్తన సరఫరాతోపాటు, రైతుకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందులను అందుబాటులోకి వచ్చి విజ్ఞానమార్పిడి గ్రామస్ధాయి వరకు వెళ్ళడమే హరిత విప్లవ విజయ రహస్యం.

అయితే నేటి ప్రభుత్వాలు విత్తనోత్పత్తిపై శ్రద్ద వహించకుండా, విత్తన రంగాన్ని బహుళజాతి సంస్థలకు వదిలివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్దప్రాతిపదికన తిరిగి విత్తనోత్పత్తిపై దృష్టి పెట్టకపోతే రైతుకు అన్యాయం చేసిన వాళ్ళమౌతాము అన్నారు. భారతీయ విత్తనోత్పత్తి కంపెనీలన్నీ, బహుళజాతి కంపెనీల కబంధ హస్తాల్లోకి వెళ్ళి పోతున్నాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే ఐదువందల విత్తన కంపెనీల్లో 10 మాత్రమే స్వతంత్య్రంగా మిగిలాయని తెలిపారు. తీనికి తోడు వంకాయతో సహా, భారతీయ సంప్రదాయ ఉత్పత్తులు’’ జన్యు మార్పిడితో పరాధీనం కావడం మంచిది కాదని అన్నారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్వవసాయానికి ప్రాధాన్యతనిచ్చే చర్యలు సత్వరమే చేపట్టాలని శరవేగంతో పెరుగుతున్న జనాభాకనుగుణంగా ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని డా॥ రావు అభిలషించారు. దీనితోపాటు ప్రతి భారతీయునికి పోషకాహారాన్ని సమకూర్చడం ద్వారా జాతి బలవత్తర మవుతుందని ఆకాంక్షించారు.