సేంద్రీయ వ్యర్థ పదార్థాల మీద ప్రత్యేకమైన వానపాముల్ని ప్రయోగించటం ద్వారా తయారు చేయబడే కంపోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు. మామూలుగా తయారుచేసే కంపోస్టు కన్నా వర్మి కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మి కంపోస్టులో పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులో సరాసరిన నత్రజని, భాస్వరం, పొటాష్‌ పోషకాలు వరుసగా 0.75, 0.17 మరియు 0.55 శాతం ఉండగా, వర్మి కంపోస్టులో సరాసరిన ఇవి 1.23 నుండి 2.40, 0.67 నుండి 1.93 మరియు 0.35 నుండి 0.63 శాతంగా వేసిన వ్యర్థ పదార్థంపై ఆధారపడి ఉంటాయి. ఇదే విధంగా వర్మి కంపోస్టులో సూక్ష్మపోషకాలు పశువుల ఎరువుకన్నా దాదాపు 50 శాతం అధికంగా ఉంటాయి. వీటికి తోడు, వర్మి కంపోస్టులో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలు ఉన్నాయి.

వర్మి కంపోస్టుకు అవసరమైనవి :

వానపాములు :

బొరియలు చేయని వానపాముల రకాలు సేంద్రీయ వ్యర్థ పదార్థాల నుండి కంపోస్టు చేయడానికి పనికివస్తాయి. ఇవి. 1. యూడ్రిలస్‌ యూజినే 2. అయిసీనియా ఫొయిటిడా 3. పెరియానిక్స్‌ ఎక్స్‌కవేటస్‌ 4. లుంబ్రికస్‌ రుబెల్లస్‌

సేంద్రీయ శేష వ్యర్థ పదార్థాలు :

వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్టు తయారీకి బాగా ఉపయోగపడతాయి.

ఇతర అవసరాలు :

వానపాములు తిన్నగా ఎండను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కొరకు తగిన నీడను కల్పించాలి. ఇందుకు గాను పందిరి వేయటానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాతగోనె సంచులు, పాలిథీన్‌ సంచులను వినియోగించవచ్చు. పందిరి వెయ్యటం వల్ల వానపాములకు నీడనివ్వటమేకాక, ఎరువు నుండి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాక వర్షం తిన్నగా ఎరువు మీద పడి పోషకాలు నష్టపోకుండ కూడా రక్షించుకోవచ్చు. వరి గడ్డి లేదా పాత గోనె సంచులను వర్మి కంపోస్టు బెడ్‌లపై కప్పడానికి ఉపయోగించవచ్చు.

వర్మి కంపోస్టు బెడ్‌లను తయారు చేయడం :

భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత పొడవున వర్మి కంపోస్టు బెడ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్‌ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటుచేసే వాటిని సిమెంట్‌తో గట్టిగా చెయ్యవచ్చు లేదా పేడను ఉపయోగించి గట్టి పరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న నేలపై సుమారుగా (45 సెం.మీ.) రెండు అడుగుల ఎత్తు వరకు వర్మి కంపోస్టు చేయాలనుకొంటున్న వ్యర్థ పదార్థాలను (చెత్త, ఆకులు, పేడ మున్నగునవి.) వేయాలి. పేడ ఒక పొరగా తిరిగి వ్యర్థ పదార్థాలు, ఆపై పేడ రెండో పొరగా వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడను వేసేటప్పుడు బెడ్‌పైన నీరు చల్లాలి. ఇలా రెండు నుండి మూడు వారాల వరకు నీరు చల్లుతుండాలి.

ఇలా బాగా కుళ్ళిన బెడ్డు పైన వానపాములను వదలాలి. వానపాములను వదిలేటప్పుడు బెడ్‌ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కొంటూ లోపలికి వెళతాయి. ఇవి ప్రతి రోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకొంటాయి. ప్రతి చదరపు మీటరుకు 1000 వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది.

బెడ్‌పైన పాత గోనె సంచులను గాని, వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయటం వల్ల తేమను కాపాడటమే కాక, వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములను వదిలన బెడ్‌లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతుండాలి. ఈ విధంగా చేయడం వల్ల వ్యర్థ పదార్థాలను 60 రోజుల్లో వర్మి కంపోస్టుగా తయారు చేసే వీలుంది.

బెడ్‌ నుండి వర్మి కంపోస్టును తీయటానికి 4 లేదా 5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. ఇలా చెయ్యటం వల్ల వానపాములు తేమను వెదుకుతూ లోపలికి వెళ్ళి అడుగుభాగానికి చేరతాయి. బెడ్‌పైన కప్పిన ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2-3 ఎమ్‌.ఎమ్‌ జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడ గల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. బంతిలా చుట్టుకొని ఉన్న వానపాములను ఎరువు నుండి వేరు చేసి తిరిగి వర్మి కంపోస్టు తయారీకి వాడుకోవచ్చు.

ఎరువును తొలగించిన బెడ్‌లపైన వ్యర్థ పదార్థాలను 45 సెం.మీ. ఎత్తువరకు పరచి మరల పైన చేసిన విధంగా కంపోస్టును తయారుచేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వరకు వర్మి కంపోస్టును తయారుచేసే వీలుంది.

వర్మి కంపోస్టు తయారైనది లేనిది తెల్సుకోవటమెలా ?

వానపాములు వ్యర్థ పదార్థాలు తిన్న తరువాత వీటి విసర్జిత పదార్థమే మంచి ఎరువుగా మారుతుంది. ఎరువు తయారైన తరువాత వానపాములు అందులో నిలవవు. అవి పైకి వచ్చి గోనె సంచులకు అతుక్కొని వుంటాయి. అంతేకాక ఎరువు లేకుండా గోధుమ రంగులో టీ పౌడరులా కనిపిస్తుంది. వర్మి కంపోస్టు తయారైందని తెల్సుకోవటానికి ఇది గుర్తుగా భావించవచ్చు. ఈ దశలో నీరు చల్లటం ఆపివేస్తే, వానపాములు తేమను వెతుక్కొంటూ అడుగు భాగానికి చేరుతాయి.

వర్మి కంపోస్టు రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ళ వరకు వివిధ పంటలకు వాడవచ్చు. పండ్ల తోటలకు కూడ బాగ ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుండి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయటం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. వర్మి కంపోస్టును సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు వాడవచ్చు.

ఇప్పటికే వర్మి కంపోస్టు తయారుచేస్తున్న రైతుల నుండి అవసరమైన వానపాముల్ని కొనవచ్చు. వర్మి కంపోస్టు యూనిట్‌ పరిమాణాన్ని బట్టి మొదట కావలసినన్ని వానపాములను కొనాల్సి ఉంటుంది. తరువాత ఇవే వృద్ధి చెందుతాయి.

వర్మి కంపోస్టును బయట నుండి కొని క్రమం తప్పకుండా వాడటం ఆర్థికంగా అంతగా లాభదాయకం కాకపోవచ్చు. అయితే స్వయంగా వర్మి కంపోస్టును తయారు చేసుకొని వాడితే ఎంతో లాభం ఉంటుంది.

పి. మధుకర్‌ రావు, శాస్త్రవేత్త (ఆగ్రానమి), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల

డి. అనిల్‌, శాస్త్రవేత్త (ఆగ్రానమి), వ్య్రవసాయ పరిశోధన స్థానం, కూనారం, ఫోన్‌ : 9505507995